సద్గురు వాణి
ఆశను అనంతం చేసుకోండి
- రచన : జగ్గీ వాసుదేవ్, ISHA Foundation
ఆశలేనిదే ఈ ప్రపంచమే లేదు. అసలు సృష్టే లేదు. ఆశ లేనిదే ఈ శరీరం ఉండదు. ప్రాణం నిలవదు. ఆశపడకూడదని ఈ సృష్టి మీకు ఎప్పుడూ చెప్పలేదు. ఆశను వదిలివేస్తే అంతా సరిగా ఉంటుండి అనుకోవడం కంటే మూర్ఖత్వం మరొకటి లేదు. అలా ఎవరు చెప్పినా నమ్మకండి. ఆశను త్యజించాలని నిశ్చయించుకున్నాను అంటూ మీ మనసు మిమ్మల్ని మభ్యపెడుతుంది. సన్యాసం గురించి ఉపన్యసిస్తుంది.
మీ మనసుకు చాలా తంత్రాలు తెలుసు. ఏదో చెప్పి మిమ్మల్ని నమ్మించి ఏమార్చగలదు. ఆ చాకచక్యం దానికుంది. అయితే మరి శరీరం మాటేమిటి? గాలి చొరబడకుండా మీ నోరు, ముక్కు మూసుకుని చూడండి. ఒక్క నిమిషం, లేదా రెండు నిముషాలు శరీరం సహిస్తుంది. తర్వాత, బతకాలనే కోరిక మోలో పుట్టి బలం పుంజుకొని మీ చేతిని బలవంతంగా నెట్టివేస్తుంది.
ఆక్సిజన్ ను త్వరత్వరగా పీల్చుకుంటుంది. ఆశలు లేవంటూ మీ మనసు చెప్పే తాత్త్వికమైన కబుర్లు మీ శరీరం దగ్గర ఏమాత్రం పనిచేయవు. దానికి అబద్ధం చెప్పి ఏమార్చడం చేతకాదు. శరీరం మొత్తం గురించిన మాటలెందుకు? అందులోని ప్రతి ‘జీవకణం’ ఆశతోనే జీవిస్తుంది. ఒక రోగక్రిమి అందులోకి ప్రవేశించనీయండి. వెంటనే ప్రతి ఒక ‘జీవకణం’ ఆయుధాల్ని సిద్ధం చేసుకొని పోరు మొదలుపెడుతుంది.
ఎందుకలా? సృష్టే జీవించాలనే కోరిక మీలో పుట్టించింది. ఇంకా లోతుగా తరచి చూస్తే, ఆశను త్యజించాలని అనుకుంటే అది కూడా ఆశేకదా?
మీ ఊరికి ఒక సన్యాసి వచ్చాడు. నువ్వు సంపద మీద ఆశ పెంచుకున్నావు. అదే నీ దుఃఖానికి కారణం. భగవంతుడి మీద ఆశ పెంచుకో అంటాడు.
నీ దగ్గర పదికోట్ల రూపాయలున్నాయనుకుందాం. భగవంతుణ్ణి నమ్మి మీ డబ్బంతా పేదలకు పంచి ఇచ్చేస్తే నిశ్చింత దొరుకుతుందా? రేపట్నించీ ఈ దేశంలోని పేదవాళ్ళలో మీరు కూడా కలుస్తారు అంతే.
సంతోషం కోసం ఆశ పడకు. స్వర్గం కోసం ఆశపడు. అధికారం కావాలని ఆశపడకు. ప్రశాంతత కావాలని ఆశపడు. అంటూ ఏవేవో పనికిరాని సలహాలు వస్తూనే ఉంటాయి.
శంకరన్ పిళ్ళైకి ఒకసారి తట్టుకోలేని నడుంనొప్పి వచ్చింది. డాక్టర్ ఎక్స్ రే తీసి పరీక్షించాడు. "ఈ ఎక్స్ రే చూసారా? మీ వెన్నుముక బాగా దెబ్బతింది. ఆపరేషన్ చేయాలి " అన్నాడు డాక్టర్.
"ఎంత ఖర్చవుతుంది డాక్టర్?"
"నా ఫీజు రూ.25,000 ఆస్పత్రిలో ఆరువారాలైనా ఉండి రెస్ట్ తీసుకోవాలి" అని చెప్పాడు డాక్టర్.
పిళ్ళైకి ఏం చేయాలో తోచలేదు. అంత డబ్బు ఎలా వస్తుంది. ఇప్పుడే వస్తాను డాక్టర్ అంటూ ఎక్స్ రే తీసుకుని ఎక్స్ రే తీసిన వ్యక్తి దగ్గరకు వెళ్ళాదు. అతనికి రూ. 25 ఇచ్చి నా వ్యాధి తగ్గిపోయేలా ఈ ఎక్స్ రేనిమార్చగలవేమో చూడు అనడిగాడు. అలాంటి ఎక్స్ రేల్నిమార్చగలిగే సన్యాసులూ, స్వాములే ఆశల్ని ఒకదాన్నుంచి మరొకదానికి మార్చుకోమని చెబుతారు.
మరొక స్వామి ‘ఆశను పూర్తిగా త్యజించనక్కరలేదు. కొద్దికొద్దిగా ఏదో కాస్త తక్కువ ప్రమాణంలో అయితే పర్వాలేదు’ అంటూ అనుమతిస్తాడు.
కావాలనుకుంటే నేనింకా సంపాదించగలను, కానీ నాకు ఇదే చాలు. అని తృప్తిపడితే మెచ్చుకోవచ్చు. అది సంతృప్తినీ, ఆనందాన్ని ఇవ్వవచ్చు. అయితే నాకవన్నీ ఎక్కడ అందుతాయి? ఇదే చాలు అంటూ తాత్వికంగా మాట్లాడి మీ ఆశల రెక్కల్ని కత్తిరించుకుంటే, అది పిరికితనం.
పక్కింటివాడు పేరాశగాడు. అయినా వాడికన్నీ లభిస్తున్నాయి. నేను ఆశపడుతున్నది కొంచెమే. అదీ నాకు దక్కడం లేదు. అన్న బాధే మీకు మిగులుతుంది.
అందుకే చెప్తున్నాను. మీరు ఆశలు పెంచుకోండి. చాలా ఎక్కువ ఆశలు పెంచుకోండి. ఆ ధైర్యం కూడా లేకుండా, అల్పత్వం పెంచుకుని ఆశల్ని చంపుకుంటే, జీవితంలో మీరు ఏదీ సాధించలేరు.
అందుకే అనంతంగా ఆశించండి. మీ ఆశలను అన్నిపరిమితులకు అతీతంగా పెంచుకోండి. మీకు, మీ చుట్టు ఉన్నవారికి, ప్రపంచంలోని ప్రతి జీవికి ఏది శ్రేయస్కరమో దానిని అనంతంగా ఆశించండి.
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)