దటీజ్ కాంగ్రెస్

 

 

మిగిలిన పార్టీలతో పోలిస్తే- కాంగ్రెస్ పార్టీ గ్రూప్ రాజకీయాలు విలక్షణమైనవి. అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో ఆ పార్టీ నాయకులు బహిర్గతం చేసే వ్యాఖ్యలు, విమర్శలు అన్నీ ఇన్నీ కావు. ఒకరకంగా చెప్పాలంటే – కాంగ్రెస్ అధికారంలో వుంటే- ప్రతిపక్షాల పని కొంత తగ్గినట్టే. పాలకపక్షంపై తాము ఎక్కుపెట్టాలనుకున్న ఆరోపణాస్త్రాలలో సగం కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి నాయకులే వాడేస్తూ వుండడంతో – ఒడ్డున కూర్చుని తమాషా చూడడానికే వాటి పాత్ర పరిమితం అవుతూ వుండడం కూడా కద్దు.

1978 నుంచి కాంగ్రెస్ రాజకీయాలను గమనించే వారికి – ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తికి అధిష్టానం ఆశీస్సులు అవసరం అన్న విషయం తేలిగ్గా బోధపడుతుంది. 1978 లో తొలిసారి, 1989 లో మరోసారి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా సొంత బలంపై  ఎంపిక  కాగలిగారు. ఆతరువాత ముఖ్య మంత్రులయిన వారందరూ పార్టీ అధిష్టానం నామినేట్ చేసినవారే.  పొతే, 2004 లో- ఒక్క రాజశేఖరరెడ్డికి మాత్రమె చెన్నారెడ్డి మాదిరిగా ముఖ్యమంత్రి కావడానికి అధిష్టానం అంగీకరించక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రవ్యాప్త పాదయాత్రతో పార్టీ శ్రేణులలో కదనోత్సాహాన్ని రగిలించి- చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఆనాటి పాలకపక్షం టీడీపీ పై కాంగ్రెస్ గెలుపు అసాధ్య అనుకుంటున్న తరుణంలో – అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిన  రాజశేఖరరెడ్డిని ముఖ్యమంత్రిగా కాకుండా నిలువరింప చేయడం అధిష్టానానికి కూడా అలవి కాకుండా పోయింది. తొమ్మిది సంవత్సరాలకు పైగా ప్రతిపక్షంలో కూర్చున్న కాంగ్రెస్ కు ప్రజలు తిరిగి అధికారం కట్టబెట్టి నాకూడా – ఆ పార్టీ అధిష్టానం అలవాటు చొప్పున అయిదేళ్ళ గడువులో కనీసం ముగ్గురో, నలుగురో ముఖ్యమంత్రులను మార్చకపోతుందా అన్న అంచనాలను తలకిందులు చేస్తూ – రాజశేఖరరెడ్డి అయిదేళ్ళ పదవీ కాలాన్ని ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తిచేయడమే కాకుండా, 2009 ఎన్నికలల్లో కూడా పార్టీని విజయపధాన నడిపించి వరసగా రెండో సారి కూడా ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో రికార్డు సృష్టించారు. అధిష్టానం మరోమారు కిమ్మనకుండా వూరుకోవడానికి ఆయన ఒంటిచేత్తో సాధించిపెట్టిన విజయమే కారణం. అయినా రాజశేఖరరెడ్డి ఏనాడు పార్టీ అధిష్టానాన్ని బహిరంగంగా ఎదిరించే పనికి పూనుకోలేదు. పైపెచ్చు తన పాలనా కాలంలో రూపకల్పన చేసి అమలులో పెట్టిన పధకాలు అన్నింటికీ రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీల పేర్లు పెట్టి ప్రతిపక్షాల  విమర్శలకు తావివ్వడానికి సిద్దపడ్డారు కానీ అధినేత్రి సోనియా గాంధీ పట్ల భక్తి ప్రపత్తులను దాచుకోవడానికి ఏమాత్రం సంకోచించలేదు. రాష్ట్ర కాంగ్రెస్ లో ధిక్కార స్వరాలూ ఒక పరిమితి దాటిపోకుండా చూసుకోవడానికీ, అసమ్మతి సెగలు అలవికాని రీతిలో పెరిగిపోకుండా జాగ్రత్త పడడానికీ – అధిష్టానంవద్ద ఆయన పెంచుకుంటూ వచ్చిన సత్సంబంధాలు ఉపయోగపడుతూవచ్చాయి. మరో రికార్డు అంటే సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన అపూర్వ అవకాశం తప్పిపోయే వీలు ఏమాత్రం లేదు అని అందరు   అనుకుంటున్న తరుణంలో హెలికాప్టర్ దుర్ఘటన రూపంలో మృత్యువు ఆయనని కబళించింది. యావత్ ఆంధ్ర ప్రదేశ్ ని కలచివేసిన మహానాయకుని మహాప్రస్తానం ముగిసి కొద్ది రోజులుకూడా గడవకుండానే అనేక గొడవలు, గడబిడలు రాష్ట్ర రాజకీయరంగాన్ని ముసురుకున్నాయి. కాంగ్రెస్ పార్టీలో అంతర్లీనంగా వుండిపోయిన అసమ్మతివాదులు గళం పెంచారు. స్వరం మార్చారు. అంతవరకూ కట్టుతెగకుండా సాగిన వేర్పాటు ఉద్యమం గట్లు తెంచుకుని బలాన్ని, బలగాన్ని పెంచుకుంది. ప్రకృతి  సయితం కన్నెర్ర చేసింది. కనీవినీ ఎరుగని రీతిలో వరదలు ముంచెత్తాయి. ఒకానొక విపత్కర పరిస్ఠితిలో ముఖ్యమంత్రిగా ప్రభుత్వ పగ్గాలను చేపట్టిన కాంగ్రెస్ కురు వృద్ధుడు కొణిజేటి రోశయ్య గారికి – రాజకీయ ప్రస్తాన దశలో లభించిన ఈ పదవి ముళ్ళ కిరీటం గా మారిందన్న ఊహాగానాలకు మీడియా ఊపిరులూదింది. స్వపక్షంలోని ప్రతిపక్షం పత్రికలకెక్కి రచ్చ సాగించింది. ముఖ్యమంత్రి మాట వినే మంత్రులే కరువయ్యారంటూ మీడియా మేధావులు రోశయ్యగారి పాలనను తూర్పారబట్టే పని ప్రారంభించారు. రాజశేఖరరెడ్డి గారి మరణానంతరం రాష్ట్రంలో ఒక పార్టీ ప్రభుత్వం మారి వేరే పార్టీ అధికారంలోకి వచ్చిందా అనే అనుమానం పొడసూపే రీతిలో వార్తలు వెల్లువెత్తాయి. నెల తిరిగితే ఘనం అని మెటికలు విరిచినవాళ్ళు కూడా లేకపోలేదు. ఇంటాబయటా ముసురుకున్న సమస్యల అమావాస్యల నడుమ రోశయ్యగారి ప్రభుత్వ పయనం సాగింది. రోజులు గడిచాయి. వారాలు తిరిగాయి. నెలలు దాటాయి. ఆరుమాసాల పదవీ కాలాన్ని కూడా పూర్తిచేసుకుని రోశయ్య గారు ముందుకు సాగుతున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఈ సందర్భంలో ఆయనకు అక్కరకు వచ్చింది. బలాలు బలహీనతలు క్షుణ్ణంగా ఆకలింపు చేసుకున్న అనుభవశాలి కనుకనే నిదానంగా పరిస్తితులను బట్టి ప్రవర్తిస్తూ క్రమంగా పట్టుసాధించుకునే క్రమంలో అడుగులు వేస్తున్నారు. అయాచితంగా లభించిన పదవిపై ఆపేక్ష పెంచుకోకుండా- అప్పగించిన బాధ్యతను మాత్రమె నిర్వర్తిస్తూ అదనపు బరువులు తలకెత్తుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రోశయ్యగారు కూడా కొన్ని రికార్డులు తన ఖాతాలో జమచేసుకున్నారు. పదవి చేపట్టిన వెంటనే విమానం ఎక్కి డిల్లీ వెళ్ళే సంప్రదాయానికి ఆయన స్వస్తి చెప్పారు. వెళ్ళిన సందర్భాలలో కూడా అదిష్టాన వర్గం అప్పాయింట్ మెంట్ కోసం అర్రులు చాచాల్సిన అగత్యం ఆయనకు పట్టలేదు. కొన్ని నామినేటేడ్ పదవులను- చిన్నవే కావచ్చు- డిల్లీ వయిపు  చూడకుండానే తనవారికి ఇవ్వగలిగారు. ప్రెస్ అకాడమి చైర్మన్ వంటి కాబినెట్ హోదా కలిగిన పదవి విషయంలో ఎవ్వరినీ సంప్రదించకుండా నిర్ణయించిన వయినం- జర్నలిస్టు సంఘాల సీనియర్ నాయకులను సయితం నివ్వెరపరచింది. మొదట్లో మొరటుగా వ్యవహరించినవారు, విమర్శించడానికి ఏమాత్రం వెనుదీయనివారు – ఇప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని మాట్లాడాల్సిన పరిస్తితి ఏర్పడింది. మాట వింటారా లేదా అని హుంకరించకుండా- మాట వినని వాళ్ళను గాటికి తెచ్చుకున్న తీరును గమనించిన మీడియా బలం పుంజుకుంటున్న రోశయ్యగా అభివర్ణించే స్థితికి చేరుకున్నారంటే- ఈ ఆరు మాసాల కాలంలో ఆయన అనుసరిస్తూ వచ్చిన నిదానమే ప్రధాన మన్న విధానమే అక్కరకు వచ్చింది. వీటన్నిటికీ మించి, ఏ వర్గము లేని రోశయ్యగారికి అధిష్టాన వర్గమే అండదండగా నిలవడం ఆయనకు బాగా కలిసివచ్చింది. రాజకీయాల్లో ఏదో ఒక మార్పు కోరుకుంటున్న వారి అయాచిత మద్దతు కూడా రోశయ్యగారికి అంది వచ్చింది. అనుభవంతో కూడిన వయస్సు, పెద్దమనిషి తరహాగా కానవచ్చే ఆహార్యం – విమర్శకుల నోళ్లను అదుపులో వుంచుతున్నాయి.

అలాగని- అంతా బాగుందని అనుకోనక్కరలేదు. కాంగ్రెస్ వంటి పార్టీలో ఏదయినా సంభవమే. దీనికి రోశయ్యగారే నిలువెత్తు ఉదాహరణ. మంత్రి పదవి దక్కించుకోవాలన్నా హస్తిన ప్రదక్షినలు’ తప్పనిసరి అని పేరుపడ్డ పార్టీలో-ఎల్లాంటి ప్రయత్నం లేకుండానే ఏకంగా ముఖ్యమంత్రి కావడం అన్నది ఊహాతీతమయిన విషయం. అదిష్టానం ఆశీస్సులు వున్నంతకాలం అంతా సజావుగానే సాగిపోగలదన్నది కాంగ్రెస్ సంస్కృతి తెలిసిన వారికందరికీ తెలిసిన సత్యం. అపార అనుభవం కలిగిన రోశయ్య గారికి ఈ విషయం తెలియదనుకోవడం అజ్ఞానమే  అవుతుంది. అందుకే ఆయన మాటల్లో అప్పుడప్పుడూ ధ్వనించే ‘తాత్కాలిక’ పద ప్రయోగాలు మరో రకంగా ఆయనకు ‘కొత్త’బలాన్ని సమకూరుస్తున్నాయి. తప్పుకోను అనే వారితో పేచీ కానీ – తప్పుకోవడానికి ఎప్పుడయినా సిద్దం అనే వారితో ఎవరికయినా ఏ ఇబ్బంది వుంటుంది. అదీ కాంగ్రెస్ లాంటి పార్టీలో. అందుకే అంటారు- ‘దటీజ్ కాంగ్రెస్’. 

 
     

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

   
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech