కొంపలు ముంచే కోపం

 

 

"మా ఇంట్లో నా మాటకెవరైనా ఎదురుచెప్తే భరించలేకపోతున్నాను సార్! చేతిలో ఏదుంటే అది వారి మీదకు విసిరేస్తున్నాను. ఈ కోపం తగ్గించుకోడానికి మీ దగ్గర చిట్కాలేమైనా ఉన్నాయా?" అంటూ ఉస్సూరని కూర్చున్నాడు ఓ చిరుద్యోగి.

"తప్పకుండా ఉన్నాయి.అయితే మీకు ఏయే సందర్భాల్లో కోపం వస్తూందో ఎప్పుడైనా గమనించారా?" అని అడిగాను.
"దానికి సమయం, సందర్భం అక్కర్లేదు. ఆఫీసు నుంచి ఇంటికొచ్చేసరికి మా ఆవిడ వెంటనే మంచినీళ్ళివ్వకపోతే కోపం. ఒక వేళ మంచినీళ్ళిచ్చినా, వెంటనే ఎందుకు టీ తీసుకురాలేదని కోపం. ఒకవేళ రెండూ ఇచ్చినా టిఫిన్ ఏదైనా తెచ్చి తగలెయ్యొచ్చు కదా అని అరుస్తాను ఒకవేళ ఇవన్నీ తెచ్చినా ’పిల్లలెక్కడికి తగలడ్డారు?’ అని తిడతాను. ఒకవేళ వాళ్లంతా ఇంట్లోనే ఉంటే, ’పుస్తకాలు ముందేసుకోకుండా ఏం చేస్తున్నారు భడవల్లారా?’ అని కరుస్తాను. ఒకవేళ వాళ్ళు చదువుతున్నా, వాళ్ళకు అంతకు ముందు వచ్చిన ఛండాలం మార్కుల గురించి తిట్టి, ఇలా అయితే మీరు అడుక్కుతింటారని నానా మాటలూ అంటాను. ఎందుకిలా కోపం వస్తోందో తెలియడం లేదు. ఒక్కోసారి నా మీద నాకే అసహ్యం వేస్తుంది. భగవంతుడు ఈ కోపాన్ని నా ఒక్కడికే ఇచ్చాడేమోననిపిస్తుంది." అన్నాడు దిగాలుగా.

"కోపం మీకే కాదు, ప్రతి జీవికీ వస్తుంది. పిల్లికీ, కుక్కకీ కూడా కోపం పాలెక్కువే.కోపం మీ ఒక్కరి ఆస్తీ కాదు.అయితే దాన్ని అదుపులో ఉంచుకోవడం వివేకవంతుల లక్షణం. తప్పనిసరైతే, కోపాన్ని నటించాలి తప్ప, నిజంగా కోపం తెచ్చుకోకూడదు. దానివల్ల సంబంధ బాంధవ్యాలు చెడిపోతాయి. విలువ ఇచ్చేవారు కూడా ఇవ్వరు. మీ పట్ల భక్తి పోయి, భయం ఏర్పడుతుంది. చివరికి మిమ్మల్ని విడివిపెడతారు"అన్నాను.

"నిజమే. మా అబ్బాయికి ఎంసెట్ లో మంచి ర్యాంకు రాలేదని గొడ్డును బాదినట్లు బాదాను.వాడు ఆ రోజే ఇంట్లోంచి పారిపోయాడు. ఇంతవరకూ రాలేదు. నిజానికి మా వాడు మంచి స్టూడెంటే. ఆ సంవత్సరం ఎంసెట్ పరీక్షలో ఒక అధికారి తన కూతురి కోసం, పేపర్ లీక్ చెయ్యడం వల్ల చాలా మంది బ్రిలియంట్ స్టూడెంట్స్ దెబ్బతిన్నారని తరువాత తెలిసింది. మా వాడి జాడ ఇంతవరకూ తెలియలేదు. అసలు ఉన్నాడో లేడోనని భయంగా ఉంది" అన్నాడు కళ్ళనీళ్ళు కుక్కుకుంటూ.

" మీ కోపానికి ఫలితం చూశారు కదా! మీరింకా కోపాన్ని పెంచుకుంటూ పోతే, మిగతా వారితో మీ సంబంధాలెలా ఉన్నా, మీ ఆరోగ్యం దెబ్బ తినడం ఖాయం!" అన్నాను.
"నా ఆరోగ్యానికా? నేను బాగానే ఉన్నాను కదా! ఏదో ఆ కోపం వచ్చినప్పుడు అలా ఉంటాను తప్ప తరువాత మామూలవుతున్నాను" అన్నాడు అమాయకంగా.
"అని మీరనుకుంటున్నారు. మీకు కోపం వచ్చినప్పుడు మీ శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా?" అని ప్రశ్నించాను.
"మార్పులా?" అని అడిగాడు.
"అవును. పది మార్పులు జరుగుతాయి. అవి మీ వయస్సును రోజురోజుకూ తగ్గిస్తాయి." అంటూ ఆ పది మార్పులూ ఇలా చెప్పాను.

1.కోపం వచ్చినప్పుడు ఎడ్రినల్ గ్రంధులు విడుదల చేసే హార్మోన్స్ అధికమై, శరీరానికి అత్యధిక శక్తి వచ్చి ఏ అఘాయిత్యమైనా చేయించగలవు.

2.ఎడ్రినల్ గ్రంధులు విడుదల చేసే హార్మోన్ల వల్ల బాడీ కెమిస్ట్రీలో మార్పులు వస్తాయి. రసాయనాలు విషతుల్యం కాగలవు.

3.ఉచ్ఛ్వాసనిశ్వాసాలు అత్యధికమై కోపాన్ని మరీ పెంచుతాయి.

4.గుండె కొట్టుకునే వేగం తీవ్రమవుతుంది.

5.రక్త ప్రసరణ అత్యంత వేగాన్నందుకుంటుంది. దానివల్ల రక్తపుపోటు రావచ్చు,ఉంటే పెరగొచ్చు.

6.కోపం వల్ల నోరెండిపోతుంది. ఫలితంగా జీర్ణక్రియ తాత్కాలికంగా ఆగిపోతుంది.

7.చేతులు,పెదవులు వణుకుతాయి.చెమట పడుతుంది.

8.శరీరంలో కండరాలు బిగుసుకుంటాయి.

9.రక్తప్రసరణ అస్తవ్యస్తమై, శరీరంలో కొన్ని క్రియలు దెబ్బతింటాయి.

10.చివరిదైనా ముఖ్యమైనది మీ కోపం మిమ్మల్ని గుండె, లివరు వీటికి సంబంధించిన జబ్బులకు గురి చేస్తుంది.
 

"కాబట్టి మీ కోపం, మీ కుటుంబ పరిస్థుతులనే కాక, మీ శారీరకస్థితిని కూడా అతలాకుతలం చేయగలదు. మైగ్రెయిన్, అల్సర్స్, గ్యాస్, షుగర్ వ్యాధి, రుమాటిజం(కీళ్ళ నొప్పులు) వంటి జబ్బులు కోపిష్టి వారి ఆప్తమిత్రులని మరిచిపోకండి!" అన్నాను.
"మీరు ఇవన్నీ చెప్పి భయపెట్టకండి. నా కోపం తగ్గించే మార్గం చెప్పండి. మీరంతా అదృష్టవంతులు.మీకు కోపం రాదు" అన్నాడు బాధగా.
"ఎవరన్నారు? అందరికీ కోపం వస్తుంది. సహజంగా కోపం రాని వారిక్కూడా కోపం వచ్చే సంఘటనలు ఎన్నో రోజూ జరుగుతున్నాయి. ఉదాహరణకు ట్రాఫిక్ జామ్ లు, టెలిఫోన్ల్ రాంగ్ కాల్స్ ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం ఇవ్వకపోతే పని జరగపోవడం, అప్పు దొరక్కపోవడం, పిల్లల చదువులు, లోకంలో కులాల పిచ్చి పెరిగి, చేతికందిన అదృష్టం జారిపోవడం ఇలా ఎన్నో! చివరికి ఒక రోజు పేపరు వాడు పేపరు వెయ్యకపోయినా, టీవీలో చెత్త ప్రోగ్రాములు వచ్చినా, పాలవాడు ఆలస్యంగా వచ్చినా కోపం వచ్చి తీరుతుంది. అలాగని ప్రతి దానికీ చెలరేగిపోయి, చేతిలో వున్నది విసిరికొడితే, ఒకరోజు సమాజం మిమ్మల్ని ఏకాకి చెయ్యడం తప్పదు! అందరూ మిమ్మల్ని విసిరేస్తారు!" అన్నాను.

"అయితే నన్నేం చెయ్యమంటారు?" జాలి కలిగేలా అడిగాడు. నా మాటలు అతన్ని దాదాపు భయపెట్టాయి.
"ఏమీ పరవాలేదు. ముందు ఇంటి వారి మీద కోపం తెచ్చుకోవడం మానండి. మీరేమన్నా చచ్చినట్లు పడతారనే ధీమా నుంచి బయటపడండి. వారికీ కోపం ఉంటుందని మరిచిపోకండి! బయటివారి మీద కోపం ఇంట్లో ప్రదర్శించకండి. కుటుంబసభ్యులు మిమ్మల్ని ప్రేమిస్తున్నారని మరిచిపోకండి. ఇక ఈ పద్ధతులు పాటించండి.
 

1.కోపం వచ్చినప్పుడు ఒకసారి దీర్ఘమైన శ్వాస తీసుకుని మిమ్మల్ని మీరు అదుపు చేసుకోండి. వీలైతే దైవనామం స్మరించండి.

2.ప్రతి నిత్యం ఏదో ఒక రిలాక్సేషన్ ఎక్సర్స్ సైజు 10 నిమిషాలు చేయండి. లేదా యోగాభ్యాసం చెయ్యండి.

3.కోపం వచ్చినప్పుడు ఒక గ్లాసు నీళ్ళు తాగడమో, వంద వరకూ అంకెలు లెక్కపెట్టడమో చేయండి.

4.ఇతరులు నిజంగా తప్పుచేసినప్పుడు కోపం వచ్చినట్లు నటించండి తప్ప, నిజంగా కోపం తెచ్చుకోకండి.

5.చివరగా, మీకు చాలా పనులు వాయిదా వేసే అలవాటుంది కాబట్టి, ఇవాల్టి, కోపాన్ని మరునాటికి వాయిదా వేయండి!" అంటూ లేచాను.

 
 

Dr. బి.వి. పట్టాభిరాం:

బీ వీ పట్టాభి రాం, పరిచయం అక్కర్లేని పేరు...ఎన్నో ఏళ్ళుగా మేజిక్ రంగం లోనూ, ఇటు సైకాలజీ రంగంలోనూ తనదైన ముద్రతో ఎంతో మందికి స్ఫూర్తి కలిగించే అద్భుతమైన రచనలు అందిస్తూ, అనేక మంది యువతకి లక్ష్య సాధన వైపుకు నడిపించే ట్రైనింగ్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్న డాక్టర్ బి.వి. పట్టాభిరాం రచనల సమాహారం ఈ "పట్టాభిరామాయణం".

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

   
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech