Sujanaranjani
           
  కథా భారతి  
   

నాకు నచ్చిన కథ : ధన త్రయోదశి  - శ్రీమతి భండారు అచ్చమాంబ  

 

వ్యాస రచన : టీవీయస్.శాస్త్రి.    

 

శ్రీమతి  భండారు అచ్చమాంబ గారు (1874 - 1905) తొలి తెలుగు కథా రచయిత్రి. అచ్చమాంబ గారు, గురజాడ అప్పారావుగారి కన్నా పదేళ్ళ ముందే 1902 నవంబరు నెలలో రాసిన కథధన త్రయోదశి’. అచ్చమాంబ గారు 1874 సంవత్సరంలో కృష్ణా జిల్లా నందిగామ దగ్గర పెనుగంచిప్రోలులో పుట్టింది.ఈమెకు ఆరేళ్ళ వయసపుడే తండ్రి చనిపోయాడు.10 ఏటనే ఈమెకు పెళ్ళయ్యింది. పెళ్ళయ్యే నాటికి అచ్చమాంబ ఏమి చదువుకోలేదు.ఆమె తల్లి,తమ్ముడు కూడా ఆమెతో పాటే ఉండేవారు.ఆమె తమ్ముడుకి  (ప్రముఖ భాషావేత్త శ్రీ కొమర్రాజు లక్ష్మణరావుగారు) చదువు చెప్పించారు. ఎమ్. చదివిన తమ్ముడితో పాటు కూర్చుని తానే చదువుకుంటూ తెలుగు,హిందీ నేర్చుకొన్నది. 1902లో మచిలీపట్నంలో మొదటి మహిళా సమాజంబృందావన స్త్రీల సమాజంను స్థాపించింది. చిన్న వయసులో కుమారుడు,కుమార్తె మరణించడం ఆమెకు తీవ్రమైన దు:ఖాన్ని కల్గించింది.అనాధ పిల్లల్ని చేరదీసి చదువు చెప్పించేది.ఆమె ఇంట్లో ఎపుడు ఐదారుగురు పిల్లలుండి చదువుకుంటూ వుండేవారు.1905 జనవరి 18 తేదీన ముఫ్ఫై ఏళ్ళకే మరణించింది.అచ్చమాంబ గారు   అబలా సచ్చరిత్రమాల అనే గ్రంధాన్ని రచించింది.ఇందులో షుమారు 1000 సంవత్సరాల కాలంలో ప్రసిద్ధికెక్కిన భారత స్త్రీల కథలున్నాయి. గ్రంధాన్ని కందుకూరి వీరేశలింగం పంతులుగారు తమ చింతామణి ముద్రణాలయంలో ప్రచురించారు.

        దీపావళికి ముందరి రోజు త్రయోదశి. అది కూడా పర్వదినమే.లక్ష్మీపూజ చేసే రోజు అది.దరిద్రం తాండవించే ఒక కుటుంబ యొక్క పరిస్థితిని కథా వస్తువుగా తీసుకున్నారు   రచయిత్రి.పది రూపాలయ జీతానికి గుమస్తాగా పని చేస్తున్న భర్తకు చేదోడుగా ఆమె కుటుంబ నిర్వహణ కోసం రవికలు కుడుతూ సంసారాన్ని గడుపుతూ ఉంటుంది.దీపావళి పండుగకు పిల్లలకు కొత్త బట్టలూ,టపాసులూ,కొనిపెట్టలేని ఆర్ధిక దుస్థితికి బాధపడుతున్నాఅది పైకి కనపడనీయదు.పతిని మందలించటం మంచిది కాదు అనే సాంప్రదాయ భావం వున్నప్పటికీ అతను చెడిపోతుంటే చూడడం వివేకం కాదన్న ఉద్దేశ్యంతో యెలా మంచిగా జీవించాలో అతనికి చెప్పింది."ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్ర్తీ ఉంటుందనే"సామెతకు  అక్షరరూపం యిచ్చి లక్షల విలువైన నిజాన్ని చెప్పిన కథ ఇది!మనిషి నిజాయితీ బయట పడేది,ప్రతి కూల పరిస్థితులు ఏర్పడినపుడే!అటువంటి పరిస్థితులను ఎదిరించి యెలా ధైర్యంగా,నిజాయతీగా బతకాలో భర్తకు ఒక స్నేహితురాలు,హితుని లాగా చెప్పింది,ఆమె. అడ్డదారుల్లో అవినీతి    సంపాదనతో ఆడంబరంగా ఆనందంగా జీవిస్తూ,అవినీతి పరులైన భర్తలను ప్రోత్సహించే 'నారీశిరోమణులకు',పతివ్రత అంటే యెలా ఉండాలో నిజమైన అర్ధం చెప్పిన గొప్ప కథ ఇది.

 

************************************************************************

 

ఊరంతా దీపావళి పండుగ కాంతులకోసం యెదురు చూస్తూ కళకళ లాడుతుంది.అతని ముఖంలో మాత్రం అమావాశ్య చీకటులే కనపడుతున్నాయి.పిల్లలిద్దరూ తమకు కొత్త బట్టలు లేవనీ టపాసులు లేవనీ అలిగి కూచున్నారు.ఆవిడకు కూడా బాధ లోపల వున్నప్పటికీ,చిరునవ్వు ముఖం మీద చెరగకుండా పిల్లలను ముద్దుగా ఊరడిస్తూ"మీ నవ్వుల కన్నా కాంతివంతమైన మతాబులు ఎక్కడ వుంటాయి?" అని వారిని సముదాయిస్తూ హాయిగా వుంటుంది.భర్త ఒక పెద్ద వర్తకుడి వద్ద చిన్న గుమాస్తా.అతని జీతం నెలకు పది రూపాయలు. సంపాదన కుటుంబ పోషణకు మాత్రం సరిపోదు.భర్తకు చేదోడుగా రవికలు కుడుతూ తానూ సంపాదిస్తూ కుటుంబ భారాన్ని పంచుకుంటుంది.అర్ధం చేసుకునే భర్త,ముద్దులొలికే పిల్లలూ ఇంతకన్నా ఒక గృహిణికి కావల్సిన సంపద ఏముంటుంది? కానీ,పండుగకు పిల్లలు చిన్న బుచ్చుకోవటం లోపల ఆమెకు కూడా బాధగానే వుంది.రాత్రి పని పూర్తి చేసుకొని భర్త భారంగా ఇంటికి చేరాడు.ఆందోళనగా వున్నాడు.వళ్ళంతా చెమటలు పడుతున్నాయి.రోజూలాగే పిల్లలను నిద్రపుచ్చి,భర్తకు భోజనం వడ్డిస్తూ,అతని వాలకం,ప్రవర్తన కొంత వింతగా వుండటం చేత, "ఏమైందీ! అదోలా వున్నారు?"అని భర్తను అడుగుతుంది.అతను తలదించుకునే సమాధానం చెబుతున్నాడు"నీకు మాత్రం బాధగా లేదా!పండుగ రోజు పిల్లలు అలా చిన్నబుచ్చుకోవటం?". " మాత్రం దానికి బాధపడాలా! మనలాంటి వారికి ఎప్పుడు చేతిలో డబ్బులుంటే అప్పుడే పండుగ.డబ్బులున్నప్పుడు పిల్లలకు బట్టలు కొనిపెట్టవచ్చు." అని భర్తను సముదాయిస్తుంది.అతను మౌనంగా వుండిపోయాడు. నిద్రపోతున్నాడుగానీ,నిద్ర పట్టటం లేదు.ఆమె ప్రశాంతంగా నిద్ర పోయింది.అతడు లేచి కూచొని రోజు తన యజమాని ఇంట్లో జరిగిన సంఘటను నెమరు వేసుకుంటున్నాడు. రోజు యజమాని ఇంట'ధనత్రయోదశి'పూజ జరిగింది.ఇంట్లో భద్రంగా వున్న బంగారు ఆభరణాలు,డబ్బు అంతా బయటకు తీసి పూజలో వుంచారు.రెండు రోజులు వాటిని అలానే వుంచి,దీపావళి పండుగ  అయిపోయిన తరువాత వాటిని మళ్ళీ  లోపలపెట్టి భద్రపరుస్తారు.పెద్ద గుమాస్తా అతడిని పక్కకు పిలిచి"ఒకటి,రెండు నగలు తీసి జేబులో వుంచుకో! ఇక్కడ వున్న వారికెవ్వరికీ లెక్క తెలియదు.  నీవు సరే నంటే,నేను కూడా అదే పని చేస్తాను "అని ప్రలోభపెట్టాడు. మాటలు విన్న అతడికి చెమటలు పట్టాయి."నా మనసు పని చేయటానికి ఒప్పుకోవటం లేదు." అని నిష్కర్షగా పెద్ద గుమాస్తాకు చెప్పాడు."తొందరేమీ లేదు.నిదానంగానే ఆలోచించు,యింకా రెండు రోజుల వ్యవధి వుంది.అంతవరకూ వంద రూపాయలు వుంచు,పండుగకు  వుపయోగ పడుతాయి" అని చెబుతూ బలవంతంగా అతని జేబులో వందరూపాయల నోటును వుంచి అతనిని రంగంలోకి   దించాడు పెద్ద గుమాస్తా.అలా అతను వంద రూపాయల నోటుతో రాత్రికి ఇంటికి చేరాడు. జరిగింది భార్యకు చెప్పాలనుకున్నాడు,కానీ చెప్పటానికి సంకోచించాడు,చెప్పలేకపోయాడు. వంద రూపాయల నోటును ఇప్పుడు తీసి మరీ మరీ చూసుకుంటూ,పెద్ద గుమాస్తా గారు చెప్పిన పని చేద్దామా,వద్దా అని ఆలోచిస్తూ ఆందోళనలోవున్నాడు.భార్య నిద్రలేచి భర్త చేతిలోని వంద రూపాయల నోటును చూసింది.భార్య ఒడిలో తలపెట్టి బాధతో జరిగినదంతా పూసగుచ్చినట్లు భార్యకు చెప్పాడు.అప్పుడు భార్య అతనితో"మనిషి బతకాలంటే కావలసినవి నీతీ,నిజాయతీ ఆరెండూ లేని  జీవితం వృధా! ఇటువంటి తప్పుడు బతుకు మనకు వద్దండి."అని భర్తను సముదాయించి,మరుసటి రోజు భర్తను తీసుకొని పెద్ద గుమాస్తా ఇంటికి  వెళ్లి,అక్కడ వున్న బల్లమీద వంద రూపాయల నోటు వుంచి "దయచేసి తప్పుడు పనుల్లోకి మమ్ము లాగకండి" అని చెప్పి వెనుతిరిగారు.పెద్ద గుమాస్తా వాళ్ళను వదలలేదు సంతోషంతో అతనిని కౌగలించుకున్నాడు. పరీక్ష పెట్టి నాటకాన్ని నడిపిన యజమాని లోపలినుంచి బయటకు వచ్చి వారిని మెచ్చుకున్నాడు.మనసు చలించిన భర్తను సరైన దోవలో పెట్టిన భార్య గురించి విని,"ఆమె నాకు నిజమైన తోబుట్టువు"అని చెప్పి దంపతులను  తన కుటుంబ సభ్యులుగా చేసుకున్నాడు. అతని జీతాన్ని రెండింతలకు పెంచాడు.నిజాయతీ అనే అసలైన'సిరిని'కాపాడుకున్న వారికి ఆరోజు నిజంగానే'ధనత్రయోదశి'.సిరి వారింటికి నడుచుకుంటూ వచ్చింది.

               ఇంత చక్కని కథను వ్రాసిన వారు తొలి తెలుగు కథా రచయిత్రి కావటం మన అదృష్టం.అతి చిన్న వయసులోనే మరణించిక పొతే వీరి కలం నుండి మరెన్నో మంచికథలు జారువాలేవి అనటంలో మాత్రం సందేహం లేదు.  

            శ్రీమతి అచ్చమాంబ గారికి స్మృత్యంజలితో.....

 

 
 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech