"నాదతనుమనిశం.."
(భాగం - 5)
రచన : శ్రీమతి కాజ సుభాషిణి శాస్త్రి
వీణను సుస్వరంగా వాయించడమే కాదు. ఈ వాయిద్యము యొక్క తయారీ కూడా ఒక గొప్ప కళే !
భారతదేశంలో ముఖ్యంగా మూడు ప్రదేశాలలోని వీణలు అంతర్జాతీయ ప్రాచుర్యాన్ని పొందాయి. ఈ మూడు ప్రాంతాలూ దక్షిణ భారతదేశానికి సంబంధించినవి కావడం విశేషం. అవి బొబ్బిలి (ఆంధ్ర), నూజివీడు (ఆంధ్ర) మరియు తంజావూరు (తమిళ నాడు). మైసూరు వంటి ఇతర ప్రాంతాలలో కూడా వీణల తయారీ జరుగుతుంది. ఒక్కొక్క ప్రదేశానికి సంబంధించిన వీణలో ఒక్కొక్క ప్రత్యేకత ఇమిడి ఉంది.
అంతేకాక ప్రాంతాల వారిగా మనకు వీణాబాణీ లో కూడా ఆంతర్యం కనబడుతుంది. వీణను తయారుచేసేవారికి దీనికి సంబంధించిన ఎన్నో మెళకువలు తెలిసి ఉండాలి. ఇందులో ప్రావీణ్యతను సంపాదించాలంటే ఎన్నో సంవత్సరాలు కృషి చెయ్యవలసి వస్తుంది. వీణల తయారీ కేవలం పనిముట్లు ఉపయోగించి యాంత్రికంగా నేర్చుకోవడం సాధ్యపడదు. వీణ యొక్క నాదము మేళం పైన ఆధారపడి ఉండటంవలన దీని భాగాలలో మేళం యొక్క తయారీ అత్యంత ప్రధానమైనదిగా పరిగణింపబడుతుంది . అయితే ఈ మేళం తయారు చెయ్యడానికి స్వరజ్ఞానం ఎంతో అవసరం. అది నిరంతర అభ్యాసంతో మాత్రమే లభిస్తుంది. ఒక్కొక్క వీణను సుమధుర నాదాన్ని పలికించే వాయిద్యంగా మలచడానికి దానిని తయారుచేసేవారు ఎంతో సమయాన్ని కేటాయించడమేకాక తదేక దృష్టితో అదొక యజ్ఞముగా భావించి చేస్తారు. అయితే ఈ కళ సాధారణంగా వంశపారంపర్యంగా రావడం మనము గమనిస్తాము. కాబట్టి వీణల తయారీలో ఉన్నవారు ఈ విద్యను సులభంగా తమ తరువాతి తరానికి అందించే అవకాశం ఉంటుంది. కాని నేడు ఈ విద్యను తమ వృత్తిగా స్వీకరించడానికి నేటి తరం యువత మక్కువ అంతగా చూపుటలేదని వివిధ సంగీత సంబంధిత అధ్యయనాల ద్వారా వెల్లడి అవుతోంది. ఇతర ఉద్యోగాలలో వారు సంపాదించగలిగే ధనంతో పోలిస్తే ఇటువంటి వృత్తి విద్యల ద్వారా వారు ఆర్జించగలిగేది స్వల్పమనే అభిప్రాయం ఇందుకొక కారణం కావచ్చు.
మారుతున్న కాలానికి అనుగుణంగా వీణ తయారీలో కూడా అనేక మార్పులు సంభవిస్తున్నాయి. వీణపై గల మెట్లను సాధారణంగా కంచు లేక ఇత్తడి లోహముతో తయారు చేస్తారు. వీణ వాడే వారి కోరిక మేరకు కొన్ని వీణల తయారీలో మెట్లకు 'స్టీల్' ను కూడా వాడటం జరుగుతుంది. మా గురువుగారైన శ్రీ వాసా కృష్ణ మూర్తి గారి వద్ద వీణపై స్టీల్ తో మెట్లు అమర్చబడి ఉండేవి. ఇటువంటి వీణల యొక్క నాదములో స్వల్ప భేదము కనబడుతుంది. రోజువారీ వాడుకలో స్టీల్ తో తయారు చేసిన మెట్లు త్వరగా అరగవన్న ఉద్దేశ్యం తో ఈ రకము మెట్లను కొందరు ఇష్టపడతారు. నా వద్ద కూడా ప్రస్తుతము వాడుకలో ఇటువంటి వీణ ఒకటి ఉంది.
