| |
"నమస్తే నా పేరు సరోజ" అందామె చేతులు
జోడించి.
సత్యవతి ఆమెవైపు ప్రశ్నార్ధకంగా చూసింది.
"మీ ఇంట్లో అద్దెకి పోర్షనుందని...". ఆపుచేసింది అర్ధోక్తిలో.
"రండి రండి" అంటూ బయటకు నడిచింది సత్యవతి. ముందున్న బంతిపూల మొక్కల
మధ్యనుండి పక్క పోర్షన్ వైపు దారితీసి, వేసున్న గొళ్ళాన్ని తొలగించి
లోపలికి ప్రవేశించింది.
"మూడు గదులు, చివరిది వంటిల్లు, పెరట్లో పంపు వుంది".
"అద్దెంత?" సరోజ అడిగింది.
"నూట ఇరవై. కరెంట్ కాక".
"నాకు నచ్చిందండీ. రేపే చేరిపోతాను" అంది సరోజ.
సరోజ కొంగు పట్టుకుని నిలబడ్డ మూడేళ్ళ బాబు చుట్టూ చూస్తున్నాడు.
బయట సంభాషణ విని లోపల్నించి సత్యవతి భర్త సుధాకరం బయటకొచ్చి,
ఇద్దర్నీ చూసి లోపలికి వెళ్ళాడు.
సరోజ బాబు చెయ్యివిడిచి, హ్యాండ్ బాగ్ లో చెయ్యి పెట్టి" ఒక నెల
అడ్వాన్స్ ఇవ్వనా?" అంది.
"ఇవ్వండి" అంది సత్యవతి. సరోజ డబ్బు తీస్తుంటే "మీ బాబా?" అని
అడిగింది.
"అవునండీ".
"ఒకడేనా?".
"ఒకడే" ఈ సమాధానంతో సత్యవతి సంతృప్తి పడింది. "ఎంత తక్కువ మందుంటే
ఇల్లంత బాగుంటుంది. మొత్తం ముగ్గురేనా ఉండేది?" అని మామూలుగా
అడిగినట్టు అడిగింది.
"కాదండీ, ఇద్దరమే"
సత్యవతి ఉలిక్కిపడి "ఇద్దరేనా?" అంది సరోజవైపు పరీక్షగా చూస్తూ
"..... అంటే మీ వారు".
"లేరు" ఆమె నెమ్మదిగా అంది.
"అయ్యో పాపం" నొచ్చుకుంది."ఎంతకాలం అయింది?" అంది సరోజ నుదుటికేసి
చూస్తూ. ఎర్రటి తిలకం బొట్టు అక్కడ మెరుస్తూంది. భర్త పోయి
సంవత్సరం తిరక్కముందే తిరిగి బొట్టు పెట్టుకునే వాళ్ళు ఆమెకి
కొత్త. అందుకే ఎంతకాలం అయింది అని అడిగింది.
"ఎవరు?"
"అదే - వారు పోయి.".
"పోవటం కాదు, అసల్లేరు" సరోజ జవాబిచ్చింది.
"అంటే......పెళ్ళి కాలేదా?"
"ఉహు కాలేదు.....".
సత్యవతి అర్ధంకానట్టు "ఈ బాబు?" అంది.
"నా కొడుకు".
దాదాపు వెయ్యిపౌన్ల సుత్తితో కొట్టినట్టు తల దిమ్మెక్కింది
సత్యవతికి. అదే టైమ్ కి సుధాకరం తండ్రి ఆఫీసు నుంచి వచ్చాడు.
సైకిల్ అరుగు మీద కెక్కించి లోపలికి వెళ్ళాడు. మళ్ళీ వచ్చి, సైకిల్
స్టాండ్ సరిగ్గా పడిందో లేదో చూశాడు.
"అంటే పెళ్ళి కాకుండా" ఈ మాట అడగటానికి సత్యవతి కడుపులో
తిప్పినట్టయింది.
సరోజ వెంటనే జవాబు చెప్పలేదు. తల వంచుకుని నెమ్మదిగా "......ఔను"
అంది.
"నీకు తల్లి తండ్రుల్లేరా?"
’మీ’ నుంచి ’నీ’ కు మారటాన్ని గమనించింది సరోజ. అయినా జవాబు
చెప్పింది "ఉన్నారు".
"ఎక్కడ"
"ఈ ఊళ్ళోనే"
"మరి వాళ్ళతోనే ఉండొచ్చుగా".
"గెంటేశారు" దీనంగా అనలేదామె.కానీ కంటిలో విషాదం కనబడింది.
సత్యవతికి ఇంకేం అడగాలో అర్ధం కాలేదు. ఇంత ఇంట్రెస్టింగ్ గా ఈమెని
అంత అర్ధాంతరంగా వదలటం ఆమెకి ఇష్టంలేకపోయింది.
"ఎంతకాలం అయింది?".
"మూడు సంవత్సరాల ఎనిమిది నెలలయింది".
"మరింతకాలం...".
"గాంధి స్ట్రీట్ లో ఉండే వాళ్ళం. ఇల్లు గల వాళ్ళు చాలా మంచివాళ్ళు.
కానీ వాళ్ళు ఆ ఇల్లు అమ్మేస్తున్నారు. అందుకని మారాల్సి వచ్చింది."
అంటూ హ్యాండ్ బాగ్ లోంచి డబ్బుతీసింది.
"ఇదిగో నూటిరవై".
సత్యవతి పుచ్చుకోలేదు. "మా వాళ్లని అడగాలి" అంది.
"మీవారు వచ్చినట్టున్నారుగా. అడగండి".
నిజానికి అడిగేదేమీ లేదు. ఆ ఇంట్లో సత్యవతి మాటే మాట! కానీ ఎలా
ఈమెని వదల్చుకోవాలో తెలియక అలా అబద్దమాడింది. ఇప్పుడిక ఏ సాకు
చెప్పి తప్పించుకోవాలో తెలియలేదు. దాన్ని సరోజ గుర్తించినట్టు
"మీకు అద్దె విషయంలో ఏ డోకాలేదండీ. నెలనెలా ఫస్టు తారీఖు కల్లా
ఇచ్చేస్తాను. కావాలంటే ఒక నెల బదులు రెండు నెలల అద్దె అడ్వాన్సుగా
ఇస్తాను. దేముడి దయవల్ల ఐదారొందల జీతం వచ్చే ఉద్యోగమే
చేస్తున్నాను" అంది.
"అహ! అద్దె గురించి కాదు".
"మరి".
సత్యవతి వెంటనే జవాబు చెప్పలేకపోయింది. నిజానికి తన సమస్య ఏమిటో
ఆమెకే అర్ధం కావటం లేదు. ఇల్లు ఇవ్వటం మాత్రం ఇష్టం లేదు.
"ఏదన్నా ఫ్యామిలీకి ఇద్దామనుకుంటున్నా" అంది.
సరోజ నవ్వి, "స్టేట్ గవర్నమెంట్ టి.ఎ. రూల్స్ ప్రకారం మేం ఫామిలీయే
కదా".
ఆ నవ్వు సత్యవతికి ఉక్రోషం తెప్పించింది.
"......గౌరవప్రదమైన ఫ్యామిలీకి" అంది. "గౌరవప్రదమైన" అన్న పదాన్ని
వత్తి పలుకుతూ. సరోజ మొహం క్షణం పాటూ వాడిపోయింది. కానీ ఈ
తిరస్కారాలు అలవాటు పడటం వల్ల, వెంటనే సర్దుకుని "మనిషి
గౌరవప్రదంగా బతకడానికీ, మానసికంగా ఒక్క క్షణం బలహీన మవటానికి
సంబంధం ఏమిటండీ? బలహీనతలన్నవి ఎవరి దగ్గర వారివి ఉంటాయి" అన్నది.
తన పాయింట్ మీద నిలబడి ఆర్గ్యూ చేసే సరోజని చూస్తే ఆమెకి ఉక్రోషం
ఎక్కువయింది. నిజానికి ఆమె ఇంటికోసం దీనంగా బతిమాలుతుందేమో
అనుకుంది. అందుకే చప్పున అనేసింది.
