ఇన్నిటా నింతటా

ఇన్నిటా నింతటా నిరవొకటే
వెన్నుని నామమే వేదంబాయే

నలినదళాక్షుని నామకీర్తనము
కలిగి లోకమున కలదొకటే
యిల నిదియే భజియింపగ పుణ్యులు
చెలగి తలప సంజీవని ఆయ

కోరిక నచ్యుత గోవిందా యని
ధీరులు తలపగ తెరువొకటే
ఘోర దురితహర గోవర్ధనధర
నారాయణ యని నమ్మగగలిగె

తిరువేంకటగిరి దేవుని నామము
ధరతలపగ నాధారమిదే
గరుడధ్వజుని సుఖప్రద నామము
నరులకెల్ల ప్రాణము తానాయ

సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాస్సుఖినో భవన్తి అంటుంది విష్ణు సహస్రనామస్త్రోత్రం. అంటె కేవలం నారాయణ శబ్దం ఉచ్ఛరించిన మాత్రం చేతనే మన దుఃఖాలు, రోగాలు తొలగిపోతాయని అర్ధం! అట్టి వెన్నుని నామాన్ని వేదంగా స్వీకరించాడు అన్నమయ్య. ఈ యుగంలో మనందరికీ ఆశ్రయమైనది ఆ పద్మ పత్రాక్షుని నామమే. ఈ నామాన్ని కీర్తించే ఇంతకు మునుపు పుణ్యులు తరించారు. ధైర్యశాలులందరికీ మార్గమిది. పాపాలను పరిహరించే పావనమంత్రమిది! అదే తిరువేంకటగిరి దేవుని నామము! అని అంటున్నాడు మన అన్నమయ్య! ఆ పద కవితా పితామహుడు సంకీర్తనలలో అనుగ్రహించిన వేంకటేశ్వర నామ మంత్రాన్ని స్వీకరించి ముక్తులమవుదాం! పదండి ముందుకు ఆ నామాన్ని స్వీకరించడానికి!


ఇరవు = స్థానము;
సంజీవని = జీవము కలుగజేయునది;
ధీరులు = విద్వాంసులు, ధైర్యం కలవారు;
తెరవు = మార్గము;
గోవర్ధనధర = గోవర్ధన పర్వతాన్ని ధరించినవాడు (శ్రీకృష్ణుడు)
 

 
ఇన్నియు చదువనేల
ఇన్నియు చదువనేల యింతా వెదకనేల
కన్ను దెరచు టొకటి కనుమూయుటొకటి

వలెననే దొకమాట వలదనే దొకమాట
సిలుగు లీరెంటికిని చిత్తమేగురి
వలెనంటే బంధము వలదంటె మోక్షము
తెలిసే విజ్ఞానులకు తెరువిది ఒకటే.

పుట్టేడి దొకటే పోయెడి దొకటే
తిట్టమై ఈరెంటికిని దేహమే గురి
పుట్టుట సంశయము పోవుట నిశ్చయము
వొట్టిన విజ్ఞానులకు నుపమిది యొకటే

పరమమనే దొక్కటే ప్రపంచమొక్కటే
సిరుల నీ రెంటికిని జీవుడే గురి
ఇరవై శ్రీ వేంకటేశు డిహపరములకర్త
శరణాగతులకెల్ల సతమీతడొకడే

తత్త్వ సారాన్ని, జీవిత పరమార్ధాన్ని తెలుసుకోవడానికి అన్ని శాస్త్రాలు చదువవలసిన అవసరం లేదు. శుష్క సాధనలు, శోధనలు అంతకంటే అవసరం లేదు. మరి ముక్తి మార్గం ఎలా తెలుసుకోవాలనే జిజ్ఞాసులకు అతి సులభంగా తత్త్వ సారాన్ని అన్నమాచార్యుల వారు ఈ సంకీర్తనలో ఉపదేశిస్తున్నారు. జనన మరణాలు అనివార్యమైన ఈ ప్రపంచ నాటక రంగస్థలంపై భగవంతుడు ఆడించే బొమ్మలు ఈ జీవులు! మరులు గొలిపే బాహ్య భౌతిక ఆకర్షణలకు లోనై, యింద్రియ సుఖాలకు అంటిపెట్టుకుని ఉండడమే బంధం! వాటిని ‘మాయ’ గా గ్రహించి, దూరంగా ఉండటమే మోక్షం. పుట్తిన దేహం గిట్టక మానదు! (కా) వలెను. (కా)వలదు అని మనసులో రెండు భావాలు తరచు సంవాద పడుతుంటాయి మనం ఏదైనా ఇది మనది అనుకుంటే బంధం! కాదు అనుకుంటే బంధరాహిత్యం! అలాగే పుట్టుట, చావుట రెండూ దేహానికి సంబంధించినవే! పుట్టుక సంశయం అంటే మనం మళ్ళీ పుడతామో లేదో తెలియదు కానీ పుట్టిన తరువాత చావటం మాత్రం అనివార్యంగా జరిగే పని, ఈ విజ్ఞతతో కూడిన ఈ విషయాలన్నీ భక్తి, జ్ఞాన శిఖామణులైన వారికి మాత్రమే తెలుస్తాయి. ఆ జ్ఞాన సారాన్ని అన్నమయ్య ఈ పాట ద్వారా మనకందిస్తున్నాడు! ఈ సత్యం తెలుసుకుని ఇహపరలోకాలకు కర్తయైన శాశ్వతుడు శ్రీ వెంకటేశ్వరుని శరణు వేడడమే జీవికి ముక్తిమార్గం.

సిలుగు = ఉపద్రవము / కష్టము;
తెరువు = మార్గం;
సతము = శాశ్వతము;
తిట్టము = ఆశ్రయం;
ఇరవు = నెలవు;
తెలిసి విజ్ఞానులు = గమనించగలిగే వివేకులు;
వలెను = కావాలి;
వలదు = వద్దు;
సిరుల = విశిష్టమైన
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech