తల్లాప్రగడ

ప్రధాన సంపాదకులు:
తల్లాప్రగడ రావు
సంపాదక బృందం:
తాటిపాముల మృత్యుంజయుడు
తమిరిశ జానకి
కస్తూరి ఫణిమాధవ్
పుల్లెల శ్యామ్ సుందర్
అక్కుల కృష్ణ
శీర్షిక నిర్వాహకులు:
మువ్వల సుబ్బరామయ్య   
ప్రఖ్యా మధు
విద్వాన్ టి.పి.ఎన్.ఆచార్యులు      
ఈరంకి కామేశ్వర్
రాగధేను స్వరూప కృష్ణమూర్తి
జి.బి.శంకర్ రావు
గరికిపాటి నరసింహారావు
డా||బి.వి.పట్టాభిరాం
చొక్కాపు వెంకటరమణ
ఎం.వి.ఆర్.శాస్త్రి
చీకోలు సుందరయ్య
భండారు శ్రీనివాసరావు
తల్లాప్రగడ రామచంద్రరావు
తాటిపాముల మృత్యుంజయుడు
కూచిభొట్ల శాంతి
కస్తూరి ఫణిమాధవ్
అక్కుల కృష్ణ
వనం జ్వాలానరసింహా రావు
సరోజా జనార్ధన్
యండమూరి వీరేంద్రనాథ్
ముఖచిత్రం :
సేకర్త: అర్జున్ మీనన్
వెబ్ రూపకల్పన :
సి.కృష్ణ
 

 

 

 

భారతంలో మయసభ కట్టింది మెక్సికన్లా?

అమెరికాలో కూడా ఇంటి బాక్‌యార్డ్ చేయించుకుందామని పని మొదలు పెడితే, వచ్చే నిపుణత వున్న ప్రతి పనివాడు మెక్సికనే. మయుడు కూడా మెక్సికనే ఐతే, మరి మా ఇంట్లో ఉన్నదికూడా మయసభే! మయుడు మెక్సికననే అనుమానం ఎందుకంటే  .....  చదవండి ......  

 

Indraprasta

 

మెక్సికో, దక్షిణ అమెరికాలలోని మాయన్ లేక  మాయ లేక   మయుల సంస్కృతి వున్నట్టుండి చాలా వెలుగులోకి వచ్చింది.   కారణం కొన్ని వేల సంవత్సరాల క్రిందట వారు తయారు చేసిన కాలండరే!  క్రీ.పూ. ఆగష్టు 11, 3114  నాటినుంచీ క్రొత్త యుగం మొదలయ్యిందని వీరి కాలండర్ చెబుతోంది; అలాగే డిసెంబర్ 21, 2012 నాటితొ, ఈ కాలెండర్ యొక్క ఆవృతం ముగుస్తుంది. ఆ రోజు సూర్యుడి వెనుక, మన గలాక్సీ గురుత్వకార్షణ అతిగరిష్ట స్థాయిలో వుంటుందని శాస్త్రవేత్తలూ చెబుతున్నారు. ఈ నమ్మకం పైనే తీసిన “ 2012”  అనే హాలివుడ్ సినిమా కూడా ఈ మద్యనే ఒక బాక్సాఫీసు హిట్టయ్యి కూర్చుంది కూడా . మళ్ళీ కొత్త యుగం అక్కడినుంచీ మొదలవుతుందా? లేక అదే యుగాంతామా? అని సమాధానం తెలియక అందరూ ఆదుర్దాతో సతమతమవుతున్నారు. అందుకే మయులపై పరిశోధనలు జరిపి వారిని  వెలుగులోకి తెచ్చారు; అలా వారి గురించి అనేక కొత్త విషయాలు బయటకు రావడం మొదలయ్యాయి. 