వాడుకకు అనుకూలముగా ఉండుటకు వీణకు చెక్క పిడులకు (కూటీలకు) బదులుగా స్టీల్ పిడులను వాడటం జరుగుతోంది. రేడల్ వంటి సంస్థలు ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విద్యుత్తుతో లేక బ్యాటరితో పని చేసే విధంగా వీణలను తయారు చేస్తున్నారు. ఈ వీణను భాగాలుగా విడగొట్టి భద్రపరుచుకోవచ్చు. అంతేకాకుండా ఆ వీణను ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశమునకు సులభముగా తీసుకుని వెళ్ళ వచ్చు. ఇందులోని కుండ, తుంబ భాగాలలో ఆమ్ ప్లిఫయ్యర్ ను మరియు శ్రుతి పెట్టెలను అమర్చడం వలన కచేరిలలో దీని వాడకమేంతో తేలిక అని చెప్పవచ్చు. ఈ వాయిద్యమును యొక్క వాడకమునందు నేటి తరానికి ఆసక్తిని కలిగించ డానికి ఈ సంస్థ చేస్తున్న కృషి ప్రశంశనీయము. వీణ తయారీలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ వీణానాదము యొక్క సహజ సౌందర్యాన్ని ముందు తరాలవారికి యధాతధం అందించడం అనేది ఎంతో ముఖ్యమన్న సంగతి విస్మరించకూడదు.
ఐహికంగా ఉపయోగాన్ని ఆశించేవారికి ఆధ్యాత్మికముగా భగవంతుడిని చేరగోరే వారికి నాదాభ్యాసము ఉత్తమ మార్గము. తానే శివుడని తెలుసుకోవడమే మానవ జన్మకు సార్ధకత అయితే ఆ శివుడు ఓంకార నాదమధ్యములో ఉంటాడని కదా నారదుడందించిన స్వరార్ణవశ్లోక సారము! అందుకే శ్రీ త్యాగరాజ స్వామి వారు "నాదతనుమనిశం.." అని నాద స్వరూపుడైన ఆ శంకరుడిని నిరంతరం ధ్యానించి నమస్కారములిడుచున్నానని ఆయన కీర్తనలో తెలిపారు.
నాదము యొక్క ప్రయోజనములను అర్ధము చేసుకుని అభ్యసించడం వలన ఆ అభ్యాసమును ఏకాగ్రచిత్తముతో చెయ్యగలడమే కాక మనస్పూర్తిగా ఆనందించే వీలు కూడా ఉంటుంది. నేటి పోటీ ప్రపంచంలో ఏ రంగములోనున్నా ప్రతిరోజు ఎన్నో మానసిక ఒత్తిళ్లను యువతరం అనుభవించక తప్పదు. ఈ ఒత్తిళ్ళ వలన మనసు ఏకాగ్రతను కోల్పోయి , దాని ప్రభావము పనిలోని నేర్పరితనముపైన పడుతుందని అందరికీ తెలిసిన విషయమే! అయితే నేడు ఈ అంశము పై అధ్యయనము చేసి మానవుడు ఎన్నో పరిష్కార మర్గాలు కనుగొన్నాడు. ఆలోచించి చూస్తే , ఇతర మార్గములు ఎలా ఉన్నప్పటికీ నాదము మన జీవితములో పుట్టుక నుంచే ఒక భాగమై ప్రతి క్షణమూ మన మనసును ఏదో ఒక విధముగా రంజింప చేస్తూ ఉందన్న సంగతి గ్రహించవచ్చు. ఎట్టి వారైనా పసివారిగా ఉన్నప్పుడు అమ్మ పాడే లాలి పాటకు ఆనందముగా స్పందించిన వారేనని అనటములో తప్పు లేదు. అంటే ప్రతి మనిషిలోనూ సంగీతానికి పరవశించే గుణము వారికి తెలిసినా తెలియకున్నా అంతర్లీనముగా ఉన్నదని చెప్పవచ్చు. మనసుకు నిజమైన ప్రశాంతతను చేకూర్చగలిగే శక్తి అట్టి సంగీతానికుందన్నవిషయం తెలుసుకుంటే, ఈ ఒత్తిళ్లను సులభముగా ఎదుర్కొనే నేర్పు , ఓర్పు సమకూరుతాయి. అందువలన కార్యములను సమర్ధవంతముగా నిర్వహించగలిగే అవకాశముంటుంది. కాబట్టి సంగీతాభ్యాసము పట్ల నేటి తరానికి తగు ఆసక్తిని కలిగించే ప్రయత్నమును మనము తప్పక చెయ్యాలని నా అభిప్రాయము.
(సమాప్తం)
(రచన సహకారం : శ్రీమతి కళ్యాణి సచీంద్ర)
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)