పుష్పలావిక

 

-శ్రీమతి తమిరిశ జానకి

 

పూలమొక్కలకి నీళ్ళు పోస్తూ ప్రతి మొక్కతోనూ తీయగా ప్రేమగా ఊసులాడుతోంది గౌరి. ఆమె కబుర్లకి పరవశిస్తున్నట్లు ఆమె స్పర్శకి పులకిస్తున్నట్టు...అటూ ఇటూ ఊగుతూ ఆనందం వెలిబుచ్చుతున్నాయి ఆ మొక్కలు.
ఎన్ని మొక్కలు? ఎన్నిరకాల పూలమొక్కలు...
ఆ మొక్కల్లో తానూ ఓ మొక్కలా..ఆ రెమ్మల్లో తానూ ఓ రెమ్మలా..
ఆ ఆకుల్లో తానూ ఓ ఆకులా...ఆ పూలల్లో తానూ ఓ పువ్వులా..
ఆ తోటలో...తాను స్వయంగా వేసి పెంచుతున్న ఆ చిన్ని తోటలో తిరుగాడుతోంది గౌరి.
పిన్నమ్మ! పరిగెత్తు కొచ్చాడు రంగడు.
ఏవిరా! వాడిని ప్రేమగా దగ్గరికి తీసుకుంది.
సన్నజాని అల్లుకుపోయినట్టు వాడి లేత చేతులు పిన్నమ్మని చుట్టేశాయి.
ఈ రోజు బళ్ళో కొత్త పంతులొచ్చారు. నీకు చెప్పడం మరిచా.
అట్లనా? వాడి తృప్తి కోసం ఎక్కడలేని ఆశ్చర్యం కళ్ళల్లో.
కొత్త పాఠం నేర్పించారా?
ఓ! కళ్ళు పై కెగరవేశాడు.
నువ్వు బాగా చదూకుని పెద్ద ఉద్యోగం సెయ్యాల. ఈ పిన్నమ్మకున్న కోరిక అదొక్కటేరా.
ఓ ..చేస్తా..
మాబాబే..మాబాబే..ముద్దులతో వాడిని ముంచెత్తింది.
ఆతోటలోని పూలపరిమళాలన్నీ తీసికట్టే, ఆమె ముద్దుల్లోని ఆప్యాయత అనే సుగంధానికి.
ఆ పూబాలల సోయగాలు వెలవెలబోయాలు ఆనందం తృప్తి వెల్లివెఇరుస్తున్న ఆమె కన్నుల తళుకునముందు.
తోటి స్నేహితుడెవరో పిలుస్తుంటే రివ్వున తూనీగలా పరిగెత్తిపోయాడు రంగడు.
అప్పుడే వాడు పెద్దవాడై పోయినట్ట్లు పెద్ద చదువులు చదివేసినట్టు ఊహించేసుకుంటూ మళ్ళీ మొక్కల సంరక్షణలో పడిపోయింది గౌరి. అక్క మనసులో మెదిలి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.


ఏంటే అక్కా! ఈ సారి మరీ దిగాలు పడిపోయున్నావ్! నీ దిగులేంటో నాతో చెప్పకూడదా? ఊర్నించి వచ్చిన అక్కని అడగకుండా ఉండలేకపోయింది ఆ రోజు.
చిన్నగా నిట్టూర్చి గౌరివంక తిరిగింది నూకాలు.
నీతో చెప్తే నన్నా నాకు కొంత ఊరటగా ఉంటదేమో! కానీ అయ్యతో మాత్రం చెప్పమాకు. ఇప్పటికాయన పడుతున్న తిప్పలు చాలు.
చెప్పను. హామీ ఇచ్చింది గౌరి.
మీ బావ మంచోడు కాదే. ఈ భూమ్మీద ఎన్ని చెడ్డగుణాలున్నయ్యో అన్నీ ఉన్నాయ్ ఆడికి, దానికే నేను బాధపడి చస్తా ఉంటే..ఇప్పుడు ..ఈ పిల్లగాడు పుట్తిన కాడినుంచీ నన్నింకా రాచి రంపాన పెడుతుండె. ఈ బతుకేవొద్దనిపిస్తా ఉందినాకు.
అక్క ఒళ్ళో ఉన్న పసిపిల్లాది మీద అప్రయత్నంగా ఆపేక్షగా చెయ్యి వేసింది గౌరి. ఏంటక్కా, నువ్వనేది? అసలేం జరిగింది?
పెళ్ళయిన కాడినించీ అక్క సుకపడ్డది లేదు.
ఎప్పుడూ తన్నులు తిని పుట్టింటికి రావడవేగా.
మీ అయ్యనడిగి డబ్బట్రా... ఎప్పుడూ ఇదే పాట ఆ కట్టుకున్నోడి నోటెంట. ఆడి జల్సాలకి ఎంత డబ్బని చాల్తది? అయ్య జమీందారా? అడిగినప్పుడల్లా డబ్బు రాసులు గుమ్మరించేందుకు.
తనపెళ్ళీ చెయ్యాలని పాపం..అయ్య నాలుగు డబ్బులు కూడ బెడతా ఉంటే అల్లుడు తన్నుకుపోతుండె..కాదంటే పెద్ద కూతురి బతుకు నాశనం అవుతాదయ్యె,..నోరు కట్టుకుని కూచోవలసొచ్చె అయ్యకి.
అతగాడి బాగోతంతో తన పెళ్ళీ వెనకబడిఫొయె,..తనేమి చిన్న పిల్లనా? పాతికేళ్ళొచ్చేసినయ్.
ఈ పిల్లగాడు తనకిపుట్టిన కొడుకు కాదంట. అభాండం ఏశాడునాపైన...అనుమానం పెంచేసుకుని రోజూ గొడ్డుని బాదినట్టు బాదతాడు నన్ను. ఇంక తిట్టే ఆ తిట్లు నానోటితో నేను చెప్పలేనే.
తుళ్ళిపడింది గౌరి అక్క మాటలకి.
ఆ సీతామహాతల్లి నిజంగా ఉందో లేదో తనకైతే తెలియదు కానీ తన కన్నెదుట కనిపించే సీతమ్మతల్లి తన అక్కే. అటువంటి అక్క మీద అనుమానమా?
మొదటి రెండు తడవలూ పుట్టిన బిడ్డలు దక్కకుండా చావు తప్పి కన్నులొట్ట పోయినట్టయింది అక్కకి. మనశ్శాంతి లేని బతుకు. ఎప్పుడూ తోటకూర కాడల్లేవాడిపోయి వేలాడిపోటవే..పెళ్ళయిన ఇన్నేళ్ళకి అపురూపంగా నిలిచిన బిడ్డ వీడు. డబ్బుతేతెమ్మని రొస్టు పెట్టేది చాలక ఇప్పుడీ కొత్త హింస మొదలెట్టాడన్నమాట.
ఏడుపొచ్చింది గౌరికి.
తన ఏడుపు నొక్కి పట్టుకుని అక్కకి ఓదార్పు మాటలు చెప్పడానికి ప్రయత్నించింది తన శాయశక్తులా.
ఆడిచేత రోజూ తిట్లూ చావుదెబ్బలూ తినే బదులు ఒక్కసారి ఏదో గుటుక్కున మింగిచస్తే వొదిలిపోతుంది.
అక్కా..ఒద్దక్కా..అట్లాంటి మాట్లనమాక. బావ మంచిగా మారతాడులే. ఆ ఆశతోనే బతుకుదాం.
ఏడవలేక నవ్వింది నూకాలు.
కల్మషం లేని మనసు..
కళ్ళలో నీళ్ళు..పెదాల మిద చిరునవ్వు.
అక్కని చూస్తుంటే మంచిలో తడిసిన మల్లెమొగ్గ కంటి ముందు నిలిచింది గౌరికి.
పక్కనే ముల్లుగుచ్చుకుంటున్నా తన బాధపైకి తెలియనీయకుండా నవ్వులు చిందిస్తూ విచ్చుకున్న గులాబి బాల గుండెల్లో కదిలింది. మరి కొద్దిరోజుల్లో వినకూడని వార్త వినాల్సి వచ్చింది. నూకాలు ఆత్మహత్య చేసుకుంది.
గుండెలు బాదుకుంటూ పడిపోయింది గౌరి. పొరుగూరికి తండ్రితో కలిసి హోరున కురిసే వానలో బయల్దేరింది.
పదినెల్ల పసివాడిని చీదరించుకుంటూ కాలితో తంతున్న బావని చూసిందా ఇంట్లో అడుగుపెడుతూనే.
అతనో రాక్షసుడిలా కనిపించాడామె కంటికి. ఒక్క పరుగున వెళ్ళి పిల్లాడిని చేతుల్లోకి తీసుకుని గుండెల కదుముకుంది. ఓ సోస్..నీకెందుకూ ఆడి మీదంత ప్రేమ నువ్వుకన్నావా? వెకిలిగా నవ్వాడు రావులు.
బావ మొహమ్మీద తుపుక్కున ఉమ్మెయ్యాలనిపించింది గౌరికి.
పరాయమ్మ బిడ్డయ్యనా పసిపిల్లాడంటే ఎవరికైనా జాలుంటది..అట్టాంటప్పుడు నా అక్క మీద నాకు ప్రేమ ఉండదా?
అబ్బో! మాటలు నేర్చిన కుక్క ఇస్తో అంటే ఇస్కో అందట. అంత ప్రేవైతే ఆడిని నీతో తీసుకుపో. మల్ళీ ఎప్పుడూ ఆడి మొహం నాక్కనపడకుండా ఉంటే బతికిపోతాడు. లేపోతే ఎప్పుడో నాసేతి దెబ్బల్లోనే గుటుక్కుమంటాడు.
కన్నకొడుకుని అట్టాంటి మాటలనడానికి నోరెలా వచ్చింది. ఈడు మనిషి కాదు??
కళ్ళనీళ్ళు పెట్టుకుంది గౌరి. అంతే..ఆ క్షణం నుంచి ఆ పిల్లాడు గౌరిబిడ్డే అయ్యాడు. తన ఊరు తీసుకొచ్చింది. ఈ పిల్లాడి కోసమే ఈ పిన్నమ్మ బతికేది అనుకుంది.

పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచనే మనసులోకి రానివ్వలేదు. ఆ మాటే తలపెట్టనివ్వలేదు తండ్రిని.
ఇదుగో చూడూ,,నువ్వుపోయి ఆ పిల్లగాడిని తీసుకొచ్చి మనింటో పెట్టేసినావంటే మంచిది మనకి, అధికారపూర్వకంగా అంది వరాలు.
నూకాలు పోయిన కొద్ది రోజుల్లోనే వరాల్ని చేసుకున్నాదు రావులు. నూకాలు లాగా అమాయకురాలు మెత్తని మనిషీ కాదు ఈ వరాలని గ్రహించడానికి కాట్టే రోజులు పట్టలేదు రావులికి.
చాలా గయ్యాళిది వరాలు. అడుగు తీసి అడుగేస్తే తాటకిలా విరుచుకుపడుతుంది.
పులిలాంటి రావులు పిల్లిలా మారిపోవడం గమనిస్తూనే ఉన్నారు ఆ పేటలో అంతా. పెళ్ళయిన నాలుగేళ్ళకి కూతురు పుట్టింది. వరాలు ఆరోగ్యం అంతంత మాత్రమే అయింది. తల్లిప్రాణం దక్కాలంటే మరి పిల్లలు పుట్టకుండా
ఆపరేషన్ చెయ్యక తప్పదన్నారు. దాంతో మొగనలుసు లేకపోయెనే అన్న దిగులు ఇద్దరికీ మొదలయ్యింది. పిల్లకిప్పుడు ఏడాది.
లాభనష్టాలు బేరీజి వేసుకుని ఈ రోజు వరాలు రంగడి గురించి మాట్లాడింది.
ఏ పిల్లగాడూ నువ్వు చెప్పేది? అర్ధవైనా అర్ధం కానట్టు దీర్ఘం తీసాడు రావులు.
ఏ పిల్లోడినో నేనెందుకు తీసుకురమ్మంటా? నీపిల్లోడే. రంగడు..ఆళ్ళ పిన్నమ్మ దగ్గర పెరుగుతున్నాడంటగా?
ఔను.
ఆరేళ్ళంటగా, ఇప్పుడు.
ఔను.
ఇంకొక్క ఏడాది పోతే ఆ పిల్లోడిని ఏదో ఓపన్లో పడేసి ఆ డబ్బు ఎనకేసుకుంటది ఆడి పిన్నమ్మ. ఆడబ్బు దానికెందుకు పోనివ్వాల? ఆడిని మనింటికే తెచ్చుకుంటే ఇంట్లోచాకిరికి పనికొస్తాడు.
ఏదన్నా పన్లో జేరి నాలుగు డబ్బులు సంపాయించి నీ చేతిలో పెట్టడానికి పనికొస్తాడు. ఇంక మనకి పిల్లలు పుట్టే అదురుష్టం లేకపొయే. వాడుంటే రేఫు నీకు కాలూ చెయ్యీ ఆడనప్పుడు ఇల్లు నడిపేందుకు ఆసరా అవుతాడుగా మనకి.
వరాలు మాటలు సబబుగానే తోచాయి రావులికి. ఈమద్దెనరోజూ కడుపులో నెప్పొస్తూనే ఉండె తనకి. తాగుడెక్కువై పోవటం వల్ల అని తెల్సు. కానీ మానలేడు. ఓ రోజు పన్లోకి యెళ్ళినా యెళ్ళకపోయినా మొగపిల్లోడుంటే చిన్న చిన్న కూలి పనుల్లో పెట్టేయచ్చు. చేతికింద ఆసరాగా ఉంటాడు. నూకాలు మీద మోజు తీరిపోయి అప్పట్లో ఆడు నాకు పుట్టినోడు కాదని దాన్ని కాల్చుకుతినేవోడు తాను. అంతేగానీ ఆడు తన కొడుకు కాపోటవా?
నువ్వు చెప్పేదీ బానే ఉంది. కానీ మరి..ఎళ్ళడిగితే నాతో పంపిస్తదా ఆడి పిన్నమ్మ.
గయ్యిమని లేచింది వరాలు ఏం..ఎలా కదంటది.. నీపిల్లాడిని నువ్వు తీసుకుపోతానంటే దాని ఆదారిటీ ఏవిటంటమద్దెన?
నిజవేననుకో..
ఇంకా అనుకునేదేంటి? చేతికింద ఆసరాగా పన్లకి ఆడిని తెచ్చుకోక పిచ్చిమొకవల్లే కూచుందావనా? బయల్దేరిపో..
అట్టా నించున్న పళంగా తెమ్మంటె ఆడేవన్నా చెక్క బొమ్మంటే? ఉపాయవాలోచించుకోవాల మరి.
ఏవో మరి. అదేదో తొందరగా చూడు. ఆలోచన వచ్చిందే తడవు ఆత్రం వరాలుకి.
తలూపి ఆలోచనలో పడ్డాడు రావులు.
ఆమర్నాడే రంగంలోకి దిగాడు. పొరుగూరు బయల్దేరాడు. అది మొదలు అప్పుడప్పుడు పొరుగూరెళ్ళి పిల్లగాడు చదూతున్న బడి దగ్గరి కాపు కాసి ఆడిని నెమ్మదిగా మాలిమి చేసుకునే పన్లో పడిపోయినాదు.

గౌరీ..
వస్తున్నా అయ్యా. మల్లెమొగ్గలు కోస్తున్న గౌరి గుడిసోపలి కొచ్చింది.
జ్వరంతో నాలుగైదు రోజులుగా కూలిపనికి పోడమే లేదు శివయ్య.
తాగేందుకు నీళ్ళియమని పిలిచాడనుకుంది గౌరి.
కానీ,,,అక్కడ అయ్యకెదురుగా కూచునున్న ఆకారం చూస్తూనే తుళ్ళిపడింది.. పైగా అతగాడి ఒళ్ళో రంగడు.
బావొచ్చినాడే..
అయ్య గొంతులో ఆ సంబరం ఎందుకో తెలియదు.
గౌరీ! బావ పిలుపు కంపరం పుట్టించింది.
ఏవిటన్నట్టు చూసింది.
పిల్లోడిని ఇంకనాకాడనే అట్టి పెట్టుకుందామని, కూడా తీసుకుపోదామని వచ్చినా.. గుడిసె కుప్పకూలి దానికింద తనుపడ్డట్టనిపించింది గౌరికి. గుండె ఆగిపోయిందనిపించిది ఒక్క నిముషం. పిచ్చిదానిలా చూసింది.
ఏరా! నాతో పట్నం వచ్చేస్తవుగా? అక్కడ నీకు మిఠాయిలూ, బొమ్మలూ ఏం కావాల్నంటే..
ఓ ...నీతో వస్తానయ్యా. కళ్ళు చక్రాల్లా తిప్పాడు రంగడు.
నీ పిల్లోడు..నీఇష్టవు.నువ్వు తీస్కపోతానంటే కాదంటానికి మేమెవరుం?
తన అభిప్రాయం చెప్పేశాడు శివయ్య.
ఏంటయ్యా? నువ్వు కూడా అట్లంటావే? పిల్లోడు నాపేణవే గదా...ఆడులేకుండా ఈ గౌరి బతుకేవిటి?
తప్పదు గదే మరి..ఆళ్ళ పిల్లోడిని ఆళ్ళు తీసుకుపోతానంటే అందులో తప్పేవి?
 

ప్పుందని గట్టిగా అరవాలనిపించిందికి గౌరికి.
ఈల్లేదయ్యా.. పిల్లోడిని నేనుకనలేదు గానీ అంతకంటే ఎక్కువగానే పేణంలా పెంచుకొస్తున్నాను. బళ్ళో ఏసాను. పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద ఆఫీసరవ్వాలి ఆడు.
ఆడి కోసమే సంపాయిస్తున్నాను. అడికోసమే బతుకుతున్నాను. ఆ బతుక్కోసవే ఇంత తిండి తింటన్నాను. పూలమ్మి బతుకుతున్నాను. పువ్వులా ఆడిని చూసుకుంటన్నా.
ఓసోస్..పెద్ద పెద్ద మాటలొస్తన్నాయే? ఆడికి అయ్యన్నేను. నాకుండదా ఆడిమీద పేవ?
ఆ ఉందిలే మాలావు ప్రేవ..కల్లబొల్లి కబుర్లు చెప్పమాకు.
గౌరీ నువ్వుండవే? విసుక్కుంటూ రావులివైపు చూశాడు శివయ్య.
రావులూ..దాంతో నీకేవిలే..దాని మాట పట్టించుకోమాకు.
తీస్కపో..నీపిల్లాడిని. నీకొడుకు నీ ఇష్టవు. గర్వంగా ఓ నవ్వు విసిరాడు రావులు గౌరివంక చూస్తూ.
లేచినిలబడి కొడుకు చేతిని గట్టిగా పట్టుకున్నాడి.
ఏరా! ఎవురో వచ్చి తీసకపోతానంటే ఈ పిన్నమ్మ నొదిలేసి పోతావంట్రా? ఒక్క ఉదుటున రంగడి ముందుకు వెళ్ళి మోకాళ్ళ మీద కూచుంది.
ఎవరో కాదు పిన్నమ్మా..మా..అయ్యే.
రంగడి జవాబు పదునైన కత్తిలా గౌరి గుండెల్లో దిగింది.
మొక్కకి నొప్పి పెట్టకుండా ఆకులు దూయటం తెలుసు గౌరికి..
సున్నితంగా మొగ్గలు తుంచటం, అల్లటం తెలుసు.
పరాచికాలూ అడుతూ పూలమ్మటం తెలుసు.
కానీ..కానీ...తన స్వార్ధంతో ఎంత తెలివిగా రావులు పిల్లాడిని రహస్యంగా మచ్చిన చేసుకున్నాడన్నది మాత్రం తెలియదు గౌరికి.
 

 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech