కథా భారతి - అనగనగా ఓ కథ
కల్యాణి...కల్యాణీ!
- మొక్కపాటి శివాజీ

’నీకు పామిష్ట్రీ వొచ్చునటగా’ చెట్లనీడని చల్లగా కూచున్నాం.
’వొచ్చివుండాలా?’ అన్నాను కొంటెగా.
’నా చెయ్యి... ఎలావుందో చూడు...’ చాపిన ఆ చేతిని చూడ్డానికి పాముద్రిక అంటే శాస్త్రమే రావాలా!
’చెప్పు చూద్దాం..’ అంది కల్యాణి, మరికొంచెం దగ్గరకు జరిగి-
’ఏముంది? వైద్యవృత్తి, స్వతంత్రం అంటే పూర్తిగా స్వతంత్రమూకాదు; కాదంటే పూర్తిగా కాకనూపోదు. ద్రవ్యలోపం వుండదు కాని, తిండి సుఖం సున్న. ఎంత సంపాదిస్తేనేం, భోజన సౌఖ్యం లేకపోయాక...

’నీకెంతసేపూ తిండిగొడవే మిగిలినవి... అవి చెప్పు. లేనిదెందుకు!’
’గృహం. గృహయోగం, వాహనయోగం వున్నాయి కాని, ప్రస్తుతంలో కొంచెం స్పుటంగా కనబడటంలేదు...’
’నా బ్యాగులో బాటరీ లైటుంది. వెయ్యనా?...ఇంకా...’
వెలుతురు బాగావుంది. సూర్యాస్తమయం కాలేదు.
’ఏం చెప్పను? అసలు నీకే సౌఖ్యం కావాలి?...’
’నాక్కావలసిందెందుకు? వున్నదేదో చెప్పు, నీ శాస్త్ర ప్రకారం...పురుషులు...’

గొంతు అదోవిధంగా అయింది. ’అసలు నేను అలాంటిదాన్నంటావా? అది చెప్పు చూద్దాం!’
ఆ విషయాన్ని గురించి చెప్పడానికి నాకు అట్టేసేపు పట్టలేదు. ’నువ్వా? నువ్వు... చాలా మంచిదానివి. సర్వకాలముల యందూ పాతివ్రత్యం ఆరాధించే సీత, సావిత్రి, దమయంతివంటి సాధ్వీమతల్లిల సంతతికి చెందినదానివి...’

కొంత జ్ఞానం, కొంత జ్ఞాపకం... మూర్తి, మావాడు, రోజూ కనిపించేవాడు, నాలుగు రోజులు మాయమై, సరిగ్గా నేను కాలేజీకి బయలుదేరుతుండగా ఊడిపడ్డాడు; ’ఇంకా ఇలాగే ఉన్నావా? రారా తెములు దబ్బున అనుకుంటూ. నేను ఆలిస్యంచేస్తూ వున్నట్టు అక్కడికి. ’ఏమిటోయ్ తోందర? అయినా యిన్నాళ్ళూ నువ్వు ఎక్కడికి వెళ్ళినట్టు? ఏయేదేశాలు చక్కబెట్టినట్టు...’ అన్నాను తాపీగా.

’అన్నీ చెప్పడానికి ఇప్పుడు టైం లేదు నువ్వు ముందర బట్టలువేసుకో కాలేజీకీ పోతూ మాట్లాడుకుందాం’ బట్టలు వేసుకోవడానికి నాకు సుమారు అయిదునిమిషాలు పట్టింది. అంతకన్న నాకు సమయం మావాడు చిక్కనిస్తేగా!
సగందూరం కూడా నడిచివుండం ఉన్నట్టుండి: ’నువ్వు ఈవాళ కాలేజీ మానెయ్యాలిరా మరెక్కడికైనా పోవాలి. కాస్త స్థిమితంగా మాట్లాడుకోవడానికి వీలైన చోటికి’ అన్నాడుమూర్తి వాడి కంఠం ఆతురతతో జీరపోయింది.

కాలేజీ మానెయ్యడం... నేను ఇంకా ఆలోచిస్తూ ఉండగానే! ’అవతల కొంపలు ములుగుతుంటే ఈకాలేజీ ఏమిట్రా నీకు? ఆపాఠం ఏదో నేచెబుతాగా, రాబాబూ, అన్నాడు మూర్తి గట్టిగా. నాకంటే రెండు క్లాసులువాడు పైవి.
’అసలు నువ్వు పరీక్ష డేకేసరికే పట్టపగలు సప్తర్షిమండలం కనిపించింది. అయినా నీమొహం నువ్వు నాకు పాఠంచెప్పే దేమిటీ! నాకేం కొంపమునిగే పనిలేదు; నీకుంటే నువ్వు మానెయ్యి. తాచెడ్డ కోతి...

’ఓరెయ్! ప్రాణ మిత్రుడువి అంటే నువురా! నాపని ఒహటీ, నీపని ఒహటీట్రా దౌర్భాగ్యుడా! నీ కవసరంవొస్తే నేను సహాయం చెయ్యొద్దుట్రా! ఇంత స్ర్వార్ధమాదాంతస్సారవలా!’

’అసలుపనేమిటో చెప్పకుండా...’ ’అరె అసలు నన్ను చెప్పనిస్తేనా! చెప్తాను రారాబాబూ అంటే, కాలేజీపోతానని భీష్మీంచుకున్నవాడితో నేను ఎల్లా చెప్పను? కాస్త ఆలోచించాలి, బుర్ర అనేది వుంటే...’

ఆ తరువాత వాడితో వాదించడం మంచిది కాదనిపించిందీ, నా అవయవాల్లో ఎన్ని లోపాలు కనిపిస్తాయోనని...
’కానీ! ఈ రోజుకు, నా చదువు ధ్వంసం, నీ ధర్మమా అని నడునడు ఎక్కడికి పోదాం అంటావు యింతకీ?’ అన్నాను. ఎం చెయ్యను, ప్రాణమిత్రుడి ప్రాణం మీదికి వొస్తే! నాలుగు రోజులయి కాంటీనులోనూ లేక, కామను రూములోనూ లేక, సినిమాల దగ్గరా లేక- మూర్తి చాలా కష్టంలోనే వుండివుండాలి.

తిన్నగా పార్కులోకి తీసుకుని వెళ్ళాడు, ’ఇన్నాళ్ళూ వీడు ఏమయాడోననీ నీకు కించత్తయినా ఆదుర్దా పుట్టిందిరా? రోజూ కనిపించే మైలురాయి కనిపించక పోతేనే మనిషి అన్నవాడు "ఏమయింది చెప్మా’ అనుకుంటాడే! నువ్వు ఏమన్న స్నేహితుడివిరా!’

’నా గుణగణాదులు ఎంచడానికా కాలేజీ ఎగ్గొంట్టించింది?’ అన్నాను, కొంచెం కోపం నటిస్తూ
మూర్తి వెంటనె తగ్గాడు. ’ఇంద ఈ సగరెట్టు తగలెయ్. మెల్లిగా చెపుతూ వుంటాను. శ్రద్దగా విను. పనికిమాలిన చొప్పదంటు పశ్రలు వెయ్యకు!’ వాడొక సిగరెట్టు అంటించాడు.

’నాలుగు రోజులక్రితం ’ఆవిడ’ కనిపించింది.’
’ఏవిడ?’ రోడ్డు మీద కళ్ళు తెరుచుకుని నడిస్తే డెబ్బైమంది ’ఆవిడ’లు కనిపిస్తారు. నాకు ’ఆవిడ’ ఎవరో తెలియదు మరి. వీడికా... పెళ్ళికాలేదు:

’అందుకే చొప్పదంటు ప్రశ్నలు వెయ్యకుండా శ్రద్దగా వినరా గాడిదీ అన్నాను. వళ్ళు మండి ఛస్తుంటే మధ్యన యీ అడ్డు సవాళ్ళేమిటి?’ వాడికి నిజంగా వొళ్ళు మండే వుంటుంది. కాని అనవసరం.
’మరి ఆవిడెవరో నాకు తెలీదు’ అన్నాను పెంకెగా. వాడి ధోరణి చూస్తే తెలియవలసిన అవసరం లేనట్టే వుంది. తెలియకపోతే ప్రమాదం కూడా లేక పోవచ్చు. అయినా, నాకేదో పెద్ద తెలిసి వున్నట్టు వాడు మాట్లాడ్డం యెందుకు?
’ఆవిడేనయ్యా--కళ్యాణి’ అన్నాడు విసుగ్గా.

’ఎవరు? కాలు విరిగిన జట్కా గుఱ్రంలా కొంకరటింకరగా నడుస్తుంది-’
’అందుకే నిన్ను చూస్తే వొళ్ళు మండేది. ఎప్పూడూ పక్కదార్లోకి లాగడానికే చూస్తావు కదా! ఆడవిలోని గొప్పతనం అందం, నీకేమన్నా తెలిశాయీ? వొంకర నడకట, వొంకర నడక! బుద్ది వొంకర వున్నవాడికి అన్నీ వొంకరగానే కనిపిస్తాయి...’

మూర్తి కికోపం రావడమేకాదు; గట్టిగా వొచ్చింది. వీడికి కల్యాణిమీద అభిమానం అని నాకు యిట్టే తెలిసిపోయింది. ఆమె నామాంతరం(’పుచ్చు పెసలు’ అని ఆమె పలువరసయొక్క అందాన్ని సూచిస్తూ పెట్టినది) ఉచ్చరించివుంటే, నాకు తప్పకుండా దేహశుద్దిచేసి వుండేవాడు, స్నేహితుణ్ణని అయినా ఆలోచించక, అంతవరకు నే లేచినవేళ బాగుంది!

’సర్లే , రోజూ కనిపిస్తొందికదా! విశేషం యేముంది. కొమ్ములుకాని మొలవలేదు కదా వున్నట్టుండి!’ నా మాటల్ని వాడు పూర్తిగా గుర్తించినట్టు లేదు. ఏదో ధోరణిలో పడ్డాడు. ’ఎక్కడ కనిపించింది నీకు?’ అన్నాను. కధ నడవాలిగా. పైగా అటువంటి విశేషాలుంటే వాడే చెపుతాడు!

’అసలు కల్యాణీ నేనూ హైస్కూల్లో కూడా కలిసి చదువుకున్నాం అని నీకు తెలియదేమో! చాలా మంచి పిల్ల. ఇంట్లో ఏదో ఇబ్బందివల్ల ఒకటి రెండేళ్ళు పరీక్ష తప్పింది. లేకపోతే నీలాంటి దౌర్బాగ్యుణి క్లాసుమేటు అయే దురవస్థ తప్పేది...’

గాలి నా మీదికి!... కొంచెం విసురుగానే తిరుగుతోంది. వూరుకోడం మంచిది. ’ఆ రోజుల్నించి నాకు బాగా పరిచయం. వాళ్ళ అమ్మా నాన్నా కూడా నాన్ను బాగా యెరుగుదురు...’

’వాళ్ళ యింటికి వెడుతూ వొస్తూ వుండే వాడివి కాబోలును.’ ’
లేకపోతే యింతమంది వుండగా నన్నే ఎట్లా యెరుగుదురు! చొప్పదంటు ప్రశ్న...’
’అబ్బే! నీ తెలివి తేటలకి కలిగిన ఘనతమాత్రం కాదని...అంతే...’

’మొన్న వాళ్ళింటికి వెళ్ళాను...వాళ్ళ వాళ్ళెవరూ యింట్లో లేరు. ఎంతోసేపు పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ కూచున్నాం...’
’చైనా విషయం ఏమన్నా వొచ్చిందా?...’
’నీ తలకాయ విషయం వచ్చింది... ఇల్లా గాడిద ప్రశ్నలు వేస్తుంటే నేనసలు మాట్లాడను. ఏదో అప్తుడివని చెపుతోంటే, యీ ప్రశ్న లేమిట్రా మధ్యని, నాకు కోపం తెప్పించడానిక్కాని...’
’మరి యెంత సేపయినా, దిక్కుమాలిన ఉపోద్ఘాతంతోనే సరిపోతే...’
’ఉండు మరి. మాటపెకలిస్తావా?.’
’చెప్పు నాన్చకుండా కానియ్...’

’అదే. తీరా...సరే చాలాసేపు మాట్లాడుకుంటూ కూచున్నాం. ఎంతో అప్యాయంగాను, ఎంతో ’యిది’ గాను మట్లాడింది. అదివరకెప్పుడూ అంత ’యిది’గా లేదు...’

’ఒక్కొక్కరోజు అల్లా వుంటుంది. ’మూడ్’ని బట్టి. కొన్నాళ్ళకోసారి వొస్తుందట అల్లాగ...శాస్త్రకారుడు అంటాడు.’
’ఒరే నీది నిక్కచ్చి అయిన మట్టి బుర్ర. వాళ్ళ వాళ్ళు లేనప్పుడు ’అంత ఫ్రీగా మాట్లాడింది’ అంటే,... కాస్త వూహించలేం? పరీక్షలు పాసు అవడానికి పనికొచ్చే తెలివితేటలు కాస్త ప్రపంచం అర్ధం చేసుకోవడానికి కూడా ఉపయోగించు...వూహించలేవేవూ...’

’ఊహాగానంవల్ల ప్రమాదం వుండోచ్చు. పరిస్థితులు యధాతధంగా గ్రహించడం మంచిది.’
’కల్యాణి నన్ను ప్రేమిస్తున్నట్టు మొన్న నిశ్చయం అయిపోయింది నా మనస్సులో, నువ్వు ఏమన్నా అను...’
నేనేమంటాను మధ్యని! వాడి ధర్మమా అని, -విషయం త్వరగా బైట పడేశాడు. డొంకతిరుగుడు తగ్గించాడు. కనీసం మధ్యాహ్నం అయినా కాలేజీకివెళ్ళే అవకాశం కలగవచ్చు.

’అయితే శుభం. కానీయ్’ ఈ మధన పడడం యెందుకు? హాయిగా తీయగా వుండకుండా?’ అన్నాను ముక్తాయింపు శైలితో.

మూర్తికి కొంచెం విసుగు వచ్చినట్టుంది. ’దున్నపోతు యినింది అంటే దూడను వెంటనే కట్టేయ్యమన్నవాడు నీకు చిన్నతమ్ముడు అయివుండాలిరా!... అంతా సిద్దం అయినట్లు... మాట్లాడతావేం? గ్రంధం పూర్తయినట్టు!...’
’ఇంక గ్రంధానికేముంది! నీ హృదయావేదన అమహాస్వాధ్వికి తెలియపర్చడం, ఆమె ఆమోదిస్తే ... ఆమోదిస్తుందని నీదైర్యం కనుక - యిక మిగిలినదీ ఒకరు చెప్పేదేముంది...’

’అక్కడే వొచ్చింది చిక్కు; ఆమెకు తెలియపరచడం యెల్లాగా, అని...’
’మొన్న అంతసేపు మాట్లాడేనన్నావు, కాస్త నీసంగతి చెప్పుకోలేక పోయావా?’ అన్నాను.
’అదేరా? చెప్పడం నాచాతకాలేదు. రెండ్రోజుల్నించి ప్రయత్నం చేస్తున్నాను. కావటంలేదు...’
’అయితే మానెయ్. మన బ్రహ్మచర్యం మనకు వుండనేవుంది...’
’యేడిసినట్టే వుంది నీ సలహా! అవతల అంత సుముఖంగావుంటే, ఊరుకోవడం యెల్లాగరా?’
’అయితే యేంచేద్దామంటావు?’

’ఒకలవ్‍లెటరు రాసిపడేస్తే, పేచీలేని పని...సంగతి తెలిసిపోతుంది.’
’లవ్‍లెటరు! నీ తెలివితేటలు తగులబడ్డట్టున్నాయి. యిటువంటి పేచీ వ్యవహారాలు నొటిమాటమీద జరగడం మంచిది. అసలుమనిషికి యిష్టం లేకపోతే, ఆకాగితం ప్రిన్సిపాలుకు అందుతుంది; నీకు శాస్తి జరుగుతుంది...’
’ఆమాత్రం నాకు తెలియనట్టే : మహాతెలివైనివాడు వొచ్చాడు సలహా యియ్యడానికి! ఆమెచేతికే అందేటట్టు చేస్తాను. ఇక కల్యాణికా, నామీద బ్రహ్మాండమైన మోజుగావుంది...’’అని నీ అభిప్రాయం.’
’అది నిశ్చయం. అనుమానం యేమి లేదు...’
’అయితే ఆలిశ్యం దేనికి?... ఒక ప్రేమ లేఖ రాసి పడెయ్యలేక పోయావూ... ఏదో ఒక నమూనా చూసి.’ విషయం సులువుగా తేల్చేశాను.

’ఈ నలుగురోజుల్నించీ ఏం చేస్తునాననుకున్నావు! చాలా ప్రయత్నం చేశాను. కుదరలేదు.’
’కుదరక పోవడానికేముంది? ప్రోఫార్మాలిన్నాయిగా మన సాహిత్యంలో; కష్టంయేమిటి? ఒకలేఖ కాపీచెయ్యడం, నీపేరున సంతకంపెట్టి పంపడం...’
’అదే కుదరడంలేదురా...’
’పోనీ, వేలుముద్ర చిత్తగించు...’

’అందుకే నిన్ను ... తెలుగులో అయితే నేను ఏదో రాశేద్దును, అవాకులో చవాకులో... ఇంగ్లీషులో కావాలి.’
’ఆమెకు తెలుగురాదా?’

’రాకేం. బాగా వొచ్చును. ఎంత తెలుగువాళ్ళయినా ’లవ్‍లెటర్’ అన్నది యింగ్లీషులో వుంటేనే దాని అందం. మన ఇంగ్లీషుభాషా పాండీత్యం యెంతటిదో నీకు తెలుసుకుకదా...’

’ఆహా! తెలియకేం. మనలాంటివాళ్ళు చేసే చిత్రహింస చూడలేకేగదా, యింగ్లీషు వాళ్ళు భారతదేశం వొదిలి పారిపోయింది! ...పోనీ హిందీలో వ్రాయి. దేవభాషగా ఈ మధ్య ప్రమోటు అయింది! ’
’ఆమెకు హిందీరాదు. నువ్వు చెప్పు నా దస్తూరీతో వ్రాసి పంపిస్తాను... మూడు రోజుల్నుండి అహోరాత్రాలు ప్రయత్నించినా నావల్ల కాకనే నీ సహాయం కావలసి వొచ్చింది. ఆ దౌర్బాగ్యపు భాష నాకు లొంగలేదు... అదీ సంగతి.’

టూకీగా విషయం తేల్చేశాడు మూర్తి. ’నావల్ల కాదు’ అని అనడం యెలా? నేను లవ్‍లెటరు చెప్పడం, మూర్తి పట్టి పట్టి చక్కగా వ్రాయడం మాత్రమే నే నెరుగుదును.

మరునాడు బస్సుస్టాండుకీ కాలేజీకీ మధ్యదారిలో మూర్తి నోటుబుక్కుసరిగ్గా వాడి మొహాన్నేవేసి కొట్టి; ’యింతపూల్లా ప్రవర్తిస్తావనుకోలేదు!’ అని కల్యాణి కుబుసం విడిచిన తాచులా చరచరా సాగిపోవడం నాకళ్ళతో నేను చూచాను...

’అక్కడే పొరపాటు పడుతున్నావు. నాకు పురుషులంటే ... అపరిమితమైన యిష్టం...’ తన ముఖం నా ముఖానికి దగ్గరగా పెట్టింది. వోళ్ళో అలా వాలి పోయింది. వారం క్రితం...

’జ్ఞాపకం ఉన్నానా? మరిచిపోయావా?’ అంది ఎంతో చనువుగా, ఆ స్త్రీ మూర్తి.
జ్ఞాపకం ! కొద్ది సేపటికికాని రాలేదు కాలేజీ, నోటుబుక్కుతో మూర్తి మొహం బద్దలవడం, లవ్‍లెటరు... జరిగి చాలాకాలం అయింది. ’జ్ఞాపకం లేకేం! తప్పకుండా జ్ఞాపకమే.’ అన్నాను ’మీరు’ అనాలా, ’నువ్వు’ అనాలా అన్న సందేహం పైకిరాకుండా, జాగర్తగా.

’అయితే నా పేరుచెప్పు !’ కొంటెగా సవాలు.

నిజంగా అయితే ... చటుక్కున ఆమె పేరు జ్ఞాపకం రాలేదు. మనస్సనే చెత్తబుట్టలో త్వరత్వరగా వెతుకుతున్నాను...
విజయగర్వంతో అన్నది ఆమె: ’నీకు జ్ఞాపకంలేదు. అవునా! ఒప్పుకుంటే సరిపోలా?...’ నవ్వింది.
నవ్వింది పళ్ళు బైటపడ్డాయి.

’పుచ్చుపెసలు!’ అన్నాను విజయంతో. పూర్వజన్మ స్మృతి మెరుపులా వొచ్చింది.
’నీ బుద్దులు పోనిచ్చుకున్నావు కావు, అప్పటికీ యిప్పటికీ. ఏదో పెద్దమనిషిని అయావు అనుకున్నాను కాని...’
’నీతో చదువుకున్నాక పెద్ద మనిషిని యెల్లా అవుతాను చెప్పు... కల్యాణీ!’ పేరు అది! అప్పటికి జ్ఞాపకం వొచ్చింది.
తరువాతి పది నిమిషాల్లో, తానేం చేస్తున్నది, ఆవూరు యెందుకు వొచ్చింది... పై ఆదివారం నే నామెను ఎక్కడ కలుసుకోవలసింది చెప్పింది. నేనెక్కడ వున్నది. ఏమిచేస్తున్నది కనుక్కుంది. నేను వెళ్ళకపోతే తరువాత నిలవేసి అడిగేటందుకు కాబోలు!

వెళ్ళాను, ఆమె క్వార్టర్సుకి. హాస్పిటలు పక్కనే వున్నాయి. ఎంతో అప్యాయంగా మాట్లాడింది. మంచి ’కేకు’ బిస్కట్లు తినిపించింది. కాఫీ తెప్పించింది.

’ఇంతకంటే ఇక్కడేమీ దొరకవు. దరిద్రం. ఏదోశె అయినా తినాలనివుంటే మౌంటురోడ్డు దాకా పోవాలి. ఒకర్తిని వెళ్ళలేను. నీలాంటి స్నేహితుడు దొరికినప్పుడు తప్ప వెళ్ళడం కుదరనూ కుదరదు...’

తీసుకుని వెడతానని వొప్పుకున్నాను. ఆమెను వూరంతా తిప్పాను. కాదు కాదు...నన్నే ఆమె ఊరంతా తిప్పింది. సినిమాకు తీసుకుని వెళ్ళింది. డబ్బు ఆమే ఖర్చు పెట్టింది. కాదంటే దెబ్బలాడింది.

అడయారు వెళ్ళాం. బీచికి వెళ్ళాం. ఏకాంతంగా కూచున్నాం. పూర్వగాధలు నెమరువేసింది. మనక్లాసు మేటు ఫలానా అమ్మాయి చెడిపోయిందిట తెలుసా! ఫలానా వాడు ఫలానా ఆమెను చాలాకాలంగా ఉంచుకున్నాడుట తెలుసా!... ఒక గంటసేపు విన్నాను. ఇంకాఎక్కువే అయివుండొచ్చు...

...నేను ఏంచేశానో చెప్పలేను. శరీరం వేడేక్కింది కాని నా పెదవులు అంత శీతలాన్ని ఎన్నడూ రుచిచూడలేదు. తరువాత కాల్చిన రెండు సిగరెట్లు ఎందుకు ఆరిపోలేదో మాత్రం తెలియదు.

అసలు ఆ పొగ అయినా, గడ్డకట్టి క్రింద పడకుండా పైకి ఎలా పోగలిగిందో నన్నడిగి ప్రయోజనంలేదు.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)