కళాపోషణ

 

- జగదీశ్వరీ మూర్తి . కల్యాణ్ .

 

  '' సంగీతనిలయం '' అన్న బోర్డ్ ని తదేకంగా చూస్తూ ఆప్యాయంగా తడుముతున్నారు రాఘవరావుగారు . అది తమ వంశపారంపర్యంగా వస్తున్న సంగీత రాగనిధికి నిదర్శనం . తమ తాత, ముత్తాతల నుంచీ అందరూ సంగీతకోవిదులే. ఆ తరం కళలకిచ్చే గౌరవాలే వేరు . ప్రతీఇంటా లక్ష్మీకళ ఉట్టిపడుతూ ఉండేది . తెల్లారితే సుప్రభాతం , వేద పారాయణ పఠనం వినిపిస్తూ ఉండేది .చాలాఇళ్లల్లో సంగీతసాధన మొదలైయ్యేది . శ్రావ్యమైన కంఠాలతో పిల్లలు పాడుతూఉంటే , స్నానాది ,సూర్యనమస్కారాలు ఆచరించడానికి చెరువులకు వెళ్లేవారికి వీనులవిందయ్యేది . అప్పటి వాతావరణంలో పెరిగిన పిల్లలందరికీ సంగీత, సాహిత్యాలలో ఒకరినిమించి ఒకరు రాణించాలన్న తపన, పట్టుదల ఉండేవి. అటువంటి వారిలో తనూ ఒకడిగా తాతగారిదగ్గర నేర్చుకున్న సంగీతం తన గళానికే వన్నెతెచ్చింది . సాదరమైన ఆహ్వానాలు , సన్మాలమధ్య , '' సంగీత కళా తపస్వి '' అన్న బిరుదు
మరింత కీర్తిని తెచ్చిపెట్టింది .

తాతదగ్గరే తను పెరిగేడు . తనని కన్న నాలుగేళ్లకే తల్లి కన్నుమూసింది .తండ్రి ఉన్నా లేనట్టే. తనని పట్టించుకున్నవారే లేని సమయంలో తాత చేయూత, అమ్మమ్మ ఆప్యాయతా తనని సాంప్రదాయబద్ధంగా తీర్చిదిద్దేయి .

తాతయ్య క్రమశిక్షణకి ప్రాధాన్యమిచ్చే మనిషి . వంశపారంపర్యంగా వస్తున్న సంగీతాన్ని సాధన చేస్తూ , పల్లెలోఉన్న చాలామంది పిల్లలకు సంగీతగురువైన తాతయ్యకు , తాను ప్రియశుష్యుడ య్యేడు . రాగం, తానం, ఆలాపన, స్వరకల్పనల మధు రసాలు తనలో వయసుతోపాటు వృద్ధిచెందుతూ వచ్చేయి .

ఆ ఆనందం , సంగీతం పట్ల ప్రజలు చూపించే గౌరవం , సంగీతసభల సుగంధాలు తనలో జీర్ణించుకుపోయాయి . కాలం , కాలంతో పాటు వయసుతెచ్చిన వృద్ధాప్యం తన గొంతుమీద దాడిచేసాయి . ఊపిరినిలిపి పాడడం కష్థం అయ్యింది . కచేరీలు తగ్గేయి . ఈతరం వారి అభిరుచులలో కూడా చాలా మార్పు వచ్చింది . కానీ రాఘవరావుగారి తృష్ణ తీరలేదు . తనపిల్లలకి నేర్పి వారిని తీర్చి దిద్దుదామన్న ఆశ నిరాసే అయ్యింది . తన సహధర్మచారిణి సీతమ్మకి పాటరాదు . అసలు గొంతే పలకదు . కనీసం సంగీతం పట్ల ఆసక్తి కూడా లేదు. పిల్లలకి ఆమె పోలికే... అన్నట్లు , ఎవరి గొంతులోనూ సంగీత స్వరాలు పలికేవికావు . దానితో రాఘవగారు నిరాశ, నిస్ప్రుహలతో మూగబోయారు . దానికితోడు మారుతున్నకాలంతోపాటు మనుషుల అభిరుచులూ, వెకిలి సాహిత్యాల వెర్రికూతలూ, ఆచారవ్యవహారాల అంతులేని మార్పులూ మొగ్గలుతొడిగాయి . జనం పగలబడి ప్రాధాన్యత యిచ్చే పాటలకు సాహిత్యం కరువయ్యేది ,.సంగీతం బరువయ్యేది . రాఘవగారిలాంటి ఎందరికో ఈ మార్పు తీర్పులేని విచారణయ్యేది .

అటువంటి సమయంలో '' కావ్య '' పుట్టుక మహదానందాన్నిచ్చింది . కావ్య..తన మనుమరాలు , అది పుట్టినప్పుడే దాని కంఠంలో సప్తస్వరాల కదలికలు గమనించేరు . పెరుగుతున్న కావ్యతో బాటు అలనాటి సంగీత, సాంప్రదాయ కళా వైభవపు పరిమళాలు ఆమెలో గుప్పించారు .అతని నమ్మకం వమ్ముకాలేదు . శ్రావ్యమైన కంఠం , భగవంతునిమీద భక్తి , పురాణాలపై ఆసక్తి , అన్ని మంచి గుణాలకీ పెట్టయ్యింది కావ్య.

రాఘవగారి వడలిన జవసత్వాలలో బలం పుంజుకొంది . కంఠంలో కరడుకట్టిన సంగీతం కట్టలు తెచ్చుకొని బయటకు వచ్చీ, కావ్య గొంతుకి పదును పెట్టింది . ఫలితం ఎనిమిది సంవత్సరాల కావ్య సంగీతసరస్వతే అయ్యింది . తనుచెప్పిన తన చిన్ననాటి ముచ్చట్లు , కచేరీలు, సన్మాలగురించిన విన్న కావ్యమనసులో చిన్నికోరిక . తనూ కచేరీ చేయాలనీ, తాతయ్యలా చప్పట్లమధ్య కానుకలు గెలుచుకోవాలని .మనుమరాలి కోరిక, తన వాంచ ,తీరేందుకై రాఘవగారు తన సాయశక్తులా ప్రయత్నించీ చివరకు ఒక శ్రీరామనవమి సందర్భం లో కావ్యచే త్యాగరాజకృతులు పాడించేందుకు ఒక సభవారిని ఒప్పించగలిగేరు .

ఆ కాలంలో సంగీతకళాకోవిదులని వెతుక్కుంటూ వచ్చీ సాదరంగా వేదికమీదకు తీసుకువెళ్లేవారు . పాదాభివందనాలు , పూలాభిషేకాలతో పట్టం కట్టేవారు . కచేరీ పూర్తయ్యేదాకా జనం గౌరవంగా కూర్చొనేవారు . కచేరీ పూర్తి అయ్యినతర్వాత పాడినవారి శాంతి మంత్రాలముగింపు తర్వాత భక్తిగా దండాలు పెడ్తూ ఇళ్లకు తిరిగి వెళ్లేవారు . కానీ మారే మనిషి కాలం పేరుతో మన సంస్కృతీ, సాంప్రదాయాలని మూలకి నెట్టివేసేరు . కళాపోషకులు కరువై కళోద్ధరణకి కాకాలు పట్టవలసివస్తున్నాది .

ఆత్మాభిమానం చంపుకొని , మనుమరాలి కోర్కె తీర్చగలుగుతున్నందుకు ఒకపక్క ఆనందంగా ఉన్నా ..మరోపక్క అర్ధిస్తేగానీ అందని అవకాసాన్ని తలుచుకొని కృంగిపోయారు . కానీ మనుమరాలికి వచ్చిన మొదటి అవకాసం దిగ్విజయంగా పూర్తయితేచాలనీ , ఆమె గాత్రం, ప్రతిభ తెలిసినతర్వాత మరెన్నో అవకాసాలు రావచ్చన్న ఆలోచనలు ఆయన్ని రాత్రంతా నిద్రపోనివ్వలేదు . మగతనిద్రలో కావ్య కోకిలకంఠంతో పాడిన కీర్తనలకి , జనాల చప్పట్ల జోరు ,ప్రసంసల హొరుల తీపి కలల మధ్య తెల్లారినసంగతికూడా తెలియలేదు . కావ్యవచ్చీ లేపేదాకా.

గబగబా స్నానం ముగించుకొని పూజగదిలోకివచ్చేరు . పూజగదిలో కావ్య పుత్తడిబొమ్మలాగున్నాది . పట్టుపరికిణీ , జాకట్టు , జడగంటలు పెట్టిన పూలజడ , బంగారు భరణాలతో ,మెరుస్తూంటే , లక్ష్మీ , సరస్వతులు తనయింట నాట్యం చేస్తున్నట్లనిపించింది . ప్రసాంతమైన మనస్సుతో రామష్థ్థోత్తర పూజ ముగించీ, ఆ స్వామివారి కృపాక్షతలను కావ్యపైవేసి మనసారా దీవించేరు. \

ఇంటందరికీ ఒకటే హడావిడి . సాయంత్రం కాగానే కావ్యని ముద్దుగా తయారు చేసీ ,సందడిగా బయలుదేరేరు . పాడవిసిన స్థలం దగ్గరవుతున్నకొద్దీ అందరిలో ఒకటే ఆనందం , ఆతృత.
ఎంతమంది వచ్చీ ఉంటారో...కావ్యపాటవిని ఎంత ప్రసంసిస్తారో అనుకుంటూ , హాలులో ప్రవేసించిన వారి కనులకి ఖాళీ జంబుఖానాలూ , కుర్చీలూ వెక్కిరిస్తూ కనిపించేయి . ఎవరో నలుగురు కమిటీ సభ్యులు అటూ, ఇటూ తిరుగుతూ వీరినిచూసీ ,దగ్గరకువచ్చేరు .వారిలోకూడా నిరాస కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాది .

రాఘవగారిలో చిన్ని ఆశ . సంగీతం యిష్ఠం ఉన్న తనలాంటివాళ్లు కొంతమందైనా లేకపోరు . ఇంకా సమయం ఉంది కనకా జనం తాపీగా రావొచ్చన్న ఆశ నిరాసే అయ్యింది . ఏడవుతూండగా మరో నలుగురువచ్చేరు . మరిరారని నిర్ధారించీ కమిటీ సభ్యులు కార్యక్రమం ప్రారంభించమని కోరడంతో , రావుగారు కావ్యవైపు చూసేరు .

ఎంతో ఉత్సాహంతో పదిరోజులుగా తెల్లారి నాలుగు గంటలకే లేచీ సాధనచేస్తూ వచ్చిన కావ్యమొహం చిన్నబోయింది . రావుగారు కావ్య వేపు సూటిగా చూడలేకపోయారు . బోసిగావున్న ఆడిటోరియం తన ఆలోచనలను వెక్కిరిస్తున్నట్లుగా ఉన్నాది . తననుతాను సంభాళించుకొని ఒక
ధృఢనిశ్చయానికి వచ్చినరాఘవగారు , కావ్యతో '' ఎవరు విన్నా, వినకపోయినా ఆ శ్రీరామచంద్రులవారు నీ పాట వింటారమ్మా ...మొదలెట్టూ...అనగానే , తాతయ్య మాటలకు ఒక్కసారి ఆ దేవునివైపు చూసి , భక్తిగా నమస్కరించీ ,పాడడం మొదలెట్టింది .

అద్భుతమైన గాత్రం. అనంతమైన స్వర`జ్నానం.గంటసేపు సభాధ్యక్షులని ఏవేవో లోకాలకు తీసుకువెళ్లింది .చప్పబారిన చప్పట్లమధ్య ఎవరో మొబైల్ తో కావ్యని ఫోటో తీసేరు . కార్యవర్గం సభ్యులు వచ్చీ కావ్యచేతికి పూలగుచ్చాన్నిచ్చీ ప్రసంసించేరు . రెండు, మూడు గంటలుసాగవలసిన కచేరీ గంటలో పూర్తయ్యింది జనం లేనందున.

రాఘవగారు కావ్యచూపులని తప్పించుకు నడుస్తున్నారు. పరివారం వైపు చూడడానికే చిన్నతనంగా ఉంది. కొడుకు ఎన్నిసార్లు చెప్పలేదు , నాన్నగారూ.. పాత బాణీలకీ, పద్ధతులకీ ఈరోజుల్లో విలువనిచ్చేవారు ఎవరూ లేరంటూ....
చిన్నారి కావ్యకి తను ఎన్ని ఆశలు చూపించేడు .మన సాంప్రదాయాలకి , సంగీతానికీ మనవాళ్లు ఎంతవిలువనిస్తారో వివరించీ ఎంతలాచెప్పేడు . కానీ తను చెప్పిందేమిటీ ...జరిగిందేమిటీ....ఆలోచిస్తూనే రాఘవగారు కావ్య చేయి పట్టుకొని నడుస్తున్నారు .

రోడ్డుకి అవతలివైపు వేరేచోట రామనవమి సందర్భంగా ఎవరిదో ఆర్కెష్థ్రా తెప్పించినట్లున్నారు . ఈవైపువరకూ నిండిన జనం , ఈలలతో, వాయిద్యాల ఘోషతో రోడ్డు క్రిక్కిరిసి ఉంది .

కావ్యని ఎత్తుకొని , జనాన్ని తప్పించుకుంటూ రావడం లో అప్రయత్నంగా అటువైపు చూసేరు రాఘవగారు . ఆధునాతంగా అలంకరించబడ్డ స్థేజి మీద సీతా,రాముల విగ్రహాలు మూలగా అలంకరించబడ్డాయి . స్ఠేజి మధ్య పాడేవారికోసం మైకులు అమర్చబడ్డాయి . పదిమంది వాద్యబృందాల మధ్య ఒక స్థ్థ్రీ పలుచటి చీరని బొడ్డుకిందకి కట్టీ, లోనెక్ జాకట్టులోని అందాలు వంగి , వంగి మరీ చూపిస్తూ ..అర్ధం , పర్ధం లేని పాటలు పాడుతోంది . ఆమె చేస్తున్న డేంస్కి అనుగుణంగా ,చప్పట్లు కొడుతూ, జనం ఈలలు వేస్తున్నారు .ఒక జునపాల జుట్టాయన చినిగిన జీంస్ , చేతుల్లేని చొక్కాతో అష్థవంకర్లు పోతూ ఆమెమీద పడుతున్నపుడల్లా జనం వెర్రికేకలు వేస్తున్నారు . కెమేరావాళ్ల హడావిడి, వీడియోవారి తోపులతో , మరింత మూలకి జరపబడ్డ సీతారాముల విగ్రహాలు , భక్తిలేని జనాలమధ్య , కాంతిహీనమై వెలవెల పోతున్నాయి . ఈ కాలుష్యాన్ని ఎక్కడ చూస్తుందో నని భయపడ్డ రాఘవగారు కావ్యనెత్తుకొని జనాన్నితోసుకుంటూ బయటపడ్డారు .

పక్కవీధిలో జరిగే కోలాహలంలో ఒకవంతైనా కచేరీ జరిగేచోటికి రానందుకు , మన సంస్కృతి విలువలు తగ్గేయి అనుకున్నారు కానీ మరీ ఇంతలా దగజారిపోయాయా .... అనుకొని , దిగ్భ్ర్రాంతిపడి ,ఆశ్చర్యపోయారు . అలసిన కావ్య భుజమ్మీదే నిద్రపోతున్నాది . ఆమెచేతిలో సభవారిచ్చిన గులాబీ వడలి వాలిపోతున్నాది .

కావ్య మొహం చూసిన రాఘ్వగారి కంట్లో నీరు చిమ్మింది . ఈ చిన్నారికి ఎన్నిమాటలు చెప్పేనూ, ఎన్ని ఆశలు చూపించేనూ ... మొదటిసారే ఘోరంగా విఫలమై , మనసులో తగిలినగాయం ,చిదిమి చీము పట్టదుకదా...

ఆలోచనలతో నిస్థ్ర్రాణ ఆవహించిన రాఘ్వగారు తమ ఇంటి సందులోకి ప్రవేసించీ, మెల్లగా నడవసాగేరు .తమవీధి వేంకటేశ్వర ఆలయంలో స్వామివారి దివ్యమంగళ విగ్రహం చిరుదివ్వెవెలుగులో చిద్విలాసంగా కటకటాలతలుపువెనక కవ్విస్తూకనిపించింది . ఒక్కక్షణం ఆగేరు . రాఘవగారు తప్ప ఆదేవదేవునికి సుప్రభాత, పూజాపునస్కారాలు చేసేవారులేరు . ఏ పండగకో, పుణ్యానికో పక్కవూరి పూజారిగారితో అర్చనలు చేయించుకుంటారు ఆవూరివారు . అయినాసరే స్వామి నవ్వుతూ అలా నిల్చునేవుంటారు . ఈ ప్రజలసంగతి తెలిసినవాడు కనకనే శిలారూపంలో బిగుసుకుపోయాడు .

నిద్రపోతున్న కావ్యని కింద పడుక్కోబెట్టీ, గుడి స్థంభానికి ఆనుకొని కూర్చున్నారు .
కళాపోషణ లేని సంస్కృతికి నిదర్సనంగా దూరంగా మైకులోంచీ బూతుపాటలు వినిపిస్తున్నాయి . ఈలలగోల చీదరపరుస్తున్నాది .

'' ఇదీ ఒకరకమైన కళాపోషణేకదా '' అన్నట్లు స్వామివారి విగ్రహం చిరునవ్వులు చిందిస్తూనేవుంది.

 

 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech