|
"అమ్మ దొంగా నిన్ను చూడకుంటే.. నాకు బెంగా.. "
ఈ గీతం వినని తెలుగువారుండరు
అంటే అతిశయోక్తి కాదు.మొదట కొన్నాళ్ళు సినిమారంగంలో పనిచేసి అక్కడ మహామహుల వద్ద సంగీతంలో
మెళకువలు నేర్చుకునిఅనంతరం ఆకాశవాణి చేరుకుని అక్కడే స్థిరపడి తెలుగు జాతికి మరపురాని
గీతాలెన్నింటినో అందించిన పాలగుమ్మి విశ్వనాథం
రచన ఇది. సంగీతంకూడా ఆయనే సమకూర్చిన ఆగీతంలో
"ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతె...
నిలువలేక నా మనసు నీ వైపే లాగితే...
ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతె...
నిలువలేక నా మనసు నీ వైపే లాగితే...
గువ్వ ఎగిరి పోయినా గూడు నిదుర పోవునా..."
కంటికి రెప్పలా పెంచుకున్న తన చిట్టితల్లి పెళ్ళి చేసుకుని మరో ఇంటికి
వెళ్ళిపోతే అన్నఆలోచనామాత్రానికే కన్నమనస్సు ఎలా తల్లడిల్లుతుందోనన్నభావానికి అక్షరరూపమైన ఈ గీతం విన్న ప్రతిఒక్కరి మనస్సు భారంగా మారిపోతుంది.
ఈ గీతానికి తన గొంతుతో వన్నెలద్దిన వేదవతీ ప్రభాకర్ కూడా
శాశ్వతంగా అలా నిలచిపోతారు.
ఆయన రచన, స్వీయ సంగీతంలోనే మరొకటి.. మా ఊరు ఒక్క సారి పోయి రావాలంటూ సాగే
మరో
గీతంలో..
"పంట చేల గట్ల మీద నడవాలి..
ఊహలేమొ రెక్కలొచ్చి ఎగరాలి..|
మా ఊరు ఒక్క సారి పోయి రావాలి..
జ్ఞాపకాల బరువు తో తిరిగి రావాలి..."
అందులోనే మరోచోట
"చిన్ననాటి నేస్తాలు చుట్టూ చేరాలి...
మనసువిప్పి మాట్లాడే మనుషుల కలవాలి....
ఒకరొకరు ఆప్యాయతలొలకబొయ్యాలి...
ఆగలేక నా కన్నులు.. చెమ్మగిల్లాలి..."
వినగానే సొంత ఊరి మట్టిపరిమళాలు మన చుట్టూ ఆవరించుకుంటాయి. జ్ఞాపకాల్లో
జారిపోయి మానసికంగా మన ఊరి చుట్టూ పచార్లు కొడ్తూంటాం.
తేరుకోగానే ఊరి మీద బెంగ మొదలవుతుంది. యాంత్రిక జీవనంలో, కృత్రిమ
మనస్తత్వాల మధ్య బతుకుతూ కోల్పోతున్నదేంటో ఎరుకలోకి వస్తుంది.ఒక్కసారి ఊరు పోయి రావాలని మనస్సు కొట్టుకుంటుంది.
ఇలా ఎన్నో..........
శాస్త్రీయ సంగీత పునాదిపై లలిత సంగీత బాణీలను సమకూర్చి దేవులపల్లి
కృష్ణశాస్త్రి, బసవరాజు అప్పారావు, నండూరి, దాశరథి, నారాయణ రెడ్డి,
బాపురెడ్డి, భీమన్న, శేషేంద్ర శర్మ, అరిపిరాల విశ్వం, చిరంజీవి, శశాంక,
కోపల్లె శివరాం, పుట్టపర్తి నారాయణాచార్యులు, వేటూరి ఆనందమూర్తి వంటి మహా
రచయితలెందరివో గీతాలకు ప్రాణం పోసిన స్వరకర్త పాలగుమ్మి విశ్వనాథం.
స్వతహాగా కవి, గేయకారుడు, గాయకుడు అయిన పాలగుమ్మి స్వరకల్పనలో దిట్ట
కావడంలో వీనులవిందుగా సాగే బాణీల్లో రచయిత భావాలు ప్రస్ఫుటమయ్యేలా
స్వరప్రతిష్ఠ చేసి ఆ గీతాలు అజరామరంగా నిలిచేందుకు కారకులయ్యారు.
సాహిత్యంలోని భావాలకు సంగీత చిత్రాల్ని అపూర్వమైన రీతిలో గీసిన సృజనశీలి
పాలగుమ్మి విశ్వనాథం. అతిరథ మహారధులనదగ్గ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ,
శ్రీరంగం గోపాల రత్నం, వింజమూరి లక్ష్మి, చిత్తరంజన్ వంటి వారెందరో
పాలగుమ్మి సంగీత దర్శకత్వంలో పాడినవారే. పాలగుమ్మితో రేడియో అన్నయ్య
రాఘవరావు, రేడియో అక్కయ్య కామేశ్వరమ్మ ఎన్నో పాటలు చేయించారు. ఎన్నో సంగీత
నాటికలకు రూపకల్పన చేయించారు. పిల్లల, స్త్రీల, కార్మికుల,కర్షకుల,
విద్యార్థులకు సంబంధించిన వైవిధ్యభరితమైన పాటలెన్నో చేసారు. ఆనాడు
ఆకాశవాణిలో రకరకాల ప్రయోగాలకి, సృజనాత్మకతతో కూడిన రకరకాల కార్యక్రమాలు
చేయడానికి తగినంత స్వేచ్ఛ లభించడంతో పాలగుమ్మి సహజ ప్రతిభ ఆకాశం హద్దుల్ని
కూడా ఛేధించుకుని అవధుల్లేని మధుర సంగీత విశ్వంలో విహరించింది. నిరంతర సాధన
చేస్తూ ప్రతి పాటని ఒక సవాల్ గా తీసుకునే తత్వం ఆయనది. రచయితల భావప్రవాహంలో
పాలగుమ్మి గానవాహిని ఐక్యం అవడంతో అద్భుతమైన పాటలెన్నో
రూపుదిద్దుకున్నాయి.కాలానికి ఎదురొడ్డి నిలిచాయి. విశ్వజనీనతని
సంతరించుకున్నాయి. ఆనాటినుండీ నేటివరకూ సంగీతంలో కృషి చేస్తున్న పాలగుమ్మి
ఇంతవరకూ పదివేలకి పైగా పాటలకు, అయిదువందలకు పైగా సంగీత రూపకాలకు
స్వరకల్పన చేసారు... ఇంకా చేస్తూనే ఉన్నారు 90 ఏళ్ళ వయస్సులో కూడా.
ఉత్తమ వ్యక్తిత్వం, ప్రతిభ, క్రమశిక్షణ, మానవీయ విలువలు, ఆత్మీయతతో కూడిన
వాక్కు, అద్భుత జ్ఞాపకశక్తి, విశ్లేషణా శక్తి, నిష్కల్మషమైన హృదయం
పాలగుమ్మి విశ్వనాథంది. మానసిక ఔన్నత్యం కళాకారుడి ప్రతిభకు
వన్నెలద్దుతుంది. ఆయన సంగీతానుభవాలు అనేకం. అవి వివరించేడప్పుడు ఒక
కథకుడిలా చక్కగా చెప్పుకుంటూ వస్తారు. ఇలా ఆయన అసమాన ప్రతిభాపాటవాలు,
అసాధారణ కృషిల గురుంచి చెప్పుకుంటూ వెళితే ఈ వ్యాసం ఎప్పటికో కానీ పూర్తవదు.
ఆయన జీవితంలో, సంగీత జీవితంలో ఆసక్తికరమైన అంశాలని మరోమారు ప్రస్తావించుకుందాం.
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం
ఈ క్రింది పెట్టెలోతెలపండి. (Please leave your opinion here) |
|
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో
మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను
క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will
not be shared to outsiders or used for any unsolicited purposes.
Please keep comments relevant.) |
|
Copyright ® 2001-2009
SiliconAndhra. All Rights Reserved. సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
Site
Design: Krishna, Hyd, Agnatech |
|
|