w  
               

 

జయదేవ బృందావనం(అష్ట పది -5)
డా.తాడేపల్లి పతంజలి

                                            

సఖి హే  కేశి మథన ముదారం

సఖీ ! ఇతర కాంతలతో విహరిస్తున్నాడని తెలిసినా కృష్ణయ్య మీద నాకు కోపం రావటం లేదే!’’అంటూ ఎప్పుడో

జరిగిన ముచ్చట్లు రాధ తన చెలికత్తెతో ఈ అష్టపదిలో పంచుకొంటోంది .

నిభృత నికుంజ గృహం    గతయా  నిశి  రహసి నిలీయ వసంతం 

చకిత వి లోకిత సకల దిశా   రతి రభస భరేణ  హసంతం

సఖి హే  కేశి మథన ముదారం రమయ మయా  సహ మదన మనోరథ భావితయా స వికారం   (1)

నిభృత= నిశ్శబ్దంగా ఉన్న; నికుంజ గృహం  =  పొదరింటిని ; గతయా =పొందిన నాతో ; నిశి =రాత్రియందు; రహసి =ఏకాంతముగ; నిలీయ =అణగి ; వసంతం =ఉన్నట్టి; చకిత =భయంతో; విలోకిత =చూడబడిన ; సకల దిశా   =అన్ని దిక్కులు కలిగిన నాతో; రతి రభస భరేణ  =రతి  క్రీడల సంతోషమునకు అధీనుడగుట చేత ; హసంతం =నవ్వుచున్నట్టి కృష్ణుడిని ; రమయ =రమింపజేయుము.; సఖి హే =ఓ సఖీ!;   ఉదారం =చక్కని వాడైన కేశి మథనం =కేశి అనే రాక్షసుని చంపిన  కృష్ణుడిని; మదన మనోరథ =కామ క్రీడాసక్తితో : భావితయా = భావాలతో ఉన్న   ; మయా  సహ =నాతో కూడా; స వికారం   =గోటి గిచ్చుళ్ళు మొదలైన చేష్టలతో ;రమయ =కలిసేటట్లు చేయవే!

తాత్పర్యం

ఒకసారి కృష్ణుడిని  కలుసుకొందామని నిశ్శబ్దంగా ఉన్న పొదరింటిలోకి వచ్చానే !అంతకుముందే అయ్యగారు వచ్చినట్టుంది. నేను చూసుకోలా! ఆయన కోసం నాలుగు పక్కలా వెతుక్కొంటున్నా! నా ఆతృత చూసి ఒక నవ్వు నవ్వాడు. నా మనస్సులో మన్మథ వికారాలు అనేకం వస్తున్నాయే! ఆ మాథవుడిని నాతో కలిసేటట్లు    చేయవే!

విశేషం:

ఒక అందమైన దృశ్య చిత్రం. ఈ భావం చదివిన తర్వాత ఒక్కసారికళ్ళు మూసుకొని  దృశ్యాన్ని మనస్సులో ఊహించుకొంటే జయదేవుని అద్భుత భావ చిత్రణ కనబడుతుంది.

ప్రథమ సమాగమ లజ్జితయా పటు చాటు  శతైరనుకూలం

మృదు మధుర స్మిత భాషితయా శిథిలీకృత జఘన దుకూలం

సఖి హే  కే శి మథన ముదారం రమయ మయా  సహ మదన మనోరథ భావితయా స వికారం   (2)

ప్రథమ సమాగమ =మొదటి సమాగమంలో; లజ్జితయా =సిగ్గుపడిన నాతో ; పటు చాటు  శతైరనుకూలం =వశం చేసుకోవటానికి వీలయిన నేర్పుతో కూడిన అనేక మాటలతో  అనుకూలుడు; మృదు మధుర= కోమలములైన, మనోహరములైన అనేక;స్మిత భాషితయా =నవ్వులమాటలతో ;శిథిలీకృత =వదలింపబడిన ; జఘన దుకూలం =మొలయందుగల పట్టు వస్త్రం కల కృష్ణుడిని ; రమయ =రమింపజేయుము.

తాత్పర్యం

               అయ్యవారితో కలిసిన మొదటి సమాగమంలో కాస్తంత సిగ్గు వచ్చిందే! అప్పుడు ఆకృష్ణయ్య చక్కగా మాట్లాడాడు.నెమ్మదిగా సిగ్గు పోగొట్టాడు.ఏదో చనువుతో

మాట్లాడుతున్నానో లేదో, - -వస్త్ర దాత- వస్త్రాపహరణం చేసాడు. ఆ కృష్ణయ్యని నాతో కలిసేటట్లు    చేయవే!

కిసలయ శయన నివేశితయా   చిరమురసి మమైవ శయానం

కృత పరిరంభణ చుంబనయా పరిరభ్య కృతాధరపానం

సఖి హే  కే శి మథన ముదారం రమయ మయా  సహ మదన మనోరథ భావితయా స వికారం   (3)

కిసలయ శయన =చిగుళ్ళ పడకలో; నివేశితయా= కూర్చున్నాడు.; చిరం =అదే అదనుగా ;మమ ఏవ = నాయొక్క; ఉరసి =వక్ష స్థలంమీద; శయానం =పరున్నాడు.; కృత పరిరంభణ= నన్ను కౌగిలించుకొన్నాడు;. చుంబనయా =ముద్దాడాడు.; పరిరభ్య=బిగియారా కౌగిలించుకొని; కృతాధరపానం = నా అధరామృతాన్ని తనివితీరా తాగాడు ;

తాత్పర్యం

చిగుళ్ళ పడక లో కూర్చున్నాడు. తర్వాత నా వక్ష స్థలంమీద పరున్నాడు.  నన్ను కౌగిలించుకొన్నాడు.ముద్దాడాడు. నా అధరామృతాన్ని తనివితీరా తాగాడు. ఆ కృష్ణయ్యని నాతో కలిసేటట్లు    చేయవే!

విశేషం:

ఈ రకమైన ఆలింగనాన్ని క్షీర ,నీర ఆలింగనంఅని రసమంజరీ కారుడు చెబితే , ఇంకొందరు తిల తండుల ఆలింగనం అన్నారు.

అలస నిమీలిత లోచనయా  పులకావలి లలిత కపోలం

శ్రమ జల  సకల కళేబరయా   వర  మదన మదాదతి  లోలం

సఖి హే  కే శి మథన ముదారం రమయ మయా  సహ మదన మనోరథ భావితయా స వికారం   (4)

అలస నిమీలిత లోచనయా  = మెల్లిగా సగము మూయబడిన కన్నులతో  పడుకొన్నానే! ;పులకావలి లలిత కపోలం= రోమాంచాల వరుసలతో  ఒప్పుచున్న చెక్కిళ్ళు కలిగిన నా ; శ్రమ జల  సకల కళేబరయా   =ఒళ్ళంతా చెమరించింది.; వర  మదన మదాత్ =శ్రేష్ఠమైన  మన్మథునివల్ల  కలిగిన సంతోషంతో ;  అతిలోలం= బాగా ఆశ కలిగిన కృష్ణుని  ; రమయ =రమింపజేయుము.;.

తాత్పర్యం

ఆ మొదటి కలయిక తర్వాత మెల్లిగా సగము మూయబడిన కన్నులతో  పడుకొన్నానే! నా ఒళ్ళంతా చెమరించింది.నాతో కలిసిన కృష్ణుడు కూడా మన్మథునివల్ల  కలిగిన సంతోషంతో బాగా ఆశ కలిగిన కృష్ణుని నాతో కలిసేటట్లు    చేయవే!

