ఏదితుద దీని
కేది మొదలు
ఏదితుద దీని కేది మొదలు
పాదుకొను హరిమాయ పరగు జీవునికి
ఎన్ని బాధలు తనకు నెన్నిలంపటములు
యెన్ని వేదనలు మరి యెన్ని దుఃఖములు
యెన్ని పరితాపంబు లెన్ని తలపోతలు
యెన్ని చూచిన మరియు నెన్నైన కలవు
యెన్ని కొలువులు తనకు నెన్ని యనుచరణలు
యెన్ని యాసలు మరియు నెన్నిమోహములు
యెన్ని గర్వములు తనకెన్నిదైన్యంబు లివి
ఇన్నియును తలప మరి యెన్నైనగలవు
యెన్నిటికి చింతించు నెన్నటికి హర్షించు
నెన్నిటికి నాసించు నెన్నిటికి దిరుగు
యిన్నియును తిరువేంకటేశు లీలలు కాగ
ఎన్ని చూచినను తానెవ్వడును కాడు
అనంత కాలగమనంలో,
జనన మరణ చక్ర భ్రమణంలో ఏది ముగింపు?
ఏది మొదలు?
ఇదంతా శ్రీహరి మాయే అంటున్నాడు అన్నమయ్య!
ఈ పాటలోని మూడు చరణల్లో అన్నమ్య్య చాలా చక్కగా జీవుడు అనుభవించిన సుఖాలు దుఃఖాలు విపులంగా తెలియజేసినాడు.
ఈ పాటలోని పల్లవి,
చరణాల లోని పది పాదలు ఒక ఎత్తు కాగా,
చివరి చరణంలోని రెండు పాదాలు వీటన్నిటిని మించి ఉత్కృష్టమైన సత్యాన్ని, పరమార్ధాన్ని తెలియజేస్తూ యిన్నియును తిరువేంకటేశు లీలలు కాగా అంటే పైన చెప్పినవన్నీ ఆ భగవంతుని లీలలే అంటూ ఎన్ని చూసినను తానెవ్వడును కాడు!
ఇక్కడ ఆత్మతత్త్వం ప్రతిపాదించబడింది.
పైన చెప్పిన అశాశ్వత విషయాలలో శాశ్వత స్వరూపుడైన ఆత్మకు ఎటువంటి సంబంధం లేదు.
కాబట్టి జీవుడు శాశ్వత తత్త్వమైన ఆత్మ స్వరూపాన్ని
(భగవంతుని రూపాన్నే)
ఎరిగి,
అశాశ్వతమైన భౌతిక విషయ్ల పట్ల విముఖుడు కావాలన్నది ఇందున్న సందేశం!
పాదుకొను = నెలకొను;
లంపటము= వదలని బంధం;
కొలువు = సేవ;
అనుచరణ = ఆచరించుట; ఒనరించుట, అనుసరించుట
ఏమని
పొగడుదు ఇట్టి నీ గుణము
ఏమని పొగడుదు ఇట్టి నీ గుణము
ఏమని పొగడుదు ఇట్టినీ గుణము
యీమహిమకు ప్రతి యితరులు కలరా
నిండెను జగముల నీ ప్రతాపములు
చెండిన బాణుని చేతులతో
కొండలంతలై కుప్పలు వడియెను
వండదరగు రావణు తలలయి
పూడెను జలధులు పొరి కోపించిన
తోడ బ్రహ్మాండము తూటాయ
చూడ పాతాళము చొచ్చె బలీంద్రుడు
కూడిన కౌరవ కులములు నడగె
యెత్తితివి జగము లీడేరు నొకపరి
యిత్తల నభయంబిచ్చితివి
హత్తిన శ్రీ వేంకటాధిప నీకృప
నిత్తె మాయ నీ నిజదాసులకు
శ్రీ
మహావిష్ణువు శౌర్య ప్రతాపాలు అనంతాలు! బాణాసుర
సంహారంతో నీ ప్రతాపం జగమంతా వ్యాపించినది! నీ
ప్రతాపానికి రావణుడి తల వ్రక్కలయ్యింది. నీ
కోపానికి సముద్రాలు అల్లకల్లోలమైనాయి.
రాక్షసరాజు బలిచక్రవర్తి పాతాళానికి
అణగద్రొక్కబడ్డాడు నీ వామనపాదం చేత! అనేక
అవతారాలైన భక్తులకు మాత్రం చల్ల్ని చూపులతో
అభయాన్ని అందిస్తున్నావు! కలియుగంలో
వేంకటేశ్వరునిగా వెలసిన ఓ స్వామీ! నీ కరుణ మా
వంటి నిజదాసులకు నిత్యమూ నిండుగా ఉన్నదయ్యా!
అని అంటున్నారు. ఆచార్యులవారు!
ప్రతి = తిరుగు;
నిత్తెమాయ = నిత్యము + ఆయ
|