"అలాంటి బలహీనతలున్న వాళ్ళు మా పక్క పోర్షన్లో వద్దు".
ఈ మాటని సరోజ ముందే వూహించినట్టుంది. అందుకే ఈ సారి ఆమె
తమాయించుకుని ఆవేశ రహితంగా నెమ్మదిగా అంది. "ఒకప్పటి బలహీనతండీ
అది. అప్పుడు లోకం గురించి అంతగా తెలీదు. ప్రేమకీ, మంగళసూత్రానికీ
తేడా తెలీదు. అది ఒక విధంగా చూస్తే బలహీనత కూడా కాదు. మీకు తెలియని
దేముంది? ఇటువంటి విషయాల్లో మగవాడే డ్రైవ్ చేస్తాడు స్త్రీని.
గమ్యం చేరుకున్నాక గానీ, తన భవిష్యత్తు అగమ్యగోచరం అని స్త్రీ
తెలుసుకోలేదు. కాని అప్పటికే మూడోనెల. మీరన్నారు బలహీనతలున్న
వాళ్ళు పక్క పోర్షన్లో వద్దూ అని! నాకిప్పుడు ఏ బలహీనతలు లేవండి.
అవేవన్నావుంటే ఈ పాటికి మళ్ళీ.....".
"శివ శివా" అంటూ సత్యవతి చెవులు మూసుకోబోయి ఆగింది. సరోజ చెబుతూనే
వుంది. ఈ లోపులో బాబు చిటికెన వేలు చూపించి "అమ్మా" అన్నాడు.
"ఒక్క నిముషం ఆగరా బాబూ" అంటూ సత్యవతివైపు తిరిగింది.
"మీరనొచ్చు, ఇప్పుడు నాకు బాగా ఎక్స్ పీరియన్సొచ్చింది కాబట్టి,
అలాటివేవీ రాకుండా జాగ్రత్త పడుతున్నానేమో అని. అంత ఆత్మవంచనే
చేసుకునే మనస్తత్వమే ఉంటే వీణ్ణి నా తమ్ముడని చెప్పుకోవటమో, లేక
పుట్టగానే ఏ అనాథ శరణాలయంలో చేర్పించటమో చేసి వుండేదాన్ని కదండీ.
మీరూ స్త్రీయే కదా! మీకు తెలియని దేముంది? ఒకసారి మోసపోయిన స్త్రీ
మరిక జన్మలో పురుషుడిని దగ్గరకు రానివ్వదు. అవునా? ఇప్పుడు నాకు
బలహీనతలేమీ లేవండీ" అంది. "బలహీనత" అనే పదాన్ని వత్తి పలుకుతూ.
"అలాంటి వన్నీ పద్దెనిమిదో ఏట. ఎర్రటి సంధ్య కలలోనూ, తూర్పు ఉపస్సు
రాగరంజిత రసానుబంధాల్లో కరిగిపోయే వాటికి ’బలహీనతలు’ అని మీరు పేరు
పెడితే! ఇప్పుడు నా ఆశయమల్లా వీణ్ణి పెద్దవాణ్ణి చెయ్యటమే.
రియాల్టీకన్నా మొరాల్టీ గొప్పది కావచ్చు. కానీ రియాల్టీ రియాల్టీయే
కదా! పోనీ మీకెంత అపనమ్మకమయితే ప్రతిరోజు రాత్రి తొమ్మిది
గంటలకల్లా మా ఇంటి ముందు తలుపుకి తాళం వేసుకోండి. ఇంకేముంటుంది మీ
అభ్యంతరం. ఆ ! అన్నట్టు మీకో అనుమానం రావచ్చు. మధ్యాహ్నం ఆఫీసుకని
చెప్పి వెళ్ళి నేనెవరితోనైనా తిరగొచ్చు అని, ప్రోబబులిటీ మీరు ఒక
ఫామిలీ కిచ్చినా వుంది కదండీ".
సత్యవతికి అకస్మాత్తుగా పొయ్యిమీద పెట్టిన పప్పు జ్హాపకం వచ్చింది.
దాని ఘాటు అక్కడి వరకూ వచ్చి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టూ
అయింది. ఇంత తెగించిన దానితో తనకి మాటలేమిటా అనుకొని చేతులు
జోడించి నమస్కారం చేస్తూ "వెళ్ళిరా తల్లీ, నువ్వు మంచిదానివే
కావచ్చు కానీ మా ఇంట్లో మగవాళ్ళున్నారు. వాళ్ళకి వుండొచ్చు
బలహీనతలు" అంది.
సరోజ నవ్వింది. విషాదమూ, జాలి మిశ్రితమైన నవ్వు! నదిలో
మునిగిపోతున్నవాడు గడ్డి పరకను పట్టుకొని ఈదుతున్న వాణ్ణి చూసి
నవ్విన నవ్వు.
"ఒప్పుకున్నారు కదా మీ మగవాళ్ళకు బలహీనతలున్నాయని. మరి ఒక
’బలహీనతలున్న స్త్రీ’ ని పక్క పోర్షన్ లోకి రానివ్వటానికి ఇష్టపడని
మీరు, ఒక బలహీనతలున్న పురుషుడి పక్కలో యెలా రోజూ
పడుకుంటున్నారండీ?" నవ్వింది. "ఈ ఫ్రాంక్ నెస్ తో మీకు నేనో
రాక్షసిలా కనబడుతున్నాను కదూ" చప్పున ఆమె కంఠం రుద్దమయింది. "నేనూ
మీలాగే అమాయకంగా కలల ప్రాంగణంలో ముగ్ధంగా, స్నిగ్ధంగా ఆడుకొనే
దాన్నండీ! కన్ను మూసి తెరచేలోగా అంతా అయిపోయింది. ఇందులో బలహీనత
ఏమీలేదు. అంతా హీనతే. మంగళ సూత్రం కట్టలేదు కాబట్టి తనకే సంబంధం
లేనట్టూ చూసే కొడుకూ, తనకి న్యాయం చెయ్యమని అడగటానికొచ్చిన
అమ్మాయిని మెడ పట్టుకొని తోసివేసిన మావగారూ -" ఆమె ఆగి
కొనసాగించింది.
"సంపాదిస్తున్న కూతురు తప్పు చేసింది కాబట్టి ’మరీ ఎక్కువగా’
తిట్టలేక ఎబార్షన్ చేయిస్తానన్న తండ్రీ.... వీళ్ళు, వీళ్ళంతా కలిసి
ఒక పద్దెనిమిదేళ్ళ అమ్మాయి ముగ్ధత్వాన్ని కాళ్ళ క్రింద నలిపేసేరు.
అప్పుడు నాకు బాధ వెయ్యలేదండీ!
చేసిన చిన్న తప్పుని వప్పుకుని ఇంతమంది మొగాళ్ళని ధైర్యంగా
ఎదిరించి, స్వశక్తి మీద నిలబడి తన కొడుకును తాను పెంచుకొంటున్న ఒక
అమ్మాయిని, స్త్రీ అయివుండీ మీరు మీ పక్క పోర్షన్ లోకి రానివ్వటం
లేదంటే ఇప్పుడు బాధగా వుంది, అంతే".
చివరగా అన్నది, "నాకు ఇల్లక్కర్లేదండీ, మీరే ఇంట్లోంచి బయటకొచ్చి
ప్రపంచాన్ని చూడండి. స్త్రీకి జరుగుతున్న అన్యాయానికి పరోక్షంగా
దోహదం చేస్తున్నది స్త్రీయే అని తెలుస్తుంది. మొగవాళ్ళ ప్రపంచం
నుంచి తన వాళ్ళని తొలగిస్తున్నది కూడా స్త్రీయే అనిపిస్తుంది".
ఆమె వెనుదిరిగింది.
ఆమె చేయిపట్టుకుని బాబూ వెనుతిరిగేడు.
|
|