వీరతాళ్ళు వేస్తాం, వస్తారా?!

--వేమూరి వేంకటేశ్వరరావు

ముందుమాట: తెలుగులో రాయటమన్నా, మాట్లాడటమన్నా చాల కష్టం అనే భావం మనలో చాలమందిలో ఉంది. అందుకనే ఎందుకొచ్చిన గొడవనీ, తేలిగ్గా ఉంటుందనీ శుభ్రంగా ఇంగ్లీషులో మాట్లేడేసుకుంటాం. ఆ ఇంగ్లీషైనా బాగా మాట్లాట్టం, రాయటం వచ్చా అంటే అదీ లేదు. నేర్చుకుంటూన్న భాషలో పెద్ద పాండిత్యం ఉన్నట్లు మాట్లాడతాము కాని వచ్చిన మాతృభాష రాదనుకొని మాట్లాడటానికి చిన్నతనం పడిపోతున్నాం.

ఏ భాషైనా సరే వాడుతూన్నకొద్దీ వాడిగా తయారవుతుంది; వాడకపోతే వాడిపోతుంది. కనుక మన భాష కుంటుతూనో, మెక్కుతూనో మాట్లాడుతూ ఉంటే వాడితేరి వాడుకలోకి వస్తుంది. “మన భాషలో వొకేబ్యులరీ లేదండీ” అని ఒక సాకు వినిపిస్తూ ఉంటుంది. నిజమే! ఇంగ్లీషులో ఉన్నంత పదజాలం తెలుగులో లేదు. ఇంగ్లీషులో వాడుకలో ఉన్న మాటలు దరిదాపు 50,000 ఉంటాయని అంచనా. బూజు పట్టినవి, మూలబడ్డవి కలుపుకుంటే ఇంకా చాలానే ఉంటాయి. ఇదే రకం అంచనా వేస్తే తెలుగులో వాడుకలో ఉన్న మాటలు ఓ 15,000 ఉంటాయేమో. మన భాష పెరగటం మానేసింది. మన భాష విస్తృతిని పెంచాలంటే వాడుకని పెంచాలి. వాడుక పెరగాలంటే క్లిష్టమైన భావాలని, సరికొత్త విషయాలని తెలుగులో వ్యక్తపరచటానికి సదుపాయంగా మన పదజాలం పెరగాలి. అలాగని టోకుబేరంలా, పెద్ద ఎత్తున, ఇంగ్లీషులోని మాటలని తెలుగులోకి దింపేసుకుంటే అవి మన నుడికారానికి నప్పవు. కనుక మన సంప్రదాయాలకి, మన వ్యాకరణానికి అనుకూలపడేలా ఈ పదజాలాన్ని సమకూర్చుకోవాలి. ఈ పని ఎవరు చేస్తారు? మనమే ప్రయోగాత్మకంగా చేసి చూడాలి. మాయాబజారు సినిమాలో చెప్పినట్లు మాటలు మనం పుట్టించకపోతే మరెక్కడనుండి పుట్టుకొస్తాయి?

ఒక భావానికి సరిపడే మాట సృష్టించే బధ్యత మనదే – అది ఇంగ్లీషువాడి సొత్తు కాదు. అది ఇంగ్లీషు వాళ్ళకి దైవదత్తంగా వచ్చిన బాధ్యతా కాదు. అందుకని తెలుగులో ఆధునిక అవసరాలకి పనికివచ్చే కొత్త మాటలు సృష్టించి వాటిని వాక్యాలలో ప్రయోగించి చూస్తే ఎలాగుంటుందో చూడాలని ఒక కోరిక పుట్టింది. ఈ ప్రయోగంలో పాఠకులని కూడా పాల్గొనమని ఇదే మా ఆహ్వానం. ప్రతినెలా మేము ఐదో-పదో మాటలు తయారు చేసి వాటి ప్రవర, పుట్టుపూర్వోత్తరాలు కొంతవరకు చెప్పి, అవసరం వెంబడి వాటి వాడకం ఎలాగో మీకు సోదాహరణంగా చూపిస్తూ ఉంటాము. ఆ తరువాత కొన్ని ఇంగ్లీషు మాటలు ఇచ్చి వాటితో సరితూగగల తెలుగు మాటలని ప్రతిపాదించమని పాఠకులని ఆహ్వానిస్తూ ఉంటాం. మేమడిగిన మాటలని తెలుగులో ఏమంటే బాగుంటుందో మీరు సూచించాలి. మీ సూచనని బలపరచటానికి ఆ తెలుగు మాటని ఒక వాక్యంలో ప్రయోగించి చూపండి. మా స్వకపోల కల్పితాలైన మాటలతో పాటు పాఠకులు సూచించిన వాటిలో కొన్ని ఎంపిక చేసి ప్రచురిస్తూ ఉంటాము.

ఈ దిగువ చూపిన విధం మీకు నచ్చితే దాన్ని ఒక మూసగా తీసుకుని మీరూ ప్రయత్నించి చూడండి. లేదా కొత్త పంధాని సూచించండి. పాఠకులు పంపిన అంశాలని ప్రచురణ సౌకర్యానికి సవరించే హక్కు మాకు ఉంది. ఇదొక ‘విక్కీ’ నిఘంటువుని తయారుచేసే ప్రయత్నంలా ఊహించుకొండి. విక్కీ విజ్ఞానసర్వస్వంలో అందరూ పాల్గొన్నట్లే ఇదీను. ఈ ప్రయత్నం దేవుడి పెళ్ళి లాంటిది; కనుక దీనికి అందరూ పెద్దలే.

ఈ నెల బేకర్స్‌ఫీల్డ్ వాస్తవ్యులు సురేంద్ర దారా కి రెండు వీరతాళ్ళు వేస్తున్నాం!

గత సంచికలో ప్రచురించిన పిలుపుకి బాగానే స్పందన వచ్చింది కానీ – ఆ వచ్చినదేదో చాలమట్టుకు ఉత్త ఊకదంపుడు స్పందన. అంటే “బాగుంది” అని అన్నవాళ్ళు కొందరు, “ఇప్పటికైనా ఈ ప్రయత్నం మొదలుపెట్టేరు, శుభాకాంక్షలు” అంటూ ముఖప్రీతికోసం కొంతమంది అన్నారు తప్ప మేము అడిగిన మాటలకి సరైన తెలుగు పదాలు సూచించిన వారు ఇంతవరకూ ముందుకు రాలేదు. కాని, “వేమూరి గారూ, దీన్ని తెలుగులో ఏమంటారు? దాన్ని తెలుగులో ఏమంటారు?” అని అడుగుతూ నాకు తరచుగా ఈ-టపాలు వస్తూనే ఉంటాయి. ఇలా ఈ నెల అడిగినవాళ్ళు ఏప్రిల్ నెల సుజనరంజనిలో వ్యాసాన్ని చూసి స్పందిస్తూ అడిగేరో లేక నాకు సాధారణంగా నా నెలవారీ కోటాలో వారి ఉత్తరాలు వచ్చేయో తెలియదు కాని కొన్ని ప్రశ్నలు రావటం వచ్చేయి.

బేకర్స్‌ఫీల్డ్ నుండి సురేంద్ర దారా, eyelashes కి తెలుగు మాట ఏమిటి? అని అడుగుతున్నారు. మనకి eyebrows అన్న మాటకి కనుబొమ్మలు (కనుబొమలు అని - మ కింద మ లేకుండా - కూడా అంటారు) అని తెలుగులోనూ, భ్రుకుటి అని సంస్కృతంలోనూ ఉన్నాయి. కనుబొమ్మలని ఇంగ్లీషులో eye diagrams అనో eye dolls అనో అనొచ్చేమో కాని, ఎంత ఆలోచించినా eyelashes కి తెలుగు మాట తట్టలేదు. ఈ eye అన్న మాటని కళ్ళు అనో, చూపులు అనో, నయనాలు అనో, లోచనాలు అనో, ఇంకా మరెన్నో విధాలుగా తెలుగులో చెప్పుకోవచ్చు. కాని lash అంటే కొరడా ఒక్కటే మెదడులో మెదులుతోంది. అలాగని “కంటి కొరడాలు” అంటే మరీ ఎబ్బెట్టుగా ఉందేమోనని భయపడుతూ ఉంటే “చూపుల తూపులు” ఉన్నట్లే “కంటి కొరడాలు” అంటే తప్పు కాదేమో అంటూ కొంచెం స్వగతంగా సురేంద్ర ఈ-టపాలో గొణుక్కున్నారు. మరేమో eyelid ని రెప్ప అనో కంటిరెప్ప అనో అంటున్నాము కదా. కనుక ఆ lid అనే మాటకి మూత కంటె సొగసైన ‘రెప్ప’ అన్న మాట దొరికినట్లే ఆ “మూత” చివర ఉన్న కేశ సంపద అని స్పురించే మాట సృష్టించవచ్చేమో అని ఊహాగానం చేసేరు, సురేంద్ర. ఇలా ఉహాగానం చేసినందుకుగాను ఆయనకి మొదటి వీరతాడు!

అప్పుడు నాలో ఉన్న సైంటిస్టు కి ఒక అనుమానం వచ్చింది: కనురెప్పల చివర వెంట్రుకల మాదిరి ఉన్నవి నిజంగా వెంట్రుకలేనా అని! (ఖడ్గమృగానికి ముట్టె మీద ఉన్న కొమ్ము నిజంగా కొమ్ము (horn) కాదు; అది కరడు కట్టిపోయిన జుత్తు! అందుకనే తెల్లనివన్నీ పాలు కావన్నారు.) ఇంతకీ మాకు eyelashes అన్న మాటకి ఇంపైన తెలుగు సేత కావాలి. ఎవ్వరికైనా తెలిస్తే చెప్పండి.

సురేంద్ర నన్ను ఇలా పద్మవ్యూహంలాంటి వ్యూహంలో ఇరికించి నేను ఇంకా బయటకి రాకుండానే నా మీద మరొక అస్త్రం వదిలేరు. “అంకెలకీ సంఖ్యలకీ తేడా ఏమిటీ?” అని. అదృష్టవశాత్తూ ఇది మా పెరట్లో పంట! నేను ఇక్కడ చెప్పే నియమాన్ని ఎవ్వరూ పట్టించుకోరు కానీ, నియమం అంటూ ఒకటి ఉండటం ఉంది. “రెండు కాని అంత కంటె ఎక్కువ కాని అంకెలు ఉంటే అది సంఖ్య అవుతుంది. ఏకాకులుగా ఉన్న అంకెలు సంఖ్యలు కావు.” ఉదాహరణకి 0, 1, 2,..,9 అంకెలు; 10, 11, .. వగైరా సంఖ్యలు అనే నియమం ఉంది కాని కొంత మంది 0, 1, 2, … ఇలా అన్నింటినీ నిర్లక్ష్యంగా “సంఖ్యలు” అని అనేస్తూ ఉంటారు. మనం భాషా పోలీసులులా ప్రపంచం అంతటి మీదా నిఘా వేసి ఉండలేము కదా. “నహి నహి రక్షతి డుకృంకరణే” అన్నారు కాబట్టి ఈ అంకెలకీ, సంఖ్యలకి నిర్వచనంలో ఉన్న తేడాలని సాగదీస్తూ కూర్చునే కంటె “అంకె అయితే నేమిరా సంఖ్య అయితే నేమిరా ఈ పాడు చేతికి ముట్టవలసిన మొత్తాన్ని ముట్టచెప్పరా!” అంటూ ఆశగా ఎదురు చూడటం లౌకికుల లక్షణం. ఈ ప్రశ్న అడిగినందుకు సురేంద్రకి రెండో వీరతాడు!!

ఇక గత సంచికలో అడిగిన communication channel అన్న ఇంగ్లీషు మాటకి తెలుగు ఏమిటో ఆలోచిద్దాం. ఏప్రిల్ 2007 ‘ఈమాట’ అనే పేరుగల అంతర్జాల పత్రికలో (చూశారా! Internnet అనే మాటకి అంతర్జాలం అనే మాట సృష్టించి చెప్పకుండా పెట్టకుండా మీ మీదకి ఎలా సంధించి ఒదుల్తున్నానో!) నేను “భయం” అనే పేరుతో ఒక కథ రాసేను. అందులో communication channel అన్న మాటకి ‘వాక్పథం’ అని వాడేను. వాక్కు అంటే నోటి మాటే కాదు, ఇంకా అనేక విస్తృతమైన అర్ధాలు ఉన్నాయి. ఈ విస్తృత దృక్పథం (wider point of view) తో చూసినప్పుడు వాక్కు అంటే communication, పథం అంటే దారి, మార్గం లేదా channel. ఈ వాక్పథం అన్న మాట నేను తయారు చేసినది కాదు; “చత్వారీ వాక్పథాలు” అని నాలుగు రకాల communication channels ఉన్నాయని ఉపనిషత్తులలో చెబుతారు. మరుగున పడిపోయిన మాటని వెలికి తీసి మళ్ళా వాడేనంతే.

ముప్ఫై ఏళ్ళ క్రితం ఒక వైజ్ఞానిక కల్పిత (science fiction) గాధ రాస్తూ signal అనే మాట వాడవలసి వచ్చింది. మనందరికీ రైలుస్టేషన్‌లో ఒక రకం signal ని చూసిన అనుభవం ఉంది. ఆ రకం signal ని ‘ధూమశకట గమనాగమన భయసూచక లోహపట్టిక’ అని ఒకరు తెనిగించేరు (సరదాకే కావచ్చుననుకోండి). కాని ఈ అనువాదం చాలా సంకుచిత పరిధిలో చేసినది. నాకు కావలసినది communication engineering లో వాడే signal. అంటే ఒక చోట నుండి మరొక చోటుకి వార్తని మోసుకెళ్ళేది. అంటే పంపవలసిన వార్తని ఒక సంకేతంగా మార్చి ఆ సంకేతాన్ని ఒక channel ద్వారా ప్రసారం చేసే పద్ధతి. అందుకని signal అన్న మాటని ‘వార్తాసంకేతం’ అని అన్నాను. మరీ పొడుగైపోయిందేమోనని కొంచెం కుదించి ‘వాకేతం’ అన్నాను. (కనిష్ఠ సామాన్య గుణిజం ని కసాగు అన్నట్లు.) ఈ వాకేతాన్ని పంపటానికి మనకి ఒక వాక్పథం కావాలి కదా. చూశారా! ఈ “వాక్” అనే శబ్దమూలాన్ని నా అవసరాలకి ఎలా మలుచుకున్నానో. “సంకేతం ఉంది కదా, మళ్ళా వాకేతం ఎందుకు?” అన్నారు, సురేంద్ర. ఈయనకి మరో వీరతాడు వెయ్యాలో ఏమిటో కాని సంకేతం static, వాకేతం dynamic.

ఇహ protein అనే మాట చూద్దాం. దీనికి తెలుగులో “మాంసకృత్తులు” అనే మాట ఉంది కదా అని మీరనొచ్చు. మాంసకృత్తులు అనే మాట పోషక ప్రక్రియల కోణంలో సృష్టించబడ్డాది కాని, శరీరభాగాలని నిర్మించే దృష్టితో కాదు. కనుక ఇంతకంటె ఇంపైన మాట మరొకటి సృష్టించి చూద్దామని నాకు బుద్ధి పుట్టింది. ఇంగ్లీషులో protein అనే మాట గ్రీకు protos నుండి పుట్టింది. ఈ మాటకి “ప్రథమ స్థానంలో ఉన్నది, అగ్రగణ్యమైనది, ముందున్నది, ముఖ్యమైనది” అనే అర్ధాలు ఉన్నాయి. మన మనుగడకి ప్రోటీనులు చాలా ముఖ్యం కదా. కనుక ఈ ముఖ్యం అనే అర్ధం స్పురించేది గానూ, “ప్రొటోస్” శబ్దానికి దగ్గరగా ఉండేదిగాను అయిన మాట కోసం వెతకటం మొదలుపెట్టేను. మన భాషలో అచ్చులు చాలా ముఖ్యం. ఈ అచ్చులని ప్రాణ్యములు అంటారు. ఎందుకని? మాటల కట్టడికి అచ్చులు చాలా అవసరం కనుక. అదే విధంగా, భాష కట్టడికి అచ్చులు ఎలాంటివో జీవి శరీరభాగాల కట్టడికి ప్రోటీనులు అలాంటివి అని అన్వయించుకుని ఈ ప్రోటీన్ అన్న మాటని “ప్రాణ్యము” అని తెలిగించేను. ఈ ప్రాణ్యములు ఒక్క మాంసంలోనే కాదు అనేక రకాల తినుభండారాలలో లభిస్తాయి కనుక ఆ “మాంస” శబ్దాన్ని వాడటానికి మనస్కరించలేదు. Xerox copy” కి photo copy కి మధ్య ఉన్న పోలిక ఎలాంటిదో మాంసకృత్తులకీ ప్రాణ్యాలకీ మధ్య ఉన్న పోలిక కూడ అటువంటిదే.

కుతూహలంతో కూతకుతలాడుతున్నవారికి మరొక విషయం. అణుగర్భంలో ఉన్న ప్రోటాను అనే మాట కూడ ఇదే తర్కంతో పుట్టింది.

Molecule అన్న మాటకీ, atom అన్న మాటకీ మధ్య తేడాని గుర్తించకుండా మనవాళ్ళు నిర్లక్ష్యంగా మాటలు వాడతారు. Atom పరమాణువైతే atom bomb పరమాణు బాంబు అవాలి, atomic enery పరమాణు శక్తి కావాలి. కాని మనం అంతా ‘అణుబాంబు’, ‘అణుశక్తి’ అని మాట్లాడతాం. Atom పరమాణువైతే atom లో ఉన్న ఎలెక్ట్రానులు, ప్రోటానులు, మొదలైనవి పరమ పరమాణువులా? (నా చిన్నతనంలో అర వెధవ, వెధవ, వెధవన్నర వెధవ అని మూడు ప్రమాణాల్లో తిట్లు తినే వాళ్ళం. అలా అర అణువు, అణువు, ఒకటిన్నర అణువు అని కూడా అనొచ్చేమో!)

ఈ వివాదాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలంటే ఈ రకరకాల వాటికన్నిటికి ఒక్క సారే పేర్లు పెట్టాలి. ‘తెలుగుభాషాపత్రిక’ లో ఎవ్వరో (నేను కాదు) molecule అంటే బహుళ అణువులు (అంటే బహుళమైన అణువుల సముదాయం అని అర్ధం) అని అన్వయం చెప్పుకుని, ఇంత పొడుగ్గా ఉన్న మాటని ఉచ్చరించటం కష్టమని, క్లుప్తంగా “బణువు” అని పేరు పెట్టేరు. కనుక అప్పటినుండి molecule అంటే బణువు, atom అంటే అణువు, subatomic particle అంటే పరమాణువు అనటం మొదలుపెట్టేను. ఈ పరమాణువులనే ఎలక్ట్రానులు, ప్రొటానులు, నూట్రానులు అంటున్నాం. ఈ పరమాణువుల గర్భంలో ‘క్వార్కులు’ అనే ఊహాత్మకమైన రేణువులు ఉన్నాయి. వీటన్నిటికి తెలుగు పేర్లు పెట్టకుండా అలా ఇంగ్లీషులోనే ఒదిలేసేను – నాకు తెలుగు పిచ్చి ఉందో ఎమిటో అని ఎవ్వరైనా అనుకుంటారో ఏమో అన్న భయంతో!

జీవరసాయన శాస్త్రం (biochemistry) లో మనకి తారసపడే బణువులు చాలమట్టుకి భృహత్ బణువులు – అంటే పెద్దపేద్ద బణువులు. ఉదాహరణకి ప్రాణ్యపు బణువు (protein molecule) ఆషామాషీ బణువు కాదు – చాలా పెద్ద బణువు, లేదా భృహత్ బణువు (megamolecule). రక్తచందురం (hemoglobin) మరొక భృహత్ బణువు.

ఇక్కడితో నా సోది ఆపి విక్రమార్కుడి కథలో లా …. వచ్చే నెలకి ఈ దిగువ ఇచ్చిన మాటలకి తెలుగు మాటలు తయారు చెయ్యండి. చేసి వీరతాడు వేయించుకొండి!

మీ ఊహలు vemurione@yahoo.com కి పంపండి.

  • hardware
  • software
  • chromosome
  • eyelashes
  • light year
  • vaccination

డా. వేమూరి: నవీన తెలుగు సాహితీ జగత్తులో పరిశోధకులుగా, విజ్ఞానిగా వేమూరి వెంకటేశ్వర రావు గారు సుపరిచితులు. తెలుగులో నవీన విజ్ఞాన శాస్త్ర సంబంధ వ్యాసాలు విరివిగా వ్రాయటంలో ప్రసిధ్ధులు. విద్యార్ధులకు, అనువాదకులకు, విలేకరులకు పనికొచ్చే విధంగా శాస్రీయ ఆంగ్ల పదాలకు తెలుగు నిఘంటువును తయారు చేయడం వీరి పరిశ్రమ ఫలితమే. సరికొత్త పదాలను ఆవిష్కరించడంలో వీరు అందెవేసిన చేయి. కలనయంత్ర శాస్రజ్ఞుడిగా వృత్తిలోను, తెలుగు సాహిత్యంపైన లెక్కించలేనన్ని వ్యాసాలు వ్రాస్తూ, ఉపన్యాసాలు ఇస్తున్నారు.