విప్రనారాయణ చరిత్ర

(తొందరడిప్పొడి ఆళ్వారు)

 

 - విద్వాన్ తిరుమల పెద్దింటి నరసింహాచార్యులు

 

 

దక్షిణ దేశమున వివిధ కులములందు, వివిధ నదీ తటములందు జన్మించి, విష్ణుభక్తిని తాము సంపూర్ణంగా అనుభవించి, ఇతరులచే అనుభవింజేసిన వారు ఆళ్వారు, ’ఆళ్వారు’ అనగా భగవంతుని యందు సంపూర్ణ విశ్వాసముగల వారు లేదా భక్తిలోనిండా మునిగినవారు అని అర్ధం. వీరు తొలుత పదిమంది. కాలాంతరమున మరి యిద్దరు చేరి పన్నిద్దరు ఆళ్వారులుగా ప్రసిధ్ధి నొందిరి. వీరు నాలుగు వేలపాశురములను(పాటలు) వ్రాసి వాసిగాంచిరి. ఈ పాశురములకే "నాలాయిరదివ్యప్రబంధము" అని పేరు. తమిళమునందు ఇయ్యది పంచమవేదముగ ప్రముఖులచే కీర్తింపబడినది.ఈ ప్రబంధము "తిరువాయ్ మోళి" (జి)పేరియతిరుమొజి,ముదలాయిరం, ఇయర్పా ఇత్యాది నామములతో వ్యవహరించబడుతూ,నేటికినీ విష్ణ్వాలయములందు ’సేవాకాల’రూపమున పారాయణ చేయబడుచున్నది.

విశిష్టాద్వైత మతస్థాపకాచార్యులైన భగవద్రామానుజులకు పూర్వమే, ఆళ్వారులు వైష్ణవమత ప్రచారము గావించి వినుతికెక్కిరి. వీరి తమళ,సంస్కృత నామములు ఇట్లున్నవి.
తమిళనామము - సంస్కృతనామము
1.పూదత్తాళ్వార్ - భూతయోగి
2.పోయిగై ఆళ్వార్ - సారయోగి
3.పేయాళ్వార్ - మహాయోగి
4.తిరువజిశైయాళ్వార్- భక్తిసారయోగి
5.నమ్మాళ్వార్ - శఠగోపయతి
6.మధురకవియాళ్వార్- మధురకవి
7.కులశేఖరాళ్వార్ - కులశేఖరులు
8. పేరియాళ్వార్ - విష్ణుచిత్తులు
9.ఆండాళ్ - గోదాదేవి
10.తొండరడిప్పొడియాళ్వార్-భక్తాంఘ్రిరేణువు
11.తిరుమంగైయాళ్వార్-పరకాళయతి
12.తిరుప్పాణాళ్వార్-యోగివాహయతి
ప్రహ్లాద,నారద, పరాశర,పుండరీకాది భాగవతభక్తులవలె
"భూతం సరస్య మహదాహ్వయ భట్టనాద
శ్రీభక్తి సారకుల శేఖర యోగివాహాన్
భక్తాంఘ్రిరేణుపరకాలతీంద్రమిశ్రాన్
శ్రీ మత్పరాంకుశ మునింప్రణతోస్మినిత్యం"
అని అనుదినము వీరిని స్మరించిన చాలును దేవదేవుని కరుణా కటాక్షప్రాప్తి కలుగును.
వీరిలో భగవంతుని ’వైజయంతీమాల’ అంశతో జన్మించినవారు "తొండరడిప్పొడియాళ్వార్" నేను భక్తుల పాద ధూళిని అనుటచే ఈ నామముతో ప్రసిద్ధిచెందెను.(తొండర్=భక్తుల. అడి=పాదం. పొడి=ధూళి అని అర్ధం.)తెలుగువారికి ఈ ఆళ్వార్ ’విప్రనారాయణుడి’గా పరిచితుడు.ప్రభోదకీగీతములుగా భగవంతునికి సుప్రభాతరూపముగా పాశురములను "తిరుపళ్లి యేళుచ్చి" అనునామంతో రచించి చరితార్ధుడయ్యెను.
కావేరి తీరమందలి ’మందంగుడి’ అను గ్రామమున జన్మించి, చిన్నతనమునుండి విష్ణుభక్తి కలవాడై ఆ స్వామికి పుష్పమాలా కైంకర్యము చేయుచు, వనసంరక్షణచే(కాలముగడుపుచు) బ్రహ్మచర్య వ్రతముతో కాలము గడిపెడి వాడు.భగవానుని లీలావిలాసములు విచిత్రములుగదా! తన భక్తుని అన్ని విధముల పరీక్షించి సానబెట్టిన వజ్రమువలె చేయదలచి ఒక వినోదమును స్వామి కల్పించెను.

అపరరతి దేవియను పేరుపొందిన దేవదేవి, అను ఒక వేశ్య స్త్రీ, మధురరాజు చోళజవిభుని ఆస్థానమున నృత్య గానాధులచే ఆరాజును మెప్పించి, గొప్ప కానుకలను పొంది, తన ఊరికి మరళిపోవుచు, అలసట తీర్చుకొనుటకై విప్రనారాయణుని వనములో ప్రవేశించి ఆ బ్రహ్మచారికి తన అక్క మధురవాణి తో సహ నమస్కరించి ముందునిలిచెను.కాని నిరంతర భగవన్నామస్మరణతోనే కాలము గడుపుచుండెడి ఆవటువు, అపూర్వ సౌందర్యవతి అయిన దేవదేవి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆమె అది అవమానముగా భావించినది. తన అక్క వద్దని చెప్పినను ఆ ఘోటక బ్రహ్మచారిని తన దాసునిగా చేసికొందునని పందెము వేసి నాటికి వెళ్ళిపోయెను.

మరునాడు దాసరసాని వేషములో వచ్చి న తము అనాధనని,ఆశ్రయము కల్పించమని వేడుకొనెను.అప్పుడు తొందరడిప్పొడియాళ్వారు తన వద్దనే ఉండమని అనుజ్ఞ ఇచ్చెను. ఆనాటి నుండి తన శృంగారాది చేస్టలతో ఆ బ్రహ్మచారిని వశపరచుకొని, తన గృహమునకు(వేశ్యవాటికకు) తీసుకొనిపోయి తనకి దాసునిగా చేసుకొని కృతకృత్యురాలయ్యెను ఆ దేవదేవి.
ఇలా కొన్ని నాళ్లు గడిచిన తరువాత ఆ బ్రహ్మచారి వద్ద ధనము లేదని తెలుసుకొన్న ఆమె తల్లి తన ఇంటి నుండి అతనిని గెంటివేసెను.

ఇచ్చటనే భక్తుని భక్తిత్వము పరాకాష్ట చేరుటను మనం దర్శించగలము.
విప్రనారాయణుడు దేవదేవి విరహమును ఓర్చుకోలేక,’ధనము చేకూర్చుము’అని భగవంతుని ప్రార్ధించెను. భక్తవత్సలుడైన ఆ దేవుడు కపట బ్రహ్మచారి వేషముతో తన గుడి లో కల ఒక బంగారుపాత్ర ను తీసుకుని వేశ్యమాత యింటికి వచ్చి , తాను విప్రనారాయణుని శిశ్యుడనని, తన గురువుగారు ఈ పాత్రని దేవదేవికి కానుకగా ఇవ్వమని చెప్పినారని పలికి, ఆ గిన్నెను ఆమెకియిచ్చి వెడలిపోయెను వెంటనే ఆవిప్రుని తమయింటికి ఆహ్వానించి, గౌరవ మర్యాదలు చూపసాగిరాజారవనితలు. మరునాడు దేవాలయంలో బంగారుపాత్ర కనబడక పోవుటచే, పూజారి అయిన జీయర్ ఆ గ్రామాధికారికి విషయము తెలియచేసెను. భటులను పంపి ఊరిలో అందరి యిల్లు వెతికించగా దేవదేవి యింటిలో ఆ పాత్ర కనపడగా, వేశ్యమాతను విచారించి విప్రనారాయణుడే చోరుడని తలంచి న్యాయస్థానమునకు, దేవదేవి తో సహా తోడ్కొనిరాగా, అన్ని విధముల విచారణ జరిపిన న్యాయాధికారి ఆ విప్రుణికి గ్రామ బహిష్కారణ శిక్ష వేసెను. తాను నిరపరాధిననియు, తుచ్చమైన కోరికకై భగవంతునికి అపచారం చేయుట వలన యిట్టి శిక్ష లభించినదనియు తలంచి శ్రీమన్నారాయణుని మనసారా ప్రార్థించెను విప్రనారాయణుడు.
భక్తుని మొరవినిన దేవదేవుడు ఆ సభలోనే ప్రత్యక్షమై, ’విప్రనారాయణుడు పరమ భాగవతోత్తముడనియు, దేవదేవి అప్సర స్త్రీ అనియు తెల్పి, లీలావినోదము కొరకై తానే ఈ విధముగా చేసితిననియు,ఆ యిద్దరు నిరపరాధులని, చెప్పి " విప్రుని శరీరములో దివ్యకాంతిని ప్రవేశింపచేసి అదృశ్యమైపోయెను.

ఆశ్చర్యకరము, అతి పవిత్రము అయిన ఆ దృశ్యమును చూసిన సభికులు, జీయరు విప్రనారాయణునికి బ్రహ్మరథము పట్టి, పురవీధులలో ఊరేగించి, పూజించిరి. అపుడు ఆ వైష్ణవోత్తముడు శ్రీ రంగనాథుని దేవాలయము చేరి సుప్రభాతగీతికలగు "తిరుపళ్ళి యెళుచ్చి" యను, పేర ’పాశరముల’ను పాడి స్వామికి సమర్పించెను. భగవానుడు ప్రసన్నుడై ’విష్ణుసాయుజ్యమును పొందెదవనియు’, ’తొందరడిప్పొడి ఆళ్వారు’ గా కీర్తిగాంతువనియు వరమొసంగెను.

ఆళ్వారులు పరమభక్తులైననూ, పరమ రక్తులైననూ, సంతోష దుఃఖములు వారిని మర్చవు. వారు స్థిరచిత్తులు. వారికై భగవానుడే సుఖదుఃఖములనుభవించును. ఆళ్వారుల చరిత్ర మనకు భగవంతుని కన్నా భక్తులే గొప్పవారని తెల్పును. ఆళ్వారు ’భృత్య స్యభృత్య పరిచారక భృత్యులు’ గా భావించి తరించువారనియు. అట్టి ఆళ్వారులలో ’తొందరడిప్పొడి ఆళ్వారు’ "ఆరాథ్యుడు ప్రాతఃస్మరనీయుడు" అనియు చెప్పవచ్చును.
 

 
     

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు

ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech