12 వ వార్షికోత్సవం ఘన విజయం!!
సిలికానాంధ్ర 12వ వార్షికోత్సవం సన్నీవేల్ లోని హిందూదేవాలయంలో ఆగస్ట్ 3, శనివారం నాడు ఘనంగా జరిగింది.బాలకృష్ణ, జగదీష్ శర్మ వేదప్రవచనంతో ప్రారంభమైన పుష్కరోత్సవంలో ‘సంగీత నవనవావధానం’ లో అవధాని డా.మీగడ రామలింగస్వామి తన గాత్రమాధుర్యంతో సభికులను రంజింపజేసారు. పురాణం, శతకం, ప్రబంధం, నాటకం,అవధానం, ఆధునికం, శ్లోకం మొదలగు ఏడు అంశాలనుండి పృచ్చకులు తమకు నచ్చిన రాగంలో పద్యాలు పాడారు.అదే పద్యాన్ని వేరే రాగంలో పాడమని అవధానిని అడిగారు. అప్పటికప్పుడు ఎలాంటి వాద్యసహకారం లేకుండాపద్యాలను రామలింగస్వామి స్వరపరిచిన విధానం అమోఘం. అప్పుడప్పుడు తెలుగుభాషా ప్రాశస్త్యాన్ని,తెలుగుజాతి కీర్తిని వివరిస్తూ పురాణాలు, నాటకాల్లోని పెక్కు పద్యాలన్ని రాగయుక్తంగా పాడగా సభాప్రాంగణంకరతాళధ్వనులతో నిండిపోయింది.
మధు ప్రఖ్య సంధానకర్తగా, హరిశాస్త్రి, తిరుమల పెద్దింటి నరసిం హాచార్యులు, నాదెళ్ళ వంశీ, నారాయణ రాజు, దర్భసుబ్రహ్మణ్యం, తాటిపాముల మృత్యుంజయుడు, శ్రీమతి కూచిభొట్ల శాంతి, శ్రీమతి కొలవెన్ను శ్రీలక్ష్మి పృచ్చకులుగావ్యవహరించారు. ప్రముఖ సినిమా, నాటక రచయిత ఆకెళ్ల రచించి, సిలికానాంధ్ర సభ్యులు నటించిన నాలుగు లఘునాటికలు ప్రేక్షకులను అలరించాయి.
సిలికానాంధ్ర అధ్యక్షుడు మాఢభూషి విజయసారధి ఉపన్యసిస్తూ గత పన్నెండు ఏళ్లుగా సిలికానాంధ్ర తెలుగుసాహితీ, సంస్కృతి, సాంప్రదాయ పరివ్యాప్తికి చేస్తున్న కృషిని వివరించారు. అక్టోబర్ 5న ‘ఆంధ్ర సాంస్కృతికోత్సవం’జరుగుతుందని ప్రకటించారు. వైస్ చైర్మన్ కొండిపర్తి దిలీప్ మాట్లాడుతూ సిలికానాంధ్ర కార్యవర్గాల మరియు సభ్యులస్వచ్చంద సేవతోనే ఇంతటి ప్రగతిని సాధించిందని కొనియాడారు. మనబడి పీఠాధిపతి చమర్తి రాజు రాబోయేవిద్యాసంవత్సర వివరాలను వెల్లడించారు. సెప్టెంబర్ 1న తెలుగు మాట్లాట తుదిపోటీ జరుగుతుందని తెలిపారు.కోట్ని శ్రీరాం, కాజ రామకృష్ణ, మంగళంపల్లి రాజశేఖర్, వంక రత్నమాల సహాయసహకారాలందించిన ఈ వేడుక విందుభోజనంతో విజయవంతంగా ముగిసింది.