ఇలా చేస్తే సరి!

 

  మేడం సోనియాగాంధీగారికో సూచన!
ముందుగా మీకు బోలెడు ధన్యవాదాలు. మాకు మంచి ముఖ్యమంత్రినిచ్చారు. మాంఛి గవర్నరునిచ్చారు. మీ దయవల్ల రాష్ట్రంలో పరిపాలన ఏది ఎట్లా జరగాలో అట్లాగే సాగిపోతున్నది. మీరు కనుక ఇంకొక్క మార్పు చేశారంటే ప్రభుత్వరథం పంచకల్యాణి గుర్రంలా ఇంకా బ్రహ్మాండంగా దూసుకుపోతుంది.
ప్రస్తుతం మా ముఖ్యమంత్రిగారు పనిచెయ్యలేక బాధపడుతుంటే గవర్నరుగారు సరిపడా పనిలేక అవస్థపడుతున్నారు. గవర్నరు కేవలం ఉత్సవ విగ్రహమని, రాష్ట్రంలో వాస్తవ అధికారం యావత్తూ ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికి నాయకుడైన ముఖ్యమంత్రి, ఆయన మంత్రిమండలి చేతుల్లోనే ఉంటుందని చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం. కేంద్రానికి గిట్టని పార్టీకి చెందిన ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని సతాయించే స్పెషల్ డ్యూటీ పడ్డప్పుడో, రాష్ట్రంలో బలాబలాలు మారి రాజకీయ అస్థిరత్వం నెలకొన్నప్పుడో, మరో అత్యవసర సందర్భంలోనో తప్ప సాధారణంగా గవర్నరు చెయ్యవలసింది, చెయ్యగలిగింది ఏమీ ఉండదని కూడా ఎక్కడో విన్నాం. రాజ్యాంగ బద్ధంగా పరిపాలన సాగేట్టు పై ఎత్తున కనిపెట్టి ఉండటమే తప్ప రోజువారి పాలనా వ్యవహారాల్లో, అధికారుల విధుల్లో గవర్నరు కలగజేసుకోవలసింది, పర్యవేక్షించాల్సింది ఏమీ లేదనే మాబోటివాళ్లం అనుకుంటున్నాం.
కాని ఇప్పుడు ఈ రాష్ట్రంలో చిత్రమైన పరిస్థితి. కాడి మోయాల్సిన ముఖ్యమంత్రేమో వృద్ధాప్యం వల్లో... శరీరం సహకరించకో... ఎప్పుడూ రెండోస్థానంలో ఒకరి కింద పనిచేయటమే తప్ప నెంబర్ వన్‌గా పెత్తనం చేయటం అలవాటులేకో, చేతకాకో తెలియదుగాని పరిపాలనను పట్టించుకోవడం మానేశారు. అన్నీ అధిష్ఠానమే చూసుకుంటుందని, ప్రతిదీ ఢిల్లీలోనే నిర్ణయమవుతుందని చెప్పి, భారమంతా తమరి మీద వదిలేశారు. తనను తాను ‘దారినపోయే దానయ్య’ అని కీర్తించుకోవటమే తనకు గౌరవమనుకుంటున్నారు.
ఇక సాధారణంగా లాంఛనప్రాయ కార్యక్రమాలకు హాజరవుతూ, విజ్ఞాపన పత్రాలందుకుంటూ, అడపాదడపా కేంద్రానికి రిపోర్టులు పంపుతూ ఆవలిస్తూ కునికిపాట్లు పడతారనుకునే గవర్నరుగారేమో చురుకుపాలు ఎక్కువై అందర్నీ చురుక్కుమనిపిస్తున్నారు. రాజ్‌భవన్‌లో అడుగుపెట్టీ పెట్టగానే డి.జి.పి.నీ, హోంమంత్రినీ, పోలీసు ఉన్నతాధికారుల్నీ కేకేసి శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించినప్పుడే, ప్రభుత్వానికి నాయకుడైన ముఖ్యమంత్రి కూడా రాముడు మంచి బాలుడన్నట్టు అక్కడికి బుద్ధిగా వెళ్లి ఒదిగి కూర్చున్నప్పుడే జమానామారిందని అందరికీ అర్థమైంది. వైస్‌చాన్సలర్లకు క్లాసు తీసుకొని గోడకుర్చీ వేయించటం మొదలుకుని అబ్కారీ వంటి శాఖలపై అధికారులను కేకేసి సమీక్షా సమావేశం జరిపి ఎక్సయిజ్ పాలిసీ ఉండాలో బోధించటం వరకూ... ఆదిలాబాద్ వెళ్లి ప్రజల సమస్యలు ఆరా తియ్యటం నుంచి... విజయవాడ వెళ్లి పోలీసురేంజి ఆఫీసర్లను పిలిపించి డ్యూటీ ఎలా చేయాలో నేర్పటం వరకూ నరసింహంగారి వేగంచూస్తే ఓ సంగతి స్పష్టం. ఈయన సామాన్యుడు కాదు. పూర్వపు గవర్నర్లలా జోగినులకు పెళ్లిళ్లూ శోభనాలూ చేయిస్తూనో... చక్కనమ్మలతో చెమ్మచెక్కలతోనో... పై స్థాయిలో పైరవీలతోనో, లాబీయింగులతోనో పుద్దుపుచ్చే రకం కాదు! పక్కా పని రాక్షసుడు.
కాబట్టి మేడంగారికి మనవి చేసేదేమిటంటే దయచేసి చిన్న ఎడ్జస్టుమెంటు చెయ్యండి. నరసింహంగారిని ముఖ్యమంత్రిని చెయ్యండి. రోశయ్య అలియాస్ దానయ్యగారినేమో రాజ్‌భవన్‌కు మార్చండి. దానివల్ల రోశయ్యగారికి ఒళ్లు ఎక్కువ తూలకుండా విశ్రాంతి దొరుకుతుంది. అట్టే శ్రమ లేకుండా రాజ్‌భవన్‌లో మాంచి కాలక్షేపమూ అవుతుంది. నరసింహంగారికేమో చేతినిండా, దురదతీరా పని, పవరు దొరికినట్టూ ఉంటుంది.
77 ఏళ్ల రోశయ్యతో పోలిస్తే 64 ఏళ్ల నరసింహన్‌గారు యువకుడు. కేంద్రంలో ఇంటలిజెన్స్ బ్యూరో డైరెక్టరు గిరీ చలాయించి ఇక్కడ వాళ్ల గోత్రాలు, గుట్టుమట్లు ఎరిగినవాడు కాబట్టి అన్ని వ్యవహారాలనూ ఎటునుంచైనా నరుక్కురాగలడు. నిజంగా పవర్సేమీ లేకున్నా ఆదిలాబాద్‌లో కూచుని అర్ధగంటలో జీవో చేయించగలిగినవాడు ఇక పగ్గాలే చేతికిస్తే రాష్ట్రంలో ఎక్కడెక్కడి సమస్యలనూ, ఎక్కడెక్కడి జనాల కష్టాలనూ అర నిమిషంలోనే పారదోలగలడు. మీ పార్టీ ఎమ్మెల్యేలు బుద్ధిమంతులు. మీరు ఎవరిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోమంటే వారిని కిమ్మనక నెత్తికెత్తుకోవటానికి వాళ్లు ఎవర్‌రెడీ. కన్నడ జైరాం రమేష్‌ను ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించగా లేనిది ఆంధ్రాకాడరు ఐ.పి.ఎస్. వాడిగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో లోగడ పనిచేసిన అరవ నరసింహన్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఎందుకు చెయ్యకూడదు? తమరు తలచుకుంటే కాదనేవారెవరు?
రోశయ్యగారుండే అమీర్‌పేట రాజ్‌భవన్‌కు దగ్గర. సెక్రటేరియటూ, సి.ఎం. కాంపు ఆఫీసూ ఇంకా దగ్గర. పెద్దాయనను రాజ్‌భవన్‌కూ, చిన్నాయనను ముఖ్యమంత్రి కాంపు ఆఫీసుకూ బదలాయించడానికి రవాణా ఖర్చులూ పెద్దగా కావు. ఏ రాష్ట్రం వాడిని ఆ రాష్ట్రానికి గవర్నరుగా పంపకూడదన్న సంప్రదాయం ఉన్నమాట నిజమే. సంప్రదాయాలన్నవి మనం పెట్టుకున్నవే. మనకు కావలసినప్పుడు వాటిని పక్కకునెట్టవచ్చు. ఈ సంగతి తమరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ వయసులో రోశయ్యగారిని ఇంకో రాష్ట్రానికి పంపితే ఆయనకూ, రోజూ ఆయన చుట్టూ చేరి కబుర్లాడే వాళ్లకీ ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇంటికీ, తెనాలికీ దగ్గరగా ఆయనని ఇక్కడ ఉంచటమే బెటరు.
అన్నట్టు ఇంకో లాభం. మనలో మాట. ఈ ఏర్పాటువల్ల రాష్ట్రంలో వారసత్వం తలనెప్పి పర్మెనెంటుగా పోతుంది. ముఖ్యమంత్రి గద్దెమీద గంపెడాశ పెట్టుకుని రాష్టమ్రంతటా తెగతిరుగుతున్న ఓ కుర్రాడికి మీరు కాస్త ‘ఓదార్పు’ ఇస్తే సరిపోతుంది.
-సాక్షి

 
 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech