ఏమని
పొగడుదుమే ఇక
ఏమని పొగడుదుమే
యిక ని(న్ను)ను
ఆమని సొబగుల అలమేల్మంగ || ఏమని ||
తెలికన్నుల నీ
తేటలే కదవే
వెలయగ విభునికి వెన్నెలలు పులకల మొలకల
పొదులివికదవే
పలుమరు పువ్వుల పానుపులు || ఏమని ||
తియ్యని నీమోవి తేనెలే కదవే
వియ్యపు రమణుని విందులివి
ముయ్యక మూసిన మొలక నవ్వుకదె
నెయ్యపు కప్రపు నెరిబాగాలు || ఏమని ||
కైవసమగు నీ
కాగిలె కదవే
శ్రీ వేంకటేశ్వరు సిరినగరు
తావుకొన్న మీ తమకములే కదే
కావించిన మీ కల్యాణములు || ఏమని ||
అమ్మ అలమేల్మంగమ్మ ప్రకృతి స్వరూపిణి! ఆమని
సొబగులను (వసంతఋతువులోని ప్రకృతి అందచందాలను)
కైవశం చేసుకున్న ఈ జగదేక సుందరి తన తెలికన్నుల
వెన్నెల కురిపిస్తూ స్వామివారికి ఆనందాన్ని
కలుగజేస్తుంది. మోసులెత్తిన ఆశల ఊహలే
వారిరువురి పూలపాన్పు! అమ్మవారి అధరమధురామృతం
అయ్యవారికి తేనె విందు! ఆమె మొలకనవ్వే ఆతనికి
తియ్యని తాంబూలం! అమ్మవారి నులివెచ్చని కౌగిలి
అయ్యవారికి సిరులనగరు (అంతఃపురం) ఆదిదంపతులైన
వారిరువురి తమకాలు లోకకళ్యాణాలు!
ఆమని=వసంతకాలం;
తెలికన్నులు=తెల్లని కన్నులు ;
కప్రపునెరిబాగాలు=కర్పూర తాంబూలం ;
మొలక నవ్వు=చిరునవ్వు ;
తమకము=మోహము
ఏమి
చెప్పేదిది
ఏమి చెప్పేదిది యీశ్వర మాయలు
దీము ప్రతినకును త్రిజగము కలిగె
మల మూత్రంబుల మాంసపు ముద్దకు
కులగోత్రంబుల గురి కలిగె
తొలులు తొమ్మిదగు తోలు తిత్తికిని
పిలువగ పేరును పెంపును కలిగె
నెత్తురు నెమ్ముల నీరు బుగ్గకును
హత్తిన కర్మములటు కలిగె
కొత్త వెంట్ర్లుకల గుబురుల గంతికి
పొత్తుల సంసార భోగము కలిగె
నానా ముఖముల నరముల పిడుచకు
పూనిస సిగ్గులు భువి కలిగే
ఆనుక శ్రీ వేంకటాధిపు డేలగ
దీనికి ప్రాణము తిరముగ కలిగె
ఈ నిలుకడ లేని శరీరాన్ని
గురించి ఏమి చెప్పేది? ఇదంతా యీశ్వరమాయే!
మలమూత్రమయమై, నవరంధ్ర భరితమై, రక్తమాంసాలతో
కూడి ఉన్న ఈ శరీరానికి కులము, గోత్రము, పేరు,
పెంపు, కర్మ, సంసారము, మొదలైన మాయావిషయాలు
జతకూడాయంటున్నాడు అన్నమయ్య! ’కొత్త వెంట్రుకల
గుబురుల గంతికి పొత్తుల సంసారబోగాలు కలిగె’
అన్నచోట వెంట్రుకలను కత్తిరించిన వెంటనే మరల
కొత్త వెంట్రుకలు రావడం సహజం! అలాగే జీవి ఈ
సంసారం నుండి వేరయిన తర్వాత ( అంటే మరణించిన
తర్వాత ) మరో సంసారబంధంలో
పడిపోతున్నాడు!
అలాగే అశాశ్వతమైన శరీరానికి అశాశ్వతమైన
కులగోత్రాలు మొదలైనవి జతకూడగా,
శాశ్వతుడైన తిరువేంకటేశుడు శాశ్వతమైన
ప్రాణానికి (ఆత్మకు)
జత కూడాడట!
అదీ తిరమైనది (శాశ్వతమైనది)
అని అన్నమయ్య అద్భుతంగా
వివరిస్తున్నాడు.
దీము = ఎర;
తోలుతిత్తి =
శరీరము, దేహము;
గంతి = గ్రంధి;
తొలులు =
రంధ్రములు
|