శీర్షికలు
తెలుగు తేజోమూర్తులు
సంగీత రాజర్షి వోలేటి వెంకటేశ్వరులు
తెలుగు సంగీత వినీలాకాశంలో వెలసిన ధృవ తార - శాస్త్రీయ సంగీత రాజర్షి - శ్రీ వోలేటి వెంకటేశ్వరులు గారు. వీరి సంగీతం జన హృదయాలను తాకింది. పాట శృతి లో ఉండాలి. లక్షణంగా ఉండాలి. రాగ, లక్షణ, గమక, భావ, తాళ, లయ జ్ఞానంలో ఈయన దిట్ట. అందుకనే రసజ్ఞులు వీరిని " ఋషి " గా అభివర్ణించారు. వోలేటి వారి ఆధ్వర్యంలో విజయవాడ ఆల్ ఇండియా రేడియో సంగీత శిక్షణా కార్యక్రమాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. వీరు ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు కూడా పాడారు. సదాశివ బ్రహ్మేంద్ర కృతులు, నారాయణ తీర్ధుల వారి తరంగాలు వీరి గొంతులో జాలువారాయి.. ఖ్యాతి, డబ్బు యావ లేని సంగీత రాజర్షి శ్రీ వోలేటి వెంకటేశ్వరులు గారు. వీరి రాగాలాపన చాలా విలక్షణమైనది. రాగం, భావం రెండూ మెండుగా ఉండి రసవత్తరంగా ఉంటాయందులో. వీరు ప్రముఖ సంగీత దిగ్గజం శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారితో సన్నిహితంగా పనిచేశారు. సంగీతానికి శ్రావ్యత అద్దిన ప్రజ్ఞాశాలి నీరు. ఎన్నో కృతులకు స్వర కల్పన చేసారీయన. శ్రీపాద పినాకపాణి గారి శిష్యులు ఈయన. ఆల్ ఇండియా రేడియో లో " భక్తి రంజని", "యక్ష గానం", "ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు " మొదలైన కార్యక్రమాలు రూపొందించారు.
"వోలేటి గొప్ప మేధావి - ఆణి ముత్యం, మంచి మనస్సున్నవాడు కూడాను. ఆంధ్ర దేశంలో అత్యుత్తమ సంగీతజ్ఞుడు. మళ్ళీ అలాటి వాడు మళ్ళీ పుడతాడో లేదో! " అని సంగీత కళానిది శ్రీ శ్రీపాద పినాకపాణి గారు అభివర్ణించారు. " "సంగీతం లో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పారు వోలేటి" అన్నారు ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు. ఎం ఎస్ గోపాలకృష్ణ గారు, లాల్గుడి జయరామన్ గారు ఓలేటి వారికి అభిమానులు, మిత్రులు.
శ్రీ వోలేటి వెంకటేశ్వరులు గారు ఆలపించిన సంగీత రసగుళికల్లో - "శంకరీ నీవే", "బృహదీశ్వరాయ నమస్తే" (శంకరాభరణం), "థిల్లాన" , "శ్రీ వేంకట గిరీశం", "నగుమోము గనలేని (అభేరి రాగం), "కామాక్షి అనుదినము (స్వరజతి)", "నారాయణ తీర్ధుల వారి తరంగాలు" ఇత్యాదివంటివెన్నో ఉన్నాయి.
పరిశీలన, సాధనల ద్వారా ఎప్పటికప్పుడు స్వర జ్ఞానం పెంపొందించుకోవాలంటారు వోలేటి. . " అనునిత్యం సంగీత సాధన చేయాలి. ఒక్క రోజు మానేస్తే ఇది నీకు తెలుస్తుంది. రెండు రోజులు మానేస్తే అది ప్రేక్షకులకి కూడా తెలుస్తుంది " అంటూ చెప్పిన ద్వారం వెంకటస్వామి నాయుడు గారి మాటలు శిరోధార్యాలీయనకు.
జననం, చదువు, సంగీత ప్రవేశం:
శ్రీ వోలేటి వెంకతేశ్వరులు ఆగస్టు 27, 1928 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి లో జన్మించారు. వీరి తండ్రి నరసింహా రావు గారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం వాస్తవ్యులు. తల్లి శ్రీమతి అచ్చికాసులు గారు. ఐదవ ఏట నుండి సంగీతం నేర్చుకున్నారు శ్రీ వోలేటి. మొదట చతుర్వేదుల అచ్యుతరామ శాస్త్రి గారి వద్ద సంగీతం నేర్చుకుని తరువాత కాకినాడ లో మునుగంటి వెంకట్ రావు పంతులు గారి వద్ద శిష్యరికం చేశారు. పన్నెండు స్వరస్థానాలు నేర్చుకున్నారు - జ్ఞాపకం పెట్టుకున్నారు - ఒక పాట వింటూ వాటి స్వర స్థానాలు, గమకాలు అలవోకగా వ్రాయగలిగేవారు శ్రీ వోలేటి.
వెంకటేశ్వరులు గారికి 1945 లో వివాహమయ్యింది. వీరి సతీమణి శ్రీమతి విజయలక్ష్మి గారు. వోలేటి వారికి పెసరట్లు అంటే చాలా ఇష్టమట.
ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి సంగీతంలో పట్టా సాదించారు. మూడేళ్ళ పాటు సంగీత కళానిధి శ్రీ శ్రీపాద పినాకపాణి గారి వద్ధ "సంగీత జ్ఞాన - రాగ, తాళ, లయ సూక్ష్మాల"ను అవపోశన పట్టారు. ఇంక వెనక్కి తిరి చూసేదేముంది? - ముందుకి సాగిపోయారు. వీరి రాగాలాపన అద్బుతంగా ఉండేది. చిన్న తనంలోనే స్వర స్థానాలని బాగా ఆకళించుకున్నారు. అనేక సంగీత ప్రక్రియలు నేర్చుకున్నారు. 1947 నుండి కచ్చేరీలు ఇవ్వడం మొదలు పెట్టారు. ప్రధమ కచ్చేరి కాకినాడ లో చేశారు. తరువాతిది సరస్వతీ గాన సభలో చేశారు. అప్పటికి బి.యె. మొదటి సంవత్సరం చదువుతూ ఉన్నారు. ద్వారం నరసింగరావు గారు, ఇల్లా సోమన్న గారు వీరికి వాయిద్య సహకారం అందించేవారు.
వోలేటి గారు శ్రీపాద పినాకపాణి గారిని ప్రప్రధంగా విశాఖపట్నం లోని విజయ త్యాగరాయ సంగీత సభలో కలిశారు. "పంచరత్న కృతులు, ఐదు దీక్షితార్, శ్యామ శాస్త్రి కృతులు" పాడి శ్రీపాద గారి దీవెనలని అందుకున్నారు.
"ఆద్యాత్మ రామాయణ కీర్తనలు" , "సదాశివ బ్రహ్మేంద్ర కృతులు", "నారాయణ తీర్ధుల వారి తరంగాలు" ఇత్యాదివెన్నో వీరి గొంతులో జాలువారి జనరంజంకమై నిలిచాయి. చెన్నైలో కచ్చేరీ చేస్తే లాల్గుడి గారి ఇంటి నుంచి తంపుర వచ్చేది. చాలా సంగీత కార్యక్రమాలలో యెల్లా వెంకటేశ్వర రావు గారు వోలేటికి మృదంగ సహకారమందించారు.
వీరు ఆలాపించిన సంగీత రసగుళికలలో - "శంకరీ నీవే", "బృహదీశ్వరాయ నమస్తే (శంకరాభరణం)", "థిల్లాన", "శ్రీ వేంకట గిరీశం", "నీమది చల్లగ (ఆనందభైరవి రాగం)", "నగుమోము గనలేని (ఆధేరి రాగం)", "కామాక్షి అనుదినము (స్వరజతి)", "కోటి నదులు", "నీ చిత్తము", "జననీ నిన్నువిన" ,"మోహన రామ", "సంకల్పం ఎట్టిదో", "సర్వం బ్రహ్మ మయం", "పట్టి విడువరాదు", "రంగనాధుడే", "దుర్మార్గ చర", "నారాయణ తీర్ధుల వారి తరంగాలు", శ్రీపాదపినాకపాణి గారు స్వరకల్పన చేసిన "అన్నమాచార్య కీర్తనలు, "కాళహస్తి సంస్థానంలోని మునిపల్లె సుబ్రహ్మణ్య కవి వ్రాసిన కీర్తనలవంటివెన్నో ఉన్నాయి. రంజని, బెగాడ, పంతువరాళి, వరాళి వోలేటి గారికి ఇష్టమైన రాగాలంటారు.
వోలేటి వెంకటేశ్వరులు గారు హిందుస్తాని సంగీతంలో కూడా దిట్ట. వీరికి 1940 ప్రాంతాల్లో హిందుస్తాని సంగీతంతో పరిచయమయ్యింది. "బిస్మిల్లా ఖాన్, బడే గులాం అలి ఖాన్ (పటియాల ఘరాన), నిస్సార్ హుస్సైన్ ఖాన్, ఆమీర్ ఖాన్, పన్నలాల్ ఘోష్, రోషనారా బేగం" గార్ల హిందుస్తానీ సంగీతం ఆసక్తిగా వినేవారు శ్రీ వోలేటి. రోషనారా బేగం రాగ లక్షణం వోలేటి గారికి బాగా నచ్చేదిఆల్ ఇండియా రేడియో మద్రాసు కేంద్రంలో పనిచేసిన తాతాచారి గారు వోలేటి గారిని బడే గులాం ఆలీఖాన్ గారికి పరిచయం చేశారు.
ఆల్ ఇండియా రేడియో విజయవాడ - కర్ణాటక సంగీత నిర్మాత (ప్రొడ్యూసర్)గా పనిచేశారు. ఎన్నో అద్బుతమైన సంగీత విభావరులు సృష్టించారు.
పురస్కారాలు:
సంగీత నాటక అకాడమి పురస్కారం
సంగీత చూడామణి (శ్రీ కృష్ణ గాన సభ, చెన్నై)
స్వర విలాస్ (శుర్ సింగార్ సన్సద్, ముంబై)
గాన కళానిధి (విద్వత్ సభ, కాకినాడ)
ఘాన దీర
గాన నిపుణ
వారి దృష్టిలో ఈ అవార్డులు, పురస్కారాలు - సంగీత ప్రజ్ఞకి కొలమానం కానేరవు. "సంగీత సాధన రోజులో ఓ అంతర్భాగం కాదు, అదే జీవితం. అదే లక్షం. దాని కోసమే జీవితం. అదే జీవిత పరమావధి"గా నిలవాలంటారు శ్రీ వోలేటి.
శ్రీ వోలేటి వెంకటేశ్వర్లు గారు
డిసెంబర్ 29, 1989 లో స్వర్గస్తులయ్యారు. జన హృదయాలలో శాశ్వత స్థానం సంపాయించుకున్నారు.
వోలేటి వెంకటేశ్వరులు గారి సంగీత కృషి అద్వితీయం. మళ్ళీ వారిలా రాగాలాపన చేసేవారు ఎప్పుడు పుడతారో ఎదురుచూడాల్సిందే!.
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)