కవితలు
మన్మధ వత్సర స్వాగత గీతము
- శ్రీ చాకలకొండ రమాకాంతరావు
పల్లవి.
మనసు ౘల్లగ చేయ మన ముందు కొచ్చింది,
మన్మధ వత్సరము, ముదిత లాగ. ||మనసు||
అనుపల్లవి.
మనో కామన తీర్చ, మెరుపులా వచ్చింది,
మన్మధ జనకుని కరము లాగ. ||మనసు||
1. తెనుగింట ఊరూర ఉత్యాహ మిచ్చింది,
మనసులో నిండి మాయ లాగ,
సన్నని నవ్వుతో సనజాజై వచ్చింది,
నును లేత సిగ్గుల భరిణ లాగ. ||మనసు||
2. రంగుల ముగ్గులతో రంగేళి చేసింది,
హంగులు నింపి హోళి లాగ ,
పొంగారు ప్రభలతో ప్రమదలా వచ్చింది,
సింగారపు సురభి బొమ్మ లాగ, ||మనసు||
(సురభి = బంగారు)
3. సన్నని రాగమై, సరిగమలు నింపింది,
వెన్నుని కీర్తించు వీణ లాగ,
మౌన ముద్ర వీడి, మన పల్లె కొచ్చింది,,
మనో రధము తీర్చు వేల్పు లాగ. ||మనసు||
4. వనములో ప్రతి లతకు క్రొత్త దన మిచ్చింది,
ఎన లేని రంగుల కుంచె లాగ,
వన్నెలతో ప్రతి యింట వలపును నింపింది,
వెన్నెలతో వఱలు జాబిల్లి లాగ. ||మనసు||
5. వైతాళిక సభలో కవితలా పొంగిది,
చతురానన పత్ని సూక్తి లాగ,
హితముగ తిరుమలపై హొయలెన్నో నింపింది
వేద వేద్యుడు హరి వరము లాగ. ||మనసు||
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)