చిత్రకళా స్రష్ఠ - వడ్డాది పాపయ్య (వపా)

                                                                 నం.

 

తమ తమ రంగాలలో నిష్ణాతులై, విశిష్టత నాపదించుకుని, పేరు ప్రఖ్యాతలనార్జించి "గొప్పతనం" సాధించిన
తెలుగువారెందరో ఉన్నారు.వాళ్ళు యెదుర్కున్న ప్రతిబంధకాలు, సంక్లిష్ఠ పరిస్థితులు, అనుభవించిన నిర్భందాలు, పడిన ఆవేదన, చేపట్టిన దీక్ష, చేసిన కృషి, సాధన, కనపరచిన పరాకాష్ట, సాధించిన విజయాలు, ఆ విజయ రహస్యాలు, ఇలాటి విషయాలని పరిశీలించి, సమీకరించి, పొందుపరచి ఈ కధనాలలో మీ ముందు ప్రస్తుతీకరిస్తున్నాం.


తెలుగు సాహిత్యం చదివిన వారిలో " చందమామ ", " యువ " పత్రికలు కొంతవరకైనా చదవని వారు ఉండరు. కాలానుగుణముగా ఈ పత్రికలకు లక్షల అభిమానులను సంపాయించుకున్నాయి. అవి అంత జనాదరణ పొందడానికి కారణం చక్కటి కధలు, వాటితో ఉండే సందర్భోచిత కధా చిత్రాలు. ముఖ చిత్రం కూడ తన దైన
శైలిలో ప్రత్యేకత ఉట్టిపడుతూంటుంది. ఆ ఊహా చిత్రాలను తన మనస్సులోంచి, కుంచెతో రూపుదిద్ది జీవం పోశారు శ్రీ వడ్డాది పాపయ్య (వపా) గారు. చూడడానికి మధ్య కాయం, సౌమ్యుడు, మితభాషి, ఆధ్యాత్మిక చింతకుడు, గొప్ప ఊహాతో పాటు, అనూహ్యమైన హస్త నైపుణ్యం గల మేటి చిత్రకారుడు. రూపకల్పనలు - చిత్రకళా నిపుణత, ఈ రెండిటి సమ్మేళణంతో - అలరించే చిత్రాలు రూపొందించారు. ఆ చిత్రాలు చూసిన వారికి వాటి పట్ల కొంత ఆకర్షణ కలుగుతుంది. ఎందుకంటే భారతీయ కళలకు అద్దం పట్టడంతో పాటు - ఓ ప్రత్యేక శైలికి నాంది పోసి, భావంతో పాటు సందర్భోచితముగా, కథా చిత్రాలను రూపొందిస్తూ వచ్చారు. వపా చిత్రాలలో భావోచ్చరణ ప్రస్ఫుటముగా ఉండి, విభిన్న రంగులతో కళ్ళని ఇట్టే ఆకట్టుకుంటాయి - చిత్ర కళారూపాలకు ఓ కొత్త ఒరవడి చాటుతూ, మానసికోల్లాసం కలిగిస్తాయి. ఒక్క సారి చక్షువులు చూసాయంటే అవి మనో చిత్రపటాలు నిర్మించుకుంటాయి. " అవును ఎంత బాగుంది " అని తలపిస్తూ, మదిలో తలచుకున్నప్పుడు " చిత్రం అంటే ఇలా వుండాలి " అని అనిపిస్తూ, ఆ చిత్రాలు అలవోకగా మళ్ళీ స్పురణకు వస్తాయి. ఇలా జన మనస్సులలో చెరగని ముద్ర వేసి ఓ విశిష్ట స్థానాన్ని సంపాయించుకున్నాయి. కాలక్రమేణా మిగతా వారు ఈ చిత్రానుకరణ చేసినా దానికి ఆధ్యం పోసిన ఘనత, అగ్రపీటం వపా గారిదే.

దివ్య పురుషులను, దేవతలను వపా చిత్రాలు కళ్ళకి కట్టినట్టు చిత్రీకరించారు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు చక్రపాణి గారి " చందమామ " పత్రిక చిత్రాలను తన కుంచతో తీర్చి దిద్దారు వపా గారు. వారి చిత్రాలు కధలను కళ్ళకి కడతాయి. తెలియకుండానే చదువరుల హృదయం ఆకట్టుకుంటూ, మనసులను రంజింపజేస్తాయి. హింది సినీ రంగ సుప్రసిద్ధ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా చందమామాభిమాని అని, చిన్నతనం నుండి చదివేవాడినని ఓ సందర్భంలో చాటుకున్నారు.



చిత్రకళా స్రష్ట - వడ్డాది పాపయ్య (వపా)

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో స్థిరవాసం చేసుకొని ఉన్నా, పాపయ్య గారు తన వృత్తి రీత్యా యావత్ భారతం
పరివ్యాప్తించి ఉన్నారు. ఎందుకంటే దాదాపు యాబై ఏళ్ళ పాటు - " చందమామ " పత్రిక ముఖ చిత్రాలు, కధా చిత్రాల ద్వారా తన కుంచెతో చిత్రకళాద్భుతాలు సృస్టిస్తూ కధలను కళ్ళకి కడుతూ దేశంలో చదువరుల అభిమానాన్ని సంపాయించుకుంటూ వచ్చారు. వపా గారికి చిత్రకళా జగత్తులో ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే, ఆయన కుంచెతో రూపం దాల్చిన చిత్రాలేవి చూసి గీసినవి కావు. తాను ఆకళించుకున్న ప్రాచీన సాహిత్యాన్ని,వాటి
సారాన్ని ముడి సరుకుగా చేసుకుని, ఊహలతో జోడించి, వాస్తవికాన్ని చాటుతూ, అత్యంత అకర్షణీయంగా ఉంటాయి. రంగుల సమ్మేళనంతో చిత్రాలు చక్షువులను ఆకట్టుకుని, మానసికోల్లాశం కలిగించే టట్టుగా ఉంటాయి. ఇది వపా ప్రత్యేకత, లేదా శైలీ అనవచ్చు. ఈ ఒరవడి మరే చిత్రకారుడిలోను కానరాలేదు.

ఈయన చిత్రాలు భారతీయ శిల్ప కళా సంపత్తిని చక్కగా ప్రతిబింబిస్తాయి. ఇది వపా మరో ప్రత్యేకత అని చెప్పవచ్చు. తెలుగు చదువరులు మరచిపోలేని " చందమామ - ముఖ చిత్రాలు " ఈయన చిత్రకళా సృష్టే. చందమామతో పాటు " స్వాతి " - వార, మాస పత్రికలలో దశాబ్దానికి పైగా చిత్రాలు గీసారు.


బాల్యం, చదువు, చిత్రకళా రంగప్రవేశం:

సెప్టంబరు 10, 1921 లో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర, శ్రీకాకుళం జిల్లాలో నాగావళీ నదీ తీరంలో రామమూర్తి, మహాలక్ష్మి
దంపతులకు - జన్మించారు. తన ఐదవ ఏట నుండి చిత్రాలు గీస్తూ వచ్చారు. వారి ఇంట్లో ఉన్న రవివర్మ చిత్రం " కోదండ రామ ", ఆయనపై ప్రభావం చూపింది. తండ్రి చిత్రకారుడు (అధ్యాపకుడు) కావడంతో చిత్ర కళలోని సులువులు నేర్చుకోవడం సునాయాసమయ్యింది. తండ్రి వివరించిన భారత, భాగవతాల సారాన్ని బాగా ఆకళించుకున్నారు. వీరి జీవితాంతం అవి విడదీయలేని పనిముట్లుగా నిలిచాయి.

1947 లో నూకరాజమ్మ తో వివాహబంధం ఏర్పడింది. దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు తన పత్రికలో పాపయ్య గారి చిత్రాలు ప్రచురించి ప్రోత్సహించారు. చందమామ, యువ, స్వాతి, అభిసారిక, ఆంధ్ర పత్రిక, భారతి, ఆంధ్రజ్యోతి తదితర పత్రికలలో చిత్రాలు గీశారు. వీరికి ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె. వపా కాశీంకోటలో స్థిరవాశమేర్పరచుకుని నివసించారు.


వపా కుంచె సృష్టి - " చందమామ " ముఖ చిత్రాలు

వపా తెలుగు సాహిత్యాభిమానులకు తన చిత్రాల ద్వరా సుపరిచితులే. చందమామ పత్రిక ముఖ చిత్రాలు, విభిన్న కధా చిత్రాలు రూపొందించి, చదువరులను, విశేషించి వారి అభిమానాన్ని ఆకట్టుకున్నారు. ఒకటా రెండా, ఏకంగా యాబై యేళ్ళ పాటు చిత్రాలు గీస్తూనే ఉన్నారు. చందమామను పోలిన అనేక పత్రికలు చోటు చేసుకున్నా, చందమామ ప్రత్యేక దృక్పథాన్ని, పరంపరను సాధించలేక పోయాయి.ప్రముఖ రసాయన శాస్త్రవేత్త, చిత్రకారుడు నేమాని కృష్ణమూర్తి గారు వడ్డాది పాపయ్య గారి వద్ద కొంత కాలం శిష్యరికం చేసి తన హస్తకళకు మెరుగులు దిద్దుకున్నారు. మరో చిత్రకారుడు - శక్తిదాస్ కూడా పాపయ్య గారి శిష్యుడే. నవలా రచయిత, కధకులు ముద్దంసెట్టి హనుమంత రావు గారు కూడా వపా శిష్యులే.

" 0 / 0 గుర్తు "

తన చిత్రాలమీద " 0 / 0 " ముద్రా సంతకం చేసేవారు. వపా వివరణ ఏమిటంటే - " గతం శూన్యం; వర్తమానం శూన్యం; ఉండేది భవిష్యత్తే ". ఈ తలంపు ఆయనలోని తత్వజ్ఞుడిని పరిచయం చేస్తోంది. భారతీయ తత్వాన్ని ఎంత లోతుగా ఆకళించుకున్నారో అర్ధమవుతోంది.

రచనా కౌసలం:

కళాచిత్రాలతో పాటు తన రచనా కౌసలం కూడా చాటారు వపా గారు. చందమామలో కొడవటిగంటి కుటుంబరావు గారు  మొదలెట్టిన " దేవి భాగవతం " కధలను పూర్తి చేశారు. ఇది కాక " విష్ణు కధ " పౌరాణిక ధరావాహికంగా వ్రాశారు. గొప్ప కోసం ఏనాడు పాకులాడలేదు. కీర్తి ప్రతిష్ఠలను ఆశించలేదు. ఆయనకి అసలు ఆ చింతనా లేదు. తత్వ జ్ఞానాన్ని, లౌకిక అనుభవ సారాలను రంగరించుకుని, ఊహలతో జోడించి, కళాద్భుతాలు రూపొందించారు.

డిశంబరు 30, 1992 లో భౌతికాన్ని వీడి ఊర్ధ్వ లోకాలకు వెళ్ళిపోయారు. ఆయన్ని గుర్తిస్తూ, ఆంధ్ర ప్రదేశ్ లో, కోసన సాంస్కృతిక అకాడమి, ఔత్సాహిక చిత్రకళా కారులకి వడ్డాది పాపయ్య పురస్కారం అందిస్తోంది. తెలుగు చదువరులు ప్రతీ ఒక్కరూ మరచిపోలేని " చందమామ - ముఖ చిత్రాలు" జన హృదయాలలో పది కాలాలు నిలచిపోతాయి. కొందరు అభిమానులు - వడ్డాది పాపయ్య గారి మీద తీ వీ డాక్కుమెంటరీ చిత్రం రూపొందించారు.

వడ్డాది పాపయ్య గారి చిత్రాలు - భారతీయ కళా తత్వాలను ప్రతిబింబించడంతో పాటు - తనదైన ఓ పద్ధతిని అందించటంతో పాటు, సందర్భోచితంగా భావంతో ఉన్న కధా చిత్రల రూప కల్పనాధ్యుడిగా నిలచిపోయారు. వారి కుంచెతో విలువడిన కళా ఖండాలు అనేక చిత్రకారులకు స్పందన కలిగించటంతో పాటు, మెళుకువలు సూచిస్తూ, చిత్ర కళానుకరణం గా నిలిచాయి
 

 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech