మే, 2010

me.jpg

జ్యోతిష్యులు - డా. పిడపర్తి సుబ్రహ్మణ్యం.

బెనారస్ హిందు విశ్వవిద్యాలయంలో ఆచార్య(MA) మరియు చక్రవర్తి(Ph.D) పట్టాలను పొంది రాష్ట్రీయ సంస్కృత సంస్థానంలో జ్యోతిష్య శాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు.               జ్యొతిష్య శాస్త్ర సంబంధిత అధ్యయనంలో విశేషమైన కృషిని, సేవలను అందిస్తున్న డా. పిడపర్తి సుబ్రహ్మణ్యంగారిని సుజనరంజని పాఠకులకు పరిచయం చేయడానికి గర్విస్తున్నాము..

  

http://www.jagjituppal.com/images/2aries.gif

            మేషరాశి

అశ్విని (అన్ని  పాదాలు), భరణి (అన్ని  పాదాలు), కృత్తిక (మొదటి పాదం) 

 

ఈ మాసపు పూర్వార్థములో ఒత్తిడులు అధికముగా నుండును. జ్వరము మరియు కడుపునొప్పి వంటివి ఇబ్బంది కలిగించు అవకాశమున్నది. చెడు మాటలు వినుట, పనులయందు మరియు వ్యవహారములయందు చిక్కుకొనుట ద్వారా మిగిలిన విషయములందు దృష్టి పెట్టుటలో అశక్తులయ్యే అవకాశమున్నది. కలహముల కారణముగా ధననష్టము లేక వ్యయము జరుగు అవకాశమున్నది. అయినవారు మరియు పరిచయస్థులు దూరముగా ఉండటానికి ప్రయత్నిస్తారు. శుకృని అనుకూలత వలన ఈ సమయమున ధనధాన్యములు వృద్ధి పొందును. మరియు సంతానప్రాప్తి కలుగు అవకాశమున్నది. ఉత్తరార్థములో ధనవ్యయము మరియు కన్నులకు ఇబ్బంది కలుగగలవు. మోసపోవు అవకాశములు కూడ ఎక్కువగా ఉన్నవి. కావున వ్యవహారములయందు ఆచి తూచి వ్యవహరించగలరు.

          గురుడు మాసపు పూర్వార్థములో అనుకూలముగా నుండి  ఉన్నతపదవులు పొందుటయందు, ధనవ్యవహారములయందు అనుకూలముగా వ్యవహరించుచున్నాడు. అదే గురుడు ఉత్తరార్థములో స్థానమార్పును కలిగి ఈ రాశివారికి కూడ స్థానభ్రష్టత్వమును చేకూర్చుటకై ఉవ్విల్లూరుతున్నాడు. పరువు ప్రతిష్ఠలకు ఏ మాత్రము లోటు లేకున్ననూ ఏ కార్యమునూ ఎదురకు వెల్లనివ్వకుండ అనేక రకములైన ఆటంకములను ఈ గురుడు కలుగజేయు అవకాశములున్నవి.

          శని ఈ రాశివారికి ఈ మాసమంతయూ అనుకూలముగా నున్నాడు. కావున ఆ శని వీరికి అన్ని రంగములయందూ శ్రమకు తగ్గ ఫలమును ఇప్పించుటకు శాయశక్తులా ప్రయత్నించగలడు.    ఈ రాశివారికి ముఖ్యముగా ఈ మాసమునందు సూర్యగురుల వలన ఇబ్బందులు కలుగుచున్నవి కావున వీరు ఈ గ్రహముల అనుగ్రహమును పొందుటకు ప్రయత్నించగలరు.

 

http://www.jagjituppal.com/images/2taurus.gif

వృషభరాశి

కృత్తిక (2,3,4 పాదములు), రోహిణి (అన్ని పాదాలు), మృగశిర (1,2 పాదాలు

 

ఈ మాసమునందు ఈ రాశివారికి సాహసకృత్యములు ఫలించును. అధికారులు మరియు అధికారికమైన పనులయందు చుక్కెదురయ్యే అవకాశమున్నది. అధికారులను కలియుట ఈ మాసమునందు ప్రయోజనము లేని పని. పూర్వార్థమునందు చాలా తక్కువ కార్యములయందు వీరికి ఆశించిన ఫలములు లభించగలవు. ఈ రాశివారికి ఈ మాసమంతయూ అనుకూలముగా నున్న గ్రహము కుజుడు. కావున బలప్రదర్శన కావించిన చోట విజయము లభించును.

          మాసమంతయూ బుధుడు ప్రతికూలుడు. ఆ కారణముగా కార్యవ్యతిరేకత చాలా వరకు ఉండును. చర్చలు సంప్రదింపుల ద్వారా ఈ సమయమునందు శూన్యము లభించును. కావున ఈ సమయమును సంప్రదింపులకు కేటాయించుట వ్యర్థము. పూర్వార్థములో గురుడు అశుభుడై ఉన్నాడు. ఆ కారణముగా బదిలీలు, కలహములు సంభవించగలవు. కానీ అదే గురుడు ఈ మాసపు ఉత్తరార్ధములో వీరికి అనుకూలుడగుచున్నాడు. ఆ కారణముగా సమాజమునందు మరియు కార్యస్థానమునందు వీరికి ఉన్నత పదవులు మరియు ధనలాభము కలుగు అవకాశములు ఎక్కువగా ఉన్నవి.

          మాసమంతయూ వీరికి శని ప్రతికూలుడుగా నున్నాడు . ఆ కారణముగా కుటుంబమునందు అశాంతి మరియు కలహములు వీరిని ఇబ్బంది పెట్టగలవు. కావున వీరు వేంకటేశ్వరుని నిత్యము పూజింపగలరు.

 

http://www.jagjituppal.com/images/2gemini.gif

మిథునరాశి

మృగశిర (3,4 పాదాలు), ఆరుద్ర (అన్ని పాదాలు), పునర్వసు (1,2,3 పాదాలు)

 

 

ప్రస్తుతము చతుర్ధములో నున్న శని ఈ రాశివారికి ఊరటనిచ్చుటలేదు .  శని ప్రభావకారణముగా ఈ రాశివారు మితృలు, బంధువులనుండి దూరమును కలిగి యున్నారు. వీరి బుర్ఱలో కూడ ఈ సమయమునందు మంచి ఆలోచనలు చాలా అరుదుగా పుడతాయి. భార్యాపుతృలనుండి సహకారము లభించు అవకాశములు చాలా తక్కువ. అనగ వీరి ఆలోచనలు మరియు పనులకు భార్యాపుతృల సమర్థన ఉండదు.

                పూర్వార్థములో గురుడు అనుకూలముగా నున్నాడు. అందువలన మిగిలిన గ్రహముల ప్రతికూల ప్రభావమును కొంతవరకు గురుడు అదుపులో ఉంచగలడు. గురుబల కారణముగా కార్యములందు అనుకూల పరిస్థితులు, నైపుణ్యముతో కార్యసాధన మొదలగునవి సంభవించగలవు. కానీ ఈ గురుని అనుకూలత తాత్కాలికము మాత్రమే. ఈ మాసపు ఉత్తరార్ధములో ఈ గురుడు ప్రతికూల స్థానము నందు ప్రవేశించుచున్నాడు. ఆ కారణముగా స్థాన మరియు మాన హాని సంభవించగలవు మరియు ధనవ్యయము అదుపుతప్పు అవకాశమున్నది.

          రవి పూర్వార్ధమునందు అనుకూలుడు. ఆ కారణముగా కార్యములను ఆశావహముగ పూర్తి చేసుకోగలరు. అధికారుల మరయు ప్రభుత్వ సహాయసహకారములు లభించగలవు. కానీ ఈ సూర్యుడు కూడ ఉత్తరార్ధమునందు అశుభస్ధానమును ప్రవేశించుచున్నాడు. కావున కార్యసాధనకు పూర్వార్ధము అనుకూలముగా నుండుటచే  ఈ సమయమునందు  ఈ రాశివారు తమతమ కార్యములను పూర్తిచేసుకొను ప్రయత్నము చేయగలరు.

 

http://www.jagjituppal.com/images/2canc.gif

కర్కరాశి

పునర్వసు (4 పాదం, పుష్యమి (అన్ని పాదాలు),ఆశ్లేష (అన్ని పాదాలు)

 

 

గత కొద్దికాలముగా ఈ రాశివారు జన్మరాశిలో నున్న కుజుని దుష్ప్రభావమును ఎదుర్కొనుచున్నారు. ఆవేశము, ఆలోచించలేకపోవడము, ఒత్తిడి మొదలగు అనేక సమస్యలు వీరి పని సామర్ధ్యమును చాలావరకు తగ్గించివేశాయి. ప్రస్తుతము ఈ మాసములో కూడ ఈ కుజునినుండి ఊరట లభించు అవకాశములేదు. ఈ కుజునకు తోడు గురుడు ఈ మాసపు పూర్వార్ధములో అశుభ స్థానములో ఉండి కుజనకు మరింత బలమును పెంచుతున్నాడు.

          కానీ గురుడు ఉత్తరార్ధములో అనుకూల స్ధానమునకు మారుటచే ఈ రాశివారికి ఊరట లభించగలదు. శని ఈ మాసమంతయూ వీరికి శుభకరుడే. రవి బుధులిద్దరూ ఈ మాసమంతయూ ఈ రాశివారికి శుభకరులై ఉన్నారు. ఆ కారణముగా కోర్టు వాజ్యములయందు, వివాదములయందు, మధ్యవర్తిత్వములయందు ఈ రాశివారికి సఫలత ప్రాప్తించగలదు. ఇది కార్యసిద్ధి కలుగు కాలము. అన్ని రంగములవారికి అనుకూలమైన స్ధానము. కావున ఈ కాలమునందు తమ తమ మనోభీష్టములను నెరవేర్చుకోవడానికి ప్రయత్నించగలరు. కానీ పూర్వార్ధము విద్యార్థులకు అనుకూలము గాదు కావున వారు వారి పనులను ఉత్తరార్ధములో పూర్తి చేసుకొనుటకు ప్రయత్నించగలరు.

          ఈ రాశివారలు తాము స్నానము జేయు నీటియందు కొన్ని బిల్వపత్రములనుంచి స్నానము చేయుట ద్వారా కుజుని ప్రతికూల ప్రభావమునుండి కొంతవరకు ఊరట పొందగలరు.

 

http://www.jagjituppal.com/images/2eo.gif

సింహరాశి

మఖ(అన్ని పాదాలు), పూర్వ ఫాల్గుణి(అన్ని పాదాలు), ఉత్తర ఫాల్గుణి (1 పాదం)

ప్రస్తుతము ఏలినాటి శని అంతిమ చరణములో నున్న రాశి ఇది. ఈ రాశివారికి సంబంధించి గోచరములో దీర్ఘకాలిక మార్పు ఈ నెలలో జరుగబోవుచున్నది. గురుని శుభ స్థానము నుండి అశుభస్థానమునకు జరుగు మార్పుతో ఈ మార్పు ప్రారంభమగును. ఈ సమయము వీరి ఆత్మస్థైర్యమునకు పరీక్ష పెట్టు సమయము. ఈ రాశివారికి తమతమ జాతకములలో ప్రతికూలసమయము వచ్చినప్పుడు లేక బలహీనుడైన గ్రహము యొక్క దశ లేక అంతర్దశ ఈ సమయములో సంభవించిన గోచరము యొక్క ఈ ప్రతికూల స్థితి వారికి ఇబ్బందులు కలుగజేయగలదు.

          ఈ రాశివారికి ఈ మాసపు పూర్వార్ధములో గురుని శుభత్వమువలన అన్ని రంగములయందు అనుకూల ఫలములు మరియు సుఖము లభించగలవు. ఉత్తరార్ధములో రవి, పూర్వార్ధములో శుకృడు శుభులు. మాసమంతయూ వీరికి బుధ కుజులు ప్రతికూలురై ఉన్నారు. తత్ఫలితముగా ఈ మాసము వీరికి మిశ్రమముగా నుండును. గురు శుకృల ప్రభావకారణముగా పూర్వార్ధములో వీరు చిన్న చిన్న ఆటంకములు ఎదురయిననూ తమ కార్యములను నిర్వర్తించుకొనగలరు.

          ఉత్తరార్ధములో గ్రహములు అధికాంశమున ప్రతికూలస్థితిలో నుండుటచే అడుగడుగునా విఘ్నములు, పని పై శ్రద్ధ తగ్గుట, క్రింద పనిచేయువారు, ఉద్యోగస్థులు సహకారము అందిచకపోవడము, ప్రతీ పనియందు ఒకటికి రెండుసార్లు తిరగవలసి రావడము, శారీరకముగా విశ్రాంతి తీసుకొను అవకాశము దొరకకపోవడముచే వీరి పనిచేయు సామర్థ్యము చాలా వరకూ తగ్గు అవకాశమున్నది. అగమ్యగోచరముగా కనిపించే ఈ సమయములో ఈ రాశివారికి చేదోడు వాదోడుగా వారు చేయు పుణ్యకార్యములే సహకరింపగలవు. గురు శనుల ప్రభావమును తగ్గించుకొనుటకు రుద్రాభిషేకమును తరచు చేయించుకొనగలరు. శివాలయ సందర్శనము, తిలలు కలిపిన నీటితో స్నానము వీరికి ఊరటనివ్వగలవు.

 

http://www.jagjituppal.com/images/2virgo.gif

కన్యా రాశి

ఉత్తర ఫాల్గుణి (2,3,4 పాదాలు), హస్త (అన్ని పాదాలు), చిత్ర (1,2 పాదాలు)

 

 జన్మరాశిలో శని, అష్టమములో రవి, షష్ఠంలో గురుడు ఈ రాశివారికి ఈ మాసపు పూర్వార్ధములో ప్రతికూలముగా ప్రవర్తించు గ్రహములు. వీని కారణముగా వీరికి దేశాంతరవాసము, దీనత్వము, స్వజనవిరోధము, ధనాభావమును కలుగు అవకాశమున్నది. పిత్తప్రకోపము, జ్వరము మరియు స్త్రీ విముఖత ఈ రాశివారికి శాంతి కరువయ్యేలా చేయగలుగు కొన్ని అంశములు. మనస్సుకు ఏ విషయమునూ సంతోషమును ఇవ్వలేదు. అనగ వీరు ఏ పనిలోను, ఎటువంటి ఫలితములున్ననూ సంతుష్టి చెందు అవకాశములు చాలా తక్కువ.

          ఉత్తరార్ధములో గురుడు అనుకూలస్ధానమును పొందుచున్నాడు. ఆ కారణముగా ఈ రాశివారికి అనుకూల గ్రహముల బలము పెరుగు చున్నది. దానికి తోడు వీరికి ఈ మాసమంతా కుజుడు అనుకూలుడై వివిధమార్గముల ద్వారా ధనలాభమును, భిన్న వివాదములయందు విజయము, రాజ్యలాభమును కలిగించు అవకాశమున్నది. మాసమంతయూ బుధుడు కూడ అనుకూలుడైయండుటచే  మానసిక సుఖము, కార్యములందు త్వరితఫలము, ధనలాభము కలుగు అవకాశమున్నది. కావున ఈ రాశివారు ఈ మాసమునందు బకాయి ఉన్న ధన సంబంధమైన పనులను నిర్వర్తించుకొనుటకు ప్రయత్నించగలరు.

          అతి సంవేదనశీలుడు మరియు అధిక ఇబ్బందులకు గురిచేయువాడు శని. కావున ఈ శనియొక్క ప్రభావమును ఎదుర్కొనుటకు నీలము పువ్వులతో శివారాధన చేసుకొనగలరు.

http://www.jagjituppal.com/images/2libra.gif

తులారాశి

చిత్ర (3,4 పాదాలు), స్వాతి (అన్ని పాదాలు), విశాఖ (1,2,3 పాదాలు)

 

      

మాసమంతయూ శని అశుభుడు మరియు గురుడు ఉత్తరార్ధములో అశుభుడు. బుధ, రవి, కుజులు అశుభులు. వీరీ మాసమంతయూ అదే పరిస్థితిలో ఉంటారు. ఈ మాసమంతయూ ఈ రాశివారికి చేదోడు వాదోడుగా ఉండే గ్రహము శుకృడు మాత్రమే.

          ఇబ్బందులమాల వీరిని ఈ సమయములో వరించినది. అనగ ఏలినాటిశని ప్రారంభములో ఉన్న వీరికి ఒకదాని వెనుక మరియొకటిగా కష్టములు వెంటాడిఉండే అవకాశమున్నది. గురుని శుభ ప్రభావముతో పూర్వార్ధము కొంత మేర ఊరటగా ఉన్ననూ ఉత్తరార్ధములో గురుని వ్యతిరేకత ఆ అవకాశమును దూరముచేసే అకాశమున్నది, ఈ మాసములో ఈ రాశివారు పూర్తిగా ఆధారపడవలసిన గ్రహము శుకృడు మాత్రమే.  ఈ శుకృని కారణముగా వీరు నానా విధములైన సుఖములను అనుభవించగలరు. మిగిలిన గ్రహములన్నియూ ప్రతికూలతను ప్రదర్శిస్తున్న ఈ సమయములో వీరు నానా సుఖములను అనుభవిస్తారనడం అతిశయోక్తిగానున్ననూ ప్రబలుడైన శుకృడు  ఆ విధములైన ఫలితములను ఇవ్వగలడు. కావున ఈ రాశివారు ఈ మాసమునందు లక్ష్మీపూజ మరియు లక్ష్మీ అష్టోత్తరము వంటివి పఠించుట ద్వారా శుకృని బలోపెతుని గావించి వాని ద్వారా అనుకూలఫలితములను పొందగలరు.

http://www.jagjituppal.com/images/2scorp.gif

వృశ్చికరాశి

విశాఖ (4 పాదం), అనూరాధ (అన్ని పాదాలు), జ్యేష్ట (అన్ని పాదాలు)

 

ఈ మాసము ఈ రాశివారికి చాలా అనుకూలముగా కనబడుచున్నది. మాసపు పూర్వార్ధములో రవి బుధ శనులు అనుకూలురై ఉన్నారు. ఆ కారణముగా రోగ నివృత్తి, శోక నిర్మూలనము మరియు శతృవినాశనము జరుగగలవు. మాసమంతయూ అనుకూలముగానున్న బుధుడు సౌభాగ్యము, విజయము మరియు ఉన్నతస్ధానములను ఇవ్వగలడు.. వీరి స్వభావము ఈ సమయములో శనిప్రభావకారణముగా కొంతవరకూ ఉగ్రముగా మారగలదు. పరాయి ధనము మరియు స్త్రీలద్వారా లాభములను పొందు అవకాశమున్నది,

          ఉత్తరార్ధములో గురుడు  షష్ఠములోకి ప్రవేశిస్తున్నాడు . ఆ కారణముగా  అంతవరకూ అనుభవిస్తున్న సుఖములు సుఖములు కావన్నట్లు గోచరించడము ప్రారంభమవుతుంది. ఈ గురుని మార్పు దైనికజీవనములో చాలా సమీకరణములను మార్చు అవకాశమున్నది. పూర్వార్ధములో అశుభకారకుడైన శుకృడు ఉత్తరార్ధములో ఈ రాశివారిని లక్ష్మీయుతుని కావించుటకు నిశ్చయుడైయున్నాడు.

          గ్రహబలమును బట్టి చూస్తే పూర్వార్ధము  ఈ రాశివారికి చాలా వరకు అనుకూలముగానున్నది. ఉత్తరార్ధములో ఈ శుభత్వము కొంత వరకూ తగ్గిననూ శని శుక్ర బుధుల కారణముగా మాసమంతయూ వీరికి అనుకూలముగానుండు అవకాశములు ఎక్కువగా ఉన్నవి. ఉత్తరార్ధములో అశుభుడుగా మారుతున్న గురుడు దీర్ఘకాలము ఆ స్ధానములో ఉండును కావున ప్రతి నిత్యము క్రమము విడువక భగవద్ధ్యానమును చేయవలెను. దానివలన గ్రహముల ప్రతికూల ప్రభావము తగ్గి ఊరట లభించగలదు.

http://www.jagjituppal.com/images/2saggi.gif

ధనూరాశి

మూల (అన్ని పాదాలు), పూర్వాషాడ (అన్ని పాదాలు), ఉత్తరాషాడ (1 పాదం)

       

పూర్వార్ధములో సూర్యుని ప్రతికూలత వలన శారీరిక రుగ్మతలు ఈ రాశివారిని ఇబ్బంది పెట్టగలవు. కానీ అదే సూర్యుడు ఉత్తరార్ధములో  అనుకూల పరిస్థితిలోకి వస్తూనే ఈ బాధలనుండి ఉపశమనము లభిస్తుంది. కుజుడు మాసమంతా అశుభుడు. ఆ కారణముగా విత్తమానములు క్షయించుట మరియు పిత్త జ్వరము వంటి వాటికి అతడు కారణము కాగలడు.  బుధుడు కూడ మాసమంతయూ ఈ రాశివారికి అనుకూలముగా నున్నాడు. ఆ బుధుడు స్వజనులు మరియు కుటుంబ సభ్యులతో సఖ్యతను మరియు వారి వలన సుఖమును ప్రసాదించును. వ్యాపారాదులయందు అపేక్షించిన దానికన్న ఎక్కువ ధనలాభము కలుగు అవకాశమున్నది. పూర్వార్ధములో గురుడు అనుకూలుడు కాదు. ఆ కారణముగా ఒత్తిడి అధికముగా నుండు అవకాశమున్నది.

          శుకృడు మాసమంతయూ శుభుడు కాడు. పూర్వార్ధములో స్త్రీజనుల కారణముగా పరాభవమును చెందు అవకాశములు ఎక్కువగా ఉన్నవి. కావున స్త్రీలకు సంబంధించిన వ్యవహారములందు ఆచితూచి వ్యవహరించగలరు. ఉత్తరార్ధములో అశుభవార్తలను వినే అవకాశమున్నది. సుఖకారకములైన వస్తువుల క్రయవిక్రయాదులకు అనువైన సమయము కాదు.

          ఉత్తరార్ధములో ఈ రాశివారికి గురు బలము ప్రాప్తిస్తున్నది. దానికి తోడు మాసమంతయూ అశుభుడైన శని యొక్క స్థాన ప్రభావమువలన ఉద్యోగ ప్రయత్నములు ఈ సమయములో ఫలించే అవకాశమున్నది. ఈ మాసములో ప్రతికూలముగా నున్న గ్రహముల ప్రీత్యర్ధము లక్ష్మ్యష్టోత్తరము మరియు శ్రీనివాస దర్శనము చేసుకొనగలరు.

  

http://www.jagjituppal.com/images/2capricon.gif

మకరరాశి

ఉత్తరాషాడ (2,3,4 పాదాలు), శ్రావణ (అన్ని పాదాలు), ధనిష్ట (1,2 పాదాలు)

ఈ మాసము ఈ రాశివారికి మిశ్రమముగా ఉంటుంది. ప్రతికూల మరియు అనుకూల గ్రహముల బలము సమానముగా ఉండుటచే ఫలములు మిశ్రమముగా ఉండును. కుటుంబ సభ్యులు, భార్యాపిల్లలు మరియు స్వజనులతో మధ్య మధ్య వివాదములు, మధ్య మధ్య స్నేహము ఏర్పడును. తగాదాలను వెంటాడి ఒప్పందములు , ఒప్పందముల వెంట వివాదములు కలుగుచుండు అవకాశమున్నది.

          ఉత్తరార్ధములో పరిస్థితులు వీరి పరిధిలో ఉండే అవకాశములు తక్కువ. మిగిలిన గ్రహముల వ్యతిరేకతకు గురుని అశుభస్ధానప్రభావము తోడయి ప్రతికూలప్రభావమును పెంచును. ముఖ్యముగ శ్రద్ధ వహించవలసిన అంశము కుటుంబము. ఈ సమయములో అపోహలు, అనుమానములు, వివాదములు ఇంట సుఖములేకుండ చేయు అవకాశమున్నది.

          ప్రత్యేకముగ ఈ రాశివారి విషయములో వివరించుటకు ఏమియునూ లేదు. కొంతమేర అనుకూలత  పూర్వార్ధములో నుండుటచే తమతమ కార్యములను పూర్వార్ధములో నిర్వర్తించుకొనుటకు ప్రయత్నించవలెను. మరియు మిగిలిన అన్ని విషయములందూ ఆవేశము మరియు తొందరపాటుతనము పనిచేయదు. అనుకూలమైన సమయము కొరకు వేచియుండవలెను. శివ గణేశ స్తుతి మరియు ప్రార్ధనలు మానసిక శాంతిని చూకూర్చగలవు.

 

http://www.jagjituppal.com/images/2aqua.gif

కుంభరాశి

ధనిష్ట (3,4 పాదాలు), శతభిష (అన్ని పాదాలు) , పూర్వాభాద్ర (1,2,3 పాదాలు)

గురుశనులిద్దరూ అనుకూలముగా లేనప్పటికీ ఈ రాశివారికి ప్రస్తుతము అనుకూలమైన సమయము నడుస్తున్నది. దానికి కారణము ఈ రాశివారికి అనుకూలముగా నున్న కుజ, రవి, బుధ, శుకృలు. అన్ని రంగములందునా వీరికి రాణించు కాలమిది. సూర్యుని అనుకూలత కేవలము పూర్వార్ధములో మాత్రమే ఉన్నది. కావున ఆధికారికములు, ప్రభుత్వపరములు అయిన కార్యములను ఈ సమయములో పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించవలెను.

          ఉత్తరార్ధములో సూర్యడు అశుభస్ధానములో ప్రవేశిస్తున్నాడు. కానీ ఆ సమయానికి గురుడు శుభస్ధానమును చేరుతున్నాడు. ఆ కారణముగా ఉత్తరార్ధమునందు కూడ వీరికి అన్ని రంగములందునా అనుకూలఫలితములు కలుగును. కావున ఈ అవకాశమును ఈ రాశివారు ఉపయోగించుకొనడానికి ప్రయత్నించవలెను. గురుని ఆనుకూలత కారణముగా శతృవులు విరోధుల కారణముగా కూడ వీరికి ధనలాభము కలుగు అవకాశమున్నది.

      ప్రతికూల గ్రహములను ఉపేక్షించుట మంచిది కాదు కావున వారి శాంత్యర్ధము భగవత్ప్రార్ధన కొనసాగించవలెను.

 

 

http://www.jagjituppal.com/images/2psices.gif

మీనరాశి

పూర్వాభాద్ర (4 పాదం), ఉత్తరాభాద్ర (అన్ని పాదాలు), రేవతి (అన్ని పాదాలు)

కార్యస్థానమునందు (ఉద్యోగము చేయు ప్రదేశమునందు) వ్యతిరేకత ఎక్కువగానుండు అవకాశమున్నది. ఈ వ్యతిరేకత ఉత్తరార్ధములో మరింత పెరుగవచ్చును. ఆ కారణముగా స్థానమార్పిడి జరుగు అవకాశములు కూడ ఉన్నవి. అధికారులతో వివాదములకు ఇది సరియైన సమయము కాదు. కుటుంబము మరియు భార్యాపుతృలనుండి దూరముగా ఉండవలసి రావచ్చును. మానసిక దైన్యము మరింత కష్టములకు కారణము కావచ్చును.

          పూర్వార్ధములో అదుపులోలేని ధనవ్యయము, వంచింపబడడటము, సుఖము లేకపోవడము విరక్తభావనను పెంచును. కానీ ఆత్మస్థైర్యము మరియు గుండె నిబ్బరములకు ఇది పరీక్షాకాలమని గ్రహించి సంయమనముతో వ్యవహరించవలెను.

          వ్యతిరేకుల సంఖ్య పెరుగును. అన్ని రంగముల కార్యములయందు వ్యతిరేకత మరియు విఘ్నములు స్పష్టముగా కనిపించును. ఏ స్థానములో వారిని కాని ఏ స్థాయిలోవారిని కాని వ్యతిరేకించకుండ తమతమ విధులను నిర్వర్తించుకోవలెను. తరచు కలహములు సంభవించును కాని ఉద్రేకములకు లోను కారాదు. ఈ సమయములో ఈ రాశివారికి సహనమును మించిన ఆయుధము లేదు.

          ఉత్తరార్ధములో సూర్యని అనుకూలత కారణముగా చాల విషయములందు అనుకూలవాతావరణము ఏర్పడగలదు. అన్ని రకములైన గ్రహదోషములకు మంచి ఉపాయము రుద్రాభిషేకము. కావున వారమునకొకసారి రుద్రాభిషేకమును చేయించుకొనగలరు.

 

 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం