|
||||||||||||||
- శ్రీమతి సరోజా జనార్ధన్ |
||||||||||||||
సంగీతం సామవేద సారం. సంగీతం నాదమయం. నాదమంటే? ’న’ కారానికి ప్రాణమని, ’ద’ కారానికి అగ్ని అని ప్రాణాగ్నుల సంయోగంతో ఉద్భవించేదే నాదమని శాస్త్రం చెప్తుంది. అలాగే సంగీతానికి ప్రాణం శృతి. "శ్రూయన్త ఇతి శృతయః" అని శృతికి నిర్వచనం. శృతులు 22. స్వరమంటే? "స్వతో రంజయతి" స్వయంగా రంజింపజేయడమే లక్షణంగా కలిగినది. సంగీతంలో ప్రధానమైనవి 7 స్వరాలు. ఈ స్వరాలు 22 శృతుల కలయికతో 12 స్వరస్థానాలేర్పడ్డాయి. ఏ సంగీతమైనా ఈ స్వరస్థానాలను దాటి ఉండదు. కర్నాటక సంగీతమైనా, హిందుస్థానీ సంగీతమైనా, పాశ్చాత్య సంగీతమైనా ఈ స్వరాలు, స్వరస్థానాలతో ఏర్పడ్డదే. ఐతే ఆయా సంగీతాలలో వాడే పేర్లూ, పద్ధతులూ, ప్రయోగాలూ వేరుగా ఉంటాయి. సంగీతానికి సంబంధించి, అందులో ప్రయోగించే ప్రతి మాటకీ శాస్త్ర పరమైన నిర్వచనాలుంటాయి. అందుకే ఆ సంగీతాన్ని శాస్త్రీయ సంగీతం అంటారు. ఏ విద్య ఐనా ఏ విషయమైనా శాస్త్రపరమైన ప్రమాణాలతో కూడి ఉన్నప్పుడే శాశ్వతత్వం పొందుతుంది. కర్నాటక, హిందుస్థానీ, పాశ్చాత్య సంగీతాలు మూడు రకాల శాస్త్రీయ సంగీతాలు. అంటే అవి నేర్చుకునేవారు వాటిలో దాగియున్న శాస్త్రనియమాలు తెలుసుకుంటూ సంగీతం ఒక పద్ధతిగా నేర్చుకుంటారు. అవికాక లలితసంగీతం, జానపద సంగీతం, సినిమా సంగీతం ఇంకేదైనా సరే అవే విషయాలు కలిగి ఉంటాయి. కాని ఆ విషయాల వివరం తెలియక్కరలేకుండా నేర్చుకోతగినదిగా ఉంటుంది. అన్నిటికీ మూలం శాస్త్రీయ సంగీతమే. శాస్త్రీయ సంగీతమంటే చాలా నియమాలు కలిగిఉంటుంది కనుక అది అర్ధం కావడం కష్టం; ఆలాపనలు, స్వరకల్పనలు ఇలా రకరకాల ప్రక్రియలుంటాయి. అవన్నీ అర్ధం చేసుకోవడం కష్టమని, మామూలు పాటని విని ఆనందించినట్టు, శాస్త్రీయ సంగీతాన్ని ఆస్వాదించలేమని చాలా మంది అభిప్రాయం. (అపోహపడాతారు) ఐతే వారనుకునే మామూలు పాటల్లోనూ ఆలాపనలూ, స్వరాలూ అన్నీ ఉంటాయి. కానీ అవి మరోవిధంగా అందులో దాగి ఉంటాయి. స్వరం అనేది లేకుండా పాట అనేది లేదు అని ఇప్పటికీ చాలామందికి తెలీదు. సంగీతం వేరు, మామూలు పాటలు, సినిమా పాటలు వేరు అనుకుంటారు. సంగీతం ఏరూపంగా ప్రదర్శింపబడినా అది గొప్పదే. దేని విలువ దానికుంది. దేనిలో ఉండే కష్టం దానిలో ఉంది. కళ యొక్క ముఖ్య ఉద్దేశ్యం జనాదరణే. కాని జనాలు సరిగా ఆదరించలేకపోతే అది వారి లోపం కానీ కళలో ఏలోపం ఉండదు. శాస్త్రీయ సంగీత ప్రక్రియలో రకరకాల అంశాలు ప్రదర్శింపబడతాయి. ఈ సంగీతంలో ముఖ్యంగా భక్తి రసం కనబడుతుంది. కొన్నిచోట్ల, అంటే కొన్ని కృతులు కీర్తనలలో తేలిక మాటలంటే, కొన్నింటిలో కఠిన పదాలు కనబడతాయి. అన్నీ తేలికగా అర్థం అయ్యేలా ఉండకపోవచ్చు. ఐతే తేలికగా ఉంటేనే ఆస్వాదిస్తామనడం ఎంతవరకు సరియైనది? అందులోని ఆనందం అర్థమయ్యేలా మనస్థాయినెందుకు పెంచుకోకూడదు? శాస్త్రీయ సంగీతంలోని విషయాలను అంటే రాగాలాపన వంటివాటిని తక్కువ చేసి మాట్లాడేవారు చాలా మందున్నారు. ఆలాపన సాగదీసి గంటలు గంటలు పాడతారు. ఏమీ అర్థం కాదు. అని హేళన చేస్తారు. వారు ఆనందించే పాటలు మాటలుకూడా ఆలాపనలే అని తెలుసుకోలేరు. ఒక రాగాన్ని ఆలాపన చేయాలంటే ఎంత క్రియాశీలత ఉండాలి, ఎంత కష్టపడాలి తెలుసుకోరు. దానిలో ఉన్న విషయమేమిటో కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేసినా తప్పక ఆనందించగలుగుతారు. కానీ అంత కష్టపడడం చాలామందికి నచ్చదు. అది వారిలోని లోపం. కనీసం తెలుసుకోలేనప్పుడు విమర్శించకుండానైనా ఉండాలి. రకరకాల అభిరుచులుండడం తప్పుకాదు. కానీ అభిరుచి లేని విషయాన్ని విమర్శించడం చాలా తప్పు. ఈ రోజుల్లో సినిమాల ప్రభావం ఎలాంటిదో అందరికీ తెలుసు. సినిమా పాటల ప్రభావం అంతకన్నా తెలుసు. సినిమా పాటలు ఆస్వాదించని వారుండరు. సినిమా పాటల్లో రకరకాల భావాలూ, రకరకాల శైలుల్లో బాణీలూ, రకరకాల భాషా ప్రయోగాలూ ఉంటాయి. చాలా వరకూ తేలికగా అర్ధమయ్యేలా ఉంటాయి. ఏ పాటైనా పదిసార్లు వింటే బావుందనిపిస్తుంది. అది పాటకున్న లక్షణం. సినిమా పాటలు అడుగడుగునా ఎక్కడో అక్కడ వినపడడం వల్ల విపరీతమైన ప్రచారం పొంది తేలికగా ఆదరించబడతాయి. సినిమా పాటల్లో ఈ రోజుకీ "classical tunes" మీద ఆధారపడినవి ఎన్ని పాటలో. అవన్నీ ఆదరించబడుతున్నవే. అవి మెచ్చుకునేవారు అలాంటివే ఐన కృతులని కూడా తప్పక మెచ్చుకోగలరు. కానీ సినిమాలలో ఉండేవాటికున్న ప్రచారం వీటికి లేకపోవటం ఒక కారణం, సంగీతమంటే వేరు అనుకోవడం ఒక కారణం ఆ సంగీతాన్ని ఆనందించలేకపోవడానికి శ్రీ వేటూరి, శ్రీ సిరివెన్నెల వంటి వారు కఠిన పదాలతో గొప్పగా రచించిన పాటలు అందరికీ అర్ధమవకపోయినా, ఆ పాటలు పదే పదే వినడం వల్ల ఆహా ఎంత కష్టంగా గొప్పగా రచించారో అనుకున్నారు కదా. సంగీతమూ అంతేమరి. పూర్వం నుంచీ ఇప్పటివరకూ ఉన్న సంగీత దర్శకులంతా సంగీతాన్ని చక్కగా నేర్చుకుని అందులోని రాగాలని రకరకాలుగా ప్రయోగించడం వల్లే అన్ని మంచి పాటలు రూపుదిద్దుకుంటున్నాయి. సంగీతం నేర్చుకున్నవారందరూ శాస్త్రీయ కచేరీలే చేయనక్కరలేదు. దాని విలువ ఎప్పటికీ గుర్తుంచుకుంటే చాలు.
సినిమా పాటల్లో మధ్యలో పెద్ద పెద్ద ఆలాపనలూ, స్వరాలూ ఉంటే ఆ పాట పాడడం ఎంత
కష్టమో అదెంత బావుందో అనుకునేవారు కూడా అలాంటిదే శాస్త్రీయ సంగీతమని
తెలుసుకోలేక పోవడం శోచనీయం. సినిమా పాటలు ఏరకంగా తక్కువ కాదు, అవి పాడడం అతి సులభమని కాదు. కాని సినిమా పాటలే పాటలనుకోవడం సరికాదు. సంగీతానికి ప్రధానోద్ధేశ్యం సినిమాల్లో పాడడం అన్నట్లుంది నేటి పరిస్థితి. TV లో నేడు ప్రసారమయ్యే రకరకాల కార్యక్రమాల్లో సంగీతం బాగా నేర్చుకుంటున్నవారు చాలామంది పాల్గొనడం, సినిమా పాటలు పాడడం చూస్తున్నాం. ఆ పాటలు అంత ప్రతిభావంతంగా పాడగలిగేవారు శాస్త్రీయ సంగీత కచేరీలు కూడా చేయగలుగుతారుకదా. కానీ సినిమా పాటలు పాడితే వచ్చే పేరు, ప్రతిష్ఠ, సంగీతంలో త్వరగా రావని భ్రమతో దీనిని అశ్రద్ధ చేస్తారు.
సంగీతం 100 మంది నేర్చుకుంటే అందులో 10 మంది మాత్రమే సంగీతాన్ని శ్రద్ధగా
అభ్యసించి కచేరీలు చేస్తున్నారు. మిగతావారంతా సంగీత జ్హానంతో సినిమా పాటలు
పాడాలనే ఆసక్తి చూపుతున్నారు.నిజానికి ఒక కచేరీ శాస్త్రీయపరంగా చేయాలంటే కావలసిన క్రియాశీలత, అందులో
ఉండే కష్టంలో సగం కూడా సినిమా పాటలు పాడడానికి అవసరంలేదు. అందుకే అంత
కష్టపడే దానికన్నా ఎక్కువ ప్రయోజనముండే సినిమా పాటలకే ప్రాధాన్యం
ఇస్తున్నారు. వారి ఉద్దేశ్యాలని చెప్పవలసిన పద్ధతి అదికాదు. శాస్త్రీయ సంగీతం పాడడానికి voice culture అక్కరలేదా? రకరకాల గమకాలని రకరకాల ఒదుగుతో, బరువుతో పాడాలి. అది వారికి తెలియదో లేక విమర్శిస్తారో తెలియదు. మళ్ళీ వారు శాస్త్రీయ సంగీతంలో M.A ఉందని, doctorate చేశామని గొప్పగా చెప్పుకుంటారు.ఈ మధ్య A.R.Rahman గారికి అంతర్జాతీయ oscar పురస్కారం వచ్చిన సందర్భంగా నేటితరం గాయనీ గాయకుల్నెందరినో Rahman గారి గొప్పతనం గురించి , వారి పాటల్లోని విశేషాల గురించి వివరించమని కొన్ని కార్యక్రమాలు చేశారు వివిధ channels లో అందరూ Rahman గారు legend అని, great అని, melody king అని ఇలాకొన్ని పదాలు వాడి కొన్ని పాటలు పాడి వినిపించారే గాని ఆ పాటల్లో ఉన్నది ఏమిటి? ఆ tunesలో ఉన్న కష్టమైన విషయాలేమిటి, melody ని ఏరకంగా చూపించారు లాంటి విషయాలు ఎవరూ వివరించలేదు. అంతబాగా పాడగలిగిన వారు, ఆ పాటల్లోని విశేషాలని వివరంగా చెప్పగలిగేలా తెలుసుకోలేకపోవడం, ఎంతవరకు బాగుంది? A.R.Rahman గారి పాటలు ఎంత శాస్త్రీయ విషయాలు కలిగిఉంటాయో కేవలం పాట పాడేసి పేరు తెచ్చుకుంటే చాలని తృప్తి పడిపోకూడదు. పేరు తెచ్చుకోవడం మాత్రమే జీవిత పరమార్థమైతే ఎలా? కష్టపడడానికి ఇష్టపడాలి గంటలు తరబడి recordings లో busyగా ఉన్నామనుకోవడం కష్టపడడం కాదు. ప్రతిభ ఉన్నవారు దాన్ని అన్నిరకాలుగా వినియోగించుకోవాలి. నేటి యువత ముఖ్యంగా సినిమా పాటలు పాడేవారు career, devotion, voice culture, pitch, range, versatality ఇలా చాలా విషయాలు వారి interviews లో చెప్తూంటారు. వారిలో కొందరైనా మన సంస్కృతికి అద్దం పట్టేలాంటి శాస్త్రీయ సంగీతాన్ని వృత్తిగా ఎందుకు ఎంచుకోరు? చేవలేక కాదు. కష్టపడడం ఎందుకని? తక్కువ పేరొచ్చే విషయంలో ఎందుకు కష్టపడడమని. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు గుర్తింపు పొందాలి, త్వరగా పేరు తెచ్చుకోవాలి అనుకుంటున్నారే గానీ విషయ జ్హానం సంపాదించుకోవాలనుకోవడం లేదు. ఎవరి అభిరుచికి తగిన వృత్తి వారు ఎంచుకోవచ్చుగాని కేవలం పేరుతెచ్చుకుంటే చాలు అనుకుంటే మన కళలన్నీ బాగా అభివృద్ధి చెందలేవు. నేటి యువత చేయదలచుకుంటే ఏదైనా చేయగలరు. అలాంటివారు శాస్త్రీయ సంగీతానికి కూడా బాగా ఆదరణ రావాలనుకుంటే అది కూడా బహుళ జనాదరణ పొందేలా చేయగలరు. లలితసంగీతం, జానపద సంగీతం కూడా ఉండవలసినంత ప్రాముఖ్యత పొందలేక పోవడానికి పైన వివరించుకున్న పరిస్థితులే కారణం. అన్నిటికీ మూలమైన శాస్త్రీయ సంగీతాన్ని తగిన విధంగా ఆనందించగలగాలంటే శ్రోతలు తమ స్థాయిని కొంచెం పెంచుకోవాలి. సంగీతాన్ని సులభతరం చేసి ప్రజల కందించడం చాలా మంచిదే కానీ కేవలం సులభమైనవే ఆదరించి వాటిలోనే ఎప్పటికీ ఉండాలనుకోవడం సమంజసం కాదు. మన స్థాయిని పెంచుకోవడానికి ఆసక్తి లేకపోతే అది మన దురదృష్టం. ఎంతో విజ్హానం, విశేషాలు, మనోధర్మం, వైవిధ్యం కలిగిన శాస్త్రీయ సంగీతాన్ని ఆదరించి ఆనందించగలిగితే మనల్ని మనం గౌరవించుకున్నవారమౌతాం.
|