భూగోళ పరిజ్ఞానికుడు - డాక్టర్ కైగాల వెంకట సుబ్బారావు

                                                          - ఈరంకి వెంకట కామేశ్వర్

 

 


తమ తమ రంగాలలో నిష్ణాతులై, విశిష్టత నాపాదించుకుని, పేరు ప్రఖ్యాతలనార్జించి "గొప్పతనం" సాధించిన తెలుగు వారెందరో ఉన్నారు.వాళ్ళు ఎదుర్కున్న ప్రతిబంధకాలు, సంక్లిష్ట పరిస్థితులు, అనుభవించిన నిర్భందాలు, పడిన ఆవేదన, చేపట్టిన దీక్ష, చేసిన కృషి, సాధన, కనపరచిన పరాకాష్ట, సాధించిన విజయాలు, ఆ విజయ రహస్యాలు, ఇలాటి విషయాలని పరిశీలించి, సమీకరించి, పొందు పరచి ఈ కధనాలలో మీ ముందు ప్రస్తుతీకరిస్తున్నాం.


భూమి అనేక వందల ఏళ్ళ పాటు అగ్నిపర్వతాల విస్పోటాల ఆధారముగా సంభవించిన జ్వాలాముఖులు (వాల్కానోస్) ప్రవహించిన శిలాద్రవం (లావా) మూలాన పర్వత శ్రేణులు ఏర్పడ్డాయి. భారతదేశంలోని పశ్చిమ కనుమలు (వెస్టన్ ఘాట్స్), మలయ పర్వతాలు, తూర్పు కనుమలు (ఈస్టన్ ఘాట్స్), విశేషించి డెక్కన్ ప్లాటోలు ఏర్పడ్డాయి. ఈ పరిణామాలు ఎప్పుడు సంభవించాయి, ఎంత విస్తీర్ణం వ్యాపించాయి, వాటి ఒరుగు, వాలు, ఊర్ధ్వకోణాలు, ఘనపరిమాణాలు, స్వరూపాలు, శిలాద్రవ ప్రవాహాల స్థితి గతులు,
వాటిలోని లవణాలు, నిక్షిప్తమై ఉన్న చుంబక క్షారం (మాగ్నెటిక్ ప్రాపర్టీస్) వాటి రీతులు, తీరు తెన్నులు, విధ్యుత్ ప్రభావాల శల్యపరీక్షలు, కాలాణుగుణంగా సంభవించిన మార్పులు, కొండలు, రాళ్ళు, గుట్టలు ఏర్పడిన తీరు, కాల స్వరూపములో జరిగిన భూ ప్రకరణలు, ప్రాచీన, నవీన స్వరూపాలు ఇత్యాది అంశాలు సవిస్తరముగా అధ్యయనం చేసి, తద్సంబంధిత డేటాబేస్ ని రూపొందించిన ఘనుడు క్షితిజ శాస్త్ర (అర్త్ సైన్సెస్) క్షేత్రంలో నిపుణుడు, థర్డ్ వరల్డ్ అకాడమి ఆఫ్ సైన్సెస్ పురస్కారం అందుకున్న
ఆచార్యుడు డాక్టర్ కైగాల వెంకట సుబ్బారావు గారు.

డాక్టర్ కైగాల గారు హైదరాబాద్ విశ్వవిద్యాలయం (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి), సెంటర్ ఫర్ ఎర్త్ అండ్ స్పేస్ సైన్సెస్ విభాగంలో ఆచార్యుడిగా ఉన్నారు. క్షితిజ శాస్త్రం (ఎర్త్ సైన్సెస్) - వోల్కనాలజీ, ఇగ్నియస్ పెట్రాలజీ, పాలియోమాగ్నెటిజం క్షేత్రాలలో అగ్రగణ్యుడు.

 

వోల్కనాలజి - అంటే జ్వాలాముఖి, అగ్నిపర్వతాల ఆవిర్భావం, శిలాద్రవం (లావా) దాని ఆధారముగా ఏర్పడిన భౌమ, భౌతికశాస్త్రం, భూకంపాల శల్యపరీక్షలు, చుంబక శక్తి వంటి విషయాల అధ్యయనం అన్నమాట. ఇగ్నియస్ పెట్రాలజీ లో ఇగ్నియస్ రాళ్ళను గుర్తించడం, అవి ఎలా, ఎందుకు, ఎక్కడ ఆవిర్భవించాయి, ఎలా వృద్ధినొందాయి, స్పటిక ఆకార స్వరూపాలు యెలా దాల్చాయో తదితర విషాయల విశ్లేషణ వంటి అంశాలు ఉన్నాయి.
పాలియోమాగ్నెటిజం అంశంలో రాళ్ళ ఐస్కాంత పరిధుల విశ్లేషణ ఆధరముగా భూగోళ చుంబక శక్తి గురించి, భూమండలంలో ఖండాలు ఏర్పడిన తీరు నిర్ధారణ చేయడం వంటి విషయాల గురించి పరిశోధనాంశాలు ఉన్నాయి.
ఈ క్షేత్ర రంగాలలో భారత దేశంలో అగ్రగణ్యుడు డాక్టర్ కైగాల వెంకట సుబ్బారావు గారు 2003 లో థర్డ్ వరల్డ్ అకాడమి ఆఫ్ సైన్సెస్, పురస్కారం అందుకున్న భూగోళ శాస్త్రవేత్త.
 

బాల్యం, చదువు, ఉద్యోగం

డాక్టర్ కైగాల ఏప్రిల్ 5, 1942 లో ఆంధ్ర ప్రదేశ్ లో జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ తీసుకున్నారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా సాధించారు. ఆరేళ్ళ పాటు విదేశాలలో చదివి, 1973 లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ముంబై) లో ఆచార్యుడుగా చేరారు.

 

స్టాటిగ్రఫీ నిర్ధారణ - వినూత్న ప్రయోగం:

"జియో కెమికల్ ", " రాక్ మేగ్నటిక్ " పద్ధతి ఆధారముగా నర్మదా (నది) పర్వత ప్రవాహాలు, మిగతా పశ్చిమ కనుమల శిలాద్రవాల కంటే పురాతనమైనవిగా ప్రయోగాత్మకంగా నిర్ధారించి చూపించారు డాక్టర్ కైగాల వెంకట సుబ్బారావు. ప్రపంచంలో అతిపెద్ధ ఉపలం నమూనాల రశాయన డటాబేస్: దదాపు పది వేల ఉపలం నమూనాలతో (రాక్ స్పెసిమెన్ ల తో) రశాయన (కెమికల్) డటాబేస్ రూపొందించారు. ఈ క్షేత్ర పరిధిలో, ఇది ప్రపంచంలో అతిపెద్ద డటాబేస్ లో ఒకటి.

 

డెక్కన్ ట్రాప్స్:

డెక్కన్ ట్రాప్స్ ప్రపంచంలో అతిపెద్ద అగ్నిపర్వత ప్రాంతాలలో ఒకటి. " ట్రాప్స్ " అంటే స్వీడిష్ లో మెట్లు అని అర్ధం. శిఖరాల రూపు రేఖలు మెట్ల రూపంలో ఉన్నాయి. ఇవి 60 నుండి 68 మిలియన్ యేళ్ళ క్రితం, " క్రిటేషియస్ " కాలంలో " వెస్టన్ హాట్స్ " (ముంబాయి దగ్గర) ఏర్పడ్డాయి. ఇలా మెట్ల రూపంలో ఏర్పడిన కొండలు వెస్టన్ ఘాట్స్ ప్రాంతం అంతా పరివ్యాప్తించి ఉన్నాయి. 30,000 సంవత్సరాల పాటు అనేక విస్పోటాల ద్వారా ఈ కొండలు ఏర్పడ్డాయని అంచనా. ఈ కొండల స్వరూపానికి కారణమైన లావా్లో 95 శాతం "తోలిటిక్ బాసాల్ట్ " ఉంది. మిగతావి రాళ్ళు - అవి: ఆల్కలి బాసాల్ట్స్, నెఫిలినైట్స్, లాంప్రోప్రీ, కాబనటైట్స్. ఇవి సుమారు ఐదు లక్షల కిలోమీటర్ల విస్తీర్ణములో వ్యాప్తి చెందాయి. ఈ రాళ్ళు, రమారమి అమెరికా పశ్చిమ భాగ ఓరెగన్ రాష్ట్రంలోని కొలంబియా నది బాసాల్ట్స్ ఒకే మాదిరిగా, పోలి ఉన్నాయి. ఇలా భూ విస్ఫోటాలు, వాటి నుండి విలువడిన లావా, వాటితో ఏర్పడిన కొండలు, రాళ్ళు, ప్రాంతాలు ఇత్యాది వైజ్ఞానిక విషయాల సుదీర్ఘ వివరణలను అందించారు డాక్టర్ కైగాల వెంకట సుబ్బారావు గారు.

ఇలా విభిన్న పద్ధతుల ద్వరా నిర్ధారించిన మీదట వాటిలోని క్షారం, జీవ కణాలను విశ్లేషించేందుకు అవకాశం ఉంది. ఉదాహరణకి, వింధ్య పర్వత ప్రాంతాలలో 160 కోట్ల సంవత్సరాల నాటి బహుకణ శిలాజాలు దొరికాయి. ఇవి ప్రెట్రోజోయిక్ కాలానికి చెందినవి (250 కోట్ల నుంచి, 54.4 కోట్ల నాటిది) అని నిర్ధారించారు శాస్త్రవేత్తలు.

 

అందుకున్న గౌరవ పురస్కారాలు:

సుబ్బారావు గారు విభిన్న గౌరవ పురస్కారాలను అందుకున్నారు.1991 లో ఎర్త్ అండ్ ప్లానెటరి సైన్సెస్ క్షేత్ర విభాగాలలో ఇండియన్ అకాడమి ఆఫ్ సైన్సెస్ ఫెల్లో గా ఎంపికయ్యారు.
2003 లో, ఇటలీ లో నెలకొని ఉన్న థర్డ్ వరల్డ్ అకాడమి ఆఫ్ సైన్సెస్ పురస్కారం అందుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో అనేక "పేపర్స్" ప్రకటించారు.
తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాయించుకుని, ఎర్త్ సైన్సెస్ క్షేత్ర రంగాలలో భారత దేశంలో అగ్రగణ్యుడిగా, క్రియాశీలక భూమిక పోషిస్తున్నారు. ఇగ్నియస్ పెట్రాలజీ, పాలియోమాగ్నెటిజం వంటి క్షేత్రాంశాల మీద తన వంతు పరిశోధనలు జరుపుతూ, ఫలితాలను ప్రకటిస్తూ వస్తున్నారు.

 

 
     

 మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

   
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech