|
కూర చిదంబరం
ఇటీవలి కాలం నుండి వివిధ గ్రంథాలను అధ్యయనం
చేస్తూ, వివిధ పత్రికలకు చక్కటి సాహిత్య
సమీక్షలు చేస్తు, తెలుగు సాహిత్యలోకంలో తన
ఉనికిని పరిపుష్టం చేసుకుంటూ,తనదైన శైలిలో
సాగిపోతున్నారు. ఆయన పుస్తక సమీక్షల్లో లోతైన
వాస్తవ పరిశీలన వుంటుంది. భాష, శైలి, చర్చించే
విషయంలో ప్రత్యెకత కనిపిస్తుంది.చక్కటి
విమర్శకుడిగా, సమీక్షకుడిగా మాత్రమే ఆయన
పాఠకలోకానికి తెలిసినప్పటికిని, ఆయనలో చక్కటి
కథారచయిత, కవిత్వం, వ్యాస రచయిత దాగి
యున్నట్లుగా చాలా మందికి తెలువదు. ఇంతేగాక
హైదరాబాద్ ఆకాశవాణిలోఆయన రాసిన మూడు కథలు
ప్రసారమై శ్రోతల ఆదరణను పొందాయి గత యాబై యేళ్ళ
కిందటే అంటే అరవై, డెబ్బయి దశకాల్లో ఆయన రాసిన
కథలు వివిధ వార పత్రికల్లో అచ్చయినాయంటే ఆయన
ఎంతటి లబ్ద ప్రతిష్టుడైన కథా రచయితో
ప్రత్యేకించి చెప్పనక్కర లేదు.
ఆయన రాసిన కథలు అప్పటి లీడింగ్ ఆంధ్రప్రభ,
ఆంధ్రపత్రిక, పొలికేక వార పత్రికల్లో
వచ్చాయి.ఈ ప్రాంతంకు చెందిన సీనియర్లయిన కథా
రచయితలు గర్ళకుర్తి సురమౌళి, రాములు, గూడూరి
సీతారాంతో సహా,డా.మలయశ్రీ, తత్వవేత్త
బి.ఎస్.రాములు, తాడిగిరి పోతరాజులు వీరికి
సమకాలికులుగా చెప్పవచ్చును. అప్పటి సమకాలీన
సామాజిక జీవితాన్ని, అణగారిన బతుకుల్లోని జీవన
పోరాటాల్ని, పేదరికాన్ని, వారి కడగండ్లను
నిశితంగా పరిశీలించి కథలుగా మలిచి, ఆయన చేసిన
రచనలు చూస్తే, మునిపల్లె రాజు, పెద్దిభట్ల
సుబ్బరామయ్య, చాగంటి సోమయాజుల కథలు గుర్తుకు
వస్తాయి. చిదంబరం తన కథారచనను కొనసాగించి వుంటే.
ఆయనకు ఎన్నెన్నో పురస్కారాలు దక్కియుండేవి. అతి
కష్టమైన సిఎ కోర్సు పూర్తి చేసి, హైదరాబాద్ లో
చార్టర్ అకౌంటెంట్ గా బతుకు తెరువుకై జీవితంలో
స్థిరపడ్డాక ఆయన చాలా కాలం పాటు సాహిత్య
వ్యాసాంగాల జోలికి వెళ్ళినట్లు కనిపించలేదు.
వీరు ఆర్థిక వేత్తగా కొనసాగి కేంద్ర,రాష్ట్ర
బడ్జెట్ల పై సెమినార్లు చర్చావేదికలు
నిర్వహించారు. వీరి భాషా శైలిని పరిశీలిస్తే
ఈయన నిరంతర అధ్యయనం మాత్రం విడవనట్లుగా
ప్రస్ఫుటమవుతుంది. రచనా వ్యాసాంగాలు కొనసాగించి
వుంటే ఆయన పుస్తక రచనలు ఎన్నో వచ్చియుండేవి.
ఆయన చాలా కాలం తర్వాత ఒకేసారి వివిధ
ప్రక్రియలలో మూడు పుస్తకాలు వేసి, సంచలనం
సృస్టించారు. అవి పాలపిట్ట పత్రిక ప్రచురణల
సంస్థ ఆధ్వర్యంలో ముద్రణకు నోచుకున్నాయంటే, ఆ రచనల శక్తిని అంచనా వేయవచ్చును. చిదంబరం
అచ్చమైన తెలంగాణ ప్రాంతం రచయిత. ఇది మనం
గర్వపడాల్సిన విషయం. కరీంనగర్ జిల్లా వేములవాడ
పుణ్యక్షేత్రం వారి జన్మస్థలం. ఆలస్యమైనా అరవై
ఎనిమిదవ యేటలో ఆయన రచనలు పుస్తకాల రూపంలో చవి
చూడటం పాటకులకు అందుబాటులో ఉండటం ఆనందదాయకమైన
విషయమే కదా.వీరి కథా రచనలు పరీశీలిస్తే
ప్రపంచీకరణ ప్రకరణానికి రెండున్నర దశాబ్దాలకు
ముందుండటం గమనార్హం. వీరి కథలు సామాజిక,
ఆర్థిక, ఇతివృత్తాలతో అల్లబడ్డాయి.
కూర చిదంబరం చేసిన మూడు రచనలను ఇటీవల
సిరిసిల్లా మాజీ శాసన సభ్యులు సి.హెచ్.
రాజేశ్వరరావు ఆవిష్కరించారు.అవి ఉషష్సు కథా
సంపుటి, ఆలోచనా సులోచనాలు మినీ వ్యాసాలు, జీవన
చిత్రాలు మినీ కవిత్వం, వీరి రచనల్లో
సామాజికతతో కూడిన వాస్తవికత, శైలి, శిల్పం,
ఆర్తి, చక్కటి సందేశాలుంన్నాయని ఈ సందర్బంగా
మాట్లాడిన ప్రముఖ రచయితలు అన్నారు. చిదంబరం 17
యేళ్ళ వయస్సు నుండి 25ఏళ్ళ వయస్సు వరకు రాసిన
కథలే ఇందులో చోటు చేసుకోవడం గమనార్హం. సుమారు
యాబై కథలు రాయగా వాటిలో ఉత్తమమైన వాటిని ఎంపిక
చేసి తన 68 వ సంవత్సరంలో(ముదిమి వయస్సు)
ఆలస్యమైనా జాగు చేయక ప్రచురణకు తేవడం ఆనందదాయకం,
అభినందనీయం.
ఉషష్సు కథా సంపుటి:-
ఉషష్సు కథా సంపుటి156 పేజీల గ్రంథమిది. ఇందులో
పద్నాలుగు కథలతోపాటు, మూడు రేడియోలో ప్రసారమైన
నాటికలను చేర్చారు. తాను కథలు రాయడానికి తాను
జీవితంలో చూసిన సంఘటనలేనని, వీటిని అక్షర
క్రమంలో పెట్టడానికై తాను రచయితగా మారిపోయానని
చెప్పుకున్నారు. రచయిత ఎన్నుకున్న వస్తువు
అభివ్యక్తి, శిల్పం, కథా కథనంలో చూపిన నేర్పు,
కథలకు పెట్టిన శీర్శికలు పాటకునికి ఉత్సుకతను
కలిగిస్తాయి. పాలపిట్ట ఎడిటర్ గుడిపాటి
ముందుమాట రాస్తు, వివిథ పార్శ్వాలలో వీరి కథలు
కనిపిస్తాయని, మానవ సంబధాల వైచిత్రి, జీవన
వైవిధ్యాలు కనిపిస్తాయని కితాబు నిచ్చారు. ఆరు
కథలు పెద్దవిగా కనిపిస్తాయి. ఇందులో ఆయన 14
యేళ్ళ కుర్రాడిగా వేములవాడ మాధ్యమిక పాఠశాలలో
చదువుతున్నప్పుడు పాఠశాల లిఖిత పత్రిక భానులో
ఆయన రాసిన ఉషష్సు అనే టైటిల్ కథ అచ్చుకు
నోచుకోవడం విశేషం. చిరుత ప్రాయంలోనే ఆయన రాసిన
ఈ కథ చదువుతుంటే ఆయన ఎంత ప్రగాఢంగా
ప్రతిభావంతంగా కథనాన్ని కొనసాగించాడో , కథా
రచన పట్ల ఎంత అవగాహన యుందో అర్థమవుతుంది.
వీరి తొలి కథ ఉషస్సులో కాముకత పర్యవసానంగా
ఏర్పడిన కక్షలు, కార్పణ్యాలు, తదనంతరం హత్య,
జరిగి పోయన నష్టాలు చవిచూపిస్తాడు, రచయిత.
పాలేరు రామిగాడు గడిలో తన భార్య లచ్చిమిని చెర
బట్టిన పర్యవసనాన్ని, రాజాలు విని రామిగాడ్ని
కక్ష్యగట్టి చంపడానికి నిశ్చయించుకుంటాడు.
రామిగాడి భార్య రత్తాలును మోహించి తన నేర
ప్రవృత్తి బయటపడకుండా పథకం ప్రకారం మానభంగం
చేసి చంపిన సంఘటన గుర్తుకు రావడంతో రాజాలులో
వచ్చిన మార్పే కథ ఉషస్సుగా ముగుస్తుంది. ఊరి
దొర వద్ద పనిచేసె పాలేర్లయిన రాజాలు నేర
ప్రవృత్తి పూర్వాపరాలను ఈ కథలో రచయిత
చర్చించిన తీరు అద్భుతం.
రెండవ కథ మూసినకిటికి. విషాదాంతమైన ఇరవై పేజీల
దీర్ఘకథ ఇది. 1966 లో ఆంద్రప్రభ వీక్లీలో రెండు
భాగాలుగ వచ్చింది. చంద్రం, మాధవిలు బావామరదళ్ళు.
చిన్ననాటి నుండే తమ భవిష్యత్తు ఆశలను గూర్చి
కలలు కంటుంటారు. బాల్యంలొ ఒక రోజు డాక్టర్ ఆటలో
డాక్టర్ గా మాధవి చేసిన ఉత్తుత్తి వైద్యం
చంద్రం జీవితమార్గాన్ని అగాథంలోకి
నెట్టివేసింది.చిన్న నిర్లక్ష్యం వల్ల తన బావ
కన్ను కనిపించకుండా పోవడానికి మాధవి
కారణమవుతుంది. కథా నాయకుడి ఆశలన్నీ అడియాసలై,
తుదకు అంధుడై తన జీవితాన్ని ఆవేదనతో
ముగించుకోవడం, పాఠకున్ని కన్నీరు పెట్టిస్తుంది.
నాయకుడు చంద్రం మిగిల్చిన ప్రేమమయ త్యాగం
రచయిత హైలెట్ చేసి చూపిస్తాడు. డాక్టర్ కోర్సు
పూర్తి చేసిన మాధవికి సహ అధ్యాయిగా మెడికో
శ్రీధర్ చేరడంతో విధి వంచితుడైన చంద్రం తన
జీవితాన్ని త్యాగం చేసుకోవడం, మాధవి సైతం
విచారానికి లోను కావడం చూస్తే, ఈ కథలో విషాదంతో
కూడుకున్న కరుణ రసం పట్ల రచయిత మొగ్గు
చూపించినట్లు కనిపిస్తుంది. ఒక హృదయం రెండు
కథలు ముప్పయి పేజీల దీర్ఘకథ ఇది. పొలికేక
వారపత్రికలో రెండు భాగాలుగా వచ్చింది. ఇందులో
ప్రేమ, బాంధవ్యాలు, పేదరికం, అనాథత్వం వల్ల
కలిగే బతుకు జీవనంలో కలిగే మార్పులు, రోగికి,
వైద్యుడికి మధ్య వుండే సంబంధాలు, అంత
సంఘర్శణలను కథకుడు హృద్యంగా చిత్రీకరించినాడు.
దుర్యవసనాలకు లోనైన రాజశేఖర్ అనే వ్యక్తి క్షయ
వ్యాధితో బాధ పడుతూ డా. చంద్రశేఖర్ పనిచేసే
ఆసుపత్రిలో చికిత్స కోసం చేరుతాడు. రోగి భార్య
సుజాత, డాక్టర్ చేసుకున్న అనాధ సుజాత కావడం
కాకతళీయం కాగా, కథ ముగింపును ఇదే మలుపు
తిప్పుతుంది. రోగి అంత సంఘర్షణలు, మానసిక
కారణాలపై క్షయ నయం చికిత్సలో రానున్న మార్పులపై
విశ్లేషణాత్మకంగా పరిశోధన చేయడానికి డాక్టర్
చంద్రశేఖర్ ముందుకు వస్తాడు. రోగి తదుపరి తన
భార్యకు లేఖలు రాసే క్రమంలో డాక్టర్ చంద్రశేఖర్
తన భార్యయైన సుజాతతో సమాధానాలు రాయిస్తాడు.
క్లయిమాక్స్ లో రోగి డాక్టర్ భార్యను చూసి తన
పూర్వాశ్రమ భార్యగా గుర్తించడం, ఈ నిజాన్ని
భరించలేక రోగి గుళికలు అధికంగా మింగి డాక్టర్
పై గౌరవంతో ఆత్మహత్య చేసుకుంటాడు. ఇందులో
వైద్యరంగం, ఆసుపత్రి తీరుతెన్నులపై కథకుడికి
సమగ్ర అవగాహన యుండటం వల్లే ఈ కథను రాయడం
సాధ్యపడుతుంది. ఆనాటి కాలంలో ప్రభలంగా వున్న
క్షయ రోగం తీవ్రతను, సమకాలీన కాలపు జబ్బు
భయాందోళనను కథకుడు పాటకులకు యెరుక పరచడంలో,
ఆనాటి కాలపు రచయితల సామాజిక బాధ్యతను మన
ముందుంచాడు. రచయిత పరిశీలనా దృష్టిని
అభినందించక తప్పదు.
ఈకథ ముగింపులో కథకుడు రాసిన ఒక డైలాగ్
పాఠకున్ని హత్తుకుంటుంది. రోగి రాసిన చివరి
లేఖగా చివరి లేఖగా ఈ డైలాగ్ వుంటుంది. ఈ
డాక్టర్ గారూ, విధి రెండో సారి వంచింది. ఎవరో
నాకు ఏదో అవుతారని, విడిపోయిన ఆశల్ని
కూడగట్టుకుని నిలద్రొక్కుకుంటున్న క్షణాన వారు
నాకేమి కారని తెలిసివచ్చింది. జీవితపు సంకుల
సమరంలో ఈ పధికుడు చిత్తుగా ఓడిపోయాడు. ఇక సెలవ్
ఇప్పించండి. ఒక్కమాట సుజాత, సంఘం వేసిన పెళ్ళి
ముద్ర తప్ప పరస్పర, అనురాగపు అనుభూతులేమి లేవు.
న్యాయంగా, ఆమెకు నేను ఎప్పుడూ, ఏమీ కాను, ఆమె
గత జీవితం మీ భవిష్యత్తు బాటకు ప్రతిబంధకం
కావొద్దు. నేను నా తాలూకు స్మృతులు..అదో పీడకల
అని మరిచిపోకండి. ఆ నమ్మిక నాకుంది. ఎందుకంటే
మీ సహృదయత నాకు తెలుసు, పండంటి జీవితాన్ని మీరు
కలకాలం కలిసి పంచుకునేట్లు చేయవలసిందిగా, నేను
భగవంతున్ని కోరుకునే చివరి కోరిక.
అభావం అంచుమీద కథలో కథకుడు నాటి కరణం దొరల
అధికార దర్పాన్ని, తన పరిధిలోని ఆ గ్రామంపై
వుండే దొరల రాజసాన్ని కథకుడు చక్కగా
చిత్రించాడు. నాటి విద్యుత్ లేని రోజుల్లో వీధి
దీపాలు ఎలా పెడతారో, నాటి గ్రామాల పరిస్థితులు
ఎలాగుంటాయో కథకుడు అధ్భుతంగా వివరిస్తాడు.
