తెలుగు సంస్కృతిని భావితరాలకు అందించాలనే లక్ష్యంతో పన్నెండు సంవత్సరాల క్రితం సిలికానాంధ్రను స్థాపించడం జరిగింది. ప్రారంభించిన నాటి నుండి వినూత్నమైన కార్యక్రమాలను రూపొందించి తెలుగు సంస్కృతిని, సంప్రదాయాన్ని వేలాదిమంది చేరువలోకి తీసుకెళ్లడం జరిగింది.
ఈ ఒరవడిలోనే ఈనాడు సిలికానాంధ్ర మరొక చారిత్రాత్మకమైన కార్యానికి నాంది పలుకుతున్నది. దాదాపుగా అరవై సంవత్సరాల నుండి భారతీయులు అమెరికాకు ఉపాధికోసం, మెరుగైన జీవితం కోసం వలస వస్తున్నారు. కాని, ఇన్ని దశాబ్దాలలో ఇంతవరకు ఏ భారతీయులు, ఏ తెలుగు వారు తలపెట్టని చారిత్రాత్మక ఆలోచనకు నాంది పలుకుతున్నది. అదియే ‘సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం (University of Silicon Andhra)’ ఆవిర్భావం. తెలుగు సంస్కృతి, తెలుగ కళలు, తెలుగు భాషాశాస్త్రాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న సదుద్దేశంతో ప్రారంభించబడిన ఈ విశ్వవిద్యాలయంలో వచ్చే విద్యా సంవత్సరం నుండి తరగతులు ప్రారంభమవుతాయి.
మొదటగా తెలుగు కళలకు పట్టుగొమ్మలైన కర్ణాటక సంగీతం, కూచిపూడి నాట్యాలలో M.A., Diploma, మరియు Certificate కోర్సులను ప్రారంభించడం జరుగుతుంది. అలాగే, ప్రవాసాంధ్రులకు తెలుగుభాష, తెలుగు సాహిత్యంపై మక్కువ పెంపొందిచటానికి M.A.(తెలుగు) కోర్సును కూడా త్వరలో మొదలుపెట్టే యోచన ఉన్నది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుగుభాషకు జోడిస్తూ M.S. (Computational Linguistics) కోర్సుకు రూపును ఇవ్వడం జరుగుతున్నది. ఈ కోర్సు చదివిన వారికి తప్పక ఉపాధి లభ్యమవుతుంది. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ప్రారంభించటానికి కాలిఫోర్నియా రాష్ట్రం నుండి ప్రాధమికంగా అనుమతి లభించింది.
మరిన్ని అనుమతులు త్వరలోనే వస్తాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహింపబడే ఈ విశ్వవిద్యాలయానికి కూచిభొట్ల ఆనంద్ (ముఖ్య కార్యనిర్వహణాధికారి, Chief Executive Officer), చమర్తి రాజు (ముఖ్య విద్యాధికారి, Chief Academic Officer), కొండుభొట్ల దీనబాబు (ముఖ్య ఆర్థికాధికారి, Chief Financial Officer), కొండిపర్తి దిలీప్ (Chief Compliance and Audit Officer) మరియు గంటి అజయ్ (ముఖ్య కార్యదర్శి, Chief of Staff) గా వ్యవహరిస్తారు. పేరొందిన భారతీయులతో సలహా సంఘాన్ని(Advisory Board), అలాగే విద్యారంగంలో ప్రఖ్యాతులైన వారితో విద్యా సలహా సంఘాన్ని (Academic Advisory Council) ఏర్పరచడం జరుగుతుంది. ప్రముఖ విద్యావేత్తలను సంప్రదించి పాఠ్యాంశాలను రూపొందించడం జరుతుంది. ప్రపంచంలో ఎవరైనా Online మరియు Offline పద్ధతులను అనుసరిస్తూ చదివి పట్టాలు పొందవచ్చు.
సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం మారేపల్లి వేంకటశాస్త్రి గారి పూజతో ప్రారంభమైంది. ఈ ఉత్సవానికి డా.ఉపాధ్యాయుల అప్పల నరసింహమూర్తిగారు జ్యోతి ప్రజ్వలన చేస్తూ మహోన్నతమైన లక్ష్యంతో ప్రారంభమైన ఈ విశ్వ విద్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ లోని తెలుగువారు సుముఖంగా ఆహ్వానిస్తారని తెలిపారు. విశ్వవిద్యాలయం నిర్విరామంగా కృషి సలపడానికి, సర్వతోముఖాభివృద్ధి చెందడానికి ప్రతి ఒక్కరి సహయాన్ని కోరుతూ సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ నిర్వహణకు ఏయే స్థాయిల్లో ఆర్థిక సహాయం చేయవచ్చునో ముఖ్య కార్యనిర్వహణాధికారి కూచిభొట్ల ఆనంద్ వివరించారు. ఇంకా సిలికాన్ వేలీలోని ఇతర ప్రముఖులు, సాఫ్ట్ వేర్ కంపెనీ అధినేతలు ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొన్నారు.