ఎదుట నున్నాడు వీడె
ఎదుట నున్నాడు వీడె ఈ బాలుడు
మదితెలియమమ్మ ఏమరులోకాని||
పరమ పురుషుడట పసులగాచెనట
సరపులెంచిన విన సంగతాయిది
హరియే తానట ముద్దులందరికి జేసెనట
ఇరవాయనమ్మ సుద్దులేవిటివో కాని||
వేదాలకొడయడట వెన్నలు దొంగిలెనట
నాదించి విన్నవారికి నమ్మికా యిది
ఆదిమూల మీతడట ఆడికెల చాతలట
కాదమ్మ ఈ సుద్దులెట్టికతలో కాని||
అల బ్రహ్మతండ్రియట యశోదకు బిడ్డడట
కొలదొకరికి చెప్పకూడునా యిది
తెలిపి శ్రీ వేంకటాద్రి దేవుడై నిలిచెనట
కలదమ్మ తనకెంత కరుణో కాని||
లీలమానుష వేషధరి శ్రీకృష్ణుని విశ్వవ్యాపకత్వాన్ని, వైశిష్ట్యాన్ని
తెలిపే సంకీర్తన యిద్ర్!
సామాన్యుడుగ కన్పించే ఈ బాలకృష్ణుడు పరమపురుషుడు కాని నిరడంబరుడై
రేపల్లెలో ఆలమందలను మేపాడు. వేదాలకు ఈతడు ప్రభువే కాక, వేదాలను
కాపాడిన ఈతడు వెన్న దొంగతనం చేశాడు! ఎంత విడ్డూరం? సృష్టికర్తయైన
బ్రహ్మకే తండ్రి, కాని రేపల్లెలో యశోదమ్మకు ముద్దుల బిడ్డడైనాడు..
ఎంతచోద్యం? భక్తజనుల యెడ కరుణ అపారంగా కల్గిన ఆ శ్రీ కృష్ణుడే
కలియుగంలో వేంకటేశ్వరస్వామియై వెలిశారు అని అంటున్నాడు అన్నమయ్యగారు!
మది
= మనస్సు;
ఏమరు = పరధ్యానం;
ఇరవు = స్థాణము, స్థిరము;
అడికెలచాతలు = కొంటెచేష్టలు;
సరవులు = వరుసలు, క్రమములు;
ఒడయడు = ప్రభువు;
నాదించి = చెవియొగ్గి, శ్రద్ధగా;
కొలది = కొలమానము, విలువ, పరిధి, పరిమితి
|