23. అలరులు కురియగ

 ప||      అలరులు కురియగ నాడెనదే
            అలకల కులుకుల నలమేల్ మంగ  || అలరులు ||

చ||       అరవిరి సొబగుల నతివలు మెచ్చగ
           అరతెర మరగున నాడెనదే 
          వరుసగ పూర్వదువాళపు తిరుపుల
         హరి కరగింపుచు నలమేల్ మంగ
  || అలరులు ||

చ||       మట్టపు మలపుల మట్టెల కెలపుల
           తట్టెడి నడపుల దాటెనదే
           పెట్టిన వజ్రపు పెండెపుతళుకులు
           అట్టిట్టు చిమ్ముచు నలమేల్ మంగ
  || అలరులు ||

చ||       చిందుల పాటల శిరిపొలయాటల
           అందెల మోతల నాడెనదే
           కందువ తిరు వేంకటపతి మెచ్చగ
           అందపు తిరుపుల నలమేల్ మంగ
  || అలరులు ||

అలమేల్మంగ దివ్య నృత్యపు పాట యిది! అమ్మవారు నాట్యం చేస్తుంటే ఆమె కొప్పులోని విరులు జలజలా రాలినవట! ఆమె ముంగురులు సుతారంగా అల్లలాడినవట! పూర్వ దువాళపు తిరుపులు ప్రదర్శిస్తూ, అరతెరమరుగున కూచిపూడి రి సత్యభామ వలె అలమేల్మంగ హరికి ఆనందాన్ని గొల్పుతూ నాట్యం చేసినది. కాళ్లకు అలంకరించిన వజ్ర పెండెములు తళుకుళు జిమ్ముచుండగా ప్రణయ కలహముతో కూడిన చిందులు నృత్యాన్ని తిరువేంకటపతి మెచ్చగా అలమేల్మంగ అభినయించినది.

అలకల కులుకుల = ముంగురులందలి కులుకులు;

అరవిరి సొబగు = విరిసీ విరియని పుష్ప సౌందర్యము;  

అరతెర = సగంతెర, నాట్య సంప్రదాయము;     

పూర్వ దువాళపు తిరుపులు = మొట్టమొదలు నటి, రంగస్థలమునకు వచ్చునపుడు రెండుకాళ్లతో కుప్పళించి ఎగిరి నేలతాకు లోపలనే ఒక చుట్టు తిరిగి దూకుట యని కీ.శే. ప్రహాకరశాస్త్రిగారి ఊహ! ఇదియొక నాట్య విశేషము;

మట్టపు మలపులు = లయాత్మకమైన అంగవిక్షేపములు;

తట్టెడి నడపులు= సశబ్దముగా అడుగులు పెట్టుట;

పెండెపు తళుకులు =బిరుదుగా పాదమున ధరించు అందెల మెరుగులు;

చిందుల పాటలు = లయ ప్రధానమైన పాటలు;

శిరి పొలయాటలు = లక్ష్మీదేవి ప్రణయ కలహకలాపము;

ఒనర = పొందికగా; చేరులు = గొలుసులు;

కమల = లక్ష్మీదేవి;

భూసతి = భూదేవి;

పట్టవెరపై = గ్రహించుటకు సాధ్యము కానట్లు;

అమరాంగనలు = దేవతాస్త్రీలు

 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech