1-844-626-BADI(2234)
Twitter
Youtube

సిలికానాంధ్ర

సముజ్వల సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కలిగిన తెలుగు జాతి మనది. తేనెలొలుకు తెలుగుభాష మనది. వెలకట్టలేని అపూర్వ సాహితీ సంపద మన స్వంతం. గతం పునాదులపైనే వర్తమాన వైభవం ఉంటుంది. దాన్ని నిలబెట్టుకున్నపుడే భవిష్యత్తు ఉజ్వలంగా ప్రకాశిస్తుంది. కొత్తను ఆహ్వానిస్తూ పాతను పొదివి పట్టుకుంటూ పాత కొత్తల మేలు కలయికగా సంస్కృతి పరిఢవిల్లుతూన్నప్పుడే సమాజం వికసిస్తుంది.

విలువల్ని నిలబెట్టుకుంటూ ఆధునికత అందిపుచ్చుకోడం భారతీయ సంస్కృతి. భారతీయతను, అందునా తెలుగుదన వైవిధ్య భరిత వారసత్వాన్ని సంరక్షించుకుంటూ తరాల మధ్య వారధిగా నిలుస్తూ. సంస్కృతీ ఝరి కొనసాగడానికి సరైన స్ఫూర్తిని అందించడమే సిలికానాంధ్ర లక్ష్యం. అందుకే సిలికానాంధ్ర సంస్థ కాదు… పాత, కొత్త తరాలనందరినీ కలిపి ఉంచే పెద్ద కుటుంబం. ఉమ్మడి కుటుంబం. 2001 లో ప్రారభమైన సిలికానాంధ్ర నేడు జగమంత కుటుంబంగా విస్తరించింది. “సిలికానాంధ్ర” (తెలుగు సాహితీ, సాంస్కృతిక, సంప్రదాయ స్ఫూర్తి).

కేవలం అమెరికాలో మాత్రమే కాక ప్రపంచంలో ఉన్న తెలుగువారందరికీ ప్రీతిపాత్రమైన సాంస్కృతిక సంస్థగా నిలుస్తోంది. తనదైన శైలిలో నిర్వహిస్తున్న వినూత్న విశిష్ట సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలతో అప్రతిహతంగ ముందుకు సాగుతోంది. 8 గిన్నిసు రికార్డులు సాధించిన ఏకైక సాంస్కృతిక సంస్థగా విశిష్టతను సంతరించుకుంది.

పన్నెండు సంవత్సరాల సిలికానాంధ్ర ఎన్నో మైలురాళ్ళను దాటింది. సిలికానాంధ్ర విజయ ప్రస్థాన వివరాలతోపాటు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించే ఈ వెబ్సైటుకి హృదయపూర్వక స్వాగతం. ఈ వెబ్ సైటులో సమాచారంతో పాటు ఎన్నో ఉపయుక్తమైన అంశాలు కూడా పొందుపరుస్తూంటాము. వాటన్నిటినీ ఎప్పటికప్పుడు నవీకరిస్తూంటాము. కొత్తవి చేరుస్తూంటాము.

సదా మీ ఆదరాభిమానాలు ఇలానే కోరుకుంటూ…
సిలికానాంధ్ర కుటుంబం