 

Maya’s Calendar

 

అసలు వీరిగురించి మనకు తెలిసిందేమిటి? మయులు  దక్షిణ అమెరికాలో క్రీ.పూ.2000 నాటికి పూర్వం నుంచే వున్నారనీ; వుండటమే కాదు ఎన్నో గొప్పగొప్ప కట్టడాలను ఆ నాటికే కట్టారనీ; వారికున్న వాస్తు నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానం అమితమనీ, అపారమనీ, వారికి సాటెవరూ లేరనీ తెలుసుకున్నాము. యూరోపియన్ దేశాలకు ఇళ్ళు కట్టు కోవడమే తెలియని రోజుల్లో వీరు పెద్ద పెద్ద భవంతులను, ఆలయాలనూ, ఉద్యానవనాలనూ, పిరమిడ్లనూ నిర్మించుకున్నారు.  వీరికున్న ఖగోళ పరిజ్ఞానం కూడా చాలా ఎక్కువే. భూమి గోళాకారంగా వుందనీ, గ్రహ నక్షత్ర భ్రమణాలను గుర్తించి, వాటి ఆధారంగా కాలండర్లను తయారు చేసుకోవడమే కాకుండా, వాళ్ళ ఇళ్ళను కూడా ఆ భ్రమణాలను దృష్టిలో పెట్టుకునే కట్టుకున్నారని పురావస్తు శాస్త్రజ్ఞులు త్రవ్వకాల వల్ల, పరిశొధనల వల్లా తెలుసుకున్నారు. వీరికి శుక్రగ్రహం చాలా ప్రశస్తమైనదట. ఆ శుక్రగ్రహ వివరాలు తరవాత మళ్ళీ చర్చించుకుందాం.

 

 

     

  

A few of Maya’s constructions 

 

ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయాలు ఏమిటంటే మయులకు బాగా అభివృద్ధిచెందిన లిపి, క్రీస్తుపూర్వం నుంచే వుంది. వీళ్ళభాష 3000 ఏళ్ళకు మించిన ప్రాచీనభాష అయివుండచ్చునని అంటున్నారు.
వారు చెట్టు బెరడుతో పేపరు తయారు చేసి దానితో పుస్తకాలు
కూడా ఏనాడో చేసుకున్నారు. వీరి మత నమ్మకం ప్రకారం వీరి పూర్వీకులు అంతరిక్షం నుంచీ విమానయానం చేసి భూమి పైకి వచ్చారు. అలాగే వీరు కూడా తరువాత వున్నట్టుండి, వాళ్ళు కట్టుకున్న నగరాలను సైతం వదిలేసి  అదృశ్యం అయిపోయారట. ఎక్కడికి పొయారొ, ఎందుకు పోయారో తెలియదు. కాకపోతే వీరికి వైమానిక జ్ఞానం వుంది అనే విషయం మాత్రం నిర్వివాదాంశం.  

 

 

 

 

పైన చూపిన దృశ్యాలు నేలపైనే వున్నా, ఇవి చాలా పెద్దపెద్దవి కావడం వల్ల, వీటిని చూడాలంటే గగనతలంలో నుంచే చూడాలి.  ఈ ప్రదేశాలలోకి వెళ్ళినా ఇవి కంటికి అందనంత పెద్దపెద్ద ఆకారాలు. ఇలా దక్షిణ అమెరికాలో పెరూ వద్ద కనపడే ఈ రేఖా చిత్రాలను నాజ్కా లైనులు అంటారు. ఇందులో అనేక పక్షుల బొమ్మలు, జంతువుల బొమ్మలూ, త్రిభుజాలు వంటి పెద్ద పెద్ద ఆకారాలు వుంటాయి. ఇవి నాచురల్ గా ఏర్పడిన ఆకృతులు కావని ఎవరైనా చూడగానే చెప్పగలరు. అనేక మైళ్ళ దూరం వ్యాపించే ఈ ఒక్కొక్క చెక్కుడూ, ఒక మానవుడు (అందులోనూ ఆదిమానవుడు) చేయగలిగిన పనులు కావు.  ఎందుకంటే నేలమీద నుంచుని చూస్తే కంటికి తెలియని దృశ్యమది. ఒక వేళ మనిషే చేసినా అది చూడాలంటే ఖచ్చితంగా ఆకాశంలోకి ఎగరగల సామర్ధ్యం వుండాలి. లేకుంటే తను వేసిన చిత్రాన్ని తానే చూసుకోలేడు, ఆనందించలేడు, ఒకరికి చూపించుకోలేడు. అందుచేత మయులకి విమానయానం తప్పక తెలిసి వుండాలి.

అలాగే ఈ క్రింది ఆకృతి కూడా ఆకాశం నుంచే కనిపిస్తుంది. ఇది చూస్తే ఒక విమానాశ్రయంలాగా అనిపిస్తుంది.  ఒక పెద్ద రన్ వే నేలపైన నిర్మించినట్టుగా అనిపిస్తుంది. ఇలాంటి రన్ వే లు ఇంకా ఎన్నో వున్నాయి. అంతే కాదు. వీరి శిధిలాలలో విమానాలకు సంబంధించిన శిల్పాలుకూడా దొరికాయి.

 

 

 

 

Mayan Spaceship, Roswell, NM by Tammy Green (aka Zesmerelda).

Spaceship design from the wall carving on Maya’s Copan temple

 

 

పైన చిత్రాన్ని చూస్తే మనకు అందులో ఒక అంతరిక్ష నావికుడు కనిపిస్తాడు. ముఖం పైన ఒక మాస్కు వుంది. అలాగే ముక్కులోకి ఆక్సిజన్ ట్యూబు వుంది. ఒక కాలికింద ఒక పెడల్ వుంటే రెండవకాలికింద ఫుట్‌రెస్ట్ వుంది. ఒక చేతిలో జాయ్ స్టిక్కువుంటే మరొక చేతిలో ఒక బటనో లేక నాబో వుంది. ముఖం ముందు ఒక కంట్రోల్ పేనల్ వుంది. మనిషి కూర్చునే విధానం కూడా ఒక రధంలో కూర్చున్నట్లు నిటారుగా లేదు. పైకి చూస్తూ ముడుచుకుని ఉన్న ఒక రాకెట్‌లోని ఆస్ట్రోనాట్ లాగే వుంది. ఇది మన రాకెట్టునో స్పేస్ షిప్పులనో చూసి వేసిన చిత్రం కాదు. మనకు అంతరిక్ష యానం అంటే కూడా ఏమిటో తెలియని రోజులలో, ఒక కళాకారుని గుండె పొంగి, తాను చూసినది అందరికీ తెలియపరచాలి అన్న ఉద్వేగంతో,  చేసిన శిల్పం. ఈనాడు మనకు తెలిసిన రాకెట్‌ కాక్‌పిట్‌కీ, దీనికీ ఏమీ తేడా లేదు. ఇవన్నీ చూస్తుంటే వీరికి వైమానిక జ్ఞానం వుందనే తెలుస్తోంది.  

 

అలాగే వీరి కట్టడాలు చూస్తే అవి కూడా భూమికి చెందిన సాంకేతిక పరిజ్ఞానం కాదు; ఈ అసాధారణ నైపుణ్యాన్ని ఆ రోజుల్లోనే ఎలా సాధించారో మనకు అంతుపట్టడం లేదు!  వందలాది టన్నులు బరువు చేసే రాతి శిలలను ఆ రోజుల్లోనే తరలించారు, ఒకదాని పై ఒకటి ఎత్తి పెట్ట గలిగారు. గజిబిజి ఆకృతులగా కనిపించే కొండ రాళ్ళను చెక్కుకొని, ఆ రాళ్లను ఒక పజిల్‌లో ముక్కల్లా వింతగా పేర్చడం, వారి నిర్మాణ పరిజ్ఞానానికి ఒక చిన్న మచ్చు తునక. తలా ఒక ఆకారంలో వున్న ముక్కలలా అవి కనిపిస్తున్నా, అవి నిజానికి ఒక ప్రణాళికపైనే చేసినట్లుగా, ఒకదానిలో ఒకటి కూరుకుని ఇరుక్కుని సరిగ్గా సరిపోతాయి. అంతేకాదు ఆ రాళ్ళు అలా వివిధాకారాలలో వుండి ఒకదానినొకటి పట్టుకొని వుండటం వల్ల, సిమెంటు వంటి పదార్థం కూడా రాళ్ల మధ్య వాడవలసిన అవసరం రాలేదు. వందల  టన్నుల బరువుచేసే రాళ్లయినా వాటిని ఎత్తి పేర్చడం; పేర్చడమే కాదు వాటి మద్యలొలో బ్లేడుకూడా పట్టే సందు కూడా  లేకుండా అమర్చగలగటం అన్నది, ఈనాటికి కూడా ఒక సామాన్యమైన విషయం కానే కాదు! ఇన్నివేల సంవత్సరాలైనా చెక్కుచెదరలేదూ అంటే, ఆ నిర్మాణ కౌశలాన్ని మెచ్చుకోకతప్పదు.

 

 

మయులపైన నాసా కూడా ఎన్నో రెమోట్ సెన్సింగ్ సాటిలైట్లతో పరిశోధనలు జరుపుతోంది. " జర్నల్ ఆఫ్ ఆర్కిలాజికల్  సైన్సెస్ " వివరణ ప్రకారం మయులు 1400 సంవత్సరాల క్రితమే " హై ప్రెజర్‌లో " నీటిని పైపులలో పలంకె నగరానికి  సరఫరాను చేసే వారట. పలంకె నగరం క్రీ.శ.100నుంచీ వుందని, ఇందులో 1500 మందిరాలు, అందమైన హై ప్రెజర్ ఫౌంటెన్లు, 9 నీటి సరఫరా మార్గాలు, డైనేజీ కాలవలు, బ్రిడ్జీలు డాములు, స్విమ్మింగ్ పూల్సు వున్నాయట.

మయుల దృష్టిలో సృష్టి అనేక భువనాలలో జరిగిందట (హిందువుల నమ్మకం ప్రకారం కూడా సృష్టి 14 భువనాలలో జరిగింది). ముఖ్యంగా భూమిపైన, పాతాళంలోనూ, పైన స్వర్గంలోనూ సృష్టి జరిగిందట.  మనిషి చనిపోయిన తరువాత ఆత్మ పాతాళంలోని షీబలా అనే స్థానానికి చేరుతుంది. దీనినే నేమో మనం షంబాలా అని అంటాము (కల్కి భగవానుని జన్మస్థలము). ఇదే అతి భీకరమైన స్థానమట.

 

ఆశ్చర్యమేమిటంటే, వీరి పురాణాలలోనూ బయటి లోకాల నుంచీ వచ్చిన దేవతలున్నారు. వేయేళ్ళక్రితం, ఈ యుగంలో, ఈ లోకంలోకి వచ్చిన దేవుని పేరు క్విట్జక్వాటల్ (ఒక అనేకతలల మహాసర్పము). ఇతడినే " కుకల్కన " అని కూడా అని పిలుస్తారు. ఈ పేరుకు కూడా మళ్ళీ కలియుగవిష్ణు అవతారమైన " కల్కి" నామంతో సారూప్యం వుంటుంది.

 

 

Sumerian God-Enki

 

ఒకసారి ఈ దేవుడే ఒక తెల్లని మానవ రూపంలో దర్శనం కూడా ఇచ్చాడట. ఆ మానవ రూపాన్ని వర్ణించే చిత్రాలు ఎంకి అనే సుమెరీన్ దేవుని రూపంతో పోలి వుంటాయట. ఈ సుమేరియన్ ఎంకి దేవుని కథ మన వెంకటేశునికి వర్తించకపోయినా, వెంకి అన్న పదం మాత్రం సంస్కృతంలోనుంచి వచ్చింది కాదని మనకు తెలుసును. ఇది అచ్చతెలుగు పదమో లేక కన్నడ లోని వింగళం అన్నపదం నుంచో పుట్టివుండవచ్చు; లేకపోతే మనకు ఏదో తెలియని సుమేరియన్ కనెక్షన్ కూడా వుండి వుండవచ్చును. ఏది ఏమైనా ఎంకి అనే మాట వినగానే మనకు కలియుగ దైవమైన వెంకటేశుని నామం లాగా తోస్తుంది. అది ఒక కాకతాళీయమేలే అని కొట్టేయడానికి మన మనసు ఒప్పుకోదు.  ఎందుకంటే మనకు తెలుసు, వెంకటేశుడు కూడా బయట లోకం నుంచీ (వైకుంఠం) వచ్చినవాడే, అతడి అంశైన ఆదిశేషువుకు కూడా అనేక తలలే. మన కలియుగ దైవము పేరు కూడా ఎంకన్నే! అంతేకాదు, వీరి కాలండర్ ప్రకారం, కొత్త సృష్టి (అంటే యుగారంభం) క్రీ.పూ. 3114లో జరిగింది. హిందువుల లెక్కల ప్రకారం కూడా కలియుగం దాదాపు అప్పుడే మొదలయ్యింది.  కాని వీరి యుగం క్రీ.శ . 2012తో పూర్తి అవుతోంది. కానీ మన కలియుగంలో, ఇంకా మొదటిపాదం ఐనా  పూర్తి అవ్వడం లేదు.

 

మరి ఈ తేడా ఎక్కడ వచ్చిందో తెలియడంలేదు?!! ఈ విషయాలే చాలా మటుకు మనకు దొరకకుండా పోయాయి. దానికి కారణాలు అనేకం. 5వ శతాబ్ధంలో (కొంతమంది 9వ శతాబ్ధం అంటారు) వారి సామ్రాజ్యపతనం మెదలయ్యినప్పుడు అనేక మయులు వారి నగరాలను భవంతులనూ వదిలేసి ఎక్కడికో అదృశ్యమయ్యారని ఒక కధనం వుంది. వారి మత గ్రంధాలలో చెప్పినట్లు వారి పూర్వీకుల లాగా, వీరు కూడా అంతరిక్షంలోకి వెళ్ళిపోయారని నమ్మకాలూ వున్నాయట. అలాగే 16వ శతాబ్దిలో కొలంబస్ తెచ్చిన స్పానిష్ క్రిష్టియన్ మిషనరీలు మిగిలిన కొంతమందినీ (లేక వారి వల్ల మిగిలిన సంతానాన్ని) తుడిచిపెట్టి, ఈ మయుల మతాన్ని సమూలంగా రూపు మాపడానికై, వారి వేలాది గ్రంధాలనన్నిటినీ తగులపెట్టించారని  చరిత్రకారులు చెబుతున్నారు. ఇప్పుడు మయులము అని చెప్పుకునే మనిషి లేడు, భాషలేదు, మతమూ లేదు! కానీ మన అదృష్టవశాత్తు మూడు పుస్తకాలు ఎలాగో మిగిలి బట్టకట్టాయి. వాటితో పాటు కొన్ని శిలాశాసనాలు కూడా మిగిలి వున్నాయి. ఇప్పుడు మనం తెలుసుకున్నదంతా వాటి ఆధారంతోటే. అంటే తెలియనివి ఎన్నో, ఎన్నెన్నో!

 

ఈ మయుల సంస్కృతిని ఒక్క నిమిషం పక్కకి పెట్టి, మన శాస్త్రాలు ఏమి చెబుతున్నాయో చూద్దాం …… 

 

---   ---   ---

 

వాస్తుశాస్త్రంలో మయమతం, విశ్వకర్మ వాస్తుశాస్త్రం, మనుసార శిల్పశాస్త్రం, భోజరాజుని సమరంగణ సూత్రధార వంటి గ్రంధాలు ఉన్నా, వాస్తుశాస్త్రం అంటే మనకు ఆదిపురుషుడు విశ్వకర్మే. విశ్వబ్రాహ్మల నమ్మకం ప్రకారం బ్రహ్మ పుత్రుడే విశ్వకర్మ. విశ్వకర్మకు పెద్ద కుమారుని మనువు అని అంటారు. ఇతడే మనుధర్మశాస్త్రాన్ని వ్రాసాడని కూడా అంటారు. ఇతడి కాలంలోనే బ్రహ్మ సూక్ష్మశరీరాలని సృష్టించడం ఆపి, స్థూల శరీరాలను సృష్టించడం మొదలు పెట్టాడట. సూక్ష్మ శరీరాలు  ఊర్ద్వలోకాల కోసం ఐతే, స్థూల శరీరాలు భూలోకం కొరకు సృష్టించాడట. అప్పుడే శ్రీమన్నారాయణుడు వరాహావతారమెత్తి శ్వేతవరాహకల్పానికి నాంది పలికాడట.  అప్పుడే లోకకళ్యాణార్థం ఇంద్రుడి పదవిని కూడా సృష్టించి అధిష్టించాడట. ఆ ఇంద్రుని వంశంలోని వాడే భరతముని. అలా పుట్టింది భరత వంశం.  అతడితో మొదలయ్యింది భరత ఖండం.

 

మనువు వంశంలోని వాడే భృగువు. భృగువు బిడ్డలలో ఇద్దరు శుక్రులు వున్నారట. రెండవ శుక్రుడు పులోమాదేవి సంతానమై, ఇతడు బ్రహ్మ మనుమరాలు ఊర్జస్వతిని వివాహమాడి దేవయానికి జన్మనిచ్చాడు. దేవయాని యయాతిని వివాహమాడి యదు, దుర్వాసులకు జన్మ నిచ్చిందట. యదు నుంచి వచ్చిన వంశమే యదువంశం అయివుండొచ్చు (యదు వంశానంతరం కలియుగం వచ్చిందని మన అందరికీ తెలుసు). మొదటి శుక్రుడు దివ్యాదేవి వల్ల పుట్టిన వాడు. అతడు ఇంద్రుని కుమార్తె జయంతితో వివాహమాడి  కాబాలో స్థిరపడ్డాడట (కానీ ఈ అంశానికి ఇంటర్‌నెట్‌లోని ఒక వెబ్‌పేజి తప్ప అసలు పురాణాల ప్రమాణం దొరకలేదు). ఈ కాబా అన్నమాట ఈ నాటి ఇస్లాం వారి మక్కా లోని మందిరం వలే అనిపిస్తోంది. కానీ ఆ రెండూ ఒకటా కాదా అని మనం పరిశీలించ వలసి వుంది.  ఒకవేళ అదే నిజమైతే, భరత ఖండం వెలుపల ఈ రెండవ నాగరికత ఇలా ఏర్పడిందేమో.  ఇస్లాం మతం కంటే ముందు కాబా ఒక హైందవ మందిరంగా వుండేది అనే పలువాదనలు వినిపిస్తాయికాని, నిజాలు తెలియవు. కానీ ఒక వేళ ఇలాంటి లింకే ఏదో వుండేవుండి వుంటుంది అని అనుకుంటే, సుమేరియన్లకీ, మనకీ  వెంకి అనే ఒకే  పదం ఎలా వచ్చిందా అనటానికి కావలసినంత అధారాలు దొరుకుతాయి

 

KABAH      

పోనీ మన కాబాకీ సుమేరియాకీ ఏమీ సంబంధం లేదు అని అనుకుంటే మెక్సికోలో మయులు  నిర్మించిన కాబా అనే వూరు మరొకటి వుంది ( పైన చిత్రంలో). మయులకు శుక్రగ్రహం చాలా ముఖ్యమైన గ్రహం అని ఇందాకే చెప్పుకున్నాం కదా! అంటే మన కాబా ఏ కాబా అయినా కూడా, శుక్రాచార్యులతో బంధం మాత్రం ఖాయం అని తెలుస్తోంది.

 

Viswakarma

Viswakarma

 

                విశ్వకర్మకు రెండవ కుమారుడు మయుడు. ఇతడు మహా శిల్పి. పురాణాలలో దాదాపు అన్ని కట్టడాలూ అతడివే. ఇతడు అనేక లోకాలను ప్రాసాదాలను, రథాలను, విమానాలను, మండపాలను, ఆయుధాలనీ నిర్మించాడని ప్రతీతి. మయుని కట్టడాలలో ఇంద్రలోకం, వైకుంఠం, కైలాస కళ్యాణ మండపం, ఇంద్రసభ, వరుణసభ, కుబేరలోకం, సత్యలోకం (బ్రహ్మ వుండేది), మయసభ (మహాభారతంలోనిది) అతి ప్రసిద్ధి గాంచినవి. ఇతడి త్రిపుర, సౌభక, పుష్పక విమానాలు కూడా చాలా ప్రసిద్ధి చెందినవి. త్రిపురాలు రాక్షసులకోసం చేయబడ్డవి. అవి బంగారంతో చేయబడ్డ గాలిలో ఎగిరే మహా నగరాలుగా వర్ణించబడ్డాయి.  సురాసుర యుద్ధంలో శివుడు వాటిని ఖండిస్తే అవి ముక్కలుముక్కలుగా భూమిపై పడి త్రిపురాంతకం వెలిసిందని అంటారు.

మయుడు సౌభక విమానం శిశుపాలుని సోదరుడు సాల్వుని కొరకు ఉక్కుతో చేసాడు. అలాగే కుబేరుడికోసం బంగారంతో పుష్పక విమానం చేసాడు. రామాయణంలో వర్ణించినట్లుగా ఎంత మందికైనా సరిపొయేటట్లుగా పెరగగల సామర్ధ్యం దానికే  వుంటుంది. అలాగే  ఇంద్రుడికోసం మయుడు చేసిన విమానాన్ని ఇంద్రుడు వసురాజుకు బహుమతిగా ఇచ్చాడని వసుచరిత్ర చెబుతోంది. అలాగే మయుడు వజ్రాయుధాన్ని కూడా దధీచి వెన్నెముకతో చేసాడనే కథొకటి వుంది. సుదర్శన చక్రం, త్రిశూలం వంటి ఆయుధాలను కూడా మయుడే నిర్మించాడంటారు. 

 

మనమందరం N.T. రామారావుగారి ధుర్యోధన గర్వభంగం డైలాగులు అనేకమార్లు విన్నాం కాట్టి, మహాభారతంలో మయసభ గురించి మనందరికీ తెలుసు. మయుడు మహా శిల్పి అని, అతడు విడ్డూరాలు సృష్టించగలడనీ తెలుసు…  కానీ, మయుడి గురించి చాలా విషయాలు మనకు తెలియవు. పురాణాలలో ఇతడిని దైవశిల్పి అన్నారుగానీ మనదేశస్తుడనికానీ మన జాతివాడనికానీ ఎక్కడా అనలేదు. మనువు, మయులతో పాటూ, విశ్వకర్మకు త్వష్ట, శిల్పి, దైవజ్ఞ అని మరొక ముగ్గురు కుమారులున్నారు. వారిని కూడా మయునిగానే పురాణాలలో వ్యవహరించారనే వాదన వినిపిస్తుంది. అందుకేనేమో వారి గురుంచి పెద్దగా వివరాలు తెలియవు . అలాగే మరికొన్ని పుస్తకాలలో, పైన చెప్పబడిన కట్టడాలన్నీ విశ్వకర్మే స్వయంగా కట్టాడు అని చెప్పబడి వుంది. ఏది ఏమయినా  మయుడు విశ్వకర్మకుమారుడు అని మాత్రం ఖచ్చితంగా తెలుస్తోంది. అంటే అతడికి కనీసం ఈ వాస్తు జ్ఞానం తెలుసు అని తెలుస్తోంది. అలాగే భారతంలోని మయసభని మయుడే కట్టాడని నిర్వివాదంగా అన్ని పుస్తకాలు ముక్తకంఠంతో చెబుతున్నాయి. దానితో మయుడుపైన అతడి నిర్మాణ కౌశలం పైన చాలా  వరకు నిర్ధారత కనిపిస్తోంది. మయుడు స్వయంగా కట్టాడా, కట్టించాడా, లేక సాయపడ్డాడా అన్న విషయాలని పక్కన పెడితే, "అతడికి వాస్తు జ్ఞానం చాలా వుంది" అన్న మాట మాత్రం నిర్వివాదాంశం. 

 

File:Initiation of Maya Sabha.jpg

 

 ఏమైతేనేమీ మయునికి ఎన్నో అసాద్యమైన కట్టడాలను నిర్మించగలిగిన సామర్ధ్యంతో పాటు, విమాణాలనూ, అస్త్రశస్త్రాలనూ రూపొందించగల సాంకేతిక పరిజ్ఞానం కూడా వుందని, మన పురాణాలు గోషిస్తున్నాయి. కానీ ఎంత తండ్రీ, సోదరుల సాయం వుంటే మాత్రం  ఒక్కని వల్ల ఇన్ని నిర్మాణాలు సాధ్యపడతాయా నిజంగా  …. …. మయుడు అన్నది ఒక్క మనిషి పేరా? ……  లేక ఒక జాతి పేరా?

  

---   ---   ---

 

మరి మయుడు అని పురాణాలు చెబితే దాన్ని మయులు అని బహువచనంలోకి ఎలా అన్వయించుకోవడం? ఉదాహరణకు మనం బ్రిటిషువాడు భారతదేశంలోని రైలుమార్గాలన్నీ నిర్మిచాడంటాము. అలాగే ఇంకొక చోట ఈ బ్రిటీషువాడు వంతెన నిర్మించాడంటాము. మరొక చోట బ్రిటిషువాడు ఈ కాలేజీ కట్టాడంటాము. ఇది ఒక్క బ్రిటీషు వాడా లేక ఎందరో వేరే వేరే బ్రిటీషు వాళ్ళా? అలాగే దేశంలో ఏ మూలకెళ్ళినా కేరళావాడి టీ కొట్టు ఒకటి తప్పక ఉంటుందని నానుడి. ఇలా అనడంలో మన ఉద్దేశ్యం కేరళావాడు అన్నప్పుడల్లా ఎవరో కేరళావాడు అనే కానీ,  అన్నీ ఒకే వ్యక్తివి  అని మాత్రం కాదు. బ్రిటీషువాడు అన్నపుడల్లా ఎవరో బ్రిటిషు దేశస్తులు అనే కానీ ఒక వ్యక్తిని ప్రత్యేకంగా ప్రస్తావించడంలేదు. అలాగే మయుడు అన్న పదం కూడా ఒక దేశస్తులకో, జాతికో వర్తించవచ్చునేమో అన్నదే ఇక్కడి అభిప్రాయం. ఇలా  మయుడు ఒక వ్యక్తికాడు అది మయుని వంశస్తులు లేక మయులు అనే ఒక జాతి అని మనం నిర్ధారించుకోగలిగితే…  మయులన్నా, మయుడన్నా ఒకటే అని తేలిపోతుంది.  అలాగే మన మయుడికీ, మెక్సికో మయుడికీ చెందిన వర్ణనలను చూస్తే ఇద్దరూ ఒకరే నని తెలుస్తుంది.  కనీసం ఒకే  జాతికి చెందినవారని అనిపిస్తుంది.

 

దక్షిణ అమెరికాలో పురావస్తు శాస్త్రజ్ఞులు చెప్పినట్లుగా మయులకి వాస్తు జ్ఞానం, వైమానిక జ్ఞానం, ఖగోళ జ్ఞానం మనందరికన్నా ఎక్కువే వున్నాయని తెలుస్తొంది. అలాగే హిందూ పురాణాలలో కూడా, వీరికున్న ఆ జ్ఞానాలనే విశేషంగా ప్రస్తావించడం జరిగింది. మహాభారత కాలం నాటికి మయులు తప్పక వుండి వుంటారనడానికి అధారాలు శిధిలాలలో, త్రవ్వకాలలో కావలసినన్ని వున్నాయి. ఈ మయ అన్న శబ్ధం భారత, మెక్సికన్ దేశాలలోనే కాదు, టిబెట్ నాగరికతలోనూ (మాయ అని),  ఈజిప్టు నాగరికతలోనూ,  గ్రీకు నాగరికతలోనూ, అలాగే రోమనుల దేవత మయీ  లోనూ వినిపిస్తుంది. ఈ మయీ శబ్ధం నుంచే మనకు  ఇప్పుడు "మే" అనే నెలకూడా వచ్చింది.

 

ఐతే మయులు ఇండియా నుంచీ మెక్సికోకెళ్ళి సెటిల్ అయ్యారా? లేక అక్కడ నుంచి వచ్చి ఇండియాలో పనిచేసారా? భారత మెక్సికన్ల రెండు సాంప్రదాయాలలోనూ మయులు అంతరిక్షం నుంచీ వచ్చిన దేవతలని చెప్పడం జరిగింది. అదే నిజమైతే, వారు రెండు ప్రాంతాలకీ చెందని, అప్పుడప్పుడు పైనించీ భూమికి వచ్చివెళ్ళిన  నిజమైన దేవతలా   ప్రశ్నలనేకం!!!

 

 సైన్సులో ముందు ఒక హైపోతెసిస్ అంటూ లేకపోతే ప్రయోగమే లేదంటారు. కనుక నమ్మకం పూర్తిగా కుదరకపోయినా, ఈ మయ సిద్ధాంతాన్ని, అంటే  “మెక్సికోలోని మయుడు మన పురాణాలలోని మయుడు ఒకరే అన్న సిద్ధాంతాన్ని, కనీసం ఒక హైపోథెసిస్ గా తీసుకోవచ్చు. ఈ హైపోతెసిస్ ని మళ్ళీ మరిన్ని అధారాలతో సరిగ్గా నిర్ధారించుకోవలసిన అవసరం వుంటుంది…. …. ….  తెలిసింది ఆవగింజైతే, తెలుసుకోవాల్సింది అనంతం. ఆధారాలకై ఆన్వేషిద్దాం, పరిశోధిద్దాం, పరిశోధనలను ప్రొత్సాహిద్దాం!

 

మీ

రావు తల్లాప్రగడ

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech