శీర్షికలు
పద్యం-హృద్యం
నిర్వహణ - పుల్లెల శ్యామసుందర్
ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.
ఈ మాసం ప్రశ్న:
మే మాసములో రోహిణికార్తె సందర్భముగా ఈ సమస్య:
రోహిణికార్తెలో చలికి లోకులు బాధలనొందురెప్పుడున్
గతమాసం ప్రశ్న:
బ్యాటింగును జేయువాడె బౌలరు గదరా!
ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.
టేకుమళ్ళ వెంకటప్పయ్య, విజయవాడ
గోటితొ పోయెడి క్యాచికి,
వాటము తెలియని నలువురు వాదము లాడన్;
నోటికి తాళము వేయుచు
బ్యాటింగును జేయువాడె బౌలరు గదరా!
(క్యాచి పట్టమంటే పట్టకుండా ఫీల్డర్లు సాకులు చెప్తూ.. వాదాలు ఆడుతూ ఏవో సాకులు చెప్పే వారికి నోటికి తాళము వేసేట్టుగా అద్భుతం గా బ్యాట్టింగ్ చేసాట్ట ఒక బౌలర్.)
శివప్రసాద్ చావలి, సిడ్నీ
ఆటన, చివరి వికెట్టుకు
ధాటిగ బవులరులిడు తుది దాడికి క్లైమాక్స్
వేటుల గెలుపు పథంబున
బ్యాటింగును జేయువాడె బౌలరు గదరా!
ఆట న, వికెట్లు జప్పున
మేటిగ జేగొని, గెలువగ, మెలకువ తోడన్
దీటుగ నవసర మొప్పగ
బ్యాటింగును జేయువాడె బౌలరు గదరా!
సూర్యకుమారి వారణాసి, మచిలీపట్నం
మీటింగు లలో చెప్పుచు
చాటింగులు చేసి మరియు చాటించుచునే
ఓటింగును చేయ బోవును
బ్యాటింగును చేయువా డె బౌలరు గదరా
జంధ్యాల కుసుమ కుమారి హైదరాబాదు
పాటించుచు నియమావళి
ఆటంతయునభ్యసించి ఆల్ రౌండరగున్
వాటంబించుక చెదరక
బ్యాటింగునుజేయు,వాడె బౌలరు గదరా
ప్రసాద్ ఇంకొల్లు
బ్యాటింగులు బెట్టింగులు
ఏ 'టింగు'లు తెలియనోడు బేలగ పలికెన్
బ్యాటింగెవరని అడుగగ
"బ్యాటింగును జేయువాడు బౌలరు గదరా!"
సతీష్ కుమార్ ఇంద్రగంటి, చెన్నై
మేటిగ మొదలున వచ్చెడి
బ్యాట ర్లవుటయ్యె వరస బెట్టుచు, ఔరా!
ఆట గెలుపెటుల, చివరన
బ్యాటింగును చేయువాడె బౌలరు కదరా!
శ్యామసుందర్ పుల్లెల, శాన్‌హోసె కాలిఫోర్నియా
ధీటుగ నొక ఆల్రౌండర్
బ్యాటింగును జేయు - వాడె బౌలరు గదరా
నీటుగ వికెట్లు దీయుచు
ఆటన చెలరేగువాడు, అవనిన శ్యామా!
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)