1-844-626-BADI(2234)
Twitter
Youtube

Mangalvadya Sammelanam

భారతీయ శాస్త్రీయ సంగీతంలో ముఖ్యంగా కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో నాదస్వరం, డోలు, క్లారినెట్, సాక్సాఫోన్‌తో కూడిన మంగళ వాద్య సమ్మేళనానికి అత్యంత గౌరవనీయమైన స్థానం ఉంది. ఒకప్పుడు గొప్ప గొప్ప విద్వాసులు తమ నాదస్వర కచేరీలతో రసజ్ఞులను ఆనందాబ్దిలో ఓలలాడించారు. తమిళనాట టి.యస్. రాజరత్నం పిళ్ళై, పి.యస్. వీరాస్వామి పిళ్ళై, తిరువెంకడు సుబ్రహ్మణ్యం పిళ్ళై, కారైకురిచ్చి పి. అరుణాచలం, నామగిరి పేటై కృష్ణన్ (పద్మశ్రీ) వంటి నాదస్వర విద్వాంసులు, తెలుగునాట దాలిపర్తి పిచ్చిలహరి, గుంటుపల్లి విఠలదాసు, ఉస్తాద్ ఆదం సాహెబ్, షేక్ పీర్ సాహెబ్, పద్మశ్రీ షేక్ చినమౌలానా సాహెబ్, దోమాట చిట్టబ్బాయి వంటి నాదస్వర దిగ్గజాలు, ఈమని రాఘవయ్య, అన్నవరపు బసవయ్య, తిరుపతి సి.ఎం. మునిరామయ్య వంటి డోలు విద్వాంసులు తమ మంగళ వాద్య సంగీతంతో దాక్షిణాత్య సంస్కృతికి, సంగీతకళకూ ఎంతో వన్నెతెచ్చారు. కచేరీలు నేడు కానరావడంలేదు. ఏ కార్యక్రమానికైనా నాంది పలికే నాదస్వరం నేడు వినరావడం లేదు. వివాహాది శుభకార్యాలకు పరిమితమైపోయింది. ఈ కళను నమ్ముకుని  జీవనం సాగించే విద్వాంసులు తగ్గిపోయారు. కళకు ఆదరణ నానాటికీ అడుగంటుతున్నది.