కోకిల కలరవ కూజితయా  జిత మనసిజ తంత్ర విచారం

శ్లథ కుసుమాకుల కుంతలయా  నఖ లిఖిత ఘన స్తన భారం

సఖి హే  కే శి మథన ముదారం రమయ మయా  సహ మదన మనోరథ భావితయా స వికారం   (5)

కోకిల కలరవ కూజితయా  =నేను కోయిలలా కుహూకుహూ అని ధ్వనులు చేయటం మొదలుపెట్టాను.: జిత మనసిజ తంత్ర విచారం =కృష్ణుడు కామశాస్త్ర  తర్కం మొదలుపెట్టి నన్ను జయించాడు; శ్లథ కుసుమాకుల కుంతలయా  =ఆ రతిక్రీడలో నా జడ చెదరింది:. పూలు రాలాయి. తలవెండ్రుకలు చిక్కుపడ్డాయి. ; నఖ లిఖిత ఘన స్తన భారం  = కృష్ణుడు  నా స్తనములమీద గోళ్ళతో గాయాలు చేయటం మొదలుపెట్టాడు.;

తాత్పర్యం

మొదటి సమాగమం ముగిసిన పిదప నేను కోయిలలా కుహూకుహూ ఆని ధ్వనులు చేయటం మొదలుపెట్టాను. కృష్ణుడు మేల్కొని కామశాస్త్ర  తర్కం మొదలుపెట్టాడు. ఆ రతిక్రీడలో నా జడ చెదరింది. పూలు రాలాయి. తలవెండ్రుకలు చిక్కుపడ్డాయి. సమయం దొరికింది కదా అని కృష్ణుడు  నా స్తనములమీద గోళ్ళతో గాయాలు చేయటం మొదలుపెట్టాడు. ఆ కృష్ణయ్యని నాతో కలిసేటట్లు    చేయవే! 

చరణ రణిత మణి నూపురయా  పరిపూరిత సురత వితానం

ముఖర విశృంఖల  మేఖలయా స కచ గ్రహ చుంబన దానం

సఖి హే  కే శి మథన ముదారం రమయ మయా  సహ మదన మనోరథ భావితయా స వికారం   (6)

చరణ రణిత మణి నూపురయా  =ఆ సమాగమంలో  నా కాలికున్న రత్నాల అందెలు ఎన్నిసార్లు మోగాయో! ; పరిపూరిత సురత వితానం =నిండించబడిన  రతిక్రీడల ఆధిక్యం కలిగిన ;ముఖర=మోయుచున్న; విశృంఖల=దృఢమైన;  మేఖలయా =నా మొలనూలు కిందికి జారగా స కచ గ్రహ =నా కొప్పు చేతితో పట్టుకొని చెక్కిలి నొక్కి;  చుంబన దానం =అధరాన్ని   ముద్దాడాడు .

తాత్పర్యం

సఖీ! ఆ సమాగమంలో  నా కాలికున్న రత్నాల అందె లు ఎన్నిసార్లు మోగాయో! నా మొలనూలు కిందికి జారగా నా కొప్పు చేతితో పట్టుకొని, చెక్కిలి నొక్కి, అధరాన్ని   ముద్దాడాడు ఆ కృష్ణయ్యని నాతో కలిసేటట్లు    చేయవే!

 .రతి సుఖ సమయ రసాలసయా  దర ముకుళిత నయన సరోజం

నిస్సహ నిపతిత తను లతయా  మధు సూదమముదిత మనోజం

సఖి హే  కే శి మథన ముదారం రమయ మయా  సహ మదన మనోరథ భావితయా స వికారం   (7)

రతి సుఖ సమయ =రతిసుఖము పొందిన వేళలో; రసాలసయా =అనురాగముతో అలసిన నేను; దర =కొంచెము ; ముకుళిత నయన సరోజం =ముయ్యబడిన తామరరేకులవంటి కన్నులు కలిగిన దానిని అయ్యాను;  నిస్సహ =బలంకోల్పోయి; నిపతిత తను లతయా  =ఒక లతలా వాలిపోతే;మధు సూదనం  ఉదిత మనోజం= ఆ సమయంలో మళ్ళీ నాలో మన్మథుణ్ణి పుట్టించాడు ;.

తాత్పర్యం

రతిసుఖము పొందిన వేళలో అనురాగముతో అలసిన నేను కొంచెము ముయ్యబడిన తామరరేకులవంటి కన్నులు కలిగిన దానిని అయ్యాను.  రతిశ్రమచే నా శరీరం బలంకోల్పోయి ఒక లతలా వాలిపోతే ,ఆ సమయంలో మళ్ళీ నాలో మన్మథుణ్ణి పుట్టించాడు . ఆ కృష్ణయ్యని నాతో కలిసేటట్లు    చేయవే! 

శ్రీ జయదేవ భణితమిదమతిశయ  మధురిపు నిధువన శీలం

సుఖముత్కంఠిత గోప వధూ కథితం  వితనోతు  సలీలం

సఖి హే  కే శి మథన ముదారం రమయ మయా  సహ మదన మనోరథ భావితయా స వికారం   (8)

శ్రీ జయదేవ కవి భణితం = శ్రీ జయదేవ కవి చెప్పిన; అ తిశయ =అధికమైన; మధురిపు నిధువన శీలం =శ్రీకృష్ణ రతములే స్వభావముగా కలిగినది; ఉత్కంఠిత గోప వధూ కథితం=విలాసాలు కలిగినది ఆసక్తి  కలిగిన రాధ చెప్పినది అయిన ఈ గీతం; సుఖం =సుఖాన్ని ;వితనోతు  = విస్తరించేటట్లు చేయుగాక 

తాత్పర్యం

శ్రీ జయదేవ కవి చెప్పిన; అధికమైన శ్రీకృష్ణ రతములే స్వభావముగా కలిగినది,విలాసాలు కలిగినది ,ఆసక్తి  కలిగిన రాధ చెప్పినది ఆయిన ఈ గీతం సుఖాన్ని పెంచుగాక!

విశేషం:

మొత్తం మీద ఈ ఆష్టపదిలో బాహ్యంగా శృంగారం పదాలలో కదను తొక్కిందనేది స్పష్టం.

ఇంతగా శారీరక వాంచ విశృంఖల విహారం చేసిందేమిటనే సందేహం సామాన్యుల నుదురును,మనస్సును ఆక్రమించుకోవటం సహజం.

ఆర్తి విరహంలోను, భక్తిలోను ప్రధాన పాత్ర వహిస్తుంది.

కలవటం అంటే రాధ అనే ఆత్మ కృష్ణుడనే పరమాత్మకోసం తాపత్రయపడటం.

''నన్ను రతిలో తేల్చాడంటే ''   ఆ జీవ పరబ్రహ్మైక్యసంధాన అనుభూతి  కొంచెం సేపు జరిగిందనే అర్థం.యోగం చేసేవారికి ఇది అనుభవ సిద్ధం. ఒక్క క్షణం అలా అద్భుతమైన ,వివరించటానికి అసాధ్యమైన సమాధి స్థితి కలుగుతుంది.మరునిమిషంలో యోగం చాలక ,ఆ అనుభవం చేజారిపోతుంది.మళ్ళీ తీవ్రమైన యోగానుసంధానంలో ఆ సమాధి కుదురుతుంది.

శాశ్వతమైన యోగం  కోసం ప్రయత్నం నిరంతరం చేస్తుండాలి. ఇదే చేజారిపోయిన కృష్ణ 'సంయోగం'' కోసం    రాధ  తాపత్రయ పడటం . ఈ యోగ రహస్యాన్ని  జయదేవుడు శృంగారం చాటున బోధిస్తున్నాడు. 

అష్టపదులలో అర్థం కంటే పరమార్థం ముఖ్యం.  స్వస్తి.  

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం