ఈ శతాబ్దపు సంగీత కళానిధి - డాక్టర్ శ్రీపాద పినాకపాణి

-- ఈరంకి వెంకట కామేశ్వర్

తమ తమ రంగాలలో నిష్ణాతులై, విశిష్టత పెంపొందించుకుని, పేరు ప్రఖ్యాతులనార్జించి "గొప్పతనం" సాధించిన తెలుగువారెందరో ఉన్నారు. వాళ్ళు యెదుర్కున్న ప్రతిబంధకాలు, సంక్లిష్ట పరిస్థితులు; అనుభవించిన నిర్భందాలు, పడిన ఆవేదన, చేపట్టిన దీక్ష, చేసిన కృషి, సాధన; కనపరచిన కౌశలం, సాధించిన విజయాలు, ఆ విజయ రహస్యాలు, ఇలాటి విషయాలని పరిశీలించి, సమీకరించి, పొందు పరచి ఈ కధనాలలో మీ ముందు ప్రస్తుతీకరిస్తున్నాం.

ఈ శతాబ్దపు అద్భుత సంగీత విద్వాంసుడు, మధుర గాయకుడు, సంగీత కళానిధి పద్మ భూషణ్ - డాక్టర్ శ్రీపాద పినాకపాణి. సంగీత కళాభివృద్దికి విశిష్ట కృషిచేసి, భావి తరాలకు అందించాలన్న కుతూహలంతో అనేక సంగీత రచనలు కావించారు. తన శిష్య, ప్రశిష్యులకు సంగీతంలోని మెళకువలు నేర్పించిన సంగీత శాస్త్ర విశారదుడు. వృత్తిరీత్యా ఓ ప్రముఖ డాక్టర్, పరిపాలనా దక్షుడు, అచార్యుడు, కర్ణాటక సంగీతంలో గొప్ప విద్వాంసుడు. సంగీత జగత్తులోని మేటి రత్నాలు నేదునూరి కృష్ణ మూర్తి గారు, వొల్లేటి వెంకటేశ్వరులు గారు, నూకల చిన సత్యనరయణ గారు, మల్లాది సోదరులు ఈ బ్రహ్మజ్ఞాన విశారదుని శిష్యులే.

శ్రీపాద పినాకపాణి గారు ఆగస్టు 3, 1913 లో జన్మించారు. వీరు కర్నూలు జిల్లా వాస్తవ్యులు. కర్నూల్ జిల్లా ఆరోగ్య ఆసుపత్రిలో ఆరోగ్య సాఖ, వైద్యా కళాశాల అధిపతిగా వ్యవహరించారు.

డాక్టర్ శ్రీపాద పినాకపాణి

టి వాసుదేవన్, ఆర్ రంగరమానుజ ఐయ్యంగార్ పినాకపాణి గారి విద్యాగురువులు. కొన్ని నెలలు "వయొలిన్" విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడిగారి స్కూల్లో గడిపేరు. పినాకపాణి గారికి అరియక్కుడి రమానుజఐయ్యంగార్, వీణా ధనమ్మళ్ మీద యెంతో గురి, అభిమానం. ఆయన చిన్నతనంలో ఊళో ఏ కచ్చేరి జరిగినా, అయన గురువు, లక్ష్మణ రావుగారు తీసుకెళుతూ ఉండేవారు. స్రద్ధగా వినే పినాకపాణి గారికి సంగీత వికాసానికి ఇది దోహదం చేసింది.

"కళ, కళ కోసమే" ("ఆర్ట్ ఈస్ ఫర్ ఆర్ట్ సేక్") అని వీరి భావన. "సంగీతం కూడా దేవుడిని ఆరాధించే మార్గం", అని ఓ సందర్భంలో అన్నారు.

త్రికరణశుద్ధిగా సంగీత సాధనలో జీవితం సాగించిన పినాకపాణి గారు, సంగీత శాస్త్ర విద్యావ్యాప్తికి విశిష్ట కృషి చేసారు. రాగ-భావ యుక్తమైన సంగీత స్వరాలు రూపొందించడమేకాక, తన సంగీత ప్రావీణ్యంతో, మధుర కంఠంతో ఆలాపించి జన హృదయాలలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు.

పినాకపాణి గారి సోదరి చిన్నతనంలో మైసూర్ బి ఎస్ లక్ష్మణ రావు గారి వద్ధ సంగీతం నేర్చుకుంటూ ఉండేది. ఆమె సాధన చేసేటప్పుడు, తప్పులు పట్టుకుని సరిదిద్దే వారు పినాకపాణి గారు. తండ్రి, రావు గారి ప్రోత్సాహ ప్రోద్భలంతో పదకొండవ యేట సంగీతం నేర్చుకోవడం మొదలు పెట్టేరు పినాకపాణి. పినాకపాణి గారు స్వరకల్పనతో నేర్చుకున్న తొలి కృతి - "గజానన సదా యనుచు" (థోడి).

అంకెలని కూడా మేలకర్త రాగ అంకెలతో (నంబర్స్) అనుసంధానం చేస్తూ ఉండేవారు. తన టెలిఫోన్ నంబరు - రత్నాంగీల నడుమ, రెండు చారుకేశులు అని, కారు నెంబరు 3654 - చక్రవాల శంకరాభరణం అని చమత్కరించారు.

"వినగా, వినగా, వినికిడి తో రాగాలు పాడగలిగిన అనుభవం వస్తుంది. అందుకనే సంగీతం యదావిధిగా నేర్చుకున్న విద్యార్ధులకు కూడా రాగం పాడే శక్తి రావడంలేదు. ప్రసిద్ధ రాగాలను వ్రాసిచ్చి, వాటిని కంఠోపాఠంగా వచ్చే వరకు చెప్పి, పాడించాలి. విద్వాంసులు పాడే రాగాలాపనలను నిరంతరం వింటూ ఉండడం అన్నిటికంటే యెక్కువ అవసరం. స్వరకల్పన పాడుతూ పాడించినట్లే రాగం కూడా గురువు నేర్పించాలి" అని పినాకపాణి గారు తన సంగీత జ్ఞాన అనుభవంతో ఉదాహరించారు.

స్వయం కృషి

స్వయంకృషి మీద పినాకపాణి గారికి ప్రగాడ విశ్వాసం. యెందరో మేధావుల సంకీర్తనలు విని, విశ్లేషించి, మెళకువలు నేర్చుకుంటూ ఉండేవారు. మంచి అవగాహన యేర్పరచుకుని తనదైన శైలి (స్టైల్) ని నెలకొల్పేరు. సంగీతకారుల్లో ఈ లక్షణం అరుదైనా పినాకపాణి గారిలో విలక్షణంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది వీరి ప్రత్యేకత. రాగంలో ఇమిడీకృతమై, అంతర్భాగమై ఉన్న వివరాలను నిశితంగా విశ్లేషించి శిష్యులకు నేర్పేవారు.

డాక్టర్ శ్రీపాద పినాకపాణి నిరంతర పరిశ్రమతో, సంక్లిష్టమైన, విషయాలను సమన్వయించి నిశితంగా పరిశీలించి, విశ్లేషించి రాగ యుక్తంగా శిష్యులకు నేర్పేవారు. గమకానికి యెంతో ప్రాదాన్యం ఇచ్చారు. సంగీతానికి రాగమే జీవనము. వర్ణము, కృతి పదము, జావళీ ఏ రచన గానం చేసినా, ఒక రాగస్వరూపమును స్వరగమకాది భూషణములతో అలంకరించి మనోహరంగా చిత్రించడమే వీరి ధ్యేయం.

అప్పటికే రాణిస్తున్న నేదునూరి కృష్ణమూర్తి గారు, ఇంకా యెంతో నేర్చుకోవాలన్న జిజ్ఞాసతో పినాకపాణి గారిని ఆశ్రయించి వారి వద్ద గమక మెళకువలు నేర్చుకోవాలన్న కుతూహలం వ్యక్తం చేసి నప్పుడు సంతోషంగా అంగికరించి హృదయం లోతుల్లోంచి వెల్లు వెట్టిన సంగీతం నేర్పించారు పినాకపాణి గారు. కనపరిచిన వాత్సల్యం, చూపిన శ్రద్ధ గురు, శిష్య, ప్రశిష్య అనుసంధాన హేతువులైయాయి.

"తెలుగు విద్వాంసులు చేసే పాటకచ్చేరీలలో హాలు నాల్గవ వంతు జనం ఉండరు. తమిళ విద్వాంసులు పాడే సభలకు రసిక జనంతో హాలు నిండిపోతుంది. యెందుకో అందరూ ఆలోచించాలి" అని తన పుస్తక పీఠికలో పేర్కొన్నారు పినాకపాణి గారు. పాటలలో నాణ్యత, రుచి, కల్పనాచాతుర్యం, నిత్య నూతనత్వం ఉంటే, జనాకర్షణ తప్పక ఉంటుంది అని వారి అభిప్రాయం వ్యక్తం చేసారు.



గడించిన చిర కీర్తి, అందుకున్న సన్మానాలు, మన్ననలు:

శాస్త్రీయ సంగీత విద్వాంసుల సమక్షంలో "ఓ హో" అనిపించుకున్న మహనీయుడు పినాకపాణి గారు పలు మన్నలను, పురస్కారాలను అందుకున్నారు.

- సంగీత కళానిధి గౌరవం (1983)
- సంగీత నాటక ఎకాడమి అవార్డు (1977)
- భారత ప్రభుత్వం నుండి పద్మ భూషణ్ పురస్కారం (1984)
- తెలుగు విశ్వవిద్యాలయం లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారం (2005)
- గుప్తా అవార్డు (1993)

పినాకపాణి గారికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం - జి వి సుబ్రహ్మణ్యం గారు, ఉత్తర అమెరికా శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ - శ్రీరాం శొంటి, శరదా ఫూర్న గార్ల చేతులమీదుగా, జీవిత పురస్కారం (లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారం) అందుకున్నరు.



సంగీత రచనలు:

సంగీత ప్రపంచంలో శ్రీపాద పినాకపాణి గారిని గురించి తెలియని వారుండరు. శ్రీ పినాకపాణి గారు ఏ ఇతర వాగేయకారులు చేయని అద్బుతమైన కార్యాలు చేసారు. శాస్త్రీయ సంగీత లక్షణ విశేషాలు, గీతాలు, స్వరజతులు, స్వర పల్లవులు, తాన పద వర్ణములు, కృతులు, పదములు, జావళ్ళీలు ఇత్యాది సంగీత రచనలను కూలంకషంగా చర్చించారు - సంగీత సౌధాన్ని అధిరోహించారు. సంగీత విద్వాంసుడు, మహా కోవిదుడు ఐన పద్మభూషణ్ డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారు భావి తరాలకు అందిచే ప్రయత్నంలో పలు సంగీత రచనలు చేశారు. వీరి రచనలు -
- గానకళసర్వస్వము
- మనోధర్మ సంగీతము (1992)
- పల్లవి గానసుధ
- సంగీత సౌరభము (1995)

గానకళసర్వస్వము - ఈ పుస్తకం కృతులపై నిశితమైన విశ్లేషణ, వివరణలు అందించాయి.

మనోధర్మ సంగీతం - తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించింది. నెరవు పాడడానికి రాగజ్ఞానము, లయజ్ఞానము అవసరం. నెరవు ఏ విధంగా నడపాలో వినికిడి జ్ఞానంతో గ్రహించాలి. అలా గ్రహించక పోతే విద్యార్ధికి గురువు పాఠాలు వ్రాసినట్లే నెరవు కూడా వ్రాసి అభ్యాస సంగీతం లాగా నేర్పించాలి.

పల్లవి గానసుధ - సమస్త పల్లవులూ ఈ రచనలో ఇమిడి ఉన్నాయి. 162 పల్లవి లు చోటు చేసుకున్నాయి. 22 పల్లవులు ధారాళంగా వివరించబడ్డాయి.

సంగీత సౌరభము (1995) - ఈ సంగీత యజ్ఞ కృతి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించింది - ఇందులో స్వరపరచిన ఇరవై ఐదు అన్నమయ్య కృతులు, జావళీలు, తిల్లానాలు మొదలైన 276 రచనలు ప్రధమ సంపుటిలో ఉన్నాయి. 110 రాగ లక్షణాలు వివరించ్చబడ్డాయి.

సంగీత సౌరభము లో త్యాగరాజు కృతులు 607; ముత్తుస్వామి దీక్షితుల కృతులు 173; శ్యామ శాస్త్రి, సుబ్బరాయ శాస్త్రుల కృతులు 34; పినాకపాణి అన్నమాచార్యుల కృతులు 105; పదములు 44; జావళీలు 40; తానవర్ణములు 56; తిల్లానాలు 10; తిరుప్పుగళ్ 16; మొత్తం మీధ 1090 సంగీత రసగుళికలు నాలుగు సంపుటాలలో వెలువడించారు. "రసవంతముగా రచయింపబడిన కృతి పుష్ఠివంతంగా వుంటుంది. కృతి సంపద విశేషంగా ఉన్నచోట రాగజ్ఞానం పెరుగుతుంది. కృతిని బట్టి రాగము, రాగాధారముచే కృతి పరస్పరాభివృఇద్ధి చెందుతూ సంగీత జ్ఞానం ఇనుమడిస్తుంది" అని పినాకపాణి గారు ఈ పుస్తక పీఠికలో వర్ణించారు.

మేళరాగమాలిక - ఇందులో 72 మెళకర్త రాగలు, ఆది తాళంలో ఉన్నాయి. ఒక్కక్క మేళకర్తను యెలా పాడాలో నిశితంగా వ్రాసారు పినాకపాణి గారు.

పినాకపాణి గారి ఈ గ్రంధ రచన కారణాలు విశ్లేషిస్తే సుస్పష్టమయ్యే దేమిటంటే - "ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులలో సంగీత లక్ష, లక్షణ సంప్రదాయము నిబద్ధమై ఉంటుంది. అటువంటి కృతులను కనీసము వెయ్యింటినైనా సేకరించి వీలైనంతమట్టుకు వివరములతో స్వరపరచి ఆంధ్ర యువతరానికి కందజేయగలిగితే, వారి కృతి సంపదతోపాటు సంగీత జ్ఞానం, సంగీతపు బాణి, గీటుకందిన అంతస్థు చేరుకుంటాయి" అనే ధీమాతో చేసారు ఈ గ్రంధ రచనలు.

సంగీత సాధనకి, వ్యాప్తికి పినాకపాణి గారు వివరించిన చతుర్పాద క్రమాలు ఇవి.
- ముందు శైలి (స్టైల్) నేర్చుకోవాలి.
- సాధన చేసి అవపోషణ చేయాలి.
- సభలు, కచ్చేరీల ద్వరా వాటిని వ్యాప్తింప చేయాలి.
- భావి తరాలకి అందించడానికి పుస్తకాలు ప్రచురించాలి.

శ్రీపాద పినాకపాణి శిష్య-ప్రశిష్యులు:

శ్రీపాద పినాకపాణి శిష్యులు మెరికలు. కర్ణాటక సంగీత ప్రముఖ గాయకుడు, శ్రీ వోలేటి వెంకటేశ్వరులు (1928 - 1989) పినాకపాణి గారి శిష్యుడే. ఒలేటి గార్ని ఉద్దేశించి పినాకపాణి ఇలా అన్నారు: "నా శిష్యుడు సరే, కాని వొలేటి యంతటి మేధావి!. ఆంధ్రావనిలో పుట్టిన అత్యంత ముఖ్య సంగీతకారుడు. ఇలాటి వ్యక్తి మళ్ళి పుడతారో, లేదో". మనలో మాట, జన హృదయాలలో చెరగని ముద్ర వేసిన ఆల్-ఇండియా రేడియో లో విలువడే సుప్రసిద్ధ కార్యక్రమం - "భక్తిరంజని" వోలేటి వారి రూపకల్పనే.

పినాకపాని గారు తన శిష్యులు, ప్రశిష్యులు పట్ల యెంత స్నేహ పూర్వకంగా, నిష్కల్మషంగా, ఆదరణతో వుండేవారో, ఆయన సంస్కారం యెంత పరిణితి చెందిందో వేరే చెప్పనక్కరలేదు. ఈ గురు, శిష్య, ప్రశిష్యల పరస్పర ఆదరణలు ఆదర్శప్రాయం.

నేదునూరి గారికి యెంత గురు భక్తి అంటే - తన తనయుడికి గురువుగారి పేరే పెట్టుకున్నారు.

నవంబరు 2005లో పినాకపాణి గారి శిష్యులు, గురువుగారిని ఘనంగా సన్మానించారు. కదలేని స్తితిలో ఉండడంవల్ల ఆయన శిష్యులు - నూకల చిన్న సత్యనారాయణ గారు, నేదునూరి కృష్ణ మూర్తి గారు, మల్లాది సోదరులు, గురువుగారి ఇంటనే జరిపిన సభలో మూడు సి డీ లు, సంస్కృత పండితులు శ్రీ గడియారం రామకృష్ణ శర్మ గారు ఆవిష్కరించారు.



తొంభైనాల్గవ యేటా శారీరికకంగా కాస్త బలహీన పడ్డా, ఇంకా శ్రావ్యంగానే పాడగలుగుతున్నారు. నిస్సందేహంగా ఈ శతాబ్దపు అద్భుత సంగీత కళానిధి డాక్టర్ శ్రీపాద పినాకపాణి.