ఇక కథలోకి వెడితే నాటి దొర కరణం రంగయ్య
వూరిలోని రిటైర్డయిన పంతులు పరంధామయ్యను పిలిచి,
తన కుమారుడైన మధుమూర్తికి చదువు చెప్పమని కోరడం,
దొర ఏమంటాడో అన్న భయంతో సరేనని అనడం, ఏట్టి
పరిస్థితుల్లో పిల్లాడిని కొట్టకుండా చదువు
చెప్పాలని కోరడం, ఒకానొక ఆఖరి క్షణంలో కోపంతో
పిల్లాడిపై పంతులు చేయి చేసుకొని, మానసికంగా
రాత్రంతా భయంతో వేధనకు గురికావడం, తదుపరి కరణం
రంగయ్య, పంతులు గారిని మెచ్చుకోవడంతో కథకు తెర
పడుతుంది. పంతులు పరంధామయ్య మనో వేదనను
చిత్రించిన తీరులో కథకుడి శిల్ప రచన ప్రతిభ
కనపడుతుంది.
బతుకు తిరగని మలుపు కథలో భిక్షగాళ్ళ కడగండ్లు,
జీవన వ్యధలను, వారి దారిద్ర్య బాధల్ని ఎకరువు
పెడుతుంది. కథకుడు భిక్షగాళ్ళ జీవన విధానంపై
అధ్యయనం చేసి ఈ కథను వాస్తవంగా చిత్రీకరించాడని
చెప్పవచ్చును. వీరప్ప అనే భిక్షగాడు లచ్చిమి
అని తోటి భిక్షగత్తెను చేసుకుని సంసారంలోకి
ప్రవేశించడం, తదుపరి జరిగిన సంసార బాధలకు జడిసి
పారిపోవడం, తిరిగి భార్యమీద ప్రేమతో ఇంటికి
రావడంతో కథ ముగుస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో
భిక్షగాళ్ళను ఎలా చిన్న చూపు చూసి, వైద్యం
చేస్తారో కథకుడు పాటకులకు చెబుతాడు.
తనదాకా వస్తే అన్న మీనీ కథలో చెప్పేటందుకు
నీతులు ఉన్నాయన్నట్లుగా, కథా సారాంశం వుంటుంది.
సమాజంలొ బాధ్యతాయతమైన న్యాయవాదిగా యున్న పీడర్
పరంధామయ్య ద్వివిధ వైఖరిని ఈ కథలో బట్టబయలు
చేస్తాడు. తన ఇంట్లోకి కిరాయకున్న రేవతి అనే
యువతి అనుమానపు ప్రవర్తనపై కన్నేసిన ప్లీడర్
ఆమెను ఎలా వశపరుచుకుంటాడో తెలియచెబుతాడు.
నీతులు వల్లిస్తూనే, మరో రకంగా ఎలా దిగజారుతాడో
ప్లీడర్ ప్రవర్తనను కళ్ళ ముందుంచుతాడు
సమాజంలోని తన కథల్లో వివిధ పాత్రల చిత్రణలను,
వారివారి వృత్తుల బహూముఖ పోకడలను వాస్తవంగా
తెలియజెప్పే ప్రయత్నం చేయడంలో కథకుడు
సంపూర్ణంగా విజయం సాధించాడని కథకడి శైలిని
పరిశీలిస్తే అవగతమవుతుంది. సమాజాన్ని దగ్గరగా
రచయితలు ఎలాపరిశీలించాలో అన్న నైపుణ్యతలు ఈ
కథారచయత తేట తెల్లంగా వివరించడంలో విజయం
సాధించాడు. అందుకే వీరి కథలన్నీ పండాయి.
నీటిమీది నిమోన్నతాలు అన్న కథలో దేవదాసీ
వ్యవస్థ గూర్చి వివరిస్తు, కన్నెరికం ద్వారా
దేవదాసిగా ఎలా మారుతారో వసంతసేన యువతి దీనగాథను
మన ముందుంచుతాడు. రత్నదత్తుడు అనే ధనిక
వైశ్యుడు వసంతసేనకు తొలి అనుభవాన్ని ఇస్తాడు.
తల్లి దేవయాని కోరిక మేరకు తనకు ఇష్టం లేకున్నా
ఈ పనికి ఒప్పుకుంటుంది.రత్నదత్తుడు
కన్నెరికాన్ని ప్రసాదించిన రోజునే ఇంటినుండి
పారిపోతాడు. చివరి వరకు కూడా రాకుండా పోతాడు.
నాటి ముస్లిం రాజుల కాలంలో రాజాంతపురాలలో
పరదాచాటున జరిగే భోగాలు, కుట్రలు,
రాజకీయాలు,మోహ వాంఛల తిరస్కారాల వ్యవహారాల
కథనాన్ని స్వర్ణశృంఖలాలు అవిష్కరించింది.
మొగలాయిల కాలం నాటి ఆగ్రా రాజ్యంలొ మహారాణి
రత్నాల వ్యాపారిని మోహిస్తుంది. పాదుషా ఢిల్లి
వెళ్ళినప్పుడు ఇదే అదునైన సమయమని రత్నాల
వ్యాపారి మోహన్ చంద్ ను ఇంటికి పిలుపిస్తుంది.
సరైన టెక్నిక్ తో(శిల్పం), కథావస్తువు, భాష ఈ
కథలో పోటీపడుతాయి. రాణి కోరికను తాను మోహించిన
ప్రియుడు పాదుషావారి మీదవున్న గౌరవభావంతో
తిరస్కరించడంతో కథ అడ్డం తిరుగుతుంది. మోహన్
చంద్ బందీయై పాదుషావారి ఆగ్రహానికి గురై
ఉరికంబానికి ఎక్కుతాడు. మోహన్ చంద్ భార్య
పూర్ణిమ మాత్రం పాదుషాను కలసి, నిజం
చెప్పడానికి వెళ్ళి విఫలయత్నానికి గురై
మరణిస్తుంది. పాదుషా పక్కనేయున్న రాణి వల్ల
పూర్ణిమ ప్రయత్నం కలువకుండా నీరుగారి పోతుంది.
కథమాత్రం విషాదాంతమవుతు, పాటకున్ని అయ్యో పాపం
అనిపిస్తుంది. పాప కథ హృదయవిదారకమైనది. ఇందులో
సొంత తల్లి లేక, సవతి తల్లి ప్రేమగా చూడకపోవడం,
వికలాంగురాలిగా విధివంచిత కావడం వంటి విషయాలను
దృష్టిలో పెట్టుకుని, కథ అల్లినట్లనిపిస్తుంది.
ఈ కథ ముగింపు కూడా ఆసక్తిగా వుంటుంది.
ఎదురింటి ఒ పెద్దాయన పాపను పలకరించి, తన
కారులో ఎక్కించుకొని, పాపలు అందమైన బొమ్మ్లలు
కొని ఇచ్చి, ఇంటి వద్దకు దింపుతాడు. ఆలనాపాలనా
లేని పాప భవిష్యత్తు ఏమై పోతుందోనని కలగనడంతో
కథ ముగుస్తుంది. కళ్ళు కథలో ముగింపు
విషాదాంతంగానే ఉంది. ఇందులో కూలి సత్తయ్య
మిల్లు ప్రమాదంలో పోగొట్టుకుంటాడు. ఫ్యాక్టరి
యజమాని నష్టపరిహారం ఇవ్వడంలో దగా చేయడం,
కోర్టులు, చట్టాలు బీదలపట్ల న్యాయం
ప్రదర్శించడంలొ అబద్దపు సాక్ష్యాలను నమ్మి,
భరొసాలేకుండా ఎలా వ్యవహరిస్తాయో, తద్వారా పేదల
బ్రతుకులు ఎలా చితికిపోతాయోననడానికి, ఈ కథ
అద్దం పడుతుంది. క్షయ రోగానికి గురైన భర్త
సత్తయ్య, చావుకు దగ్గరై ఇంట్లో పోరాడుతుండటం,
భార్య లచ్చిమి కాంట్రాక్టర్ కామ దాహానికి బలై
పోవడం, భర్తను కాపాడుకోవడానికి వెళ్ళే సమయంలో
వాహన ప్రమాదానికి గురై ప్రాణం పోవడంతో కథ
కన్నీళ్ళుపెట్టిస్తు ముగుస్తుంది. కళ్ళకు
గంతలు కట్టుకున్న న్యాయదేవత ముందు బీదోడికి
న్యాయం ఎలా దొరుకుతుందని వ్యవస్థను
ప్రశ్నించేరీతిలొ ఈ కథ యుంది.
రచయితకున్న పర్యావరణ ప్రేమ, మనిషి_మాను అన్న
కథ రాయడానికి దోహదం చేసిందనవచ్చును. ఇందులో ఒక
ఊరిలో జరిగిన తుఫాన్ వర్ష్ బీభత్సాన్ని,
జరిగిన నష్టాన్ని రచయిత దృశ్యమానం కావిస్తాడు.
కుండపోతగా కురిసిన వర్షం వల్ల ఊరంతా వల్లకాడై
పోతుంది, రాజాలనే వ్యక్తి వర్షానికి తన గుడిసె
కోల్పోగా, ఇంటిముందున్న వేప చెట్టు
బతికిస్తుంది. వేప చెట్టుకు కృతజ్ణతగా
చెబుతూనే, దళారీలు ఊరికి వచ్చినపుడు తన
ఇంటిముందున్న వేప చెట్టును కట్టేకోత వాళ్ళకు
అమ్మడానికి ఒప్పుకొని, తన స్వార్థ గుణాన్ని
ప్రదర్శిస్తాడు. అయినా వేప చెట్టు వల్ల కిలిగే
ప్రయోజనాలను రచయిత చక్కగా వివరిస్తూ కథను
ముగిస్తాడు.
రేడియో నాటికలు:- కథలతో పాటు రచయిత రాసిన మూడు
రేడియో నాటికల్లో వైవిధ్యత కనిపిస్తుంది.
1.వాన వెలిసింది,2. అద్దెగది-అగచాట్లు,3.
చేదునిజం. ఇవి సాయంత్రం వేళలో ప్రసారం చేయబడి
శ్రోతల ఆధరణ పొందాయి. రేడియో ప్రసారాల్లొ
కధానికలు,రేడియోనాటికలు,పౌరాణికనాటకాలకు
ఎక్కువ ఆధరణ ఉంటుంది. వీటిలో రేడియో నాటికలకు
ఉన్నప్రాముఖ్యత చెప్పనలవికాదు.
వానవెలిసింది నాటికలో భార్యాభర్తల మధ్యజరిగే
సంభాషణలు ఆకర్షిస్తాయి. భార్య మాలతి
పుట్టింటికి వెళ్ళిన సమయంలో భర్త రాఘవ తన
ఇంటిని పేకాట క్లబ్ గా మార్చుతాడు. తోటి
ఉద్యోగి రమణ ఉత్తరం రాయడంతో భార్య తిరిగి
వచ్చి, వంట గదిలో కనబడిన గాజు ముక్కలు,వాడిన
పూలదండ గూర్చి అనుమానంతో ప్రశ్నిస్తుంది.
పదేండ్ల అమ్మాయి రమ భర్తకు వంటలో సహకరించడం
వలన కనబడిన అనుమానాలను నివృత్తి చేసుకోవడంతో
వానవెలిసినట్లయి నాటిక ముగుస్తుంది. దీంట్లో
నాలుగు పాత్రలతో నాటికను రక్తి కట్టించాడు.
చేదునిజం:- ఇందులో ఇద్దరు ప్రేమికుల మధ్య
జరిగిన నేపథ్యపు కుట్రలవల్ల జరగవలసిన వివాహం
రద్దవుతుంది.శేఖర్ లలితలు తమ కులాలు
వేరైనప్పటికిని ప్రేమించుకుంటారు. ఇది తెలిసి
లలిత తండ్రి మాధవయ్య శెఖర్ ను కలిసి వివాహ
ప్రయత్నాన్ని విరమించుకొమ్మని గట్టిగ
కోరుతారు. ఇది తెలియని లలిత శెఖర్ పై
కక్షపెంచుకొని మరొకరిని పెండ్లి చేసుకుంటుంది.
ఈ చేదునిజం లలిత పశ్చాత్తాపం పడడంతో కధ
ముగుస్తుంది.అద్దెగది-అగచాట్లు:- దీనిలో
బ్రహ్మచార్లకు హైదరాబాద్ నగరంలో అద్దెగదుల వేట
కోసం పడినపాట్లను రచయిత చక్కగ మలిచాడు. ఇందులో
శెఖర్,రాధాకృష్ణలు బ్రోకర్ హనుమాయమ్మ,ఇంటి
యజమాని పురుషోత్తమరావు పాత్రల సంభాషణలు
ఆసక్తిగా ఉంటాయి.
|
|