ఏ తీరుగ నను దయచూచెదవో!

- మానస చామర్తి, హైదరాబాద్

నా నీలి కనుల రెప్పలపై నే నిర్మించుకున్న కలల హర్మ్యం నెమ్మదిగా కూలిపోతున్న దృశ్యం
కని పెంచిన వాడికే కాని వాడనైనానన్న నిజం నిలువునా కాల్చివేస్తోందీ క్షణం..!
వాడిని వెన్నముద్దల తోటీ ..తీపి ముద్దుల తోటీ మాత్రమే పెంచిన  జ్ఞాపకం
మానవత్వమే మహోన్నత మతమని మేం నూరిపోసిన మాట ముమ్మాటికీ నిజం!

తామర పూరేకులంత పదిలంగా పెంచినందుకూ మమతానురాగాల కౌగిలిని పంచినందుకూ
రక్త స్వేదాలను రూపాయిలుగా మార్చి రెక్కలొచ్చేంత వరకూ రక్షించినందుకూ ...
వలస పక్షి లా విదేశాలకి ఎగిరిపోతూ కుడా వెదికాడు మా కోసం ఒక వృద్ధాశ్రమం
ఆ కృతజ్ఞతని భరించలేకే బద్దలైంది వాడి కోసమే కొట్టుకుంటున్న నా హృదయం..!

ఒడినే ఉయ్యాల చేసి ఊపినందుకూ వెన్నెలంత చల్లదనంతో సాకినందుకూ
కష్ట నష్టాల నీడైనా తాకకుండా కడుపులో దాచుకు కాపాడినందుకూ
మేం కతికిన మెతుకులకు లెక్కలు కడుతున్న ఆ కటిక బీదవాణ్ని
ఎన్ని మమతల మూటలిచ్చినా మామూలు వాణ్ని చెయ్యగలనా !

గొప్ప వాడివవ్వాలంటూ ప్రతి పుట్టిన రోజుకీ ఆశీర్వదిన్చినందుకూ
గోరుముద్దలు తినిపిస్తూ వాడి భవిష్యత్తు గురించి కలలు కన్నందుకూ
ఎత్తులకు ఎదిగిపోవడమే లక్ష్యంగా పెట్టుకు మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నా..
జీవితపు చివరి మలుపులో వాడిచ్చే ఆసరా కోసం ఆరాటపడుతున్నామని ఆపగలనా...

పెద్దరికంతో నేను చెప్పే మాటలన్నీ పైత్యమంటూ కొట్టి పారేసే బుద్ధి  కుశలతనీ
ఏ అర్ధ రాత్రో ఆపుకోలేని నా దగ్గుతో పాటే వినవచ్చే వాళ్ళ విసుగు స్వరాలనీ
తలుచుకున్నప్పుడల్లా ఉవ్వెత్తున ఎగసిపడే నా  వెచ్చని కన్నీళ్ళని
ఎప్పుడూ ఎవరి కంటా  పడకుండా  దాచడం ఎంత కష్టమైన  పని!

ఈ ముసలి వాసనలు ఇంకెనాళ్ళు అంటూ మా మనసులు ముక్కలు చేసినా
నా భార్య పనితనమంతా 'అమ్మా..' అన్న పిలుపుతో కొనాలని తలపోసినా
మనుష్యుల నుండి వాణ్ని వేరు చేస్తున్న మృగత్వానికి దూరం చెయ్యాలనే మా తపన
ఈ క్షణం కాస్త వాత్సల్యం ఒలకపోసినా తిరిగి హత్తుకోగల కడుపు తీపి  మిగిలునింకా ..!
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం