సత్యమేవజయతే!
విడాకులు
- సత్యంమందపాటి
పెద్ద బస్తీలో ప్రొద్దున్నే ఆ వార్త గుప్పుమంది.
ఎనభై రెండేళ్ళ యాదగిరిగారు, ఎనభై ఏళ్ల దుర్గమ్మగారు, యాభై ఎనిమిదేళ్ళ సంసార జీవితం తర్వాత విడాకులు తీసుకుంటున్నారుష!
కొంతమంది గూఢ మిత్రులు “అయ్యో.. పాపం!” అనుకుంటే, ఇంకొంతమంది గాఢ శత్రువులు “ఇదేం.. పోయే కాలం.. ఈ వయసులో!” అనుకున్నారు.
అసలేం జరిగిందేమిటంటే....
౦ ౦
యాభై ఎనిమిదేళ్ళ క్రితం, అంటే 1956లో, ఎక్కడ్న్జించో వచ్చి నెత్తిమీద కూర్చున్న దూరపు చుట్టాలని వదిలించుకుని, స్వేచ్చా వాయువులు పీలుస్తున్న యాదగిరి కుటుంబానికీ, తెలుగు భాష, సంస్కృతి వున్న మంచి ‘మన’వాళ్ళ సంబంధం కోసం ఎదురుచూస్తున్న దుర్గ కుటుంబానికీ, ఒకళ్ళకొకళ్ళు నచ్చారు. పెద్దల సమక్షంలో ఇద్దరికీ ఘనంగా వివాహం జరిగింది.
దుర్గ తల్లిదండ్రులు స్వతహాగా బాగా ధనవంతులు. కనుక యాదగిరి, దుర్గలకు, యాదగిరి వుండే వూళ్ళోనే,అతనికి వున్న ఖాళీ స్థలంలో, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఒక పెద్ద అధునాతన భవనాన్ని కట్టించి ఇచ్చారు. యాదగిరి అక్కడే మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఒకళ్ళనొకళ్ళు విడిచిపెట్టలేనంత అన్యోన్యంగా, అనురాగంతో సంసారం చేయసాగారు. అప్పటినించీ, ఇప్పటిదాకా వారి దాంపత్యం ఎంతో సరదాగా, ఇద్దరబ్బాయిలు, ముగ్గురమ్మాయిలతో చాల ఆనందంగా గడుస్తున్నది.
కాలం గడిచిన కొద్దీ, పిల్లలకి మంచి చదువులు చెప్పించి, పెళ్ళిళ్ళు చేసి తమ బాధ్యతలను పూర్తి చేసుకుని, ఉద్యోగంలో రిటైర్ అయాక ఇద్దరూ హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. కూతుళ్ళు, కొడుకులూ, మనవలూ, మనవరాళ్ళూ, మునిమనమలూ, మునిమనవరాళ్ళూ అందరూ దగ్గరఇళ్ళల్లోనే వుంటున్నారు.కనుక ఆ వయసులో యాదగిరికీ దుర్గకీ ఎంతో సంతోషంగా వుంది. మొత్తం నాలుగు తరాలవారూ ఆనందంగా కలిసిమెలిసి జీవిస్తున్నారు.
మరి అలాటి సంతోష సమయంలో, ఈ మాయదారి విడాకులు ఎందుకు వచ్చినట్టు?
౦౦
నిజంగా వాళ్ళు విడాకులు తీసుకోవలసిన అవసరం లేదు. ఒకళ్లంటే ఇంకొకళ్ళకి ఎనలేని ప్రేమ అలాగే నిలిచి వుంది మరి. దానికి కారణం వాళ్ళ పెద్ద కొడుకు, చిన్న కూతురు.
పెద్ద కొడుకు అంటాడూ, “మీరిద్దరూ పెద్దవాళ్ళయిపోయారు. అంత పెద్ద ఇంట్లో చాకిరీ చేసుకోలేరు. అదీకాక ఇప్పుడు మీరున్న ఇల్లు ఎంతలేదన్నా మూడు కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. అంటే ఏమిటి, ఎంతో డబ్బు ఎవరికీ దక్కకుండా అలా వృధాగా అక్కడ కూర్చున్నదన్నమాట. అంత పెద్ద ఇంటిని ఈ వయసులో మీరూ సరిదిద్దుకోలేరు, అనుభవించలేరు. మాకూ లాభం లేదు. మీ కోరికమేరకు, మీ పిల్లలం అందరం ఎవరి ఇళ్ళల్లో వాళ్ళం వేరే వుంటున్నాం. కొందరు అద్దె ఇళ్ళల్లో, కొందరు స్వంత ఇళ్ళల్లో నెల నెలా ఇన్స్తాల్మెంట్లు కట్టుకుంటూ. ఎందుకు మాకీ ఖర్మ. ఆ ఇల్లు మగపిల్లలిద్దరి పేరునా వ్రాసి ఇచ్చేయండి. దీన్ని అమ్మేసి, మేము పెద్ద ఆదాయం వచ్చే రకంగా చేసుకుంటాం. మీకేమీ ఇబ్బంది రానీయం!” అని.
అందరిలోకీ చిన్న కూతురు, మూడవది, అంటుంది, “అదెలా కుదురుతుంది. ఆ ఇల్లు మా అమ్మ పేర మా తాతయ్య కట్టించింది. స్త్రీ ధనం. అది మా ముగ్గురి ఆడపిల్లలకీ చెందుతుంది. మీరు చేద్దామనుకున్నదేదో మేమూ చేసి, నువ్వు అన్నట్టు ఈ ఆస్తి వృధా కాకుండా చూసుకుంటాం. మాకు వదిలేయండి!” అని.
“భలే చెప్పావే!ఇప్పుడిక్కడున్న ఇంటి కన్నా కూడా, స్థలమే ఎక్కువ విలువ చేస్తుంది. ఇల్లు అమ్మకోసం కట్టిందే అయినా, ఈ స్థలం నాన్న పేరున వుంది. అందుకని ఇది తండ్రి ఆస్తి. కనుక మగ పిల్లలకే చెందుతుంది” అంది పెద్ద కోడలు.
“అదేమిటి. తల్లిదండ్రుల ఆస్తి, ఆడా మగా తేడా లేకుండా, అందరికీ సమానంగా ఇవ్వాలని లా పాస్ చేశారుగా, మగ పిల్లలకి మాత్రమే ఎలా వస్తుంది?” అన్నాడు మూడో అల్లుడు.
“అలాటప్పుడు మనం అందరం సమానంగా పంచుకుంటే సరిపోతుందిగదా!” అన్నది రెండో కూతురు.
ఇవన్నీ వింటూ కూర్చున్న యాదగిరితో అంది దుర్గమ్మ, “మీరేమీ మాట్లాడరేమండీ.. అయినా ఈ పిల్లలందరూ మన ప్రమేయం లేకుండా ఇంటిని ఇలా పంచేసుకుంటుంటే, ఈ వయసులో మనమెక్కడికి పోవాలి?అదీకాక యాభై ఎనిమిదేళ్ళుగా మనకి అలవాటయిన ఇల్లు ఇది. ఇక్కడే అందరికీ పురుళ్ళు, పుణ్యాలూ.. మేము ఇప్పుడు మనమీ ఇంట్లో నించి బయటికి వెళ్లవలసిన అవసరం ఏముంది?”
“అవున్రా.. మీ అందరికీ బాగా చదువు చెప్పించాం. తెలిసిన వాళ్ళ కాళ్ళు పట్టుకుని, మంచి ఉద్యోగాలు ఇప్పించాను. మీ కాళ్ళ మీద మీరు బ్రతుకుతున్నారు. మీకెవరికీ డబ్బుకేమీ ఇబ్బంది లేదు. ఇప్పుడు విడిపోదామంటారు దేనికి?” అన్నాడు యాదగిరి.
“అవును. మగపిల్లలిద్దరికీ పెద్ద చదువులు చదివించారు. ఉద్యోగాలు ఇప్పించారు. మరి మాకో.. మా చదువులు మధ్యాంతరంగా ఆపేసి, పెళ్ళిళ్ళు చేసి మమ్మల్ని వదిలించుకున్నారు” అంది రెండో కూతురు.
“మీ పెళ్ళిళ్ళకి పెద్ద కట్నాలు ఇచ్చి పెళ్లి చేయలేదూ. మరి దాని సంగతేమిటి?” అన్నాడు రెండో కొడుకు.
“అదా సంగతి. మరి మీరిద్దరూ కట్నాలు తీసుకుని పెళ్ళిళ్ళు చేసుకున్నారుగదా.. నువ్వయితే కొత్త కారు కూడా వాళ్ళని పీడించి మరీ తీసుకున్నావ్. మరి దాని సంగతేమిటిరా?” అడిగింది పెద్ద కూతురు.
“అవును. ఆడపిల్లలు చెప్పిందే నిజం. ఇది మా నాన్న, నా కోసం కట్టించిన ఇల్లు. ఒకవేళ మనం ఇది అమ్మితే, ఆడపిల్లలకే చెందాలి” అంది దుర్గమ్మ.
“అమ్మితే మనం ఎక్కడికి పోతాం. నేనీ ఇల్లు వదలను. పిల్లలకీ ఇవ్వను. నేను పోయాకనే ఇది మగ పిల్లలకైనా, ఆడపిల్లలకైనా..” అన్నాడు యాదగిరి.
“నాకూ అమ్మటం ఇష్టం లేదు. మనిద్దరం ఇక్కడే కలిసే వుంటాం” అంది దుర్గమ్మ.
ఇలా మొదలైన వాన, పిల్లల గాలి తగిలి గాలివాన అయింది. గాలివాన తుఫానుగా మారింది. ఇక సునామీగా మారే సమయం ఆసన్నమయింది. ఆడపిల్లలూ, మగ పిల్లల్లూ తమ యధాశక్తి వీళ్ళిద్దరి బుర్రాలూ తినేసి, కడిగేసి, ఆరేశారు. దానితో తమ భవిష్యత్తుని కూడా ఆలోచించకుండా, మగ పిల్లల్ని సమర్ధించాడు యాదగిరి. ఆడపిల్లల్ని సమర్ధించింది దుర్గమ్మ. కొంతమంది మిత్రులూ, బంధువులు నయాన, భయాన నచ్చచెప్పినా, అటు యాదగిరికీ, ఇటు దుర్గమ్మకీ చెవికెక్కలేదు. చివరికి విడాకులతో విడిపోవటానికే పెద్దలు సుముహూర్తం నిర్ణయించారు.
“విడాకులిచ్చేశాం.. ఇక తన్నుకు చావండి” అన్నారు మహారాజశ్రీ కోర్టువారు.
ఇల్లు అమ్మి చెరి సగం తీసుకోవటానికి ఇరుపక్షాలవారూ ఒప్పుకోలేదు. స్థలానికి విలువ ఎక్కువ అని ఒకరు, ఇది స్త్రీ ధనం కనుక అమ్మితే అనర్ధం అని ఇంకొకరు, ససేమిరా అమ్మమన్నారు. పోనీ అక్కడ ఏడు ఎపార్టుమెంట్లు కట్టి, తలా ఒకటి తీసుకుంటే? అక్కడ అన్ని ఎపార్టుమెంట్లు కట్టటానికి డబ్బు లేదు కదా మరి!
ఎవరికైనా ఇచ్చి పదహారు ఎపార్టుమెంట్లు కట్టించి, మనం ఏడు అపార్టుమెంట్లు తీసుకుని, వాళ్లని తొమ్మిది తీసేసుకోమంటే.. అన్నాడు ఒక దారిని పోయే దానయ్య. అన్నాడే కానీ నమ్మకంగా అలా కట్టి, పూర్తి చేసి సమయానికి ఇచ్చేవాళ్ళు బహు తక్కువ, తర్వాత కోర్టు చుట్టూ తిరిగే ఓపిక వుందా మీకు అని కూడా అన్నాడు.
౦ ౦
ఆ ఇంట్లోనే తూర్పు గదుల్లో యాదగిరి, పడమట గదుల్లో దుర్గమ్మ వేరు వేరు కాపురాలు పెట్టారు. యాదగిరికి చేతిలో నెల నెలా పెన్షన్ డబ్బులు వస్తాయి. కానీ ఏనాడయినా ఇంటి పనులు చేశాడా? కనీసం కాఫీ ఎలా పెట్టుకోవాలో కూడా తెలీదు. అన్నీ దుర్గమ్మే ఏ సమయానికి అది అమర్చి పెట్టేది. రోజూ వంట చేసుకోవటం, ఇల్లు శుభ్రం చేసుకోవటం అన్నీను. కనీసం ఎప్పుడు ఏ మందులు వేసుకోవాలో కూడా తెలీదు. ఇలాటివి ఏనాడూ చేసిన పాపాన పోలేదు మరి. యాదగిరికి ఆ కష్టాలేమిటో అతని ఎనభై రెండవ ఏట మొదటిసారిగా తెలిసి వచ్చింది.
దుర్గమ్మకీ అంతే. ఇంటి పనులూ, వంట పనులూ - ఈ వయసులో కొంచెం వేగం తగ్గినా - తనంతట తనే చేసుకుపోగలదు. కానీ వెచ్చాలకీ, మందులకీ, ఇతర ఖర్చులకీ కావలసిన ఆదాయం లేదే? కాస్తో కూస్తో విడాకుల భరణం వచ్చినా, అది తన మందులకే చాలదు. ఏనాడయినా తను ఉద్యోగం చేసిందా, వూళ్ళేలిందా?భర్త డబ్బులు సంపాదించే రోజుల్లో కూడా, తను ఏనాడూ బాంకు ఎకౌంటుల గురించీ, బిల్లులు కట్టటం గురించీ తెలుసుకోవటానికి కూడా ప్రయత్నించలేదు. దుర్గమ్మకి ఆ కష్టాలేమిటో తన ఎనభయ్యవ ఏట మొదటిసారిగా తెలిసి వచ్చింది.
౦ ౦ ౦
ఈ వేరు వేరు సంసారాల సౌభాగ్యం ఇంకో రకంగా కూడా ఇబ్బందిలో పడింది. భార్యా భర్తలతో పాటు పిల్లల్లూ వేరుపడ్డారు. కొడుకులిద్దరూ, వాళ్ళ పిల్లా పీచులతో సహా, తండ్రి పక్షాన చేరారు. కూతుళ్ళు ముగ్గురూ
వాళ్ళ పిల్లలూ, బొచ్చుకుక్కతో సహా, తల్లి పక్షాన చేరారు.
మూడో కూతురి కూతురు ముచ్చటగా పెంచుకుంటున్న బొచ్చు కుక్క, దుర్గమ్మ భాగంలోనించీ, యాదగిరి భాగంలోకి వెళ్లిందని, పెద్ద కోడలు పెద్ద రాద్దాంతం చేసింది. దుర్గమ్మ పార్టీకి చెందిన వాళ్ళందర్నీ ఇంట్లోనించి బయటికి వెళ్లగొడతానంది.
అలాగే రెండో కొడుకు తన మనవడితో తండ్రిని చూడటానికి వచ్చినప్పుడు, ఆ పది మాసాల వెధవ ఒక పెద్ద తప్పుచేసాడు. పడమటి భాగంలో వుంటున్న తాతమ్మ దగ్గరికి బోసి నవ్వులతో పాకుతూ, పాకుతూ, రివ్వున వెళ్లాడు. అది చూసి మూడో కూతురి పెద్ద కొడుకు మండిపడ్డాడు.
ఇలా ప్రతిరోజూ మూడు తిట్లూ, ఆరు అరుపులతో, వారి విడాకుల జీవితం నడవసాగింది.
మరి, ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి?
మీకు తెలుసా? బాబోయ్.. అలా నా వేపు చూడకండి. నాకూ తెలీదు!
౦ ౦ ౦
నాకు ఒకటి మాత్రం తెలుసు.
ఇండియాలో పుట్టి, అమెరికాలో విద్యాభ్యాసం చేసి, ఒక అమెరికన్ని పెళ్ళాడి, తర్వాత పైలట్ అయి, నాసాలో పైలట్ ఉద్యోగంలో చేరి, ‘కొలంబియా’ అనే స్పేస్ షటిల్లో అంతరిక్షంలోకి వెళ్ళిన ధైర్యస్తురాలు, మన భారత నారి, కల్పనా చావ్లా గుర్తుందా?
దురదృష్టవసాత్తూ కొలంబియా తిరిగి భూకక్ష్యలోకి వస్తూ పేలిపోయింది కానీ, ఆవిడ చెప్పిన మాటలు,
ప్రపంచ చరిత్రలో అలా నిలిచిపోయాయి.
“ఈ అంతరిక్షంలోనించీ చూస్తుంటే, ఎంతో సుందరమైన మన భూమి, నీల రంగులో మెరిసిపోతూ చెప్పలేనంత అందంగా వుంది. కానీ నాకు ఆ అందమైన భూగోళం మీద ఎక్కడా గీతలు కనపడటం లేదు” అంది కల్పనా చావ్లా.
అవును. మనమే దేశం, మతం, తెలుపూ, నలుపూ, ప్రాంతం, కులం, నువ్వూ, నేను అనే గీతలు గీసుకున్నాం.
అంతరిక్షంలోనించీ చూస్తే, భూగోళం మీద ఆ గీతలేవీ,ఎంత వెతికినా,ఎక్కడా కనపడవు.
నిజంగా ఆ గీతలు, మనమే మన నుదుటి మీద వ్రాసుకున్నాం.
మనం వ్రాసుకున్న, మన నొసటి రాత! మరి ఆ నొసటి గీతల రాత, తరతరాలుగా మన వెంట పడి, మనుష్యుల్ని మళ్ళీ మన ముత్తాతల ముత్తాతల ముత్తాతల దగ్గరికి, అంటే కోతుల దగ్గరికి తీసుకు వెడుతున్నదని, ఆమధ్య హైదరాబాదు జూలో ఒక కోతి చెప్పిందని, నాకు నిన్న రాత్రి ఒక కల వచ్చింది.
అదెంత నిజమో, నా కల కాదు- కలలో కోతి చెప్పిన విషయం, నాకు తెలీదు.
ఎందుకంటే అది కల కదా!
౦ ౦ ౦
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)