శోభాయమానంగా మనబడి సాంస్కృతికోత్సవం
శ్రీకృష్ణ దేవరాయల సాహితీ సభా విన్యాసాలు ఒక వైపు, మహేంద్రుని తెలుగు కవితాస్వాదన మరోవైపు..పరమానందయ్య శిష్యుల హాస్య ప్రహసనాలు ఒక వైపు, “బుడుగు” యే కదలి వచ్చి బడిపిల్లలతో ఆడుకున్న వైనం మరో వైపు..తెలుగును ప్రపంచ భాషగా చేస్తామని శపథాలు, అందరిని తెలుగులో గర్వంగా మాట్లాడమని వినతులు..ఇవన్నీ ఒక రెండు రోజుల పాటు సిలికానాంధ్ర “మనబడి” చిన్నారులు ఆడుతూ – పాడుతూ తెలుగు సంస్కృతీ సౌరభాన్ని ఆహ్లాదకరంగా పంచిన సుందర అనుభూతులలో మచ్చుతునకలు.
సిలికాన్ వ్యాలీ మూలస్థానమైన “పాలో ఆల్టో” లో జనవరి 26, 27 తేదీల్లో అద్భుతరీతిలో జరుపుకున్న సాంస్కృతికోత్సవం పెద్దలకు ఆహ్లాదాన్ని పంచి, పిల్లలకు తెలుగు పట్ల మక్కువను పెంచింది. సిలికాన్ వ్యాలీలోని మనబడి కేంద్రాల్లోని పిల్లలందరిచే “స్పాంజెన్ బర్గ్ ” వేదికపై నిర్వహించిన ఈ కార్యక్రమానికి పిల్లలు, గురువులు శోభాయాత్రగా తరలివచ్చారు. సిలికానాంధ్ర వైస్ ఛైర్మెన్ శ్రీ కొండిపర్తి దిలీప్ గురువులకు జ్ఞాపికలతో అభినందించారు. శ్రీ దిలీప్ మాట్లాడుతూ పిల్లల్లో అసమానమైన ప్రతిభలు మాతృభాష నేర్పడం ద్వారా మెరుగు పరచమని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. తొలుత శ్రీ మారేపల్లి వెంకట శాస్త్రి గారి వేదప్రవచనంతో సంప్రదాయబద్ధంగా కార్యక్రమం ప్రారంభమైంది.
ఈ కార్యక్రమ నిర్వహణతో సిలికానాంధ్ర నూతన కార్యవర్గం బాధ్యతలను తీసుకుంది. నూతన అధ్యక్షుడు శ్రీ విజయసారధి మాట్లాడుతూ పూర్వ కార్యవర్గానికి ధన్యవాదాలు తెలిపి తమ ప్రణాళికను వివరించారు. సిలికానాంధ్ర కార్యక్రమాల ద్వారా తెలుగు వారిలో కొత్తగా ఉత్తేజితమైన భాషా స్ఫూర్తిని మరింత పెంపొందింపచేసి తెలుగు జగద్వ్యాపితయ్యేలా కృషి చేస్తామని అన్నారు.
పూర్వ కార్వవర్గ అధ్యక్షుడు శ్రీ కొండుభట్ల దీనబాబు మాట్లాడుతూ మనబడి ప్రాచుర్యానికి కృషి చేసిన తీరును, రెండువేల విద్యార్ధులకు తర్ఫీదునిచ్చేలా ఎదిగిన వైనాన్ని వివరించారు.
“మనబడి” పీఠాధిపతి (డీన్, అధ్యక్షుడు) శ్రీ చమర్తి రాజు అధ్యక్షోపన్యాసం చేశారు. “మనబడి” సాధించిన అద్భుతాల ప్రేరణతో రూపొందించిన కార్యక్రమాలు “బాలానందం” , “బాలరంజని”, “గ్రంథాలయం” ప్రకటించారు. మనబడి పూర్వ విద్యార్ధులను మనబడిలో బాల గురువులుగా తీసుకోనున్నట్లు అందుకు తగిన తర్ఫీదునిస్తున్నట్లు ప్రకటించారు. అంతేగాక, కొత్తగా స్పెల్లింగ్ బీ తరహాలో తెలుగులో “మాట్లాట” పోటీ, జెపర్డీ తరహాలో “తిరకాటం” పోటీలను మనబడి ద్వారా నిర్వహించనునట్టు అందరి హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. పూర్వ విద్యార్ధి సంఘం “మనబడి మనతరం” అధికారికంగా ప్రకటించారు.
ఆపై ఒక్కొక్క మనబడి కేంద్రం ఒక్కొక్క సాంస్కృతిక అంశాన్ని ప్రదర్శిస్తూ ఉత్సవాన్ని శోభాయమానం చేశారు. ఈ యేటి కార్యక్రమాల్లో భారత స్వతంత్య్ర పోరాటాల ఆధారంగా, సంక్రాంతి పండుగ ఆధారంగా చేసిన ప్రదర్శనలు పలువురి మెప్పునొందాయి. బుడి బుడి నడకల బుజ్జాయిలు ముద్దుగా చెప్పిన చిట్టి పొట్టి పాటలు, అన్నమయ్య – పెద్దన – పోతన, గురజాడ వంటి కవుల రచనలతో చేసిన సాహితీ కార్యక్రమాలు, మనబడి గురువులచే సృజనాత్మకంగా రూపొందించబడ్డ నాటికలు – అవధానాలు – పరిశోధనాత్మక చర్చలు అందరినీ అలరిస్తూ ఆలోచింపచేసాయి. ప్రతి మనబడి కేంద్రం నుండి దాదాపు అందరు విద్యార్ధులూ కలిసి నాటికలు ఆడుతూ, పద్యాలు – పాటలు పాడుతూ, నర్తిస్తూ తమ ప్రతిభలతో ప్రేక్షకులను ముగ్ధులను చేశారు. ఈ సాంస్కృతిక కార్యక్రమం శ్రీమతి పద్మ గోవిందరాజు, శ్రీమతి అద్దేపల్లి మానస గార్ల ఆధ్వర్యంలో సజావుగా నిర్వహించబడింది.
“మనబడి” నిర్వాహకులు ఈ ఏడు కొత్తగా ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని వివిధ ప్రాంతాల్లో ఒకేమారు నిర్వహించారు. ఓరెగాన్ రాష్ట్రంలోని పోర్ట్ లాండ్ లో శ్రీ మధిర మూర్తిగారి ఆధ్వర్యంలో జనవరి 26 తేదీన అక్కడి విద్యార్ధులచే సాంస్కృతికోత్సవం సమాంతరంగా నిర్వహించబడింది.
అంతేకాక రానున్న నెలలో అమెరికాలోని అన్ని ప్రాంతాల్లో ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆయా కార్యక్రమాల సంధానకర్త శ్రీమతి వేదుల స్నేహ తెలిపారు.
సిలికానాంధ్ర ఉపాధ్యక్షులు శ్రీ కోట్ని శ్రీరాం, రెండు రోజుల ఉత్సవానికి నెల్లాళ్ళుగా కృషి చేసిన కార్యకర్తలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. రెండు రోజులూ శ్రీ అన్నం అనిల్ ఆధ్వర్యంలో మంచి విందు భోజనం ఏర్పాటు చేశారు.
26 రాష్ట్రాలు, 400 పైగా గురువులు, 2000 పైగా విద్యార్ఢులు..
భారతదేశం ఆవల భాష, సంస్కృతులు తరువాతి తరాలకు వ్యవస్థీకృతంగా అందించడానికి నడుం కట్టిన సిలికానాంధ్రులు “మనబడి” ని ఇంతింతై వటుడింతై అన్న చందాన పురోగామి పథంలో నడిపిస్తూ సాధించిన అద్భుతమిది. అకుంఠిత దీక్షతో సాగుతున్న ఈ ఉద్యమ ఫలాలు అందుతూ భాషాభిమానులకు ప్రపంచవ్యాప్తంగా ఆనందాన్ని నింపుతోంది. ప్రవాసంలోని పిల్లల తెలుగు ఉఛ్ఛారణ, వారు తెలుగు నేరుస్తున్న తీరుని పలువురు చర్చించుకుంటూ సిలికానాంధ్ర కార్యకర్తలను అభినందించారు. సిలికానాంధ్రకు సాయంగా నిలుస్తామని పలువురు స్థానికులు ఔదార్యంగా ముందుకు వచ్చారు.