పద్యం-హృద్యం

-- తల్లాప్రగడ

ముందుమాట: ఈ శీర్షికతో తెలుగు పద్యంలో ఉన్న అందాన్ని, గొప్పతనాన్ని పదిమందికీ అందించి, వారిని ఈ ప్రక్రియకు దగ్గిర చేసి, పద్యానికుండవల్సిన మర్యాదని గుర్తుచేయడమే మా సంకల్పం. మరుగు పడిన పద్యాన్ని మళ్ళీ మెరుగు పరచి, భాషను సరళీకృతం చేస్తే, పద్యాలంటే ఉన్న భయం తొలుగుతుంది. వాడుక భాషలో పద్యాలు వ్రాస్తే, అటు పద్యమూ నిలబడుతుంది, ఇటు ప్రజలకూ అర్థమవుతుంది. అందుచేత వాడుకభాషా ప్రయోగాలకు మేము ప్రాముఖ్యత ఇవ్వదలిచాము. ముందు ముందు ఈ శీర్షికను పాఠకులందరూ పాల్గునే విధంగా రూపొందిస్తాము. అలాగే మంచి పద్యాలకు భాష్యం, తాత్పర్యాలు, కూడా ప్రచురిస్తాము. అందరూ ఆనందించాలి, ఆస్వాదించాలి, ఆదరించాలి, అదే మాకు పదివేలు (డాలర్లు)!!!!

సమస్యాపూరణం:

ఈ క్రింది "సమస్యని" అంటే ఆ వాక్యాన్ని యథాతధంగా ఒక పద్యంలోకి ఇమిడ్చి వాడుకుంటూ రాయాలి. ఒకవేళ పద్యం కాకపోయినా ఒక కవిత రాసినా కూడా వాటిని మేము సగౌరవంగా స్వీకరిస్తాము.

మీ జవాబులు ఈ మెయిల్(rao@infoyogi.com) ద్వారా కాని ఫాక్స్ ద్వారా కానీ : 408-516-8945 మాకు జూన్ 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము.

ఈ మాసం సమస్య ( శ్రీ పుల్లెల శ్యామసుందర్ గారు ఇచ్చిన సమస్య))

"కం:// పిల్లల నొకటేయవలెనె పిల్లల తల్లీ "
(పిల్లలని కొడితే తప్పులేదు అనే భావాన్ని ఇచ్చారు)

క్రితమాసం సమస్య (ఉదయ రావు గారిచ్చిన సమస్య) : "సందులు గొందులు వెదకుచు సత్యము కొఱకై"

ఈ సమస్యకి మంచి సమాధానాలు వచ్చాయి. వాటిలో కొన్ని ఈ విధంగా ఉన్నాయి!

మొదటి పూరణ - డా: ఐ.యస్. ప్రసాద్, హైదరాబాద్

కం:// సంధ్యా సమయంబైనను,
ఎందులకో చిన్న సత్యమింటికి రాలే,
దేందనుచు తల్లి తిరిగెన్,
సందులు గొందులు వెదకుచు సత్యము కొఱకై,

(మన తెలుగు భాషా సంస్కృతి లో ఒక ముఖ్య భాగమైన సమస్యా పూరణ నిర్వహణని అభినందిస్తూ పంపారు. ప్రసాద్ గారూ, ధన్యవాదాలు),

రెండవ పూరణ - పుల్లెల శ్యామసుందర్, శాన్ హోసే,

కం:// అందరు వలదని చెప్పిన
నెందులకప్పిచ్చినాననేడ్చుచు మదిలో
తొందరపడి తిరిగెనతడు
సందులు గొందులు వెదకుచు సత్యము కొఱకై


మూడవ పూరణ - కె.వి.యస్. శ్రీరాం, బెంగళూరు

కం:// బంధుల మిత్రుల విడచియు
పొందరు నిజమగు సుఖమును భువిన వివేకుల్
చందురు వర్ణుని తెలియక
సందులు గొందులు వెదకుచు సత్యము కొఱకై

("ఎందరో మహానుభావులు.." కీర్తనలో రామచంద్రుని "చందురు వర్ణుడు" అని వర్ణించారు శ్రీత్యాగరాజులు)


మరొక పూరణ (ఒక భౌతిక వాది మాటల్లో)

కం://ఎందులకీ వెర్రితనము
సందులు గొందులు వెదకుచు సత్యము కొఱకై
మందమతివలెను సుఖమును
విందును పొందును విడుచుట విజ్ఞతయగునే

(పద్యం హృద్యం శీర్షికను ఎంతో ప్రశంసిస్తూ వ్రాసారు. మా ధన్యవాదాలండీ!))


నాల్గవ పూరణ - తల్లాప్రగడ, శాన్ హోసే,

కం:// చిందులు తొక్కితివేలా
సందులు గొందులు వెదకుచు సత్యము కొరకై!
విందున అందిన మదువుల
నందున సోడాను కలపినదెవరననుచూ!

(నా స్నేహితుడొకడికి విస్కీలో సోడా కలిపితే మహా చెడ్డ చికాకు లెండి!)


ఐదవ పూరణ - రానారె (రామనాధ రెడ్డి ఎర్రపు రెడ్డి)

కం:// కుందనపు బొమ్మనేలక
నంధతనొక్కడు, నడిచెద నాకము ననుచున్
పెందలకడనే వెడలెను
సందులు గొందులు వెదకుచు సత్యము కొరకై


ఆరవ పూరణ - మాజేటి సుమలత, బెంగుళూరు,

కం:// ఎందును అగుపడలేదని
సందులు గొందులు వెదకుచు సత్యము కొరకై
ఎందెందున వెదకదవే
విందుగ వున్నది వెదకిన అందరిలోనూ!


ఏడవ పూరణ - డా:// రెజీనా గుండ్లపల్లి, రీడర్, తెలుగు శాఖాధ్యక్షురాలు, విజయవాడ,
(ఆంధ్రప్రదేశ్ ఉత్తమ అధ్యాపక పురస్కార గ్రహీత)

కవిత:// స్తుతమతియైన ఆంధ్రకవి ధూర్జటి పలుకులకేల గలిగేనో అతులిత మాధురీ మహిమ
...... హా తెలిసెన్ వారవనితా జనితాపహార మధురసుధా రసముల గ్రోలుటన్"
అన్నది వికట కవి పలుకులు.
మరి నేటి సిద్ద, సాధ్య, యతి, మునిపుంగవులు
టక్కు టమార, గజకర్ణ గోకర్ణ విద్యామాంత్రికులు
వారకాంతలకై యెందెందు వెతకెడు విటులు
సంసార జీమూతములచే త్రెళ్ళక స్రుక్కెడు సంసారులు
బ్రతుకంత సుఖములకై వెతకి వేసారిదోసిన నిర్బాగ్యులు
విద్యలో మర్మములన్ని తెలిసికొంటినన్న విద్యార్ధులు
ధనం మూలమిధం జగత్తని తనివితీరని ధనమధాంధులు
పరిశొధనతో తృప్తి చెందక సృష్టికి ప్రతిసృష్టి చేసెడు శాస్త్ర పిపాసులు
అడవికాచిన వెన్నెల జీవితమయినదని విలపించు వృద్ధ కన్యలు
అనాధలు, అవిశ్వాసులు, మాదకద్రవ్యప్రియులు, సంఘ విద్రోహులు
తెప్పరిల్లి చివరకు చేరుకోవలసిన దారి, తెలిసిన లోకం
సందులు గొందులు వెదకుచు సత్యము కొరకై!


పాఠకుల నుంచీ ఇంకొన్ని మంచి పద్యాలు: పుల్లెల శ్యామసుందర్ గారు మన ఆంధ్ర కుటుంబ శిభిరం (andhra family camp) నుంచీ తిరిగి వచ్చాక వారికి కలిగిన అనుభూతులను ఈ విధంగా వివరించారు

శుక్రవారం రాత్రి గురించి:

ఉహుహూ అని వణుకు చలిలొ
హహహా అని నవ్వు నిచ్చె హైదర బాద్మే
రహనే వాలోం కీబోల్
శహభాష్! అది మంచి స్కిట్టు చక్కిలి గిలితో


శనివారం రాత్రి గురించి:

పచ్చిక బయలును మీరొక
రచ్చగ మార్చితిరి మంచి లైటింగ్ తోడన్
వచ్చిన జనులందరు నిక
అచ్చెరువుతొ చూచిరి మన ఆంధ్రుల ప్రతిభన్


వంటల గురించి:,

పప్పును కూరయు పులుసును
ఘుప్పున వేసిన పోపుతొ ఘుమఘుమ లాడెన్
అప్పడముతోడ ఆ రుచి
చెప్పగ నావల్ల తరమె, సిలికానాంధ్రా!!


భక్త హనుమ -- తల్లాప్రగడ

సందర్బం: అశోకవనంలో హనుమంతుడు సీతామ్మవారితో తన పరిచయం అయ్యాక చూడామణిని శ్రీరామచంద్రులవారి జ్ఞాపికగా సీతకు ఇచ్చాడు. ఎలాగంటే,

సీ// మరుకువకొచ్చిన మరకలని తుడవ, సీతా సుమకరంద యుత మరకత
మయ యాభరణము, రామ స్పర్శతో మయూఖా జ్వలితమయి వికాసితమయి
రామ విరావము రావించు రతనమై రాజిల్ల, దానిని రామ నామ
ము తలచి, యా కపి మూర్తి సీత కొసగె, మరియొక్క మారది సరిగ తాకి

రామ నామమే ప్రతియొక్క రోమమందు!
రామ నామము కొరకేను రతము వీడి,
రామ రాణిని కలిసేటి రాణువయ్యె
రామ రేణువే హనుమంతు రామచంద్ర!

ప్రతిపదార్థం:

మరుకువ కొచ్చిన = ఏమరపాటున తెలియకుండా కల్గిన
మరకలని తుడవ = మరకలని శుభ్రంచేస్తే
సీతా సుమకరంద యుత = సీత ధరించగావచ్చిన సువాసనల భరితమయ్యినటువంటి
మరకత మయ = మణులు గల్గిన
ఆ ఆభరణము = ఆ ఆభరణము
రామ స్పర్శతో = శ్రీరాముని చే స్పృశించ బడినదైనటువంటి (రాముడే ఇచ్చిన)
మయూఖా = సూర్యకిరణము లాగున
జ్వలితయ్యి = ప్రకాశించబడి
వికాసితమయి = వికసించి, వెలిగి
రామ విరావము = రాముని ఉనికిని /ధ్వనిని
రావించు = పాడు/ తెలుపు
రతనమై = రత్నమై
రాజిల్ల = మెరుస్తోంటే
దానిని రామ నామము తలచి = దానిని శ్రీరామ, శ్రీరామ అని తలస్తూ
ఆ కపి మూర్తి = ఆ ఆంజనేయుడు
సీత కొసగె = సీతామ్మవారికి ఇచ్చాడు
మరియొక్క మారది = (ఎలాగంటే) మళ్ళీ ఇంకోసారి తనివితీరా భక్తితో
సరిగ తాకి = సరిగ్గా ముట్టుకుని

రామ నామమే = రాముడి పేరే
ప్రతియొక్క = ప్రతి ఒక్క
రోమమందు! = వెంట్రుకలోనూ
రామ నామము = రామ జపము
కొరకేను = కోసమే
రతము వీడి = బ్రహ్మచారి అయ్యి
రామ రాణిని = సీతని
కలిసేటి = వెతికి కలిసేటి
రాణువయ్యె = సైనికుడయ్యాడు
రామ రేణువే = రామునినుంచి రాలిన ఒక రేణువే (అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుడే అనటం)
హనుమంతు = హనుమంతుడు!
రామచంద్ర! = శ్రీరామచంద్రుడా!