కూచిపూడి నాట్య సమ్మేళనం
రాళ్ళలో సైతం రాగాలు పలికించగలిగినవి, గండ్ర శిలలోనూ
జీవాన్నీ అటుపై దైవత్వాన్నీ ఆవిష్కరించగలిగినవి
భారతీయమైన కళలు. భారతదేశంలో వెల్లివిరిసిన కళలన్నీ
కేవలం సృజనాత్మకతకు పర్యవసానాలు మాత్రమే కాదు. మహర్షుల
తపస్సుల సారాంశాలు. అందుకే కళాకారుడికీ, ప్రేక్షకుడికీ
ఇహంలోనే పరబ్రహ్మ సాక్షాత్కారానికి దోహదపడుతున్నాయి.
మానవ జీవితము పరమర్ధం దిశగా మానవ జీవన పయనాన్ని
సాగింపజేయడం ఏకైక లక్ష్యం అవటం వల్ల కళలన్నీ మహర్షులు,
సిద్ధుల ద్వారా సంస్కరించబడి మనకు అందజేయబడినాయి.
యుగయుగాల కూచిపూడి నృత్యరీతి యొక్క అవిఛ్చిన్న
వారసత్య్వం గురు-శిష్య పరంపర్లో కొనసాగుతూనే ఉన్నది. ఈ
మహోన్నత వారసత్వాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడంలో
విశ్వవ్యాప్తమైన గురువులు అవిరళ కృషి చేస్తున్నారు. ఈ
ప్రయత్నాలన్నీ వారి వారి పరిధుల్లో కొనసాగుతున్నాయి.
అయితే, ప్రపంచవ్యాప్తమైన ఈ పరంపరల సూత్రావళులను ఒక్క
చోటికి చేర్చి, వారి వారి అనుభవాలు, అనుభూతులనూ
మేళవించి, ఆత్మీయతతో పెనవేసుకుని, ఆ సూత్రబంధంతో
ఇనుమడించిన కూచిపూడి నృత్య వారసత్వాన్ని ముందు తరాలకు
మరింత శోభాయమానమైన కాంతులీనేలా అందజేయడానికి
విశ్వవేదిక ఏర్పాటు చేయడమే సిలికానాంధ్ర ఆశయం. అరుదైన
ఈ సంపదను మన తరువాతి తరాలకు బంగారు పళ్ళెంలో అందిస్తూ
ఈ నృత్యరీతి యొక్క ప్రాముఖ్యతను వారు సరిగా గుర్తించేలా
చేయడమే ఈ సమ్మేళనానికి లక్ష్యం.
తలపెట్టిన క్షణం నుండీ ఈ మహదాశయ సిద్ధికై ప్రపంచ
నలుమూలల్ నుండి లభించిన అపూర్వ ఆదరణ మరింత
బాధ్యతాయుతంగా, శక్తివంచన లేకుండా కృషి చేయడానికి
స్ఫూర్తినిచ్చింది. ఉదాత్తమైన లక్ష్యాల ఫలితమూ
ఉదాత్తంగానే ఉంటుందనడానికి నిదర్శనమే ప్రపంచ ప్రసిద్ధ
గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూచిపూడి
నృత్యానికి లభించిన అరుదైన గౌరవం.
సిలికానాంధ్ర హైదరాబాద్ లో నిర్వహించిన 2వ అంతర్జాతీయ
కూచిపూడి సమ్మేళనంలో భారతదేశ రాష్ట్రపతి శ్రీమతి
ప్రతిభాపాటిల్ సమక్షంలో 2850 మంది కూచిపూడి కళాకారులు
చేసిన మహాబృంద నాట్యంతో కూచిపూడి వైభవాన్ని ప్రపంచానికి
చాటారు.

ఈ
సంవత్సరం హైదరాబాద్ లో నిర్వహించనున్న 3వ అంతర్జాతీయ
కూచిపూడి సమ్మేళనానికి 6 వేల మంది కూచిపూడి కళాకారులు
పాల్గొంటారని అంచనా. ఈ విధమైన నిర్మాణాత్మకమైన
కార్యక్రమాలతో రాబోయే తరాలలో తెలుగు భాష సంస్కృతి
దీప్తి మరింత దేదీప్యమానంగా వెలుగొందే విధంగా
నిర్వహించిన కార్యక్రమాలకు మేము చేస్తున్న ఈ కృషికి..
మీరందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు.
మనబడి
పూర్తి వివరాల కొరకు దర్శించండి :
http://www.kuchipudi.siliconandhra.org
|
వ్యవస్థలు పేజీ |
|