Sujanaranjani
           
  శీర్షికలు  
  పద్యం - హృద్యం
 

  నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్     

 

ఈ క్రింది "సమస్యని" అంటే ఆ వ్యాక్యన్ని యదాతధంగా ఒక పద్యంలోకి ఇమిడ్చి వాడుకుంటూ రాయాలి. ఒకవేళ పద్యం కాకపోయినా ఒక కవిత రాసినా కూడా వాటిని మేము సగౌరవంగా స్వీకరిస్తాము. మీ జవాబులు ఈ-మెయిల్ (విద్యుల్లేఖ) ద్వారా (padyam@sujanaranjani.org) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము.
 

ఈ మాసం సమస్య:

ఉప్పును కప్పురంబు మరి ఉండవె చూడగ నొక్కపోలికన్
 

గతమాసం సమస్య:

తాతకు దగ్గులు గరపక తప్పదు బాలా

ఈ సమస్యకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.

నేదునూరి రాజేశ్వరి, న్యూ జెర్సీ
కం||
నేతులు త్రాగిన తాతలు
నీతులు జెప్పెదరు వినగ నేరం బౌనే?
పాతవి పరిహాసము లట
తాతకు దగ్గులు గరపక తప్పదు బాలా!

వారణాసి సూర్యకుమారి, మచిలీ పట్నం
కం||
తాతా చదరంగం లో !
నీతో  ఎత్తులను  నేర్చి  నిన్నోడిమ్తున్    
సీత యననవ్వి  తాన నె                        
తాతకు దగ్గులు గరపక తప్పదు  బాలా!!

జగన్నాథ   రావ్   కె.  ఎల్. , బెంగళూరు
కం||
నూతనముగ  నేర్పెదవా
తాతకు  దగ్గులు?  గరపక  తప్పదు  బాలా
వ్రాతలు  తాతయె  వ్రాయ  వి
ఘాతము  లేకయె  తెలుగున  కంప్యూటరుపై

డా.రామినేని రంగారావు యం.బి.బి.యస్, పామూరు,ప్రకాశం జిల్లా.
కం||
నూతన విలువలు రోసి,స
నాతన పోకడలె మేలు సంఘానికనే
పాత తరానికి ప్రతినిధి
తాతకు దగ్గులు గరపక తప్పదు బాలా.

యం.వి.సి.రావు, బెంగళూరు
కం||
తాతలు నేతలు యైనచొ
నూతన భావాలు లేమి నవ్వరె జనులున్
చతురత యువతీ యువకులె
తాతకు దగ్గులు గరపక తప్పదు బాలా

సుమలత మాజేటి,
కం||
త యొక రోత కాగా
నా తావున చెంత నెవరు న్నారని వాపో
తూ, తా చింతల నుండే
తాతకు దగ్గులు గరపక తప్పదు బాలా

గండికోట విశ్వనాధం, హైదరాబాద్
కం||
అతి తెలివితొ గతి తప్పిన ;
నేతకు నీతులు ,జనులకు నిరసన తెరగుల్,
మాతకు పిల్లల నడవడి 
తాతకు దగ్గులు గరపక తప్పదు బాలా!

ఇంద్రగంటి సతీష్ కుమార్, చెన్నై
క౦.|| నూతన యoత్రములు మనిషి
చేతి పనులు కడు సులువుగ జేసెను! ఇకపై
తాతలు నూతనమగుటకు,
తాతకు దగ్గులు గరపక తప్పదు బాలా!

వేదుల బాలకృష్ణ మూర్తి, శ్రీకాకుళం
కం||
ఈ తనువు వయస్సు ఉడగగ
వాతము పైత్యము కఫముతొ వ్యాధుల పరమై
శీతోష్ణపు మార్పులతో
తాతకు దగ్గులు గరపక తప్పదు బాలా!

రావు తల్లాప్రగడ, సాన్ హోసే, కాలిఫోర్నియా
కం.||
పోతగ పోసిన కథలను
పోతన లాగా పలికెడి, పోరడు కాడోయ్,
తాత! అటువంటి తప్పుడు
తాతకు, దగ్గులు గరపక తప్పదు బాలా

మాజేటి సుమలత - కూపర్టినో
పాత వొక రోత కాగా
నా తావున చెంత నెవరునారని వాపో
తూ, తా చింతల నుండే
తాతకు దగ్గులు గరపక తప్పదు బాలా

 


పద్యాలలో నవరసాలు (మూడవ భాగం)

 - శృంగార మధుమాధురి
                                                                                          - భైరవభట్ల కామేశ్వర రావు

అందముగాని జీర్ణదళనాంబరమున్ విడనాడి, వేడుకన్
గెందలిరాకు వల్వ దులకింప ధరించి, మిళింద చోళమున్
బొందుగ దాల్చి, మాధవుని పొందున వాసకసజ్జలీల నా
నంద మెసంగ వన్యరమ నవ్యరుచిం దనరారె నత్తరిన్ (వల్లవీపల్లవోల్లాసము)

ప్రియుడు వస్తున్నాడని తెలిసి పడకటింటిని అలంకరించి, తను తాను సింగారించుకొనే నాయిక వాసకసజ్జిక. ఇక్కడ - వనము ప్రియురాలు, వసంతుడు ప్రియుడు. వనమంటే అడవి లేదా తోట. వసంతుడు వస్తున్నాడని వనదేవతకి ఆనందం అతిశయించింది. పాతదై చిరుగులుపడ్డ పండుటాకుల చీరని విడిచిపెట్టి, తుమ్మెదల బారనే నల్లని రవికని తొడిగింది. కెంపు సొంపారే చిగురాకుల క్రొత్తచీర సింగారించింది. వాసకసజ్జికలా, ప్రియుని ఆహ్వానించడానికి కొంగ్రొత్త కాంతులతో తయారయ్యిందామె. ఆమె వన్య"రమ" అంటే వన"లక్ష్మి". వచ్చేది "మాధవుడు" కదా మరి! మాధవుడంటే విష్ణువు, వసంతుడూ కూడా.

వసంత ఋతువు రాగనే పుడమి చివురులతో పూవులతో పులకిస్తుంది, పరిమళిస్తుంది. రంగారు విరులతో తరువులు కనువిందు చేస్తాయి. తుమ్మెదల ఝంకారాలూ, కోకిల కుహూరవాలూ వీనులవిందు చేస్తాయి. చిరుగాలి, పూల సుగంధాన్ని మోసుకొచ్చి మెత్తగా తాకుతుంది. మధురసాల ఫలాలు రసనలకు రసాస్వాదన చేస్తాయి. పంచేంద్రియాలతో సహా మనసు పరవశిస్తుంది. మనోభవుడు రసికులపై పూలబాణాల నెక్కుపెడతాడు. అందుకే వసంతుడు మన్మథుని చెలికాడని మన కవుల నిష్కర్ష! ఇవన్నీ అడవులు పచ్చగా ఉన్నప్పటి మాట. ప్రతి యింటా పెరటితోటలు పెరిగినప్పటి మాట. ఇప్పుడు చెట్లే లేవు. తుమ్మెదలూ కోకిలలూ ఇంకెక్కడ కనిపిస్తాయి, వినిపిస్తాయ! వేసవి తాపమే తప్ప వసంత స్వరూపం తెలియని పరిస్థితి యిప్పుడు. ప్రకృతికి దూరమై యంత్రాలకి దగ్గరైపోయాం. మనసులు రసహీనాలయితే, యాంత్రికత పడకటింట కూడా అడుగుపెడుతుంది. లేదా విచ్చలవిడిగా, వికృతంగా అంగట్లో గెంతులేస్తుంది. శృంగారమంటే అసభ్యం కాదు, బూతు అంతకన్నా కాదు! రెండు శరీరాల, రెండు మనసుల, నమ్మకముంటే - రెండు ఆత్మల, సంయోగం, సమభోగం. పశుత్వ, మానుషత్వ, నమ్మకముంటే - దైవత్వ, లక్షణాల సంగమం. అందుకే, శృంగారం రసరాజం. శృంగార రసస్వరూపాన్ని తెలుసుకోవాలంటే, సంసారంలో ఆ రసాన్ని పండించుకోవాలంటే, కవిత్వాన్ని చదవాలి. మన కావ్యాలలో శృంగారరసపోషణ అంటే అంగాంగ వర్ణనలే అనీ, నిర్లజ్జగా చేసే కామకేళీ చిత్రణలే అనీ ఒక అపప్రథ బలంగా వ్యాపించింది. అలాంటి వర్ణనలు, చిత్రణలూ లేకపోలేదు కాని, ఉన్నవన్నీ అవే అనుకోవడమంత పొరపాటు మరొకటి ఉండదు. ఈ వ్యాసంలో ఆ భ్రమని తొలగించే ప్రయత్నం చేస్తాను. ఒకటి రెండు పద్యాలు చదివినంత మాత్రాన రసానందం కలగదనీ, దానికి కావ్యాలని, కనీసం ఆయా సన్నివేశాలని మొత్తంగా చదవాలనీ, యీపాటికి అర్థమయ్యే ఉంటుంది. అంచేత, కవిత్వం గుబాళించే కొన్ని(చాలా కొన్ని!) పద్యాలని ఉదాహరించి, ఆయా కావ్యాలని మీరు చదివేందుకు ప్రోత్సహించడమే యీ వ్యాసాల ముఖ్యోద్దేశం అని మరొకసారి గుర్తుచేస్తున్నాను.

శృంగార రసానికి మన కావ్యాలలో ఏమాత్రం కొదవ లేదు. ముఖ్యంగా మన తెలుగువాళ్ళు, అనాదిగా, మంచి సరసులుగా కనిపిస్తారు. భారత సాహిత్యంలోనే మొట్టమొదటి శృంగార గ్రంథంగా పరిగణింపబడే కావ్యం "గాథా సప్తశతి". ఇది తెలుగుకావ్యం కాదు కానీ తెలుగువారి కావ్యం! ఇది కథా కావ్యం కాదు. వివిధ కవులు ప్రాకృత భాషలో వ్రాసిన చాటుపద్యాలని సంకలించిన కావ్యం. దీనిని సంకలించినది హాలుడు, లేదా శాలివాహనుడు అనే తెలుగు రాజు. ఒకో పద్యం ఒకో గాథ. ఈ గాథల్లో చాలా చోట్ల తెలుగు వాతావరణం ముచ్చటగా కనిపిస్తుంది. అంచేత తెలుగు సాహిత్యం గురించి చెప్పుకొనేటప్పుడు ముందుగా యీ కావ్యాన్ని తలుచుకోవడం ఉచితం. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు యిందులో కొన్ని గాథలని ఏర్చికూర్చి, ఎంతో అందంగా తెలుగులోకి అనువదించారు. అందులోని ఒక శృంగార రస రాజం:

దొంగనిద్దురవాడ! ముద్దు గొనినట్టి
చెక్కిళుల రేగు పులకల చెలువు గంటి!
ఏల కనుమూసికొనెదు? చోటిమ్ము కొంత
మసలి యుండను లెమ్మిట్లు మరల నెపుడు

సిగ్గు చేతనో, పనిలోపడో, పడక దగ్గరకి ఆలస్యంగా వచ్చింది భార్య. భర్త కించిత్తు అలకని ప్రదర్శిస్తూ నిద్ర నటిస్తున్నాడు. సరసురాలైన ఆలి అతని చెక్కిలిపై ఒక ముద్దు ముద్ర వేసింది. అప్పుడతని చెక్కిళ్ళపై పులకరింతలు అంకురించాయి. ఇంకేముంది, దొంగ దొరికిపోయాడు! అప్పుడా కాంత ముద్దుముద్దుగా తన మగనితో అంటున్న మాటలివి. అలక, సరసత్వం, చనవు, గడుసుదనం - భార్యాభర్తల శృంగారంలో యివన్నీ ఉంటాయి. అవన్నీ మనకీ పద్యంలో స్ఫురిస్తాయి! అలంకారశాస్త్రం దృష్ట్యా పరికిస్తే - ఇందులో భార్యాభర్తలు ఆలంబన విభావాలు. పడకటింటి ఏకాంతం ఉద్దీపన. ఆవిడగారు చేసే మురిపంపు చేష్టలూ, పలికే ముద్దు మాటలూ, దానికి ఆయనగారి చెక్కిలి పులకింత - ఇవన్నీ అనుభావాలు (వీటినే సాత్విక భావాలని కూడా అంటారు). మగని దగ్గర మగనాలి చూపిస్తున్న చొరవ ఆలంకారిక పరిభాషలో "ధృతి" అనే సంచారీభావంగా పరిగణించ వచ్చు. అలానే "మతి" అని మరొక సంచారీభావం ఉంది. అంటే ఒక విషయాన్ని చక్కగా నిర్ధారించడం అన్నమాట. ఇక్కడ మగని చెక్కిలిపై పులకల ద్వారా, "నువ్వు నిద్రపోలేదులే" అనే నిశ్చయం నాయిక చేసింది. ఇది "మతి" అన్న సంచారీభావంగా పరిగణించ వచ్చు. ఈ వివరణ అంతా శాస్త్రం మీద ఆసక్తి ఉన్నవారికోసం కాని, రసాస్వాదన కోసం కాదు. పద్యాన్ని చదివగానే ఆ సన్నివేశం కళ్ళకు కడుతుంది. మందహాసంతో, తన తప్పు ఒప్పుకొంటూనే, చెలుని అదలించే ఒక ప్రౌఢనాయిక సాక్షాత్కరిస్తుంది. మనసు రసోల్లసితమవుతుంది.

ఒక్క గాథాసప్తశతి చదివితే చాలు, శృంగారరసంలో ఉండే వైవిధ్యమంతా మనకి తెలుస్తుంది. భార్యాభర్తలు, ప్రేయసీ ప్రియులు, నెచ్చెలులు, దూతికలు, ప్రణయ సందేశాలు, కలయికలు, విరహాలు, అలకలు, అనుమానాలు, నర్మగర్భ సంభాషణలు - ఇవీ అవీ అని కాదు, శృంగార రసానికి సంబంధించిన సమస్తమూ గాథాసప్తశతిలో ఉంది అనడం కించిత్తూ అతిశయోక్తి కాదు. శృంగార రసానికి ఉదాహరణలన్నీ యిందులోంచే చూపించవచ్చు. అయినా, యితర కావ్యాలలో యితర కవులీ రసాన్ని ఎలా నిర్వహించారో కూడా తెలుసుకోవాలి కాబట్టి, ఇంకొక్క ఉదాహరణ మాత్రం చూసి ముందుకు సాగుదాం.

వడకి చెమరించు వ్రేళ్ళకు వసముగాక
నిలిచి నడవక జాఱు నీ కలముతోడ
స్వస్తిశబ్దమె ముగియింప జాలనైతి!
కమ్మనింకేమి వ్రాయంగగలను చెలియ!


మొదట ఉదాహరించిన పద్యంలో ఆలుమగలు కలిసి ఉన్నారు. వారి వలపు కోర్కెలు తీరేట్టుగా ముద్దుముచ్చటలాడుకొనే సన్నివేశమది. దాన్ని సంభోగ శృంగారం అంటారు. నాయికానాయకులు ఒకరికొకరు దూరమైన సందర్భాలు కొన్ని ఉంటాయి. అప్పుడు వారి చింతన విరహానికి దారితీస్తుంది. కలవాలనే కోరిక మరింత హెచ్చుతుంది. వియోగభారం మనసుని, తనువుని, బాధిస్తుంది. ఈ స్థితిని విప్రలంభ శృంగారం అంటారు. పై పద్యంలో ఉన్నదిదే. భర్త పరదేశంలో ఉన్నాడు. భార్యకి ప్రేమలేఖ వ్రాయాలని ఉద్యుక్తుడయ్యాడు. కానీ వ్రాయలేకపోతున్నాడు! ఎందుకు? ఆమెని తలుచుకు తలుచుకు మనసు పట్టుతప్పింది. చేతులు వణకుతున్నాయి. విరహతాపానికి చేతివేళ్ళు కూడా చెమరుస్తున్నాయి. అంచేత చేతిలోని కలం నిలవడం లేదు. జారిపోతోంది. లేఖ ప్రారంభిస్తూ వ్రాసే "స్వస్తి" శబ్దమే పూర్తి చెయ్యలేకపోతున్నాను! ఇంక కమ్మని (ఉత్తరానికి అచ్చ తెనుగు పదం) ఎలా వ్రాస్తాను చెలీ అని నిట్టూరుస్తున్నాడు ప్రియుడు. విప్రలంభ శృంగారం కూడా మళ్ళీ రెండు రకాలు. నాయికానాయకులు అసలింకా కలవకుండానే, ఒకరి గూర్చి ఒకరు తెలుసుకొని, వారిపై వలపు పెంచుకొని, వారికి దగ్గరవ్వాలని తహతహలాడే అవస్థ - ఒకటి. దంపతులైన వాళ్ళకి యే కారణంగానో వియోగం సంభవించి తిరిగి కలుసుకోవాలని ఆరాటపడే అవస్థ - ఇంకొకటి. మొదటి దానిలో, తెలియనితనంలోంచి వచ్చే మాధుర్యం కొంత ఉంటుంది. రెండవదానిలో బాధే తీవ్రంగా ఉంటుంది. ఆ బాధ యీ పద్యంలో హృద్యంగా స్ఫురిస్తుంది. పరవాసంలో ఉన్న భర్తలకిది అనుభవైకవేద్యం!

ఇక మన తెలుగు కావ్యాలలో మొదటిదైన ఆంధ్రమహాభారతం విషయానికి వస్తే, మొట్టమొదటగా మహాభారతంలో కనిపించే శృంగార సన్నివేశం శకుంతలా దుష్యంతుల ప్రణయం. నన్నయ్యగారు ఏదీ బాహాటంగా చెప్పే కవి కారు. అతనిదంతా గుంభనంగా గంభీరంగా సాగే శైలి. రసపోషణ అయినా అంతే. శకుంతలోపాఖ్యానంలో మనకెక్కడా ప్రత్యేకమైన శృంగార వర్ణనలు కానీ, సంభాషణలు కానీ పెద్దగా కనిపించవు. కానీ కథా గమనంలో, కథనంలో శృంగార రసాన్ని మెల్లగా పోషించుకుంటూ వస్తారు. మొదటగా నాయకుడైన దుష్యంతుని గుణగణాలని ప్రస్తావించి, వేటకై వచ్చి కణ్వాశ్రమాన్ని ప్రవేశించేటప్పుడు అక్కడి వృక్షాలు పూలవానతో అతన్ని స్వాగతించడాన్ని చిత్రించి, శకుంతలని అతను ఏకాంతంలో కలుసుకోవడం, తొలిచూపులోనే యిరువురికీ ఒకరిపై ఒకరికి కలిగిన అనురాగాన్ని కేవలం ఒకటి రెండు పదాలలో స్ఫురింప జేసి, ఆపై శకుంతల జనన వృత్తాంత నెపంతో మేనకా విశ్వామిత్రుల శృంగారాన్ని శకుంతల చేతనే చెప్పించి, అది వారి ప్రేమకి ఉద్దీపన కలిగించడాన్ని ధ్వనింపజేసి, వారి గాంధర్వ వివాహంతో, కలయికతో, ఆ ఘట్టాన్ని సుఖాంతం చేస్తారు. ఇది నన్నయ్య ప్రసన్నకథాకలితార్థయుక్తి. ఆ సన్నివేశం మొత్తం "లోనారసి" చదివితేనే అందులోని రసం మనసుకి పడుతుంది. ఇది ఆదికవి పద్ధతి. శృంగారరసం అనగానే గుర్తుకొచ్చే నన్నయ్యగారి పద్యం మరొకటి ఉంది. అది నలదమయంతుల కథలోనిది.

నలదమయంతులిద్దరు మనఃప్రభవానల బాధ్యమానలై
సలిపిరి దీర్ఘవాసర నిశల్ విలసన్నవ నందనంబులన్
నలినదళంబులన్ మృదుమృణాలములన్ ఘనసారపాంసులన్
దలిరుల శయ్యలన్ సలిలధారల జందనచారుచర్చలన్


ఇది పైన చెప్పుకున్న విప్రలంభ శృంగారంలో మొదటి రకం. హంస ద్వారా శకుంతలా దుష్యంతులకు ఒకరిపై ఒకరికి ప్రేమ అంకురిస్తుంది. ఒకరినొకరు తలుచుకుంటూ విరహంతో తపించే సన్నివేశంలోని పద్యమిది. ఇందులో నన్నయ్యగారి అక్షరరమ్యత సాక్షాత్కరిస్తుంది. "నలదమయంతు లిద్దరు" అని మొదలుపెట్టడంలోనే, వారు ఒకటి కాలేదనీ యిద్దరిగానే ఉన్నారనీ ధ్వనింపజేసారు. వారి విరహానికి అదే కదా కారణం మరి! మనఃప్రభవుడు అంటే మన్మథుడు. మనఃప్రభవానలం అంటే మన్మథతాపం. మరోలా విడగొడితే - మనఃప్రభవ అంటే మనసులో పుట్టిన, అనలం - అగ్ని. మనసులో పుట్టిన తాపం అని కూడా అర్థం వస్తుంది. విరహబాధ మనసులో పుట్టేదే. మనసులో పుట్టి శరీరమంతా వ్యాపించేది. ఈ బాధని తగ్గించుకోవడానికి వాళ్ళు చేసింది ఏమిటి? పూలదోటల్లోనూ, తామరాకుల మధ్యనా, మృదువైన తామర తూళ్ళ మధ్యనా, కర్పూర ధూళి అలముకొంటూ, పూల శయ్యలమీద విశ్రమిస్తూ, చన్నీటి ధారలలో తడుస్తూ, చందనాన్ని పూసుకొంటూ గడపడం! ఇవన్నీ శరీరతాపాన్ని తగ్గిస్తాయి కాని హృదయంలో అగ్నిని చల్లార్చ లేవు కదా! అంచేత నలదమయంతులు ఎంతగా ప్రయత్నించినా వారి తాపం తీరలేదన్న ధ్వని "మనఃప్రభవానలం" అనే పదంలో ఉంది. ఈ పద్యాన్ని గురించి మరికొంత వివరణ, యింతకు ముందొకసారి నా బ్లాగులో యిచ్చాను. ఆసక్తి ఉన్నవాళ్ళు ఇక్కడ చదువుకోవచ్చు: http://telugupadyam.blogspot.in/2010/07/blog-post.html

నన్నయ్యగారి తర్వాత కాలక్రమంలో వచ్చేది నన్నెచోడుడు. ఇతను రచించిన కుమారసంభవ కావ్యంలో శృంగారం, శ్రుతిమించి రాగానపడిందని చెప్పవచ్చు. పార్వతీదేవయినా సరే యీ కావ్యంలో ఒక శృంగార నాయికే. ఆమె అంగాంగ వర్ణనలు విపులంగానే కనిపిస్తాయి యిందులో. అలాగే శివపార్వతుల రతికేళీ విలాసాలు కూడా రకరకాలుగా చిత్రించబడ్డాయి. బహుశా యిది అప్పటికే ప్రాచుర్యం పొందిన సంస్కృత కావ్యాల ప్రభావం కావచ్చు. కాళిదాసు కుమారసంభవంలో కూడా యిలాంటి వర్ణనలు ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి వాటి జోలికి పోకుండా ఒక భిన్నమైన ఉదాహరణ ఒకటి యిస్తాను. శృంగారరసం అంటే కేవలం మదనకేళీవిలాసాల చిత్రణ ఒక్కటే కాదని మరోసారి స్పష్టపరచడానికి యీ ఉదాహరణ ఉపయోగపడుతుంది. శివపార్వతుల వివాహం అయిన తరువాత, దేవతల కోరికపై మన్మథుడిని పునరుజ్జీవితుణ్ణి చేస్తాడు శివుడు. జగత్తుకంతా అతను అతనుడైనా (శరీరం లేనివాడే అయినా), రతికి మాత్రం పూర్వస్వరూపంతో దర్శనమిస్తాడని వరమిస్తాడు. అలా తన ముందు ప్రత్యక్షమైన మన్మథుడిని చూసినప్పటి రతిదేవి పరిస్థితిని వర్ణించే పద్యమిది.

ఎలమి బ్రాణేశున కెదురేగె నుగ్మలి
ప్రాణంబు లన మేను మ్రానువడియె,
దనరు శోకాబ్ధిలో మునిగి లేచిన భంగి
నొడల బేర్భిందు లొండొండ పర్వె,
బ్రియు బాసి కంటకశయనవ్రతము దన
సలుపుట దెలిపె నా బులక లడరె,
బతి గాంచి కన్నులపాప లుత్సవమున
నాడెనో నలి నాగ హర్షవారి

గ్రమ్మె గనుగవ, నంత నక్కొమ్మ దేవ
దేవు నుగ్రాక్ష శిఖి నిజజీవితేశు
డతనుడైన విధమ్మును నాత్మ విరహ
భరము గలగన్న కరణి విస్మరణ బొందె


తనకి అత్యంత ప్రియమైన వ్యక్తి, ఎంతో కాలం తర్వాత ఒక్కసారిగా దగ్గరైనప్పుడు కలిగే ఆనందంలో అనేక భావోద్వేగాలు జనిస్తాయి. స్తంభము (చేష్టలుడిగి మ్రాన్పడిపోవడం), స్వేదము (చెమట పట్టడం), రోమాంచము (మేను పులకరించడం), అశ్రువు (నవ్వినా ఏడ్చినా వచ్చే కన్నీళ్ళు), యిలా. ఇవన్నీ అనుభావాలు. వీటినే సాత్వికభావాలని కూడా అంటారు. శివుని కంటిమంటకు భస్మమైన తన భర్త, అదే శివుని వరంతో తన కళ్ళెదుట ప్రత్యక్షమయ్యే సరికి, ఆ ఆనందంలో రతీదేవి శరీరంలో యీ అనుభావాలన్నీ ఉదయించాయి. అయితే అవి పుట్టడానికి కారణాలని ఊహించి చెపుతున్నాడు కవి. అవి కూడా ఆమె ప్రేమని మరింతగా వ్యక్తం చేస్తున్నాయి. పతిని చూడగానే రతి మ్రాన్పడిపోయింది. అదెలా ఉన్నదంటే, తన ప్రాణేశునికి ఎదురేగి స్వాగతించడానికి ఆమె ప్రాణాలు శరీరాన్ని వీడిచి ముందుకు పోయాయా అన్నట్టుగా ఉందట. అప్పటి వరకూ శోకసముద్రంలో మునిగి అప్పుడే పైకి లేచిందేమో అన్నట్టుగా, ఆమె ఒడలంతా చెమటబిందువలతో తడిసిపోయింది. ఒక్కసారి మేనంతా గగుర్పాటు కలిగింది. కోల్పోయిన ప్రియుని కోసం, ముళ్ళమీద పడుకొనే వ్రతాన్ని పట్టిందేమో అన్నట్టుగా ఉన్నాయా ములుకుల్లాంటి పులకలు. భర్తని చూసి తన కనుపాపలు ఉత్సాహంతో ఆడుతున్నాయా అన్నట్టుగా ఆనందాశ్రువులు కనుదోయి కమ్ముకున్నాయి. శివుని కంటిమంటకి తన జీవితేశుడు మసికావడమూ, తాను పడ్డ విరహమూ, ఇదంతా ఒక పీడకల అన్నట్టుగా దాని గూర్చి పూర్తిగా మరిచిపోయింది రతి. శృంగార రసోద్వేగం అంటే ఇదీ!

ఇక రసనిర్వహణలో, రసాభ్యుచితబంధ బంధురుడైన తిక్కనార్యుని తీరే వేరు! ఈతను వ్రాసిన పదిహేను పర్వాల భారతభాగంలో శృంగారరసానికి అనువైన సన్నివేశాలు తక్కువే అయినా, వాటిని నిర్వహించడంలో ఆతని ప్రత్యేకత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మచ్చుకు ఒక్క పద్యం మాత్రం రుచి చూపిస్తాను.

వరు చూడ్కి ముద్దియ వదనంబుపై బాఱి
తివుటమై నునుగాంతితీపు గ్రోలు
సుందరీరత్నంబు చూపు మనోరము
నడుగుల యొప్పుపై నల్లనడరు
బతి విలోకనములు పడతుక మైదీవ
గలయంగ బలుమాఱు మెలగుచుండు
వెలది కటాక్షముల్ విభునిపై గ్రమమున
నెగసి మోమున జోకి మగడివచ్చు

నొండొరువుల లేజెమటల నూని వ్రేగు
పడిన చాడ్పున నవయవ భంగులందు
దగిలి మఱవున దడయు నిద్దఱ విశాల
నయనదీప్తులు నెఱుకువ బయలుపడగ

ఉత్తరాభిమన్యుల వివాహ సందర్భంలోని పద్యం. శుభముహూర్త సమయంలో వధూవరుల మధ్యనున్న తెర తొలగిపోయింది. అంతవరకూ ఒకరి గూర్చి ఒకరు విన్నవారే కాని ఒకరినొకరు చూసుకున్నవారు కారు. తొలిచూపులో మొగ్గతొడిగే కొత్తకోరిక, రతిభావాన్ని ఉద్దీపించే రసకేతనం. ఆ కేతనాన్ని యీ పద్యంలో ఉవ్వెత్తుగా ఎగరేసాడు తిక్కన. ఈ పద్యం - వస్తు, అలంకార, రస ధ్వనులకు గని. దీని గురించి తిరుమల తిరుపతి దేవస్థానంవారు ప్రచురించిన ఆంధ్ర మహాభారతంలో చక్కని వివరణని ఉంది. ఇక్కడ తాత్పర్యం మాత్రం చెప్పి ఊరుకుంటాను. వరుని చూపు ముద్దరాలైన వధువు మోముపై వాలి, దాని నునుపైన కాంతిలోని మాధుర్యాన్ని కోరికతో త్రాగుతోంది. ఆ సుందరి చూపు, మనోహరుడైన ఆ వరుని అందమైన పాదాలపై మెల్లగా తచ్చాడుతోంది. పతి చూపులిప్పుడు పడతి తీగెలాంటి తనువంతా కలయ తిరుగుతున్నాయి. అమ్మాయి క్రీగంటి చూపులు విభునిపై క్రమక్రమంగా పైకి ప్రసరించి, ముఖాన్ని తాకి తిరిగి వస్తున్నాయి. వధూవరులిద్దరి శరీరాలూ లేతగా చెమరించాయి. ఆ చిత్తడికి తడిసి బరువెక్కాయా అన్నట్టుగా పరవశంతో ఆ యిద్దరి నయనకాంతులూ ఎదుటివారి అవయవాల సొగసులలో చిక్కుకొని అక్కడక్కడే ఉండిపోతున్నాయి. ఆ విధంగా, ఒకరిపై ఒకరికున్న అనురాగం ఆ యిద్దరికీ పరస్పరం తెలిసిపోతోంది. శృంగారరస ధ్వనికి పరాకాష్ఠ యీ పద్యం. సహృదయ హృదయైకవేద్యం. తోడుకున్నవారికి తోడుకున్నంత!

శృంగారమనగానే గుర్తుకు వచ్చే కవి శ్రీనాథుడు. కుమారసంభవం ద్వారా సంస్కృత కావ్యాలను (ఇతిహాసమైన మహాభారతం కాకుండా కాళిదాసాదుల కావ్యాలు) తెలుగులోకి అనువదించే ప్రక్రియ మొదలుపెట్టినవాడు నన్నెచోడుడు. దాన్ని అందిపుచ్చుకొని సుసంపన్నం చేసింది శ్రీనాథుడు. అంతే కాకుండా, శృంగారరసానికి విశిష్ట స్థానాన్ని యిస్తూ కావ్యానికి పేరే "శృంగారనైషదం" అని పెట్టాడు. తర్వాతి కాలంలో వచ్చిన శృంగార ప్రబంధాలకి ఒజ్జబంతి శృంగారనైషదం. శృంగారరస నిర్వహణలో సంస్కృత కావ్యకర్తలు ప్రవేశపెట్టిన అనేక అంశాలని యీ కావ్యం ద్వారా విస్తృతంగా తెలుగు కవిత్వంలోకి తెచ్చాడు శ్రీనాథుడు. ఇందులో చాలా అంశాలు కుమారసంభవంలో కూడా కనిపిస్తాయి కాని, కేవలం శృంగారరస పోషణ కోసమే కావ్యమంతా నడిపించడం, శృంగారనైషధంలోనే మొట్టమొదట కనిపిస్తుంది. నాయికానాయకుల విపుల వర్ణన, ఒకరి గూర్చి ఒకరు తపిస్తూ పడే విరహవేదన, విరహాన్ని ఉద్దీపింపజేసే - చంద్రుడు, మలయానిలము, వసంతము, మన్మథుడు - మొదలైన వారి దూషణ (దీనినే ఉపాలంభము అంటారు), విరహతాపాన్ని తట్టుకొనేందుకు చేసే ప్రయత్నాలు (శీతోపచారాలు), చివరికి వారిరువురి కలయిక, ఆ కలయికలో ఉండే వివిధ అవస్థలు, రతికేళీ విలాసాలు, వీటన్నిటితో నిండిన పూర్తి (out-and-out అంటామే అది!) శృంగారకావ్యం శ్రీనాథుని నైషధం. ఈ అంశాలన్నిటినీ ఉదాహరించడం కుదరదు కాబట్టి, శ్రీనాథుని ప్రసిద్ధ ధారాధునిని పట్టిచూపే ఒక పద్యాన్నీ, సుకుమారంగా చిక్కని కవిత్వాన్ని చిందించిన మరొక పద్యాన్నీ మాత్రం ముచ్చటిస్తాను.

కాలాంతఃపుర కామినీ కుచతటీ కస్తూరికా సౌరభ
శ్రీ లుంటాకము, చందనాచల తట శ్రీఖండ సంవేష్టితృ
వ్యాలస్ఫాల ఫణాకఠోర విష నిశ్వాసాగ్ని పాణింధమం
బేలా నాపయి దక్షిణానిలము పక్షీ! సేయు దాక్షిణ్యమున్


ఇది శ్రీనాథుని సంస్కృతసమాసబంధుర ధారకి ఒక చక్కని ఉదాహరణ. నల దమయంతుల మధ్య హంస రాయబారం జరుపుతుంది కదా. మొదట నలమహారాజు దగ్గర దమయంతి సౌందర్యాన్ని గురించి, హంస వర్ణించి వర్ణించి చెపుతుంది. అంతకుముందే ఆమెపై మనసున్న నలునికి, హంస మాటలతో వలపు మరింత పెరుగుతుంది. ఇక పెరిగే విరహాన్ని తానెలా తట్టుకోగలనంటూ ఆ హంసతోనే వాపోతాడు నలుడు. ఆ సందర్భంలోని పద్యం. దక్షిణానిలం అంటే దక్షిణ దిక్కునుండి వీచే గాలి. అదే మలయమారుతం (మలయపర్వతం దక్షిణభాగంలో ఉంటుంది కాబట్టి, అక్కడనుండి వచ్చే గాలి అని). అది చల్లగా ఉంటుంది. సుగంధాన్ని మోసుకొస్తుంది అని కవిసమయం. అంచేత అది శృంగార ఉద్దీపనం. విరహార్తులకి మరింత బాధ కలిగిస్తుంది. అది చెపుతున్నాడిక్కడ నలుడు. "దక్షిణపు" గాలి అయినంత మాత్రాన నాపై అది "దాక్షిణ్యాన్ని" ఎందుకు చూపిస్తుంది? అని అంటున్నాడు. ఎందుకు చూపదంటే, అది గుండెలు తీసినబంటుట! కాలుని (యముని) అంతఃపుర కాంతల పయ్యెదలనంటి ఉన్న కస్తూరి సౌరభమనే సంపదని (శ్రీ) దోచేసే దిట్ట. యముడు దక్షిణ దిక్పాలకుడు కదా. మలయానిలం దక్షిణం నుండి వస్తుంది కాబట్టీ, అది కస్తూరి సౌరభాన్ని మోసుకు వస్తుంది కాబట్టీ, ఇలా ఉత్ప్రేక్షించాడు కవి. యముడంతటి వాని అంతఃపురంలోనే దొంగతనానికి పాలుపడిందంటే అది ఇంకెంత మృత్యుభీకరమో కదా! అని ధ్వని. పైగా, వస్తూ వస్తూ అది గందపుకొండ (ఇదే మలయపర్వతం) మీదుగా వస్తుంది. అక్కడ గందపు చెట్లకి చుట్టుకొని విషసర్పాలుంటాయి. వాటి నిశ్వాసాలు విషాగ్నులవంటివి. ఆ విషాగ్నికి యీ గాలి కొలిమితిత్తిలా పనిచేస్తుంది, ఆ విషాన్ని మరింతగా పెంచుతుంది. ఆ విషాన్ని కూడా మోసుకు వస్తుంది! అల్లాంటి మృత్యుభీకరమైన, విషపూరితమైన మలయానిలం తనపై జాలి చూపిస్తుందా అని వాపోతున్నాడు నలుడు. ఈ పద్యంలో జాగ్రత్తగా గమనిస్తే మూడు విషాలున్నాయి! "శ్రీ" అంటే విషమని కూడా అర్థం (శివుడికి శ్రీకంఠుడని పేరుంది కదా). కస్తూరి సౌరభం ఒక విషం (కస్తూరిసౌరభశ్రీ). చందనం రెండవ విషం (శ్రీఖండం). సరే మూడవది చందనపు చెట్లకి చుట్టుకున్న పాముల విషం. ఈ మూడిటినీ మోసుకు వస్తోంది మలయపవనం!

అద్భుతమైన కల్పనా, మంచి ధార, ధ్వని, ఉన్న పద్యమిది. అయినా, యిది ఎంతవరకూ రసస్పందనని కలిగిస్తుంది? ఇలాంటి కల్పనలు నేరుగా హృదయాన్ని కన్నా బుద్ధినే తాకుతాయి. ఇందులోని కల్పనా వైచిత్రికి, నిర్మాణ కౌశలానికీ మనసు వహ్వా అంటుందికాని, శృంగార రసస్పర్శ హృదయాన్ని తాకుతుందని చెప్పడం కష్టమే! అలా హృదయాన్ని తాకే పద్యాలని కూడా శ్రీనాథుడు వ్రాయకపోలేదు. అలాంటి పద్యం ఒకటి చూద్దాం:

మంకెనపూవు మీది యళి మాడ్కి నృపాధరపల్లవోదరా
లంకృత యైన దంత పదలాంఛనముం గని కన్నుగోనలం
దంకురితంబులైన దరహాసలవంబులు పద్మనేత్ర యి
ఱ్ఱింకులు సేసె బక్ష్మముల యీఱమి గాటుక చిమ్మచీకటిన్


మొదట ఉదాహరించిన పద్యానికి పూర్తిగా భిన్నమైన పద్యమిది! ఇందులో పెద్దపెద్ద సమాసాలు లేవు. సంస్కృతపదాల కన్నా ఎక్కువగా అచ్చతెనుగు పదాలతో అందగిస్తోంది. నలదమయంతుల తొలిసంగమం అయిన వెంటనే జరిగిన సన్నివేశాన్ని చిత్రిస్తోంది యీ పద్యం. దమయంతి నలుని చూసింది. అతని చిగురువంటి పెదవి లోపలి భాగం, పంటిగాటు గుర్తుతో శోభిస్తూ కనిపించింది. మంకెనపువ్వు మీద తుమ్మెద వాలినట్టుగా ఉందట ఆ దృశ్యం. అది చూడగానే దమయంతి కంటి తుదల దరహాస రేఖలు అంకురించాయి. పద్మాలవంటి కన్నులున్న ఆ యింతి, వెంటనే ఆ చిరునవ్వు తునకలని, తన కనురెప్పల వెండ్రుకల గుబురులోనూ, కనుల కాటుక చీకటిలోనూ ఇంకిపోయేట్టు చేసిందట!

చిక్కని కవిత్వం అంటే యిదీ! రసస్ఫూర్తి అంటే యిదీ! అహా శ్రీనాథా! నీ కవిసార్వభౌమ బిరుదం సార్థకమవ్వడానికి యీ ఒక్క పద్యం చాలదటయ్యా!

ఇంత చెప్పుకున్నా యింకా ప్రబంధయుగానికైనా రాలేదు మనం! అంతకన్నా ముందు పోతనగారు ఉన్నారాయె! ముందే చెప్పాను కదా, శృంగార రస నిర్వహణలో మన కవులు పోయిన పోకడలు ఇన్నీ అన్నీ కావు. వాటి గురించి ఎంత పైపైన ముచ్చటిద్దామన్నా గ్రంథం పెరిగిపోతూనే ఉంటుంది. అయినా, శ్రీనాథుని పై పద్యాన్ని ఆస్వాదించిన వెంటనే మరే పద్యాన్ని చవిచూసినా, తీపి తిన్న వెంటనే టీ తాగడంలా ఉంటుంది కాబట్టి, ప్రస్తుతానికి యిక్కడ ఆగుదాం. వచ్చే నెల, మిగిలిన ప్రాచీనకవుల పద్యాలలో రెండు మూడు ఉదాహరణలు మాత్రం చూసి, ఆధునికకాలపు కవిత్వంలో శృంగారరసం ఎత్తిన అవతారాలని ముచ్చటించుకుందాం. అందాకా, యీ శృంగార మధుమాధురిలో ఓలలాడి, తనివితీరాక, పైన ఉదాహరించిన శ్రీనాథుని రెండు పద్యాలలోనూ రెండవది ఎందుకు ఎక్కువగా హృదయానికి హత్తుకొని రసానందాన్ని కలిగిస్తుందో ఆలోచించండి.


 
 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 



 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech