కొండవేల నెత్తినట్టి
కొండ వేల నెత్తినట్టి గోవిందా నిన్ను
గొండించేరు యశోదకు గోవిందా
గొల్లెతలు మొక్కేరు గోవిందా నీ
కొల్లల చీర లిమ్మని గోవిందా
గొల్లువెన్న దొంగిలిగ గోవిందా నిన్ను
కొల్లున నవ్వేరు వీరె గోవిందా
గోవుల గాచేవేళ గోవిందా పిల్ల
గోవిని వలచిరి గోవిందా
గోవాళులై యమునలో గోవిందా నీకు
కోవరమున్నారురా గోవిందా
కొట్టేటి వుట్ల కింద గోవిందా నీతో
గొట్టెవాటై పెనగేరు గోవిందా
గుట్టుతో శ్రీ వేంకటాద్రి గోవిందా కూడి
గొట్టాన బెట్టెరు బత్తి గోవిందా
శ్రీ కృష్ణావతార లీలలను మనోయవనికపై సక్షాత్కారం
చేస్తుంది ఈ సంకీర్తన! గోవర్ధనగిరిని చిటికెన
వ్రేలితో నిలబెట్టిన గోవిందుని గొల్లెతలు (గోపికలు)
మ్రొక్కుతున్నారట! శ్రీ కృష్ణావతారంలో మనకు
కనిపించే పదహారువేల గోపికలు నిర్మలభక్తికి
సూచికలు! వారంతా భౌతిక ప్రపంచాన్ని మరచి తమ
చిత్త పద్మాలలో శ్రీ కృష్ణుని పదపద్మాలను
నిలిపి సదా స్వామిని నిరంతరం అతడి పొందు కోసం
పరితపిస్తారు. భౌతిక లోకంలో ఒక యోగి ఎలా
స్వామిని నిరంతరం తన తపోధ్యానాదులతో ఆరధిస్తాడో,
గోపికలు కూడా అలాగే శ్రీ కృష్ణుడిని
ఆరాధిస్తారు. అందుకే మధురభక్తికి సంకేతాలు ఈ
గోపికలు! అన్నమయ్య గోపికాభక్తిని అనేక
సంకీర్తనలలో ఉత్కృష్ఠమైన భక్తిగా కీర్తించాడు!
అటువంటి ఆణిముత్యాలలో ఇదొక మేలిమి ముత్యం!
కొండించేరు = పొగడేరు;
కొల్లల = దొంగిలించిన;
గోవాళులు = గోవ + వారలు = యవ్వనము గలవారు;
కోవరము = (కోపురము) శత్రువును పట్టుటకై పొంచెడు
పొంచు;
పెనుగు = చుట్టుకొను
కొనరో కొనరో
కొనరో కొనరో మీరు కూరిమి మందు
ఉనికి మనికి కెల్ల ఒక్కటే మందు
ధ్రువుడు గొనిన మందు తొల్లి ప్రహ్లాదుడు
చవిగా గొనిన మందు చల్లని మందు
భవరోగములు వీడి పారగ పెద్దలు మున్ను
జవ కట్టికొనిన నిచ్చలమైన మందు
నిలిచి నారదుడు గొనిన మందు, జనకుడు
గెలుపుతో గొని బ్రదికిన యా మందు
మొలచి నాలుగు యుగముల రాజులు ఘనులు
కలకాలము గొని కడగన్న మందు
అజునకు పరమాయువై యొసగిన మందు
నిజమై లోకములెల్ల నిండిన మందు
త్రిజగములు నెఱగ తిరువేంకటాద్రిపై
ధ్వజమెత్తె కోనేటిదరినున్న మందు
మనం భౌతిక రోగాలు పోవడానికి, ఉపశమనం కలగడానికి
అనేక రకాలైన మందులు వేసుకుంటాం! కాని అన్నమయ్య
ఇక్కడ జీవుల మనుగడకు శాశ్వతమై ఉన్న మందు ఒక్కటే!
అదే శ్రీ వేంకటేశ్వరుడు! దానిని తీసుకొనండి!
ధన్యులు కండి అంటూ ప్రహ్లాదుడు, నారదుడు,
జనకుడు, బ్రహ్మ మొదలగువారంతా ఈ మందును సేవించి
తరించారు కాబట్టి మనమంతా ఈ ఔషధాన్ని
స్వీకరిద్దాం! అని విజ్ఞానదాయకమైన బోధను చేశాడు!
మరి మనమంతా కలియుగంలో తిరువేంకటేద్రిపై కోనేటి
దరినున్న ఆ మందును (శ్రీ వేంకటశ్వరుని)
తీసుకుందామా! (ఆశ్రయిద్దామా!)
ఉనికి మనికికి
= ఉండుటకు, బ్రదుకుటకును;
జవకట్టికొనిన = పొదిగి కొనిన, స్వాధీనము
గావించుకొన్న;
నిచ్చలము = నిశ్చలము |