బొమ్మకంటి సత్యనారాయణ రావు చెప్పిన "హైదరాబాదు స్వాతంత్ర్య పోరాటం"

- వనం జ్వాలా నరసింహారావు

    

సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచనా-విలీనమా అని వాదనలు చేస్తున్న వారెవరూ ఆ రోజుకున్న ప్రాధాన్యతను-దాని నేపధ్యాన్ని ప్రస్తావించడం లేదు. హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి చేసి, స్వతంత్ర భారతావనిలో కలిపేందుకు సెప్టెంబర్ 13, 1948న మొదలయిన పోలీస్ యాక్షన్, కేవలం నాలుగైదు రోజులలోనే ముగిసి, యావద్భారత ప్రజల ఆనందోత్సాహాల మధ్య, హైదరాబాద్ రాజ సంస్థానం సెప్టెంబర్ 17, 1948న భారత దేశంలో విలీనమయింది. అప్పటి వరంగల్ జిల్లా, ఇప్పటి ఖమ్మం జిల్లా, బోనకల్లు గ్రామానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, స్వర్గీయ బొమ్మకంటి సత్యనారాయణ రావు రాసిన పాతిక సంవత్సరాల క్రితం జరిగిన స్వాతంత్ర్య సమరయోధుల క్లుప్తమైన చరిత్రను, "హైదరాబాదు స్వాతంత్ర్య పోరాటం" శీర్షికతో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక మాస పత్రిక "ఆంధ్ర ప్రదేశ్" సుమారు నాలుగు దశాబ్దాల క్రితం ప్రచురించింది. బ్రిటీష్ సామ్రాజ్యపు పటిష్టమైన చిట్టచివరి దుర్గం హైదరాబాద్‌ సంస్థానమని, అక్కడి ప్రజలు నిరంకుశ నిజాం ప్రభువుల బానిసలని, ఆ పాలనను ఎదిరించిన వారందరినీ నిజాం పోలీస్ దౌర్జన్యంతో అణచివేసే ప్రయత్నం చేశాడని, అంధకారంలో మగ్గుతున్న ప్రజలకు విముక్తి కలిగించేందుకు తమ సర్వస్వాన్ని ధారపోసి రాష్ట్ర ప్రజలకు వెలుతురును ప్రసాదించిన అ నాటి సమరయోధులను జ్ఞప్తికి తెచ్చుకుంటూ తాను ఆ వ్యాసం రాస్తున్నానని బొమ్మకంటి పేర్కొన్నారందులో. బొమ్మకంటి పోరాటంలో పాల్గొని కీలకమైన పాత్ర వహించడమే కాకుండా, ఆ తర్వాత కాలంలో మధిర శాసనసభ సభ్యుడుగా ఎన్నికై రాష్ట్ర రాజకీయాలలో కొన్నాళ్లు చక్రం తిప్పే స్థాయికి ఎదిగారు.
హైదరాబాద్ స్వాతంత్ర్య పోరాటం నేపధ్యంలో, 1938 లో ప్రారంభమైన ప్రథమ సత్యాగ్రహానికి ఆంధ్ర ప్రాంతంలో జమలాపురం కేశవరావు, హైదరాబాద్ రాష్ట్రంలో స్వామి రామానంద తీర్థ నాయకత్వం వహించారు. కాంగ్రెస్ పార్టీపై నిషేధం విధించినప్పుడు అజ్ఞాతవాసం చేస్తూ, హైదరాబాద్ సుల్తాన్ బజార్‌లోని చిన్న ఇంట్లో జాతీయోద్యమాన్ని సజీవంగా వుంచి, మహోద్యమంగా మలిచి, చివరిదాకా నాయకత్వం వహించిన వ్యక్తి స్వామి రామానంద తీర్థ. ఆయనతో పాటు స్వాతంత్ర్య సమరాన్ని గమ్య స్థానానికి చేర్చిన వారిలో బూర్గుల రామకృష్ణారావు, దిగంబర రావు బిందూ, మెల్కోటే, కొండా వెంకట రంగారెడ్డి, గోవింద దాస్ షర్రాఫ్, జనార్థనరావు దేశాయ్, జమలాపురం కేశవరావు, మాడపాటి హనుమంతరావు, మర్రి చెన్నారెడ్డి, బొమ్మకంటి సత్యనారాయణరావు, హయగ్రీవాచార్యులు, పాగా పుల్లారెడ్డి, కోదాటి-కొమరగిరి-కాళోజి నారాయణరావులు, విబి రాజు, ఎమ్మెస్ రాజలింగం, ఉమ్మెత్తల కేశవరావు, కెవి నరసింగరావు, పివి నరసింహారావులు ప్రముఖులు. వీరంతా వారి-వారి జిల్లాల్లో నాయకత్వం వహించారు.
"రెస్పాన్సివ్ గవర్నమెంట్" అని, "రెస్పాన్సిబిల్ గవర్నమెంట్" అని తర్జనభర్జనలు జరిగి, "ఇండియన్ యూనియన్‌లో చేరండి" అనే నినాదంతో ఉద్యమం మలుపు తిరిగింది. స్వామి రామానంద తీర్థ నాయకత్వంలో షోలాపూర్లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రధమ సమావేశంలో పాల్గొన్న ప్రముఖుల్లో మాడపాటి, జమలాపురం, బొమ్మకంటి ముఖ్యులు. ఆ తర్వాత బొమ్మకంటి ప్రభృతులు విజయవాడ కేంద్రంగా పనిచేసేందుకు అక్కడకు చేరుకుని, అయ్యదేవర కాళేశ్వర రావు ఇంట్లో కార్యాలయం పెట్టుకుని పని చేయసాగారు. సత్యాగ్రహ ఉద్యమం ప్రారంభించాలని నిర్ణయం తీసుకుని, ఆంధ్ర ప్రాంతానికి జమలాపురం కేశవరావు నాయకత్వం వహించాలని, ఆయన జైలుకెళ్లినప్పుడు ఇన్-చార్జ్ గా హయగ్రీవాచార్యులుండాలని, ప్రచార విభాగాన్ని విబి రాజు, ఎల్లల ఉద్యమాన్ని బొమ్మకంటి నిర్వహించాలని నిర్ణయించారు.
అప్పట్లో నెల కొన్న అరాచక పరిస్థితులు భారత ప్రభుత్వాన్ని అయోమయంలో పడవేశాయి. పరిష్కారానికి పోలీసు చర్య తప్ప వేరే మార్గం కనిపించలేదు. భారత ప్రభుత్వం సైన్యాన్ని ప్రజల సంరక్షణ కొరకై పంపించింది. దక్షిణాదిన సైన్యాన్ని తరలించినప్పుడు, ఆ ప్రాంతంలోని మిలిటరీ అధినేతలు కల్నల్ అమృత్ సింగ్, విజి సుబ్బరాయన్ లు చిరస్మరణీయమైన పాత్ర పోషించారు. జె. ఎన్. చౌదరి హైదరాబాద్ లో ఝండా ఎగురవేయడంతో కథ సుఖాంతమైంది. హైదరాబాద్ సంస్థానంలో నివసించే వారు కూడా భారతీయులే కాబట్టి, భారత దేశంలో "విలీనం" కాకుండా చేసేందుకు జరిగిన ప్రయత్నాలు, అవరోధాలు ఆనాటి తో తొలగిపోయాయి. ప్రజా వాహిని ఊపిరి పీల్చుకుంది. విజయ దుందుభులు మ్రోగాయి. ప్రజా విజయం ఖాయమని గ్రహించిన నిజాం నవాబు, తెలివిగా, "విలీన పత్రం" సమర్పించుకున్నాడు. తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో సఫలమయ్యాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ ప్రజల పాలిట ప్రాణదాతయ్యాడు.
హైదరాబాద్ నవాబుకు ప్రజలపై ప్రేమ లేకపోగా, "దోపిడీ దొంగల స్థాయి నిరంకుశ ప్రభువు" లాగా వ్యవహరించాడు. నవాబును ఓడించేందుకు బొమ్మకంటి లాంటి సమర యోధులు పథకం వేసుకున్నారు. పటేల్, పట్వారీలను రాజీనామా చేయమని కోరారు తొలుత. సంస్థానానికి, భారత యూనియన్‌కు మధ్య నున్న సరిహద్దులను రూపుమాపేందుకు నిర్ణయించి, "కరోడ్‍గిరి నాకాలను" ధ్వంసం చేయసాగారు. లెవీ ధాన్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా ప్రజలను సమీకరించారు. ప్రజలపై దాడులు చేయడానికి నవాబు ప్రభుత్వం వాడుకుంటున్న గవర్నమెంట్ విశ్రాంతి భవనాలను నిర్మూలించడం మొదలైంది. రహదారి మార్గాల గుండా మిలిటరీ-రజాకార్లు ప్రయాణం చేయకుండా నిరోధించేందుకు బ్రిడ్జులను ధ్వంసం చేశారు. బస్సులు, రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. గొరిల్లా దళాలతో మెరుపు దాడులు చేయసాగారు. గ్రామాలను రిపబ్లిక్‌లుగా ప్రకటించాలని, అక్కడ ప్రభుత్వ పాలన స్థానంలో గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలను సమీకరించి ఉద్యమంలో పాలుపంచుకునే ట్లు చేయసాగారు. కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగించేందుకు, విజయవాడ కేంద్రంగా మాడపాటి రామచంద్ర రావు, హయగ్రీవా చారి, వల్లూరి బసవ రాజుల నాయకత్వంలో, ఆంధ్ర ప్రాంత ఇన్-చార్జ్ గా బొమ్మకంటి సత్యనారాయణ రావును నియమించారు.
సర్దార్ జమలాపురం కేశవరావు, "బుర్రకథ దళం" వెంకట్ రాజుల నాయకత్వంలో, ఆగస్ట్ 7, 1948 న బొమ్మకంటి ప్రభృతులు సత్యాగ్రహ ఉద్యమానికి బయల్దేరారు. సత్యాగ్రహం మొదలెట్టే ముందు, తాను జైలుకెళ్లాల్సి వస్తుందని, జీవితంలో మళ్లీ కలుస్తామో-లేదో చెప్పలేనని, హయగ్రీవా చారి ఇన్-చార్జ్ గా, వట్టి కొండ రామ కోటయ్య సహాయంతో ఉద్యమాన్ని కొనసాగించాల్సిన బాధ్యత బొమ్మకంటి మీద పెట్తున్నానని జమలాపురం హెచ్చరించారు. జైలుకెళ్లాలని అనుకున్న బొమ్మకంటికి జమలాపురం ఆజ్ఞను ధిక్కరించే సాహసం లేకపోయింది. కేశవరావు సత్యాగ్రహం తర్వాత విజయవాడ చేరుకున్న బొమ్మకంటి సత్యనారాయణ రావు, మాడపాటి, హయగ్రీవా చారి, వల్లూరి బసవరాజులు "అన్నదమ్ముల మాదిరి" ఉద్యమాన్ని నిర్వహించే బాధ్యతను తమపై వేసుకున్నారు. స్వగ్రామం బోనకల్లు లో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసి బొమ్మకంటి అజ్ఞాతవాసం ప్రారంభించారు. సరిహద్దు చుట్టూ శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారు. వీరికి అవసరమైన ధన సహాయం సుగ్గల అక్షయ లింగం, మిర్యాల నారాయణ, శంకర లింగం గుప్తాలు సమకూర్చారు.
భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించడంతో నిజాం నవాబు, పాకిస్తాన్ ఏజంటుగా మారిపోయి, లాయక్ అలీని-ఖాసిం రజ్వీని ముందుంచి దుర్మార్గాలు చేయించసాగాడు. ప్రజలు తిరగబడ్డారు. ఖాసిం రజ్వీపై పోరాటం సాగించిన కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రజాదరణ లభించింది. "కమిటీ ఆఫ్ యాక్షన్” కు చైర్మన్‌గా వున్న దిగంబర రావు బిందు సమరయోధులను ప్రోత్సహించారు. కార్యకర్తలకు సైనిక శిక్షణ ఇవ్వడానికి పండిట్ నరేంద్ర జీ నాయకత్వంలో ఆర్యసమాజం వారు తోడ్పడ్డారు. రజాకార్లతో పోరాడడానికి శిబిరాలు, క్యాంపులు పెట్టి, సరిహద్దు గ్రామాల్లోకి వెళ్లి కార్యక్రమాలను నిర్వహించేవారు. పండిట్ రుద్రదేవ్ నాయకత్వంలో ఆయుధాల నిర్మాణ కేంద్రం కూడా పనిచేసేది. క్యాంపులకు ఇన్-చార్జులు, కమాండర్లు వుండేవారు. వారిలో జలగం వెంగళరావు, కోదాటి నారాయణరావు, పాగా పుల్లారెడ్డి, కె. వి. నరసింగరావు లాంటి ప్రముఖులున్నారు.
రజాకార్లు, పోలీసులు వెంటబడ్డా ప్రాణాలను లెక్క చేయకుండా పెనుబల్లి మాస్టారు రామచంద్ర శాస్త్రి, రామకోటేశ్వరరావు, రాచకొండ కనకయ్య, ఉట్కూరు సత్యనారాయణరావు, జలగం వెంగళరావులు ధైర్య సాహసాలతో ప్రభుత్వ బస్సును సరిహద్దు గ్రామాలకు తీసుకెళ్లిన ఘటన గురించి రాశారు బొమ్మకంటి. నారాయణ కమాండర్ ధైర్యంగా మహమ్మద్ ఇబ్రహీం అనే రజాకార్ దగ్గరున్న రైఫిల్ లాక్కుని, ఆయనను చంపిన సంఘటనను వివరించారు. నారాయణ చేసిన పనికి సిరిపురం గ్రామానికి చెందిన కందిబండ రంగారావుపై నేరారోపణ వేసి, రజాకార్లు ఆయనను ఖమ్మం జైలులో పెట్టారు. అదృష్టవశాత్తు ఆయనను కాల్చి చంపలేదు. దెబ్బతిన్న మహమ్మద్ ఇబ్రహీం అకృత్యాలను ఎదుర్కోవడానికి వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు ముత్తగుడెం నాకాను ధ్వంసం చేశారు. నిజాం-ఆంధ్ర ప్రాంతాల మధ్య నున్న హద్దులను తీసేశారు. పటేల్ పట్వారీలు దఫ్తరాలను పారవేసి పన్నుల వసూళ్లను నిలిపేశారు. గవర్నమెంటుకు ఆదాయం సమకూరుస్తున్న తాటి-ఈత చెట్లను ప్రజలు నరికేశారు. రిజర్వ్ ఫారెస్టును నాశనం చేసి నష్టం కలిగించారు.
సిరిపురం పక్కనున్న భగవాన్ల పురం వంతెన పడగొట్టి, మిలిటరీ రాకుండా చేసి, మధిర పట్టణాన్ని ఆక్రమించుకోవాలని కార్యక్రమం వేసుకున్నారు. ఈ వార్తను ముందే పసికట్టిన ప్రభుత్వం మిలిటరీ-రజాకార్ల బలగాన్ని మధిరలో మొహరించారు. అయినా పోరాటం ఆగలేదు. ఒక రాత్రంతా సాగింది. హైదరాబాద్ సంస్థానం విలీన పోరాటంలో అతి ముఖ్య ఘట్టం "రిపబ్లిక్ స్థాపన". పరిటాల తొమ్మిది గ్రామాలు, వరంగల్ పన్నెండు గ్రామాలు, గానుగపాడు, చిలుకూరు, జాల ముడి, రామచంద్రాపురం, అమర వరం అనేవి రిపబ్లిక్ గ్రామాలు. బొమ్మకంటి, హయగ్రీవా చారి పరిటాల గ్రామాలను ఆక్రమించుకుని ప్రజా ప్రభుత్వం ఏర్పాటుచేయాలని నిర్ణయించుకున్నారు. టాక్సీ డ్రైవర్ దాస్, మధుసూదనరావు, రామకోటేశ్వరరావులతో కలిసి బొమ్మకంటి పోలంపల్లికి వచ్చి, ఆయుధాలు తీసుకుని పరిటాలకు వెళ్లారు. రామకోటేశ్వరరావు ప్రభృతులు వేసుకున్న మిలిటరీ దుస్తులను చూసి, ఆఫీసర్లని భావించి సైనిక వందనం చేశారు నిజాం మిలిటరీ వారు. వందన స్వీకారం చేసి లోపలికి వెళ్లి కూర్చున్న కాసేపటికి, మిగతా బలగం వచ్చి, నిజాం సైనికుల ఆయుధాలను లాక్కొని, స్వాధీనం చేసుకుని, పరిటాల ఆఫీసు భవనంలో సభ ఏర్పాటుచేశారు. వారం రోజుల్లో రిపబ్లిక్ అవతరణోత్సవం జరిగింది. మాడపాటిని వూరేగించారు.
నిజాం మిలిటరీ, రజాకార్ల దౌర్జన్యాలు రోజు-రోజుకు మితిమీరి పోయాయి. వ్యతిరేకంగా, సంస్థానమంతా ప్రజా ఉద్యమాలు తీవ్రంగా జరిగి నిజాం ప్రభుత్వం పూర్తిగా స్తంభించింది. ఎంత పోరాటం చేసినా-చేయగలిగినా, నిజాం ప్రభుత్వాన్ని కూల దోయగల శక్తి సమరయోధులకు లేదని భావించారు. మునగాల పరగణా చుట్టూ రజాకార్ల దాడులు పెరిగాయి. యూనియన్లో వున్న గ్రామాలపై కూడా దాడులు పెరిగాయి. నల్గొండ జిల్లా సరిహద్దు గ్రామాలైన తక్కెళ్లపాడు పరిసర ప్రాంతాలకు కోదాడలోని సైనికులతో ప్రమాదం ఏర్పడింది. "బందరు సముద్రంలో తుపాకీలు కడుగుతానని" ఖాసిం రజ్వీ ప్రగల్భాలు పలకడం మొదలైంది. ఆత్మ రక్షణ కొరకు, చిల్లకల్లు-విజయవాడ రహదారి వద్ద వున్న భారత సైన్యం కమాండర్ అమృత్ సింగ్‌ను, మద్రాస్ పోలీసు శాఖకు చెందిన డి.ఐ.జి సుబ్బరాయన్‌ను కలిసి వ్యూహాన్ని పన్నారు బొమ్మకంటి, మాడపాటి, హయగ్రీవా చారి. సెప్టెంబర్ 6, 1948 న యూనియన్ సైన్యాన్ని తరలించడం, దాని వెంట బొమ్మకంటి సత్యనారాయణ రావు వెళ్లడం జరిగింది. కోదాడను ఆక్రమించిన సైన్యం, నిజాం కమాండర్ షేర్ ఖాన్‌ను సైనికులతో సహా బంధించి తక్కెళ్లపాడు దగ్గరున్న రహదారిపై కూచోబెట్టి, తర్వాత విజయవాడకు తరలించారు. ప్రగల్భాలు పలికిన ఖాసిం రజ్వీ బృందం కనీసం గంట సేపుకూడా పోరాడ లేకపోయారు. నిజాం నవాబుకు యూనియన్ సైన్యానికి ఎదురు తిరిగి పోరాడే సత్తా లేదని నిరూపణ అయింది.
సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇక ఏ మాత్రం ఆలశ్యం చేయదల్చుకోలేదు. సెప్టెంబర్ 13, 1948న పూనాలో వున్న ఆయన స్వయంగా, స్వీయ పర్యవేక్షణలో, యూనియన్ సైన్యాన్ని నలుమూలల నుండి హైదరాబాద్ సంస్థానంలోకి పంపించారు. సంస్థానంలోని రజాకార్లు ఎక్కడివారక్కడ పారిపోసాగారు. బందరు, విజయవాడల నుండి పోవాల్సిన సైన్యాన్ని హైదరాబాద్ రహదారిపై నిలిపారు. మూసీ నదిపై వున్న వంతెనను రజాకార్లు ధ్వంసం చేయడం, దాని స్థానంలో, భారత సైన్యం ఒక్క రోజులో ఇనుప వంతెన నిర్మించడం జరిగింది. చిట్యాల దగ్గరకు సైన్యం చేరుకోగానే కొంత సేపు ఆగమని సందేశం రావడంతో, బొమ్మకంటి సత్యనారాయణ రావు జీపులో డ్రైవర్ గోకుల్ దాస్‍తో, మాడపాటి రామచంద్ర రావుతో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. సెప్టెంబర్ 17, 1948 నాటి రాత్రి బొల్లారంలో వున్న మున్షీ గారింట్లో భోజనం చేసి ప్రశాంతంగా నిద్రపోయారు. మర్నాడు స్వామి రామానంద తీర్థను విడుదల చేశారు. సెప్టెంబర్ 18, 1948 న మేజర్ జనరల్ చౌదరి భారత పతాకాన్ని ఎగురవేశారు. నిజాం హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో "విలీనమైంది". భారత ప్రభుత్వానికున్న ధర్మ బుద్ధి నిజాం నవాబు ఆస్తిపాస్తులను కాపాడుకునేందుకు దోహదపడిందనాలి.
విమోచన ఉద్యమ నాయకుల్లో జమలాపురం కేశవరావు, కొలిపాక కిషన్ రావు, కొలిపాక రామచంద్రరావు, కాళోజీ, దాశరధి, హీరా లాల్ మోరియా, అయితరాజు రాంరావు ఒకే జైల్లో వుండేవారు. బొమ్మకంటి, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి వంటి వారు వెలుపలనుంచి ఉద్యమానికి నాయకత్వం వహించారు. వీరిలో జలగం వెంగళరావు ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. బొమ్మకంటి ఎమ్మెల్యే మాత్రమే కాగలిగినా దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా వున్నప్పుడు రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు.1916 ఆగస్ట్ నెలలో జన్మించిన బొమ్మకంటి 1984 ఆగస్ట్ నెలలో మరణించారు. నీలం సంజీవరెడ్డికి వ్యతిరేకంగా చెన్నారెడ్డి డెమోక్రటిక్ పార్టీ స్థాపించినప్పుడు బొమ్మకంటి కీలకపాత్ర పోషించారు. చెన్నారెడ్డితో ఎంత స్నేహం చేసినా, తాను నమ్మిన సమైక్యతా వాదానికే జీవించినంతకాలం కట్టుబడ్డ మహనీయుడాయన. విలీనమైనా, విమోచనైనా, దాని కొరకు పోరాడినవారు ఇటు తెలంగాణ లోను, అటు ఆంధ్ర ప్రాంతంలోను వున్నారనే ది వాస్తవం
 

 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు

ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                                                                        సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.     Site Design: Krishna, Hyd, Agnatech