చదరంగంలో చచ్చేది (గతమాసం తరువాయి)

- యండమూరి వీరేంద్రనాథ్

 

  ఆ మరుసటిరోజు త్రివేది ఆజ్ఞ ప్రకారం కుష్టువాడు గేటుదగ్గరే ఆపు చేయ్యబడ్డాడు.
బ్యాంకు పని ప్రారంభమయి పది నిముషాలయింది. డబ్బు వెయ్యటానికి వచ్చేవాళ్లు, తీసుకోవటానికి వచ్చే వాళ్ళతో బ్యాంకు రష్ గా ఉంది.
ఆ టైమ్ లో కుష్టువాడు తన ప్రదేశం నుంచి లేచి బ్యాంక్ లోకి వచ్చేడు. మామూలుగానే అతడు గేటుదగ్గిర ఆపుచెయ్యబడ్డాడు.
"నేను లోపలికెల్లాల" అన్నాడు వాడు.
"కుదర్దు" అన్నాడు సెంట్రీ.
"ఏం? ఎందుక్కుదర్దు".
దూరంగా క్యాష్ కౌంటర్ దగ్గిర నిలబడ్ద చతుర్వేది ఇదేమీ తనకు పట్టనట్టూ, లెడ్జర్ చెక్ చేస్తూ, ఓ చెవి ఇటు పారేసి వుంచేడు. నిజానికి ఆ క్రితం రోజు సాయంత్రమే ఆ కుష్టువాడికి యేం మాట్లాడాలో చెప్పి వుంచాడు అతడు.
"ఇక్కడ డబ్బుల్దీసుకోరా........."
"తీస్కోర్ తీస్కోర్. జావ్".
కుష్టువాడు జోలిలోంచి తెల్లకాగితం తీసి "గట్టని రాసివ్వు" అన్నాడు.
సెంట్రీ తెల్లబోయాడు. ఈ పరిణామాన్ని అతడు వూహించలేదు. ఏం చెయ్యాలో తోచలేదు. రెండో సెంట్రీని చప్పున త్రివేది దగ్గరకు పంపించేడు
చతుర్వేది పెదవుల మీద సన్నటి చిరునవ్వు వెలిసింది. కనుకొలుకుల్లోంచి ఎడమపక్కగా చూసేడు. భుజానికి సంచి వేలాడేసుకొని, చేతిలో వున్ననోట్ బుక్ మీద పెన్సిల్ తో వ్రాసుకుంటూ పోతున్నాడు ఓ కుర్రవాడు. చతుర్వేది అతడిని చూసి మరింత సంతృప్తిగా నవ్వేడు.
ఈ లోపులో రెండో సెంట్రీ మూడో అంతస్థులో వున్న త్రివేది దగ్గిరకు వెళ్ళి కుష్టువాడు ఇలా రాసిమ్మంటున్నాడనీ, ఏం చెయ్యాలో చెప్పమనీ అడిగాడు.
"అసలు వాడితో మాటలేంట్రా-మెడపట్టుకొనిగెంటక" అని విసుక్కున్నాడు త్రివేది ఫైళ్ల మధ్యనుంచి తలెత్తి.
కర్తవ్య నిర్వహణాపరుడైన సెంట్రీ కిందికొచ్చి అలానే చేసేడు. కుష్టువాడు మెట్లమీద జారిపడ్డాడు. అంతలో హాలులో ఒక మూల విజిటర్స్ కోసం బల్లమీద కూర్చొన్న వ్యక్తిలేచి బిగ్గరగా అరిచేడు.
"ఐ ప్రొటెస్టు దిస్ ఇన్ ఎ కోర్ట్ ఆఫ్ లా. ఈ అమానుష చర్యని నేను కోర్టులో సవాలు చేస్తాను. డబ్బు డిపాజిట్ చెయ్యటానికి వచ్చిన ఓ వ్యక్తిని గెంటెయ్యటానికి బ్యాంక్ కి వున్న అధికారం ఏమిటి?"
హాలులో సూది పడితే వినిపించేటంత నిశ్శబ్దం అలుముకుంది. అప్పటి వరకూ నవ్వుతూ చూస్తున్న చతుర్వేది కూడా ఈ ఆకస్మిక పరిణామానికి విస్తుపోయేడు. పెదాలమీద నవ్వు మాయమైంది. ఈ మలుపుని అతడు వూహించలేదు. ప్రాక్టీసు లేని వో లాయరు ఈ పరిమాణాన్ని క్రితం రోజు సాయంత్రమే వూహించేడనీ అందుకే ఈ రోజు ప్రొద్దున్నే వచ్చి కూర్చొన్నాడనీ అతడికి తెలీదు. చాలా చిన్న గొడవతో ఇది తేలిపోతుందనీ, తనపై అధికారి త్రివేది తెలివి తక్కువతనం పై అధికారులకి తెలుస్తుందనీ భావించాడు. అందుకే తనకి తెలిసిన ఓ దినపత్రిక కరస్పాండెంటుని పిలిచి తమాషా చెయ్యాలనుకొన్నాడు. పేపర్ చివరి పేజీలో చిన్న అక్షరాల్తో ఈ వార్త పడితే, అంతటితో పని సరి అనుకొన్నాడు.

కానీ మొదటి పేజీలోనే పెద్ద అక్షరాల్తో పడ్తుందనుకోలేదు.
’తాజా పత్రిక’ అన్నది తెలుగుదేశంలో అధిక ప్రచారంలో ఉన్న దినపత్రిక. ఎల్లుండి వార్తల్ని కూడా ముందుగానే ప్రచురించటం దాని ప్రత్యేకత. అందులోనూ అందరికీ ఆసక్తిదాయకమైన విషయాలని మరీ ప్రముఖంగా ప్రచురిస్తుంది. అది అంత పెద్ద వార్త కాకపోయినా! అందుకే ఈ వార్తని మొదటి పేజీ మధ్యలో బాక్సు కట్టి ప్రచురించింది ఇలా...


బ్యాంకులోకి కుష్టువాడు ప్రవేశించటానికి అనర్హుడా? లాయర్ సవాల్!


జనవరి14:నిన్న ప్రొద్దున్న బ్యాంక్ ఆఫ్ ఉటోపియా కాష్ కౌంటర్ లో ఒక చిత్రమైన సంఘటన జరిగింది. ఒక కుష్టువాడు తన జీవితపు పొదుపు మొత్తాన్ని పొదుపు చేయటంకోసం రాగా,అతడిని సెంట్రీలు ఆపుచేసేరు. ఇది చూసిన లాయరొకరు ఈ అమానుష చర్యని గర్హించేరు. ఆ తరువాత లాయర్ పంతులు పత్రికా ప్రతినిధుల్తో మాట్లాడుతూ తను ఈ విషయాన్ని కోర్టు ద్వారానే తేల్చుకోదల్చానని అన్నారు.

ఈ వార్త పడిన మరుక్షణం తాజా పత్రికాఫీసుకి వందలమీద వుత్తరాలు రాసాగినయ్. కొత్తపల్లినుంచీ కోటా రామలింగం, సరోజ, పద్మా ఇంకా వారి మిత్రులూ, గడ్డి అన్నారం నుంచి యాదగిరి వగైరాలే కాక కొత్తగా ప్రాక్టీసు పెట్టిన లాయర్లు, ఒక రిటైర్డ్ జడ్జి కూడా తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చారు.
దాంతో పత్రిక ఎడిటర్ సబ్ ఎడిటర్ ని పిలిచి ఈ విషయాన్ని యిప్పట్లో ఆపుచెయ్యవద్దనీ, ప్రతిరోజు కొద్దిగా స్థలం దీని గురించి కేటాయించమనీ చెప్పేడు.
బ్యాంక్ ఆఫ్ ఉటోపియా నాల్గో అంతస్థు బోర్డ్ రూమ్ లో అత్యవసర సమావేశం జరిగింది. ఎయిర్ కండిషనర్లు నిశ్శబ్దంగా చప్పుడు చేస్తున్నాయి.
రీజనల్ మానేజర్ హరిభజన్ సింగ్, ఆపరేషన్స్ మానేజర్ అరోరా, సెక్యూరిటీ చీఫ్ జె.జె. విలియమ్స్, త్రివేద్, ద్వివేది, చతుర్వేది, ఇంకా యితర ఎగ్జిక్యూటివ్స్, లీగల్ ఎడ్వైజర్ పండిత్ కూర్చొని వున్నారు. అందరి మొహాల్లోనూ టెన్షన్ కొట్టొచ్చినట్టు కనపడ్తోందిి
రీజనల్ మేనేజర్ సెక్యూరిటీ చీఫ్ వైపు చూసేడు. చీఫ్ ఇంగ్లేషులో అన్నాడు."బ్యాంక్ లోకి రానివ్వటానికీ,రానివ్వకపోవటానికి బ్యాంక్ కి అధికారం వుంది. న్యూసెన్స్ కేస్ కింద ఆల్ఠయర్ మీద పోలీసు కంప్లెయింట్ యివ్వొచ్చనీ, తాజా దినపత్రిక మీద డామేజెస్ కోసం కోర్టులో కేసు వెయ్యొచ్చనీ నా వుద్దేశం".
"రైట్స్ ఆఫ్ అడ్మిషన్ అన్నది హోటళ్ళకి, బార్లకే పరిమితం అని నా వుద్దేశ్యం" అన్నాడు త్రివేది, బొల్లి వున్న చేతివేళ్ళ మధ్య పేపర్ వెయిట్ తిప్పుతూ.
చతుర్వేది మాట్లాడకుండా ప్రేక్షకుడిలా చూస్తున్నాడు.
అందరూ మాట్లాడటం అయిపోయేక లీగల్ అడ్వైజర్ టు ది బ్యాంక్ పండిత్ గొంతు సవరించుకున్నాడు. ఇతడికి అసలు సబ్జెక్టే రాదనీ, కేవలం ఎదుటివాళ్ళని కన్ఫూజ్ చేసి పబ్బం గడుపుకొంటాడని ప్రతీతి.
అతడు చెప్పటం మొదలుపెట్టేడు.

"బ్యాంకింగ్ అనేది ఇవ్వటం-పుచ్చుకోవటం అనే కాంట్ర్రాక్టు ఆక్టు మీద ఆధారపడి వుంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే. అటువంటప్పుడు "నేను పుచ్చుకోను" అని బ్యాంకరు అనొచ్చు. కానీ "డిపాజిట్ల" కోసం పేపర్లలో అడ్వర్ డైజ్ చేస్తూన్న మన బ్యాంకు, ఒకడు డబ్బు కట్టటానికి వచ్చినప్పుడు "కాదు" అనలేదు. అది ఓపెన్ ఆఫర్ కాబట్టి".
"కానీ చదువురానివాడ్ని వప్పుకోనక్కర్లేదు బ్యాంకు" అన్నాడు ద్వివేది పెద్ద పరిష్కారం కనుగొన్నవాడిలాగా. "సంతకం పెట్టలేని వాడు డిపాజిట్ యెలా చేయగలడు? ఆ కారణంగా అతడ్ని తిరస్కరించవచ్చు" అని మెచ్చుకోలు కోసం మానేజింగ్ డైరెక్టర్ వైపు చూసేడు.

నిన్న రాత్రంతా ఈ కేసు విషయమే చదివేడుకాబట్టి పండిత్ తడువుకోలేదు.
"కేవలం చదువుకోని కారణంగా ఒక వ్యక్తిని మనం నిరాకరించలేం. ఒక గౌరవనీయమైన వ్యక్తిని యెదురుగా పెట్టుకొని, తన తరుపున ఎవర్నైనా ఏజెంటుగా నియమించటానికి కుష్టువాడికి అధికారం వుంది. అయితే ఆ ఏజెంటుతో పాటూ ప్రతిసారీ ఆ కుష్టువాడు కూడా బ్యాంకుకు వస్తూ వుండాలి."
"అది మరీ ఘోరం" అన్నాడు హరిభజన్ సింగ్.

సభ్యులందరికి జీడిపప్పూ, టీ సర్వ్ చేయబడింది. అవి తింటూ వాళ్ళు ఈ కుష్టు సమస్యను చర్చించసాగేరు.
"ఇది చాలా చిన్న సమస్య అని నా వుద్దేశ్యం" అన్నాడు ద్వివేది. అతడింతవరకూ మాట్లాడలేదు."బ్యాంక్ అన్నది పబ్లిక్ ప్లేస్. ఆ ప్రదేశంలోకి అంటురోగులు రాకూడదు అని ’హెల్త్ ఆక్ట్’ చెబుతుంది. ఇంత చిన్న విషయానికి ’కాంట్రాక్ట్ ఆక్ట్’ వరకూ వెళ్ళక్కర్లేదు"అని గెల్చినట్లూ పండిత్ వైపుచూసేడు.
సాధారణంగా ఏ సంస్థల్లోనూ పెద్దస్థానాల్లో వుండే ఏ ఇద్దరికీ పడదు.
పండిత్ మొహం పెనంలా మాడిపోయింది.
చతుర్వేది అంతలో చిన్న బాణం వదిలేడు. "కుష్టు అంటురోగమేనా?" అని.
అక్కడున్న వాళ్ళకెవరికీ తెలీదు-అది అవునో కాదో.
ఫస్ట్ సెక్రటరీ టు ది మానేజింగ్ డైరక్టర్, జనరల్ హాస్పిటల్ స్కిన్ స్పెషలిస్ట్ కి ఫోన్ చేసి అయిదు నిముషాల్లో కావాల్సిన సమాచారం తెప్పించేడు-కుష్టు అంటురోగం కాదని.
సమస్య మళ్ళీ మొదలుకొచ్చింది.
అప్పుడు అక్కడున్న వాళ్ళందర్లోకి చిన్నవాడు ఒకడు లేచి నిలబడ్డాడు. అతడు చిన్నప్పుడు కమ్యూనిష్టుల్తోనూ, పదవిలోకి వచ్చేక కార్లలోనూ తిరుగుతున్నాడు.
"అసలు మనం ఆ డిపాజిట్టు వప్పుకుంటే నష్టం ఏమిటి?" అంటూ బల్లగుద్దేడు.
"ఐదు రూపయల గురించి కాబట్టి మనం యింత ఆలోచిస్తున్నాం. అదే అయిదు లక్షలిస్తానంటే వాడికి కుష్టుకన్నా వెయ్యిరెట్లు పెద్దరోగమున్నా వెళ్ళి నవ్వుతూ ఆహ్వానిస్తాం".
అది నిజమన్నట్లు ఎవరూ మట్లాడలేదు.
హరిభజన్ సింగ్ కొంచెం ఇబ్బందిగా కదిలి "అది కష్టం. ప్రతిమ వప్పుకోవటంలేదు.వాడి దగ్గర్నుంచి డబ్బు తీసుకోవటానికి".
కమ్యూనిస్టు విస్మయం ప్రకటించేడు. "హూ ఈజ్ షీ? తీసుకోకపోవటానికి ఆవిడెవరు? ఐయామ్ సారీ, మన బ్యాంకు క్లర్కుల దయాదాక్షిణ్యాలమీద నడుస్తూందని ఇప్పుడే తెలిసింది".
"ఆవిణ్ని ట్రాన్స్ ఫర్ చేస్తే-".
"తన ప్రతిష్టకి భంగం కల్గుతుందని ఆవిడ అనుకుంటుంది".
ఈ మాటలకి కమ్యూనిష్టు రెచ్చిపోయేడు. "ఆవిడ కంత ప్రాముఖ్యత ఏమిటి?" అని అరిచేడు ఇంగ్లీషులో.
"ప్రాముఖ్యతే..."
"ఎందుకు?"
రీజనల్ మేనేజర్ నెమ్మదిగా తలెత్తకుండా అన్నాడు "ఆవిడ ఫైనాన్స్ మినిష్టర్ కూతురు కాబట్టి".
ఆ హాల్లో మళ్ళీ నిశ్శబ్దం అలుముకొంది పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ లో చిన్న చిన్న పదవుల్లో వుండే వాళ్ళ వెనుక కూడా పెద్ద ’పవర్’ వుంటుందనీ-సంస్థ కీలక నిర్ణయాలకి వాళ్లు చాలా అడ్డు పడ్తారనీ అక్కడ అందరికీ తెలుసు.
చతుర్వేది కొంచెం కదిలి "నాదో సలహా" అన్నాడు. అందరూ అతడివైపు చూసేరు."కుమారి ప్రతిమని ఆఫీసర్ చేసి, కాష్ దగ్గిర్నుంచి గౌరవంగా పంపించేస్తే"అన్నాడు.
మానేజింగ్ డైరెక్టర్ అతని వైపు మెచ్చుకోలుగా చూసేడు.
అయితే ఈ సమస్యని లాయర్ పంతులు అంత తేలిగ్గా వదిలి పెట్టదల్చుకోలేదు. కుష్టువాడికి ప్రతిరోజూ పావులా యిచ్చే కమీషన్ మీద - రోజూ వెళ్ళి ప్రొద్దున అయిదు రూపాయలు డిపాజిట్ చేసేటట్టూ, మధ్యాహ్నం వెళ్లి దాన్ని తిరిగి తీసుకొనేటట్టూ ఏర్పాటు చేసేడు.
దాని ప్రభావం మాత్రం బ్యాంకు ఆర్థిక వ్యవస్థమీద విపరీతంగా పడింది.
రోజురోజుకీ డిపాజిట్లు తగ్గిపోసాగినాయ్.
ఈ లోపులో తాజా పత్రిక ఫోటోలతో సహా ప్రచురించసాగిందీ వార్తని.
కుష్టువాడు కౌంటర్ దగ్గరికి రాగానే కాకుల్లా కష్టమర్లు, చెదిరిపోయేవారు. అతడి చేయి తగిలినచోట తమ చేయ్యి పడకుండా జాగ్రత్తపడేవారు. అయితే పరిస్థితి అక్కడితో ఆగలేదు.’ఎందుకొచ్చిన బాధ-ఇంకో బ్యాంకు చూసుకొంటే పోలేదా’ అని చాలా మంది డబ్బు తీసేసుకోసాగేరు. పది హేను రోజుల్లో బ్యాంకు డిపాజిట్లు సగానికి సగం తగ్గిపోయేయి.
ఈ విషయమై ఏం చేయాలో రిజర్వ్ బాంక్ కి సలహా అడుగుతూ వ్రాసిన వుత్తరానికి ’అతి మామూలుగానే’ జవాబు రాలేదు.
ఈ పదిహేను రోజుల్లోనూ హరిభజన్ సింగ్ బరువు ముప్పై పవున్లు తగ్గిపోయింది. దిగుల్తో కళ్ల క్రింద గీతలు ఏర్పడినాయ్. మనిషి రోజురోజుకి కుదించుకు పోసాగేడు.
అప్పుడు కల్సుకొన్నాడు చతుర్వేది అతడ్ని.
పదిహేను నిముషాలు రహస్యంగా సమాలోచన్లు జరిపేరు. తాజాపత్రిక ఆఫీసుకి ఫోన్ చేసేడు. ఎడిటర్ తో కాకుండా తిన్నగా గ్రూపు చైర్మెన్ గారితోనే మాట్లాడాడు.
"హల్లో షెట్టీ-"
"హల్లో చతుర్వేదీ- లాంగ్ టైమ్-"
"ఈ సాయంత్రం ఖాళీయేనా-"
షెట్టీ ఛార్టు చూసి "ఖాళీయే" అన్నాడు.
"అయితే సాయంత్రం కాక్ టెయిల్స్ కి ఎందుకు కలుసుకోకూడదు మనం".
"ష్యూర్".
ఆ సాయంత్రం క్లబ్ లో వాళ్ళు కల్సుకొన్నారు. అరగంటలో విషయం సెటిలయిపోయింది.
జనాన్ని మరింత దోచుకోవటం కోసం షెట్టీ పెడ్తూన్న మరో జంతర్ మంతర్ బిజినెస్ కి బ్యాంక్ ఆఫ్ ఉటోపియా గ్యారంటీ ఇచ్చేటట్టూ, కుష్టువాడి విషయం పత్రిక మర్చిపోయేటట్టూ.....
ఇది జరిగిన రెండో రోజుకి లాయర్ పంతులు బ్యాంక్ ఆఫ్ ఉటోపియాకి అసిస్టెంటు లీగల్ అడ్వైజర్ గా నియమింపబడ్డాడు.......
కుష్టువాడు మాత్రం చతుర్వేదికి కొద్దిగా ట్రబులిచ్చాడు.
"నేనెందుకు డబ్బు తీసేస్కోవాలి దొరా? ఆరో కలాసు వర్కూ నేనూ సదువుకొన్నా,అదీకాక ఆ పంతులు సెప్పిండు కూడా. నేను డబ్బులుంచాలన్కుంటే ఎవ్వరొద్దన్లేరంట.సూద్దాం ఏమవుతదో-"
చతుర్వేది మొహం చిట్లింది "నేను చెబ్తున్నా కదా"అన్నాడు.
"ఆ రోజు నువ్వయిదు రూపాలిచ్చినప్పుడు ’నేనిన్ని పైసలేం జేస్కోన్దొరా’ అంటే ’మా బ్యాంకులో ఏస్కో’, అన్నదికూడా నువ్వేగదా".
చతుర్వేది గతుక్కుమని "సర్లెసర్లె ఇప్పుడవన్నీ ఎందుకు?" అన్నాడు. "ఇదిగో యీ అయిదు రూపాయలు తీసుకుని ఇంకా విషయం మర్చిపో. ఇక లోపలికి రాకు".
వస్తానన్నాడు వాడు.
వీధిలో వాడితో ఎక్కువ సేపు మాట్లాడటం చతుర్వేదికిష్టంలేదు. అప్పటికీ ఒకళ్ళిద్దరు తమకైపు కుతూహలంగా చూడటం అతడు గమనించాడు. తలవంచుకుని లోపలికి వచ్చేసేడు.
ఆ మధ్యాహ్నమే ’ముట్టుకొని బెదిరించి’ అడుక్కుంటున్నాడన్న కారణంగా పోలీసులు అరెస్ట్ చేసి వాడ్ని తీసుకుపోయేరు... విషయం చాలా తేలిగ్గా తేలిపోయింది.
ఈ విషయం ప్రచురించటానికి పత్రిక లేదు.
ఈ విషయాన్ని ప్రొటెస్ట్ చెయ్యడానికి లాయర్లేడు.
చతుర్వేది కారు చూడటానికి కాపలాదారుకూడా లేడు.
అయినా పర్లేదు. అతడికి ప్రమోషనొచ్చిన కారణంగా కారునీ, డ్రైవర్ నీ పది రోజుల క్రితమే బ్యాంకు వాళ్లే యిచ్చేరు.
బీదవాడు తప్ప సర్వే జనా సుఖినో భవంతు.

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech