ముఖ్యమంత్రిగా కొణిజేటి రోశయ్య సెప్టెంబర్ 3, 2010 న ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంలో రెండు దశాబ్దాలుగా నేనెరిగిన

నాకు తెలిసిన కొణిజేటి రోశయ్య
 

- వనం జ్వాలా నరసింహారావు

    

ముఖ్యమంత్రి రోశయ్యతో నాకున్న సాన్నిహిత్యం, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డితో లేదు. ఆయనతో నాకు కేవలం పరిచయం మాత్రమే. అయినా, పది మందికి ప్రాణాపాయంలో అవసరానికొచ్చే 108 అత్యవసర సహాయ సేవలకు సంబంధించిన నా ఉద్యోగ నిర్వహణ విషయంలో, రాజశేఖర రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన ప్రతి సమస్యను ప్రభుత్వ పరంగా పరిష్కరించబడడానికి ఆయనతో వున్న పరిచయానికంటే, రోశయ్యతో వున్న సాన్నిహిత్యమే ఎక్కువగా ఉపయోగపడిందనాలి. బహుశా ఆ సాన్నిహిత్యంతోనే రోశయ్య ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాలుగైదు రోజుల్లో, కలవడానికి సమయం కేటాయించమని కార్యాలయ సిబ్బందిని కోరకుండానే, ఆయనను కలిసేందుకు మితృడు భండారు శ్రీనివాస రావుతో కలిసి వెళ్లాను. సాధారణంగా లోగడ కలిసే సమయంలోనే, కలవడానికి ధైర్యంగా వెళ్ళిన మాకు, ఇంటిముందరకు పోయిన తర్వాత నిరాశ మిగిలింది. అప్పటికే విధుల్లో చేరిన సెక్యూరిటీ సిబ్బంది, అప్పాయింట్‍మెంట్ లేకుండా వెళ్ళడం కుదరదన్నారు. లోపలున్నవారిని ఫోనులో సంప్రదించడానికి చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు.

ఈ నేపధ్యంలో లోనికి వెళ్లగలిగినా, ముఖ్యమంత్రిని కలవడం సాధ్యపడే విషయం కాదని అనుకుంటున్న సమయంలో, బాగా పరిచయమున్న ఒక పోలీసు ఉన్నతాధికారి, ముఖ్యమంత్రిని కలిసి బయటకు రావడం జరిగింది. ఆయన మమ్మల్ని పలకరించిన తీరు చూసి, బహుశా ఆయన సైగలను అర్థం చేసుకుని, సెక్యూరిటీ సిబ్బంది మా ఇద్దరిని లోనికి వదిలారు. మాకు తెలిసిన ముఖ్యమంత్రి వ్యక్తిగత సిబ్బంది ఇంకా రాలేదప్పటికి. ముందు గదిలో మేము కూర్చొనపోతుండగా, ముఖ్యమంత్రిని కలిసిన వ్యక్తి ఒకరు లోపలి నుంచి బయటకొస్తున్నప్పుడు తలుపు తీయడంతో, మమ్మల్ని చూసిన ఆయన, పేర్లు పెట్టి పిలిచి మరీ రమ్మనడంతో ఊపిరి పీల్చుకున్నాం. ముఖ్యమంత్రికి నమస్కారం చేసి, మర్యాదపూర్వకంగా ఆయనను కలవడానికి-అభినందనలు వ్యక్తిగతంగా చెప్పడానికి మాత్రమే వచ్చామని, ఆ రెండూ అయ్యాయి కనుక వెళ్తామని చెప్పాం. సున్నితంగా మా కోరికను తిరస్కరించి, మమ్మల్ని కూచోమని అనడమే కాకుండా, ఎప్పటి రోశయ్య గారి లాగానే, మాట్లాడారు చాలా సేపు. నేను 108 అత్యవసర సహాయ సేవల నిర్వహణ సంస్థలో ఉద్యోగం మానేసిన విషయం, అమెరికా వెళ్తున్న విషయం చెప్పి, ఇద్దరం బయటకొచ్చాం. బహుశా మరొక రాజకీయ నాయకుడై తే అలా పిలవక పోయేవారేమో! అలా సాదాసీదాగా మాట్లాడకపోయేవారేమో! ఆ తర్వాత నేను అమెరికాలో మా పిల్లలతో వున్నప్పుడు దసరా, సంక్రాంతి పండుగలకు శుభాకాంక్షలు చెప్పేందుకు ఫోన్ చేసినప్పుడు, ఇంకే ముఖ్యమంత్రి కూడా (బహుశా) కేటాయించనంత సమయం నాతోను-అక్కడుంటున్న మా అమ్మాయితోను మాట్లాడడానికి కేటాయించడం, ఆత్మీయంగా కుశల ప్రశ్నలు అడగడం, ఆయన నిరాడంబరానికి నిదర్శనం. ఒక ముఖ్యమంత్రి, అందునా అప్పట్లో వున్న పరిస్థితుల్లో, ఫోన్లో దొరకడం-సంభాషించడం నాలాంటివారెప్పుడూ మరిచిపోలేని మరుపు రాని సంఘటన.

సీఎం రోశయ్యతో నాకు మొదటిసారి దగ్గరగా పరిచయం 1989 లో అయింది. అంతకుముందు కలిసినా అంతగా పరిచయం చేసుకునే అవకాశం కలగలేదు. అప్పట్లో నేను గవర్నర్ కుముద్ బెన్ జోషి దగ్గర పనిచేస్తున్నప్పటికీ, పాత్రికేయ ప్రవృత్తితో వున్న సంబంధం నన్ను స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డితో పరిచయానికి దారితీసింది. అదే క్రమంలో, చెన్నారెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కావడంతో నేనాయనకు మరింత చేరువయ్యాను. ఎన్. టీ రామారావు సారధ్యంలోని తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఓడించడానికి పటిష్టమైన నాయకత్వం కొరకు పీసీసీ అధ్యక్షుడిగా చెన్నారెడ్డిని నియమించడంతో, ఆయనకు ఆ లక్ష్యంలో తోడ్పడిన ముఖ్యుల్లో ప్రథముడైన రోశయ్యతో పరిచయం కలిగింది. 1989 సంవత్సరాంతంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో చెన్నారెడ్డికి అన్ని విషయాల్లో చేదోడుగా వుండేవారు రోశయ్య. ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం, చెన్నారెడ్డి ముఖ్యమంత్రి కావడం, రోశయ్య ఆయన మంత్రివర్గంలో చేరడం జరిగింది. ఎన్నికల ముందు పరిచయమైన నన్ను చెన్నారెడ్డి "ముఖ్యమంత్రి పౌర సంబంధాల అధికారి" గా నియమించారు. నా నియామకం గురించి మొట్టమొదట రోశయ్య గారికి తెలియచేసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ముఖ్యమంత్రి పీఅర్‍ఓ గా ప్రతి దినం రోశయ్యను కలిసే అవకాశం, విధి నిర్వహణలో ఆయన సూచనలు-సలహాలు తీసుకోవడం నిరంతరం జరిగేది. ఆ తర్వాత రాజకీయాలకు సంబంధించిన ఉద్యోగం ఏదీ నేను చేయకపోయినా, ఆయనను మధ్య-మధ్య కలవడం జరుగుతుండేది. ఆయన మంత్రిగా లేనప్పుడు కూడా చాలా పర్యాయాలు కలిసి ఆయన సహాయం కోరితే కాదనలేదెప్పుడు. 1994-2004 మధ్య కాలంలో, కాంగ్రెస్ ప్రతిపక్షంలో వున్నప్పుడు శ్రీనివాసరావుతో కలిసి చాలా సార్లు కలిశాను. అప్పడు ఎలా కలివిడిగా మాట్లాడేవారో, ఇప్పుడూ అంతే.

2004 లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఉద్యోగ విరమణ చేసి, ఏడాది తర్వాత, 108 అత్యవసర సహాయ సేవలు నిర్వహిస్తున్న ఇ.ఎం.ఆర్.ఐ సంస్థలో ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ఇన్-చార్జ్ గా చేరాను. ఆ మధ్యలో, నేను ఆయనను కలిసిన ప్రతిసారీ, నాకేమైనా సహాయం కావాలా అని అడిగేవారు. ఇ.ఎం.ఆర్.ఐ లో చేరిన మొదటి వారంలోనే, ఒకే కంపార్ట్ మెంటులో ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఆయన్ను కలవడం, నా ఉద్యోగం విషయం చెప్పడం, ఆ సేవల గురించి ఆయన నోటి వెంట వివరంగా వినడం జరిగింది. నేను చేరక ముందు, ఆగస్టు 15, 2005 న ఆ సేవలు లాంఛనంగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ప్రారంభించినప్పుడు ఆయన అక్కడున్న విషయం కూడా చెప్పారు రోశయ్య. ఆర్థిక శాఖకు అదనంగా, ఆరోగ్య-వైద్య-కుటుంబ సంక్షేమ శాఖకు కూడా రోశయ్య గారే మంత్రి. 108 అత్యవసర సహాయ సేవలకు సంబంధించి, అవసరమైనప్పుడల్లా ఆయనను కలిసే అవకాశం కలిగింది. తొలుత కేవలం ప్రయివేట్ నిధులతోనే నడుస్తున్న ఆ సేవలను ఒకే రోజున ఒంగోలు, చీరాలలో ఆయన ప్రారంభించారు. చీరాల సభలో మాట్లాడుతూ, జిల్లాకు కోటి రూపాయల వంతున 23 కోట్ల రూపాయలను బడ్జెట్లో మున్ముందు కేటాయించడానికి ప్రభుత్వ సంసిద్ధతను మొట్టమొదటి సారిగా బహిరంగంగా ప్రకటించింది రోశయ్య గారే. ఇచ్చిన మాట ప్రకారం 2007-2008 బడ్జెట్లో 23 కోట్లు కేటాయించారు. ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం ఉన్నప్పటికి, రాజశేఖర రెడ్డి దృష్టిలో అప్పటికింకా వివరంగా పడలేదాసేవల విషయం.

రోశయ్య ఆరోగ్య శాఖను నిర్వహిస్తున్నప్పుడే, అంతవరకు 108 అత్యవసర సహాయ సేవలకు అసలే అందని నిధుల స్థానంలో, నిర్ణీత మొత్తంలో కొంత నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వ పరంగా సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి-ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు మధ్య ఆయన సమక్షంలో సెప్టెంబర్ 2006 లో అవగాహనా ఒప్పందం కుదిరింది. రోశయ్య చొరవతో సాధ్యమైన ఆ సంఘటన అత్యవసర సహాయ సేవలకు సంబంధించినంతవరకు ఒక చారిత్రాత్మక మలుపు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయనకు సలహాదారుడుగా పనిచేస్తున్న అధికారి, పీకె అగర్వాల్, అప్పట్లో ఆరోగ్య-వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి. ఒప్పందం ప్రకారం నిధులకు తోడు 432 అంబులెన్సులను కూడా సమకూర్చింది ప్రభుత్వం. క్రమేపీ రోశయ్య ద్వారా దివంగత ముఖ్యమంత్రికి చేరువైన సేవల నిర్వహణకు, మరిన్ని అంబులెన్సులను చేర్చడంలోను, నిర్వహణ నిధులను 95% వరకు పెంచడంలోను కీలక పాత్ర పోషించింది రోశయ్యే. గ్రామీణ ప్రాంతాలకు సహాయ సేవలను విస్తరించడానికి జరిగిన ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం నుంచి, ఆ సేవలకు అంబులెన్సులను పెంచినప్పుడల్లా సంబంధిత కార్యక్రమంలో పాలు పంచుకోవడం వరకు, అడిగినప్పుడల్లా కాదనకుండా ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ ప్రాంగణానికి రావడం దాకా, నిధుల విడుదలలో ఆలస్యమైనప్పుడల్లా తోడ్పడంతో సహా, ఎల్ల వేళలా ఆయన సహకారం కొరకు కలిసినప్పుడల్లా ఒకే రకమైన ఆత్మీయ స్పందన దొరికేది. సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ఇ.ఎం.ఆర్.ఐ చైర్మన్ రామలింగ రాజు జైలుకెళ్లడంతో, జనవరి 8, 2009 న, దివంగత ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలన్నీ రోశయ్య సలహాతోనే తీసుకున్నారు రాజశేఖర రెడ్డి. తిరిగి నాలుగు నెలల అనంతరం 108 అత్యవసర సహాయ సేవల నిర్వహణకు ప్రయివేట్ భాగస్వామిగా బాధ్యతలు చేపట్టమని జీవి కృష్ణారెడ్డితో రాజశేఖర రెడ్డి మాట్లాడిన సందర్భంలో కూడా ఆయన సంప్రదించింది రోశయ్యనే. ఆ నాలుగు నెలల మధ్య కాలంలో వచ్చిన పెద్ద అవాంతరం రోశయ్య జోక్యం చేసుకోవడంతో తప్పింది. ఇ.ఎం.ఆర్.ఐ ఖాతాలో వున్న సంస్థ నిధులను యాక్సెస్ బాంక్ స్తంభింపచేయడంతో తలెత్తిన సంక్షోభాన్ని అధిగమించేందుకు ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న రోశయ్యను కలవడం, ఆయన సహాయం కోరిన వెంటనే ఆయన దానిని పరిష్కరించడం జరిగింది. జీవీ కృష్ణారెడ్డి కంటే ముందు ప్రయివేట్ భాగస్వామిగా వచ్చేందుకు ఉత్సాహం చూపించిన పిరమల్ సంస్థ చైర్మన్ అజయ్ పిరమల్ కోరిక మేరకు, అడిగిన వెంటనే తన ఇంట్లో ఆయన కలుసుకునేందుకు సమయం కేటాయించడమే కాకుండా, అత్యవసర సహాయ సేవల గురించి "బ్రాండ్ అంబాసిడర్" లాగా ఆయనకు వివరించారు రోశయ్య. ఇలా ఎప్పుడు ఏది అడిగినా కాదనని రోశయ్య అనుకోని పరిస్థితుల కారణంగా, రాజశేఖర రెడ్డి అకాల మరణంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

గుంటూరు జిల్లాలో జన్మించిన కొణిజేటి రోశయ్య, తొలిసారిగా, నాలుగు దశాబ్దాల క్రితం 1968లో విధాన మండలి సభ్యుడిగా ఎన్నికై చట్టసభలో అడుగు పెట్టారు. శాసన మండలిలో ప్రతిపక్షనేతగా వ్యవహరించిన ఆయన వాగ్దాటికి అడ్డుకట్ట వేయడానికి, 1983 లో అధికారంలోకి వచ్చిన ఎన్ టీ రామారావు మండలిని రద్దు చేసేంత వరకు, ఆయన విధాన సభ సభ్యుడుగా కొనసాగారు. తెనాలి, చీరాల నియోజక వర్గాలనుంచి శాసనసభకు, నరసరావుపేట నియోజకవర్గం నుంచి లోక్ సభకు కూడా ఎన్నికయ్యారు. మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో తొలిసారిగా 1979 లో, తదుపరి ఎందరో ముఖ్యమంత్రుల దగ్గర, మంత్రివర్గ సభ్యుడిగా, కీలకమైన శాఖలు నిర్వహించిన అనుభవజ్ఞుడు రోశయ్య. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా 1995-97 మధ్య కాలంలో సమర్థవంతంగా పనిచేశారు. పాతికేళ్ల విరామం తర్వాత మరో మారు శాసనమండలి సభ్యుడుగా 2009 లో ఎన్నికయ్యారు. ఏ శాసన మండలి సభ్యుడిగా చట్ట సభల్లో ప్రవేశించారో, అదే మండలి సభ్యుడిగా, రోశయ్య సెప్టెంబర్ 3,2009 న ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. బహుముఖ ప్రజ్ఞా శాలైన రోశయ్యకు 2007 అక్టోబర్‌లో ఆంధ్రా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ పట్టా ఇచ్చింది. ఎన్జీ రంగా శిష్యుడిగా చెప్పుకునే రోశయ్య ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ను, 16 సార్లు శాసనసభలో ప్రవేశపెట్టిన అప్రకటిత "ఆర్థిక రంగ నిపుణుడు" కొణిజేటి రోశయ్య. వరుసగా రెండు పర్యాయాలు లక్ష కోట్ల రూపాయల బడ్జెట్‌ ప్రవేశపెట్టి రికార్డు సాధించారు.

ఎల్లప్పుడూ తెల్లటి ఖద్దరు దుస్తులనే ధరించే రోశయ్య ఆజానుబాహుడు. గంభీరమైన కంఠస్వరం ఆయన సొత్తు. సంయమనం ఆయన ఆస్తి. ఆయన పంచె కట్టు తెలుగు దనానికే ప్రతీక . గిట్టని వారు సహితం ఆయన్ను ఫలానా వారి గ్రూపుకు చెందిన వ్యక్తిగా వేలెత్తి చూపలేదింతవరకు. మహాత్మా గాంధి సిద్ధాంతాలైన అహింస-సత్య శీలతకు ఆయన పర్యాయ పదం అనవచ్చు. డబ్బై సంవత్సరాల రోశయ్య తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో విలక్షణమైన రాజనీతిజ్ఞుడిగా, అందరి వాడుగా, క్రమ శిక్షణ గల కాంగ్రెస్ వాదిగా మన్ననలను పొందారు. ఆశించని ముఖ్య మంత్రి పదవి, రోశయ్యకు దక్కడంతో, "అజాత శత్రువు" గా ఆయనకున్న పేరును, కొందరు అసూయాపరులు మలినం చేసే ప్రయత్నాలు ఉద్దేశపూర్వకంగా చేయడాన్ని, లౌక్యంతో-ఓర్పుతో-నమ్రతతో, అనుభవం నేర్పిన ధైర్యంతో ఎదుర్కున్నారాయన. స్వర్గీయ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలిగి, సంక్షేమ-అభివృద్ధి పథకాల రూపకల్పన-అమలులో చేదోడుగా నిలిచి, ఎదురైన చిక్కు సమస్యలను పరిష్కరించే బాధ్యత తన భుజస్కంధాల మీద మోపుకునేవారు రోశయ్య. అసెంబ్లీలో-పాలనా వ్యవహారాలలో రాజశేఖర రెడ్డికి అత్యంత ఆత్మీయుడుగా వ్యవహరించి నమ్మకానికి నిలువెత్తు ప్రతీకగా నిలిచారు. మూడు దశాబ్దాల పాటు మంత్రిగా పనిచేసిన అనుభవంతో, ముఖ్యమంత్రిగా, తనదైన శైలితో విధాన పరమైన నిర్ణయాలను తీసుకుంటూ, చెరిపినా చెరగని ముద్ర ప్రభుత్వ పాలనపై వేశారాయన. క్లిష్ట సమయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటినుంచి, ఒకటి వెంట మరొక సంక్షోభం రోశయ్యను వెంటాడాయి. ప్రకృతి భీభత్సం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర నినాదం హింసాయుతంగా మారడం, రాజకీయ అనిశ్చిత పరిస్థితుల లాంటి సంక్షోభాలను ఎదుర్కోని, ధైర్యంతో నిలదొక్కుకొని, పాలనను గాడిలో పెట్టారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడంలో ఆయన చూపిన చొరవ అభినందనీయం.

ముఖ్యమంత్రిగా రోశయ్య పాలనకు ఏడాది పూర్తి అయింది. అవాంతరాలు ఎన్ని ఎదురైనా, అధిష్ఠానం అండదండలు ఒక వైపు, కాదన్న మంత్రులే కలిసిరావడం మరోవైపు, అపారమైన అనుభవం అన్ని వైపులా ఆయన పక్షాన వుండడంతో, రోశయ్య పాలన సజావు గా ముందుకు సాగుతోంది. పరిపాలన చక్కదిద్దడానికి రోశయ్యను మించిన కాంగ్రెస్ నాయకులు మరొకరు లేరనేది తేలిపోయింది. ఊపిరి పీల్చుకోకుండా చేసిన తెలంగాణ ఉద్యమం , సవాళ్లు విసిరిన అసమ్మతి కాంగ్రెస్ వాదుల వ్యవహారం , ఆశించని ఫలితాలు అందించని హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలు-శాసనసభ ఉప ఎన్నికలు, చంద్రబాబు నాయుడు లేవనెత్తిన బాబ్లీ వివాదం , బయ్యారం మైనింగ్‌ లీజుల వ్యవహారం, విద్యార్థుల ఫీజు చెల్లించే వివాదం లాంటి పలు అంశాలు, రోశయ్యను ఇరుకున పెట్టాయే తప్ప పెరుగుతున్న ఆయన ప్రతిష్టకు భంగం కలిగించ లేకపోయాయి. రాజకీయంగా ఆటుపోట్లను స్వపక్షం నుంచీ-విపక్షాలనుంచీ ప్రభుత్వం నిత్యం ఎదుర్కుంటూనే, తనపై విసిరిన ప్రతి సవాలునూ తనదైన శైలిలో రోశయ్య అధిగమించడం కాంగ్రెస్ అధిష్టానాన్ని సైతం ఆకట్టుకుంది. ధిక్కార స్వరం వినిపిస్తున్న వారి విషయంలో రోశయ్య వ్యూహాత్మకంగా వ్యవహరించి పైచేయి తనదే అని నిరూపించుకున్నారు. తనను అదే పనిగా విమర్శించేవారి నోళ్లు మూయించడంలో నూటికి నూరు పాళ్లు సఫలం అయ్యాడనాలి. బాధ్యతలు స్వీకరించిన రోజుల్లో ప్రతికూలించిన ప్రకృతి ప్రస్తుతం సహకరించడం, ఆర్థిక పరిస్థితి క్రమేపీ మెరుగు పడటం రోశయ్యకు అనుకూలంగా మారాయి. ఆదిలో సహకరించని పలువురు మంత్రులను విశ్వాసంలోకి తీసుకొనడంలో రోశయ్య అవలంబించిన వైఖరి వల్ల అదే మంత్రులలో చాలామంది అనేక సందర్బాల్లో కలసికట్టుగా ప్రకటన చేయడం రోశయ్యకు మరో విజయం.
అధికార యంత్రాంగంలో మునుపటికంటే నిబద్ధత కనిపించడం, పరిపాలనలో చురుకుదనం చోటుచేసుకోవడం, అలిగిన మంత్రులే వాస్తవాలను అర్థంచేసుకుని పాలనలో క్రియాశీలక పాత్ర పోషించడం, విమర్శించిన స్వపక్షీయులే తప్పు సరి దిద్దుకుని రోశయ్యను సమర్థించడం, గతంలో రాజశేఖర రెడ్డికి అనుకూలంగా లేని కొందరు కాంగ్రెస్ ప్రముఖులు కూడా రోశయ్యకు మద్దతు పలకడం, రోశయ్య ఏడాది పాలనకు విజయపు గుర్తులు. ఒక వైపు తనకంటూ ప్రత్యేక అజెండా అంటూ ఏదీ లేదని-దివంగత ముఖ్యమంత్రి అభివృద్ధి-సంక్షేమ పథకాలనే పటిష్టంగా అమలు పరచడమే తన ప్రధాన లక్ష్యమని ప్రకటించినప్పటికీ, వాటి అమలుకు-వాటి అమలులో చోటుచేసుకున్నట్లు భావిస్తున్న అక్రమాలను సవరించేందుకు, తనదైన శైలిలో, విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవడం ప్రతిపక్షాల వారిని కూడా ఆశ్చర్య పరుస్తున్నది. పదే-పదే గొప్పలు చెప్పుకోకుండా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు మాత్రమే కావాలన్న ఉద్దేశంతో కాకుండా, పథకాల అమలే ప్రధాన ధ్యేయంగా, ముఖ్యమంత్రి ప్రభుత్వ పాలనలో వ్యవహరిస్తున్న తీరు, పారదర్శకతతో-బాధ్యతాయుతంగా-జవాబుదారీతనంతో, అనునిత్యం రోశయ్య వ్యవహరిస్తున్న తీరు భవిష్యత్ ముఖ్యమంత్రులకు "బెంచ్ మార్క్" లా విశ్లేషకులు భావిస్తున్నారు. సంక్షేమ పథకాలకు కోత పడుతుందని కొందరు చేస్తున్న ప్రచారాన్ని తప్పుడు ప్రచారమని ఆయన తన చేతల ద్వారా నిరూపించుకుంటున్నారు. విమర్శించిన మంత్రులతో పని చేయించుకుంటూనే, ప్రస్తుత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేసి, మరింత మెరుగైన పాలనకు ఇనుమడించిన సమర్థతకు పట్టంగట్టే దిశగా రోశయ్య అడుగువేస్తున్నారు. అధిష్టానం ఆమోదం, ఆశీస్సులు పుష్కలంగా వున్న రోశయ్య తన ప్రభుత్వాన్ని విమర్శలకు అతీతంగా నడిపించడానికి సర్వ శక్తులనూ ఒడ్డుతున్నారని త్రికరణ శుద్ధిగా ఆయన తీసుకుంటున్న చర్యలు చెబుతున్నాయి.

అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎప్పటికప్పుడు రాష్ట్ర పరిస్ధితులను క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ, అధిష్టానం, అరమరికలు లేని మద్దతును రోశయ్యకు ఇచ్చేందుకు సంపూర్ణ సహకారం ఇస్తున్నారు. పార్టీపరంగా అర-కొరగా మిగులున్న "శైశవ దశలోని అసంతృప్తి" విషయంలో ఆమె ఆలోచనలను రాష్ట్ర పార్టీ నేతలకు, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు నిర్మొహమాటంగా వివరించారు. మరో పక్క భావి భారత ప్రధాని రాహుల్ గాంధి రాష్ట్రానికి చెందిన యువ ఎమ్మెల్యేలను ఢిల్లీకి ఆహ్వానించి తన సందేశం వినిపించారు. ఇరువురు, రాష్ట్రంలో రోశయ్య సారధ్యంలోని ప్రభుత్వాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. రోశయ్య ప్రభుత్వానికి కాని, రాష్ట్ర కాంగ్రెస్ కు కాని, జాతీయ స్థాయిలో పార్టీకి కాని నష్ట పరిచే "యాత్రలకు" అధిష్టానం అనుమతి లేదన్న ప్రత్యక్ష-పరోక్ష సంకేతాలు స్పష్టంగా వ్యక్త పరిచింది సోనియా గాంధి.
వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం, రోశయ్య నాయకత్వంలో ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించడంలో చొరవ తీసుకుంటున్నది. నిధుల కొరత కారణంగా వివిధ పథకాలకు ప్రాధాన్య పరంగా నిధులు కేటాయించడంలో రోశయ్య ఆర్థిక శాఖలో తనకున్న అనుభవం దోహదపడుతున్నది. మద్యంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను రోశయ్య ప్రభుత్వం ఘాటుగా తిప్పికొట్టింది. మద్యంపై ప్రభుత్వానికి ఆదాయం రావడం నేరం కాదని స్పష్టం చేశారాయన. 'ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు’ కు తాను వ్యతిరేకం కాదు-అనుకూలమూ కాదని, అధిష్ఠానం ఏం చెబితే దానికి కట్టుబడి ఉంటానని, సమస్యకు పరిష్కారం చూపేందుకే కేంద్రం శ్రీకృష్ణ కమిటీని వేసిందని ఆయన పలు మార్లు స్పష్టం చేయడం వెనుక ఆయన పార్టీ విధేయత అవగాహన చేసుకోవచ్చు. తనను అస్థిర పరిచేందుకు కొన్ని బలీయమైన శక్తులు ప్రయత్నిస్తున్నాయన్న విషయం తెలిసి కూడా ఆయన స్పందనలో రాజకీయానికి తావులేకుండా వ్యాఖ్యలుండేవి. తన వ్యాఖ్యలకు సంబంధించి ఎవరి పేరును ఏనాడు ఆయన ఉదహరించలేదు.

రోశయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో స్వపక్షం నుంచే ధిక్కార స్వరాలు వినిపించాయి. రోశయ్య తాత్కాలిక ముఖ్యమంత్రి మాత్రమే అని ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రముఖులు కూడా కొందరున్నారు. సహచర మంత్రుల్లో కొందరు, రాజ్యాంగ పరంగా తప్పనిసరిగా చేయాల్సిన పదవీ ప్రమాణ స్వీకారానికి హాజరు కామని హటయోగం చేసేంతవరకూ వెళ్లింది వ్యవహారం. చివరకు అన్నీ సద్దుమణిగాయి. "అధిష్టానం ఆశీస్సులు వున్నంత వరకు" ఎవరెన్ని అన్నా ముఖ్యమంత్రి స్థానంలోంచి రోశయ్యను కదల్చడం జరిగే పని కాదని తేలిపోయింది. పాలనా పరంగా పట్టు సాధించడమే కాకుండా, పార్టీ పరంగా తన మాటకు తిరుగులేదని అనేక సందర్భాల్లో నిరూపించుకున్నారు రోశయ్య. తొమ్మిది గంటల విద్యుత్‌ విషయంలో స్వపక్ష విమర్శకుల వాదనను తిప్పికొట్టే సందర్భంలోను, ఓబులాపురం గనుల అక్రమాలపై సిబిఐ విచారణకు సిఫారసు చేయడంలోను, రాష్ట్రం వరదల్లో అతలా కుతలం అయినప్పుడు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌-యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీని రప్పించడంలోను, బాబ్లీ వివాదాన్ని పరిష్కరించేందుకు అఖిల పక్ష కమిటీ వాదనను ప్రధానికి వినిపించడానికి చొరవ తీసుకోవడంలోను, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం దివంగత ముఖ్య మంత్రి రాజశేఖర రెడ్డి చేపట్టిన సంక్షేమ పధకాలను యధా విధిగా కొనసాగించడంలోను, నిరంతరం ప్రభుత్వ శాఖల పనితీరుపై నేర్పుగా సమీక్షలు జరపడంలోను, అధికార యంత్రాంగంపై పట్టు సాధించడంలోను, పరిపాలనకు సంబంధించిన విషయాలలో ఎవరిని-ఎక్కడ-ఎందుకు-ఏ సందర్భంలో నియమించాలనే విషయంలోను, ప్రతి విషయంలోను ఆచి-తూచి మాట్లాడడంలోను, తనకు తానే సాటి అని, "సరి లేరు తనకెవ్వరని" నిర్ద్వందంగా నిరూపించుకుంటున్న ప్రతిభాశాలి ముఖ్యమంత్రి రోశయ్య.

ప్రభుత్వ శాఖల పనితీరుపై అవసరమైనప్పుడు తక్షణమే సమీక్షలు నిర్వహిస్తారనడానికి నిదర్శనంగా ఇటీవలి నా అనుభవమే ఉదాహరణ. ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యంలో సేవలందిస్తున్న సంస్థలో పనిచేస్తున్న నేను, ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారితో కలిసి, సంస్థ ఎదుర్కొంటున్న సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లాం. ఎంతో పని ఒత్తిడిలో వున్న ముఖ్యమంత్రి మాతో మాట్లాడడానికి నిమిషం కంటె ఎక్కువ సమయం కేటాయించ లేకపోయారు. అయినా ఆ ఒక్క నిమిషంలోనే సమస్య పరిష్కారం దిశగా ఆంతరంగిక సిబ్బందికి తగు ఆదేశాలిచ్చారు. సంబంధిత అధికారిని కలవమని కూడా సూచించారు. మేము ముఖ్యమంత్రి సూచన మేరకు ఆయన చెప్పినట్లే చేశాం. ఆ తర్వాత ఏం జరిగిందో కాని, నేను పనిచేస్తున్న సంస్థకు సంబంధించిన ప్రభుత్వ శాఖాధికారులతో, మర్నాడు సమీక్షా సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి. సమస్యకు సంబంధించిన తక్షణ ఇబ్బందులు తొలగిపోయాయి.

అధికారంలో లేనప్పుడు ఎంత సమయం కేటాయించినా, ముఖ్యమంత్రి కానప్పుడు అధికారంలో వుండగా ఎంత సమయం కేటాయించినా, ముఖ్యమంత్రిగా పనుల ఒత్తిడివల్ల అతి తక్కువ సమయం కేటాయించినా, రోశయ్య కనిపించే ఆత్మీయతలో మార్పు కొంచెమైనా లేదు. హద్దులు మించని ఏ కోరిక కోరినా ఆయన స్పందనలో ఏ మాత్రం తేడా లేదు.

 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు

ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                                                                        సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.     Site Design: Krishna, Hyd, Agnatech