కనువిప్పు
ఆచార్య పి. కె. జయలక్ష్మి, M. A. ,Ph. D. ,
సోఫియా విశ్వవిద్యాలయం, సోఫియా, బల్గేరియా(EU)
నమ్రత కేన్సర్ హాస్పిటల్. సమయం ఉదయం పది గంటలు. అప్పుడే రౌండ్స్ పూర్తిచేసుకొని తన ఛాంబర్ లో అడుగుపెట్టిన డ్యూటీ డాక్టర్ విశేష్ ఎదురుగా ఉన్న కాలెండర్ చూశాడు. ఇరవయ్యో తారీఖు. ఉలిక్కిపడ్డాడు. అన్యమనస్కంగా ఫ్లాస్క్ లో కాఫ కప్పు లో వంచుకుని తాగుతూ ఆలోచనలో పడ్డాడు. ఎన్ని సమస్యలో కదా తనకి అనుకుంటూ.
రెసిడెన్షియల్ కాలేజ్ లో చదువుతున్న కొడుక్కి వారం లో ఐఐటి పరీక్ష. ర్యాంక్ రాకపోతే తనకి తలవొంపులు. పైగా వాడు లాంగ్ టర్మ్ కూడా. నాలుగు వందల కిలోమీటర్ల దూరం లో వున్న పట్టణం లో గవర్నమెంట్ ఉద్యోగిని అయిన భార్య ట్రాన్స్ఫర్ కోసం చేయని ప్రయత్నం లేదు. ఏడాది నించి ఆమె అక్కడ వర్కింగ్ విమెన్స్ హాస్టల్ లో ఉంటోంది. నెలకోసారి కలుసుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నారు. ఈసంవత్సరం ఎలాగైనా ఏ ఎమ్మెల్యే కాళ్ళో పట్టుకొని తన ఊరికి బదిలీ చేయించుకోవాలి. కూతురు ఎమ్మెస్ కోసం త్వరలో యూఎస్ వెళ్లబోతోంది. దానిక్కావాల్సిన బ్యాంక్ లోన్లు,ష్యూరిటీలు రెడీ చేస్కోవాలి. పిల్ల వచ్చేవారం వీసా ఇంటర్వ్యూ కి వెళ్ళాలి. చాలామందిని రిజెక్ట్ చేస్తున్నారట. ఇదెలా చేస్తుందో ఏంటో? వృద్ధాశ్రమం లో ఉన్న డెబ్భై ఏళ్ల తండ్రి కి ఈ మధ్య వొంట్లో కులాసాగా లేదని కబురు తెలిసినా వెళ్లలేదు. ఇంట్లో చూస్తే వంటమనిషి సరిగ్గా రావడం లేదు. అంతా చికాగ్గా ఉంటోంది. బహుశా నాకున్నన్ని సమస్యలు ఇంకెవరికి ఉండవేమో?? అనుకున్నాడు విశేష్ .
నర్స్ హడావిడిగా తలుపు తోసుకుం టూ “డాక్టర్, డాక్టర్!” అంటూ లోపలికి వచ్చేసరికి ఆలోచనల్లోంచి ఒక్కసారి బైట పడ్డాడు విశేష్.
“ఏమైంది ఇప్పుడే కదా అందరినీ చూసి వచ్చాను”
“రూమ్ నంబర్ ఫైవ్ లో ఉన్న పాప ఫ్రెండ్స్ వచ్చారు. తనని చూడ్డానికి. పంపమంటారా సార్?”.
“ఎవరు? జ్యోతి ఫ్రెండ్సా? పంపించు. పాపం చిన్నపిల్ల. కాసేపు వాళ్ళతో స్పెండ్ చేస్తే బాధ మర్చిపోతుంది.” అనుమతించాడు.
పదకొండేళ్ళ జ్యోతి నెలన్నర నించి కేన్సర్ చికిత్స తీసుకుంటోంది. హాస్పిటల్లో అందరికంటే చిన్న పేషెంట్ తనే. తండ్రి లేడు. తల్లి బ్యాంక్ లో క్లర్క్. కేన్సర్ గుర్తించేసరికి ఆలస్యమైపోయింది. ఛాన్స్ లేనట్టే.. కానీ మానవ ప్రయత్నం మానకూడదు కదా..చికిత్స కొనసాగిస్తున్నారు. తల్లికి చెప్పేశారు, ఆమె మనసులో దుఖం పిల్ల ముందు వ్యక్తం చేయకుండా గుండె నిబ్బరం చేస్కుని కూతుర్ని కంటికి రెప్పలా చూస్కుంటోంది. ఒక్కొక్కసారి కడుపు నెప్పి తీవ్రమై జ్యోతి గట్టిగా కేకలు పెట్టేస్తుంటుంది. ఆలాటప్పుడు సెడేటివ్ ఇచ్చి పడుకోపెట్టేస్తుంటారు. అంతకు మించి ఏమీ చేయలేక. ఇంక కొన్ని వారాలో, రోజులో? రాన్రాను నెప్పి పెరిగిపోయి ఆమె శరీరం మందులకి రెస్పాండ్ కావట్లేదు. ఇప్పుడు రోజుకి మూడు సార్లు సెడేటివ్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. “ పూర్ గర్ల్” అని నిట్టూర్చాడు విశేష్ ఆమె ని తలచుకొని.
***** ***** *****
“హాయ్ జ్యోతీ, చూడు నీకోసం ఏం తెచ్చామో? అంటూ పిల్లలు బెలూన్స్, టెడ్డిబేర్ బొమ్మలు, చాక్లెట్స్,బొకేలు ఆమె మంచం దగ్గర పెట్టారు. వాళ్ళని చూసి “హాయ్” అంటూ నీరసంగా నవ్వింది జ్యోతి కాసేపు వాళ్ళతో మాట్లాడింది.టీచర్ల గురించి, మిగిలిన ఫ్రెండ్స్ గురించి పేరు పేరునా అడిగింది. “త్వరగా వచ్చేయ్ జ్యోతీ, వి ఆల్ మిస్సింగ్ యూ!” అంటూ ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నారు ఫ్రెండ్స్. ఒక్కసారిగా కడుపులో పేగులన్నిటిని విరిచేస్తున్నంత నెప్పి. తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంది. ఆమెనే గమనిస్తున్న తల్లి వాహిని “అమ్మా జ్యోతీ ఏంట్రా నెప్పి వస్తోందా? ఉండు డాక్టర్ ని పిలుస్తాను.” అనేలోపే పిల్లలు వెళ్ళి డాక్టర్ విశేష్ ని పిల్చుకొచ్చారు.
“ఏంటి జ్యోతీ ? నెప్పిగా ఉందా? ఇంజెక్షన్ చేస్తే తగ్గిపోతుంది” అంటూ సెలైన్ డ్రిప్ కి సెడేటివ్ ఇంజెక చేయబోయాడు. “ ఎందుకు?నెప్పి తగ్గడానికా? లేక నెప్పిని మర్చిపోయి మత్తు గా పడుకోడానికా? నాకు ఇంజెక్షన్ వద్దు అంకుల్.”. అని వారిస్తున్న జ్యోతి ని ఆశ్చర్యంగా చూశాడు.
“అవునంకుల్ , వారం నించి చూస్తున్నా. నెప్పి ఎక్కువవ్వగానే ఇంజెక్షన్ ఇస్తున్నారు. దాంతో నేను మత్తు లోకి వెళ్లిపోతున్నా. తెలివి రాగానే కాసేపు బాగుంటోంది. మళ్ళా కాసేపటికి నెప్పి మొదలు. ఈ మధ్య నెప్పి పెరిగి పోవడంతో ఇంజెక్షన్ డోస్ పెంచేశారు. అటు చూడండి మా అమ్మ .. తన గురించి ఆలోచించకుండా నామీదే ప్రాణం పెట్టుకొని, రాత్రనకా, పగలనకా నాకు సేవలు చేస్తోంది. ఇకపోతే వీలు దొరికినపుడల్లా ఏవేవో పట్టుకొచ్చి నన్ను సంతోష పెట్టాలని చూసే నా ఫ్రెండ్స్.. వీళ్లతో గడపడానికి లేకుండా మీరలా మత్తు ఇచ్చేస్తే ఎలా? నాకు తెలుస్తోంది అంకుల్ నేనింక ఎన్నాళ్ళో బతకను ఈ నెప్పితో అని. ఈ కొద్ది రోజులూ మగతలో గడిపేస్తే తర్వాత అమ్మని చూడాలని ఉన్నా చూడలేను కదా!.. ఇంకొన్ని రోజుల్లో ఇంజెక్షన్ అవసరం లేకుండానే నిద్ర లోకి వెళ్లిపోతాను. దయచేసి ఇప్పుడు మాత్రం నాకు మత్తు ఇంజెక్షన్ ఇవ్వకండి ప్లీజ్. నా కళ్లని తెరిచే ఉం డనివ్వండి.” వేడుకుంది బాధని పళ్లబిగువున భరిస్తూ. చలించి పోయారంతా ఆమె మాటలకి.
“కాదురా. నువ్వు స్పృహ లో ఉంటే తట్టుకోలేవని డాక్టర్ గారు ఇంజెక్షన్ ఇస్తున్నారు. నా తల్లి కదూ, మాట వినమ్మా!” కళ్ల నీరు ధారాపాతంగా కారిపోతోంటే నచ్చచెప్పబోయింది వాహిని.
“వద్దమ్మా. నాకు నువ్వు చాలా ప్రాణం. చిన్నప్పటి నించి నన్నుఎంత ప్రేమగా పెంచావో ? అనుక్షణం నా కింద ఎన్ని సేవలు చేస్తున్నావో? ఇప్పుడు కూడా నా పొట్ట రాస్తూ, కాళ్ళు నొక్కుతూ ..నా గురించి తల్లడిల్లుతున్నావు. నేను నీకేమి చేయలేకపోతున్నాను. వచ్చే జన్మంటూ ఉంటే నేను నీకు తల్లిగా పుట్టాలని కోరుకుంటున్నా. కనీసం చనిపోయే లోపు ఎంత వీలయితే అంత సేపు నిన్ను చూస్తూ ఉండాలని ఉందమ్మా. అందుకే ఇంజెక్షన్ వద్దంటున్నా. దయచేసి నన్ను అర్ధం చేసుకోండి”.ఏడ్చేస్తోంది జ్యోతి ఆవేదన గా. అందరికీ కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి.
డాక్టర్ విశేష్ కి చెళ్లున చెంప దెబ్బ తగిలినట్టయింది.. రెండు కారణాలకి. ఒకటి తనకున్న అతి మామూలు సమస్యలని చాలా తీవ్రమైనవిగా భావిస్తున్నందుకు. జ్యోతి సమస్య తో పోలిస్తే తనవి అసలు సమస్యలా?మృత్యువు కంటె పెద్ద భయం, సమస్య ఇంకేం ఉంటుంది? అదీ చిన్న వయసులో ఏమీ అనుభవించకుండానే, తల్లిని ఒంటరిచేసి వెళ్లిపోవల్సి రావడం.. ఆమెకి గర్భ శోకాన్ని మిగల్చడం.
ఇక రెండవది ఆ పిల్లకున్న మానవత్వం,కృతజ్ఞత.. తను ఎంత బాధల్లో ఉన్నా తన వాళ్ళకి ఏదో చేసి సంతోషపెట్టాలన్న తపన. తనేం చేశాడు? పాతికేళ్లు నిర్విరామంగా తన అభ్యున్నతి కోసం పాటుపడి, సమాజం లో మంచి స్థాయి కి తెచ్చిన తన తండ్రిని అమ్మ మరణించిన కొన్నాళ్లకే ఏవో సాకులతో వృద్ధాశ్రమం పాలు చేసాడు. కొన్నాళ్ల పాటు వారానికోసారి ఫోన్ చేస్తూ, రెన్నెల్ల కోసారి చూడ్డానికి వెళ్ళేవాడు. ఇప్పుడు నెలకోసారి ఫోన్ ..అంతే!నాన్నకి తనని, తన భార్యా పిల్లల్ని చూడాలని, తమతో గడపాలనీ ఎంతో ఆశ. కానీ కొడుకుగా తనేం చేస్తున్నాడు? పూర్తిగా లోకం చూడని జ్యోతి డెత్ బెడ్ మీద ఉండి తల్లికి ఎలా కృతజ్ఞత చూపించుకోగలనా అని ఆరాటపడుతోంటే తాను పాతికేళ్లపాటు తండ్రి సేవల్ని, ఆస్తుల్ని యధేచ్ఛగా అనుభవించి అవసరం తీరగానే వృద్ధాశ్రమం లో చేర్పించి చేతులు దులిపేసుకున్నాడు. తన తప్పులు ఎదురు తిరిగి ప్రశ్నిస్తోంటే ఆరిపోతున్న “జ్యోతి” వెలుగుల్లో పశ్చాత్తాపం తో దహించుకు పోతూ తండ్రిని క్షమాపణ కోరుకుని ఇంటికి తీసుకు రావడానికి సన్నద్ధ మయ్యాడు డాక్టర్ విశేష్.
********
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)