మంత్ర శక్తి కలలు - కాశీ మజిలీ కధలు

                                                                                                 

 
జీవితమే నాకో వరం. ఇది నేను అడిగానో, నాకే దేవుడు ఉచితంగా ఇచ్చాడో తెలియదు.

నిజంగా నాకు తెలియదు నా తర్వాత వందేళ్ళకి నేనెవరికైనా గుర్తుంటానో లేనో! వందేళ్ళ క్రితం నాటి మనుషులని మనం ఎంత గుర్తు పెట్టుకుంటాం? మహాత్ములనే మరిచిపోతాం, మహా అయితే సినిమాలో గాంధీ గారిని చూసి పులకించి కన్నీళ్ళు పెట్టుకుంటాం. మరి జీవితం గురించి నాకేం పెద్ద తెలుసు? ఆలోచనలకి అంతులేదు, తుది దాటాక ఒక్క నిమిషమైనా టైం లేదు. ఒక్కో సారి ఊహించుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఉపనిషత్తులు, అనేక గ్రంధాలు చెప్పింది నిజమే అయ్యి నేను నిజంగా ఆత్మనే, శరీరాన్ని కాదు అని గోచరమైపోతే? అనుభవంలోకి వచ్చేస్తే? గాలిలో తేలుకుంటూ సినిమాలో చూపించినట్టు తిరుగుతుంటానా? పచ్చి మిరపకాయ్ బజ్జీలు అవీ చూసి లొట్టలు వేస్తుంటానా? లక్షలకొలదీ వేసిన మంచి ఆదర్శాలు, పంచ వర్ష ప్రణాళికలు పంచభూతాల్లో కలిసిపోతాయా? అరే బోల్డు మంచి పన్లు చేద్దాం అనుకున్నానే, ఓ నలుగురు అనాధలకి చదువు చెప్పిద్దాం అనుకున్నానే అనుకుంటుండగానే వృద్ధాప్యం వచ్చేస్తుందా? డబ్బులు, జబ్బులు నన్ను కోతిలా ఆడిస్తుంటే ఇంక మంత్ర జపం చేసి దేవుడ్నెప్పుడు చూడ్డం? నేను దేవుడిని చూద్దాం అని బయలుదేరితే నన్నెవడు చూస్తాడు? మరి పరమాత్మలో ఆత్మ తెలిసేదెప్పుడు? ఆ మంత్రం లో ఉన్న ' మన్ ' మనకి గోచరమయ్యేదెప్పుడు?

గురిగల గురువుల దరిచేరగ,
గురుతున దేవుని గరిమగ స్మరియింపగ గలుగున గంగాధరుని,
గగన తురీయ సుధాపానము,ధ్యానము,దివ్య విజ్ఞానము,
గుహ్య ఋతంభరా రసోత్పన్న విభిన్న మహాకాల గమనాతీత పరబ్రహ్మ గమ్యము?

మదిలో ఘంటా నాదము,
హృదిలో, నిశిలో, పరులకు కనిపించని
గదిలో, పై కిందుల విధిలో, ప్రపంచ పడిలో, బడిలో
చదివే నాల్గు ముక్కల మానవత, దేవునికై చదవక మానవటా!

నీ మనసే నలుదిక్కులు
వినీల గగనపు చుక్కల దాకా ప్రవహిస్తే
ఇల నీదని, ఎల్లపుడు నీ ఎదని నివసిస్తే
కల ఘనీభవిస్తే, ' అందరు ' నేనని, నేనేనని,నేలేనని అనిపిస్తే

అది కాదా మంత్ర సిద్ధి?
అతీంద్రియం కద బుద్ధి!
(ఋతంభరాన్వేషణ, రచయిత)

దీనికి సంబంధించిందే ఓ కాశీ మజిలీ కధ చాలా కాలం కిందట."మంత్ర శాస్త్రం చాలా గొప్ప శాస్త్రం. దివ్య మైన విద్యలతో, ధ్యాన యోగంతో ఎన్నో సాధించాలనుకున్నాను నేను. కానీ ఇదిగో ఇలా డబ్బు సంపాదించడంలో పడి పోయి ఎక్కువ దూరం వెళ్ళలేకపోయాను. మీరైనా ఎలాగైనా ఇవి సాధించండి, కొద్దో గొప్పో సమాజానికి మంచి చెయ్యండి. కొన్ని కోట్ల ఆస్తి మీకోసం పెడుతున్నాను. ఎవరిదగ్గరా ఒక్క పైసా ఆశించకండి. వెళ్ళండి ఈ భౌతిక ప్రపంచానికి అందని ఆ అతీత శక్తి ఏదో దాని తత్వం ఏంటో అవగాహన చేసుకోండి, అంతు చూడండి", అని చెప్పి కొడుకుల వైపు చూసాడు ఆ తండ్రి.

"అలాగే మీ మాట నిలబెడతాము", అన్నారు. ఒక సంవత్సరం కాల చక్రంలో తిరిగిపోయిందిట. ఆరోజు చక్కగా పొద్దున్నే ఓ బెంజి కారు ఇంటిముందు ఆగాయి. అందులోంచి చిన్న కొడుకు ధ్యానగీతాకృష్ణ స్వామి దిగాడు. అతనితోపాటు ఓ ముగ్గురు శిష్యులు చక్కగా అందరు తెల్లని బట్టల్లో ఉన్నారు. మెళ్ళో రుద్రాక్షమాల, విబూది రేఖలు. "అన్నయ్య రాలేదా? " అని అంటూండగానే ఒక ఆటో ఆగింది. అందులోంచి కాషాయ వస్త్రాల్లో అన్న గారు జగద్విలీన రామ స్వామి దిగాడు."హాం సృష్టిమూల త్రికోణ శూన్య మహా చైతన్య శక్తి హ్రూం ఫట్" అనగానే చేతిలోకి మూడు వంద నోట్లు వచ్చాయి. ఆటో వాడికి మతిలేదు. కాళ్ళ మీద పడ్డాడు. వాడు నాకు ఆటో డబ్బులు వద్దంటున్నా వాడికి ప్రేమగా డబ్బులు ఇచ్చేసి లోపలికొచ్చాడు అన్న గారు.

తండ్రి ఇద్దరిని సాదరంగా కూర్చోబెట్టి మాట్లాడాక వాళ్ళిద్దరు చెప్పారు, వాళ్ళ వాళ్ళ అనుభవాలు.

మొదట రామ స్వామి చెప్పాడు. "నాన్నా! నేను నువ్వు కోరినట్టు బయలుదేరాక మంత్ర శాస్త్రం చదివి, సిద్ధులు సాధించాలని నిర్ణయించుకున్నాను. కొందరు గురువుల దగ్గర సుశ్రూషలు చేశాను. నీకు చాలా కాలంగా ఉన్న కాలు నొప్పికి కూడా ఒక మందు తెచ్చాను" అంటూనే గాలిలోంచి చటుక్కుని ఒక మందు పొట్లం సృష్టించి ఇచ్చాడు. "ఇది వేసుకుంటే నెల రోజుల్లో నొప్పి తగ్గి పోతుంది" అని చెప్పాడు.

కృష్ణస్వామి అన్నాడు, "నేను ధ్యాన మార్గంలో యోగత్వాన్ని సాధించాలని వెళ్ళాను. ఒక సద్గురు ఆశ్రమంలో ఇప్పుడు నేను పీఠాధిపతిలాంటి వాడిని. కొన్ని లక్షల మంది మాదగ్గర ప్రపంచ వ్యాప్తంగా ధ్యానం నేర్చుకుంటారు. నన్ను దైవంగా భావిస్తారు. రోజూ టీ.వీ లో పొద్దున్నే సుభాషితం-ధ్యానగతం అని ప్రసంగాలిస్తుంటాను. నువ్వు చూసే ఉంటావు" అని సంతోషంగా చెప్పాడు. "నువ్వు , అమ్మా ఈ ఇబ్బందులు పడక్కర్లేదు ఒక్కళ్ళూ, అందరం హాయిగా ఆశ్రమంలో ఉందాం. అక్కడ రెండు ఏ.సీ రూములు, వంటవాళ్ళూ, పనివాళ్ళూ, అవసరమైతే మంచి డాక్టర్లూ ఉన్నారు. అన్నయ్య కూడా నాకు ఈ ఆధ్యాత్మిక సంస్థ విషయంలో సహాయం చెయ్యగలడు" అన్నాడు.

ఇద్దరి మాటలూ విని తండ్రి ఆనందంగా చెప్పాడు, "బాగుంది ఇద్దరూ చక్కని పురోభివృద్ధి సాధించే ప్రయత్నంలో ఉండడమే కాకుండా తల్లితండ్రులకి, చుట్టూ ఉన్న ప్రజలకి ఏదో చెయ్యాలనే యత్నంలో ఉన్నారు.ఇక ఆధ్యాత్మికత విషయానికొస్తే నాకు మీరు సాధించింది సంతోషం కలిగించినా, పరిపూర్ణత కోసం ఇంకేదో చెయ్యాలనిపిస్తోంది. ఈ విషయంలో మీరు నా పిల్లలు కనక నాకు మీ దృక్పధాలు అద్భుతంగా ఉన్నట్టు అనిపించొచ్చు, లేక పెద్దతనం వల్ల ప్రతీది లోపసహితమై గోచరం కావచ్చు. మీరో పని చెయ్యండి... నాకు బాగా పరిచయం ఉన్న మన ' పరమ కాకి ' అవివేక విమర్శానంద మహాఋషి - ఆయన్ని కలవండి".

ఆ పేరు వినగానే ఆశ్చర్యంగా చూసారు రామ స్వామి, కృష్ణ స్వామి. "ఈయనెవరు? అసలు పరమ కాకి అని ఆ పేరేంటి? పరమ హంస అని కదా గురువుల పేర్లలో ఉండాలి?" అని నవ్వుతూ ప్రశ్నించారు.

"అవును ఆయన ఓ చిత్రమైన మనిషి.ఆయన్ని అర్ధం చేసుకోడం కూడా ఒక ఆనందకరమైన పనే! అవధూతలు, షిర్డి సాయి బాబా వంటి గురువులు కూడా విభిన్నమైన మనుషులే కదా!" అని నవ్వుతూ చెప్పడం మొదలు పెట్టాడు తండ్రి. ఈలోపల వాళ్ళమ్మ డబ్బాలోంచి జంతికలు తీసి వాళ్ళకి, ఇంకా కృష్ణ స్వామి శిష్యులకి ఇచ్చింది. "మహా ప్రసాదం" అని కళ్ళకద్దుకుని వాళ్ళూ తింటూ "పరమ కాకి అవివేక విమర్శానంద మహాఋషి" గురించి వినడం మొదలు పెట్టారు.

తండ్రి కొనసాగించాడు. "ఈyaన్ని కూడా అందరు పరమ హంస అని పిలవబోయారు. హంస పాలూ నీళ్ళూ కలిపి ఇస్తే పాలు మాత్రం తాగి నీళ్ళు వదిలేస్తుంది. అలాగే పరమజ్ఞానులు కూడా జగత్తులోని మంచిని గ్రహించి మిగిలినవి వదిలేస్తారు. ఈయన వాదనా అదే, చిన్న మెలికతో! అసలు పరమ హంస అయిన వాడు తనకి తాను పరమ హంసని అని చెప్పుకుని తిరుగుతుంటే పరమహంస అయినట్టా? అని ప్రశ్నిస్తాడు. పైగా పరబ్రహ్మత్వాన్ని గ్రహించిన జ్ఞానికి పాలు, నీళ్ళు అనీ ద్వైత భావాలుంటే ఎలా? అని కూడా చెప్పడం జరిగింది. మరెలా వచ్చిందో కానీ ఆయనకి క్రమంగా 'పరమ కాకి ' అనే పేరు వచ్చేసింది. అది ఆయనకి ఇష్టంకూడా" అని ఆపాడు.

"పరమ కాకి అని పిలిస్తే బాగుందని ముచ్చట పడ్డం ఏమిటి?" అని ప్రశ్నించాడు అక్కడున్న ఓ కృష్ణ స్వామి శిష్యుడు.

"హంసలు పాలు నీళ్ళు వేరుచేయడం గురించి పుస్తకాల్లో చదవడమే కానీ ఎవరం చూడ లేదు కదా! కానీ కాకి మాత్రం అందరికి అక్కర్లేని తిండిని తింటుంది. బంధువులొస్తున్నారని అరిచి చెపుతుంది. అంత్యకాలంలో కాకి కున్న ప్రాధాన్యత ఇంక దేనికుంది? అసలు కనపడకుండా ఏదో దేవలోకాల్లో, సరోవర తీరాల్లో, జానపద కధల్లో కనిపించే వయ్యారం హంస లా కాక అందరికి ఉపయోగపడే సామాన్యుడిలా, కాళీ కృష్ణ వర్ణ శోభాయమానమైన కాకి లా యోగి ఉండాలని అవివేక విమర్శానంద అభిప్రాయం" అని చెప్పారు తండ్రి.

"ఇదేదో బాగుంది, ఈయన్ని తప్పకుండా కలవాలని ఉంది" అన్నారు అన్నదమ్ములు.

పదండి అని అందరూ బయలు దేరారు. విమర్శానంద గారింటికి చేరారు. ఆయన అక్కడ చాప మీద కూచుని ఓ పది మందితో మాట్లాడుతున్నారు.ఆయన మొఖంలో తేజస్సు కనిపిస్తోంది, చక్కని వాక్కులతో ఇలా అన్నారు.

"ఈశిత్వం మంత్రసిద్ధే
ఆత్మ బోధాయ మహిత్వే
కూష్మాండ బ్రహ్మాండ మధ్యే
కుండలినీ దండే చాండాల పరిఖండే!"


అని చెప్పి కృష్ణ స్వామి వైపు చూశారు. "అర్ధమైందా?" అని అడిగారు. "చాలా బాగుంది, ఇది ఏ ఉపనిషత్ లోది స్వామీ?" అని అమాయకంగా అడిగాడు కృష్ణ స్వామి.

ఆయన నవ్వి, "నే చెప్పిన దానికి అర్ధం లేదు. బాగున్న నాలుగు మాటలు చేరిస్తే భావము రాదు. ఉపదేశించడానికి, అలా ఉపదేశించనట్టు అనిపించడానికి తేడా ఉందా?".
అన్నదమ్ములకర్ధమైంది చమత్కారంగానే ఆయన ఏం చెపుతున్నారో!

(ఈ కధని వచ్చే సంచికలో ముగిద్దాం)

శ్రీ గురుభ్యో నమః

 
 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech