మా నాన్నకు జేజేలు

- శనిగేపల్లి శ్రీనివాసు

 

నా పేరు శనిగేపల్లి శ్రీనివాసు. నాకిద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెలు. వారి పేర్లు సురేష్, కాశీవిశ్వనాథ్(ముద్దుగా కాశి), ఉమ మరియు సువర్చల. నేను, నాతమ్ముడు కాశి కాలిఫోర్నీయాలోని ఫ్రీమాంట్ నగరంలో నివసిస్తున్నాం. సురేష్, చెల్లెలిద్దరు ఇండియాలో వుంటారు. కాశి, నేను ఇద్దరం సాప్ట్‌వేరు ఇంజీనీర్లము. మేము చాలా అన్యోన్యంగ వుండడం చూసి, చాలా మంది మమ్మలిని అన్నదమ్ములని కాకుండ ఫ్రెండ్సుగా భావిస్తారు. మేము పెరిగిన కుటుంబ వాతవరణమే మా అన్యోన్యతకు కారణం కావచ్చు.     

నాన్నగారు, అమ్మగారు

ఈ శీర్షిక ద్వారా మా తండ్రిగారి గురించి నాలుగు పలుకులు మీతో పంచుకోవడానికి చాలా సంతోషిస్తున్నాం. మా జనకుని నామధేయం "శనిగేపల్లి వెంకట సుబ్బరావుగారు, మా జనని శనిగేపల్లి సత్యవతిగారు". మా తండ్రిగారి తల్లిదండులు పేర్లు, "శనిగేపల్లి సీతామాలక్ష్మీ, శనిగేపల్లి ఆదినారయణరావుగారు".

నాన్నగారు మద్దెపాడు అనె గ్రామంలో పదవతరగతి వరకు చదివినారు. అ సమయంలో తాతగారు ఒంగోలులో వ్యాపారం చేసేవారు. పదవతరగతి తరువాత నాన్నగారు తాతాగారు చేసే హోల్‌సేల్ వ్యాపారమే చేస్తూ, తాతాగారికి చేదోడువాదోడుగా వుండేవారు. అయితే అనతి కాలంలోనే వ్యాపారంలో మెలుకవలన్ని గ్రహించి, తనకంటూ సొంత బాణి వుండాలని తలచి, క్రొత్త క్రొత్త వ్యాపారాల గురించి తీవ్రంగా ఆలోచించేవారట.

నేను (శ్రీనివాసు), నా తనయుడు(సాయి), నా శ్రీమతి(సుభాషిణి), నా పుత్రిక(సీత)

మాది 20 మంది కలిసి వుండిన ఉమ్మడి కుటుంబం. దాదాపు ఇరవై సంవత్సరాలు కలిసిమెలసి వుండేవారు. మానాన్నగారు తన అన్నలని చాలా గౌరవించేవారు. అలాగె తనసోదరీమణులను మిక్కిలి ప్రేమించేవారు. నాన్న తన అన్నల మాటలకు ఎదురుచెప్పేవారు కాదు. ఒక్కొక్కసారి పెదనాన్నలు ఏదో టెన్షన్‌లో వుండి నాన్నగారిని అరవడం జరిగేది. అయితే సమయంలో నాన్నగారు ఏ విధంగాను స్పందించేవారు కాదు. తనకేదైనా కష్టమొస్తే అక్కున చేర్చుకొనేది తన అన్నలే కదా, కావున అరిచె హక్కు వారికుందని భావించెవారు. అంతే కాకుండా ఏదొ టెన్షన్‌లో వుండి కోపడ్డారులేయని గౌరవించి సర్దుకు పోయేవారు. అలాగే కోపగించుకొన్న అన్నలు కూడ తమ తప్పు తెలుసుకొని అప్యాయంగా పలకరించడంతో అ సమస్య అంతంటితో తీరిపోయేది. నిజానికి ఇదే మా ఉమ్మడి కుటుంబ రహస్యమెమో? అందువలననే మావారు అన్ని సంవత్సరాలు కలసి ఒకటిగా జీవించగలిగినారేమో?

తమ్ముడు(కాశి), తమ్ముడి భార్య

కుటుంబపరంగా చేస్తున్న వ్యాపారంతోపాటు, వైవిధ్యంగా ఎవైనా నూతన వ్యాపారాలు చేయాలని నాన్నగారు బాగా తపనపడేవారు. ఆ విషయమై ఇతరులతో కలిసి చర్చించేవారు. వార్త పత్రికలని నిశితంగా, విశిదంగా చదివేవారు. చివరికి ఆ పరిశోధనల ఫలితంగా, అయుర్వేద మందులకు వేపనూనె మరియు పెయింట్సుకు పొగాకు విత్తనాల నూనె అవసరముందని గ్రహించారు. ఆ విధంగా బిజెనెస్ అవకాశం గుర్తించన వెంటనే ఆవేశపడకుండా అందుకు కావలసిన ముడిసరకు ఎలా వస్తూంది. ఫ్యాక్టరి ఎక్కడ పెట్టాలనె విషయాలు  క్షుణ్ణంగా పరిశీలించారు. మొదట రైతులకు తనకు కావలసిన పంటలు ఎలా పండించాలో తెలియజేశారు. ఆవిధంగా నిశితంగా తగు జాగ్రత్తలు తీసుకొని తన వ్యాపారంలో ప్రగతి సాధించారు. తాను ఎదుగుతూ పదిమందికి జీవనావకాశం కల్పించారు. ఆ ప్రగతిని చూసి చాలా సంతృప్తి పడ్డారు.

మానాన్నగారు, MBA లాంటి డిగ్రీలు చేయకపోయినా, ఎంతో దక్షతతో, దీక్షతో వ్యాపారమును, వ్యవహారమును నడిపిన తీరు చూస్తే, మాకు చాలా గర్వమేస్తుంది. పై విషాయాలు తలచుకొన్నప్పుడు మాకు ఎన్నో విషాయాలు అవగతమవుతాయి. ఏ పని చేయాలనుకొన్నా ముందు అందుకు తగిన నాలెడ్జిని ఆర్జించాలి. మంచిచెడులు బేరిజు వేసుకోని ఆ కార్యం మొదలెట్టాలి. మనిషి ఎలాగైనా బ్రతికేయవచ్చు. కాని తనకంటూ ఒక ప్రత్యేకతను ఎర్పరుచుకొని, నలుగురికి బ్రతుకుని చూపించి, బ్రతకడమె నిజమైన జీవతమని భోదపడింది.

నాన్నగారికి పిల్లలంటె చెప్పలేని ప్రేమ. అయితే పిల్లలని గారబం చేసినా, పొగిడినా,పిల్లలలో పెకింతనం పెరగి చనువు వలన చెడిపొతారెమోయని తలచేవారు. అందువలన పిల్లల భవిషత్తే ప్రధానంగా భావించి, తనలో పెల్లుబికే ప్రేమని అణుచుకొని మాతో తక్కువ చనువుతో మసలేవారు. అందువలన మా అవసరాలన్ని అమ్మ ద్వారానే నివేదించేవాళ్ళం.

నిజానికి మా తండ్రిని గంభీరంగా, హుందగా చూడడం మాకందరికి ఇష్టం. మా నాన్నగారు అనవసరంగా తిట్టడం గాని, పొగడడంగాని చేసేవారు కాదు. మేము తప్పు చేసినపుడు నాన్నగారి ముఖకవళికలు మారి ముభావంగా వుండడమే మాకు పెద్ద శిక్ష. ఆ వదనమును చూడలేము. అలాగే మంచి మార్కులు వచ్చినపుడు మరియు టీచర్సు మాగురించి మంచిగా చెప్పినపుడు, నాన్నగారి మోమున వెలెగే ప్రసన్నత చూస్తే చాలు. అదే మాకు కొన్నివేల పొగడ్తలతో సమానం. అందువలన పిల్లలందరం మా జనకుని ముఖం ప్రకాశంగ, ప్రసన్నంగా వుంచడానికి తపన పడేవాళ్ళం.

మా బంధువులు వారి పిల్లలని పదవతరగతి వరకు లేదా డిగ్రీ వరకు చదివించి, అటుపిమ్మట కుటుంబపరంగా చేసే వ్యాపారం పెట్టించి, పిల్లలు సెటిల్ అయ్యేటట్లు చేసెవారు. ఉద్యోగాలు చేయడం వలన వచ్చే జీతపురాళ్ళతో, ఏమి బ్రతుకుతారనే చులకన భావం వారికుండేది. అయితే మా నాన్నగారు చదువుకోకపోయినా చాలా విలక్షణంగా ఆలోచించెవారు. చదువు కేవలం ఉద్యోగం కోసమే కాదు. చదువు మనిషి ఆలోచన పరిధిని పెంచి, అతని కుటుంబం ఎదుగుదలకు దోహదపడుతుందని గ్రహించారు. అందువలన మమ్మల్ని శ్రద్ధగ చదువు కోవాల్సినదిగా ప్రోత్సహించేవారు. అయితే మాది ఉమ్మడి కుటుంబం కావడం వలన నాన్నగారు మాతో "నేను డొనేషనులు కట్టను. మీరు మంచి ర్యాంకులు తెచ్చుకొని చదువుకుంటె, ఎంతవరకైనా, ఏ ఊరిలోనైనా చదివిస్తాను. అలా కాని పక్షంలో మీరు మన వ్యాపారాల్లో పనిచేయవచ్చు" అని చెప్పారు. ఆ విధంగా నాన్నగారు ఇచ్చిన ప్రొత్సహాంతో నేను మరియు కాశీ బాగ చదువుకొన్నాము.

అయితే కొన్ని సార్లు మేము అనుకొన్న మార్కులు గాని, ర్యాంకులు గాని రానప్పుడు అందరిలాగె మేము కూడ చాలా బాధపడేవాళ్ళం. అసమయంలో నాన్నగారు అమ్మతో, "అనుకొన్న ఫలితం రానంత మాత్రాన దిగులు పడవలసిన పనిలేదు. నేను కూడా చాలా వ్యాపారాలు చేశాను. కొన్ని సార్లు లాభాలు వచ్చాయి. మరికొన్నిసార్లు నష్టాలు వచ్చాయి. నష్టపోయిన ప్రతిసారి ఒక క్రొత్త పాఠమో, గుణపాఠమో బోధపడేది. అ అనుభవం ఇంకో వ్యాపారం మొదలెట్టినపుడు రెట్టింపు లాభాలు వచ్చేందుకు దోహదపడేది. కావున వారు చేసిన తప్పును గుర్తించి, నిజాయితిగా చదివితే తప్పక విజయం సాధిస్తారనే " వారు. ఆ మాటలు ఈనాటికి మాకు గొప్ప మంత్రంగా పనిచేస్తాయి.

నా తమ్ముడు సురేష్, నాన్నగారు చేసున్న వ్యాపారం చూసుకొంటూ వుంటాడు. అయితే నాన్నగారు సురేష్‌ని ఎక్కువ అరుస్తూ వుంటారు. అ సందర్భంలో మాకందరికి చాల బాధకలుగుతుంది. పాపం ఎందుకు వాణ్ణి ఎపుడు నాన్న తిడుతువుంటాడని అనుకొనేవాళ్ళం. కాని అడిగే ధైర్యం ఎవరికి వుండేదికాదు. అయితే ఒకరోజు నేను, కాశీ ధైర్యం చేసి నాన్నగారితో " సురేష్ మీరు చెప్పిన పనంతా చేస్తున్నాడు కదా, మరెందుకు ప్రతిదానికి అరుస్తూ వుంటారని" మృధువుగా అడిగాము. అందుకు మానాన్నగారు "నాకు పిల్లలందురు సమానమే. ఒకరు ఎక్కువ ఇంకొకరు తక్కువ కాదు. మీరిద్దరు చక్కగా చదువు కొన్నారు. జీవితంలో నెగ్గుకురాగలరనే నమ్మకం నాకుంది. అందువలన మీగురించి నాకు బెంగ లేదు. అయితే సురేష్ విషయంలో నాకింకా ఆ ధైర్యం రాలేదు. రేపు వీడి జీవితం ఏలా వుంటోందోయనే ఆందోళనతో అరుస్తానే తప్ప, అంతకు మించి వాడిపైన నాకే ద్వేషం మాకు లేదు" అని అన్నారు. ఆ మాటలు విన్న తరువాత తెలియకుండానే మాకళ్ళలో నీళ్ళు తిరిగాయి.

నేను(కాశి)హైస్కూలు చదివే రోజుల్లో, మా బాబాయి కొడుకు, నేను మా ఇంటిదగ్గర నున్న కిరణాకొట్టులో ఖాతలు తెరిచి రోజు చాక్లెట్లు మొదలైనవి కొని తినేవాళ్ళం. కొద్దిరోజులకు మా అప్పులు విడివిడిగా పెరిగి రూపాయికి పైన చేరాయి. ఒక రోజు, నాన్నగారు లేని వేళలో, కొట్టువాడు ఇంటికొచ్చి గొడవ చేశాడు. అ సమయంలో మా బాబాయి తన కొడుకు అప్పు తీర్చెసాడు. అయితే మా నాన్న నాకు ఏ సందేశం ఇస్తాడో తెలియనందున, బాబాయి నా అప్పు తీర్చకుండ ఆ విషయం నాన్నతో చెప్పారు.

నాన్నగారు అది విని ఏ మాత్రం ఆవేశపడకుండా, నన్ను పిలిచి "అప్పు తీర్చడం తెలిస్తేనె అప్పు చేయ్యాలి. ఆ విషయం తెలియకుండా అప్పు చేశావు. పర్వాలేదు ఇప్పుడైనా అప్పు తీర్చడం ఎలాగో మొదట తెలుసుకో" అని చెప్పారు. ఆ రోజునుంచి రోజు పది పైసలు ఇచ్చెవారు. అది ఖర్చు పెట్టకుండ అప్పు తీర్చెశాను. ఆ తరువాత మరలా అప్పు చేయలేదు. అప్పుచేయడవలన కొట్టువాడికి వాయిదాలలో కడతానని ఒప్పించడానికి పడిన శ్రమ, అందువలన నేను కొట్టతని ముందు నేనెంత చులకనవుతానోననె విషయాలు తెలియ జేయడమే మానాన్నగారి అభిమతం.

నాన్నగారికి సంఘసేవ  చేయడమంటే చాలా ఇష్టం. ఒంగోలులో పేదల పెళ్ళిలకు ధనసహాయం చేసె వారు. అయితే కొన్నిసార్లు కొంతమందికి ధనసహయం కన్నా మనుషుల సహాయం ఎక్కువ అవసరమయ్యేది. అటువంటి సమయంలో మా నాన్నగారు, మనుషులు కావలసిన వారితో "రేపటి నుండి మా వారు పదిమంది వస్తారు. మీ కార్యక్రమం ముగిసేవరకు క్కడె వుండి అన్ని పను చూస్తారని చెప్పి" వచ్చేవారు. అలాగె ఇంటికొచ్చి "మగ పిల్లలందరు వెళ్ళి తను మాట ఇచ్చిన వాళ్ళకు సహాయం చేయమనెవారు". మేము వెళ్ళి పందిరి వేయడం, వంటలు చేయడం, వడ్డించడం అన్ని పనులు చేసెవాళ్ళం. అ విధంగా నిష్కామంగా పనిచేసి సెలవు తీసుకోనేటప్పుడు కార్యనిర్వాహాకులు లేదా పెళ్ళి పెద్దలు అప్యాయంగా చేతులు పట్టుకొని కృతజ్ఞతలు తెలిపేవారు. అ సందర్భంలో గొప్ప పనిచేసినట్లు చాలా ఆనందమేసేది. ఇలాగా మేము ఎంతోమంది పెళ్ళిళ్ళకు సహాయం చేశాము. ఆ విధంగా  నాన్నగారి చాలా మందికి సహాయంచేసారు.

ఈ విధంగా తనువు నిచ్చి, యుక్త వయసులో మనువు జేసి, ఏన్నో అణిముత్యాలాంటి జీవిత సత్యాలు తెలియజేసి మా మనో వికాసానికి దోహదపడిన తండ్రి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అవకాశమిచ్చిన "సుజనరంజని"కి చదివిన మీఅందరికి మా ధన్యవాదములు. 

శనిగేపల్లి శ్రీనివాసు     

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

   
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech