పూర్వరంగం
శ్రీ త్యాగరాజానన్తర వాగ్గేయ శిఖామణులందొక జాతి వజ్రము నారాయణాచార్యులుగారు. 1902 వ సంవత్సరం డిసెంబరు 25వ తేదీన ప్రకాశంజిల్లా అద్దంకి మండల సమీపపు తూర్పు తక్కెళ్ళపాడు (తులాగ్రహారమ్) అను అగ్రహారమందు శ్రీమతి లక్ష్మమ్మ మరియు శ్రీనివాస రాఘవాచార్య దంపతులకు జన్మించి చరితార్థులైనారు. బాల్యదశలో సంగీతాది కళల పట్ల పురాకృత సుకృతముచే అనతికాలములోనే పేరు గడించారు.
విద్యాపాటవ కుశలత
శ్రీ త్యాగబ్రహ్మ సమకాలీనులుగా ఖ్యాతి నార్జించిన వీణ కృష్ణమాచార్య ప్రియశిష్యులైన నూజివీడు వీణావీరాసామి అయ్యంగారు శిష్యులైన శ్రీ తిరుమల నల్లాన్ చక్రవర్తుల రాఘవాచార్య స్వామి కడ గాత్రము ఆపై వీణను అభ్యసించారు. తూర్పు తక్కెళ్ళపాడు అగ్రహార జమిందారులైన శ్రీ మద్దంకి తిరుమల సమయోద్దండ కోలాహల లక్ష్మీనృసింహకుమార తాత దేశికాచార్య అయ్యగార్లంగారి పర్యవేక్షణలో ''గురుకుల'' వాస రూపమున విద్యనేర్చినారు. వీరి సతీర్థులే శ్రీ కొమాండూరి అనంతాచార్యులు (పత్ర సమర్పకుని తాతగారు), శ్రీ మద్దంకి సింగరాచార్యులనూ- వీరందరూ గురుకుల వాసము నందు స్ఫూర్తిప్రదులై విద్యావైభవమును కూలంకషంగా గ్రహించారు. ఈ మువ్వురూ 'గుంటూరు'న వసించి సంగీతసేవ చేసిన ఘనులు.
విద్యా వైభవ ప్రకాశనము
నారాయణాచార్య, అనంతాచార్య, సింగరాచార్య త్రయము దైవ నిర్ణయముగా వైణిక త్రయముగా 'గుంటూరు'కు పూర్వ సంగీత చారిత్రక స్థల వైభవమును విస్తృతి చేసి ఘనత తెచ్చుటకై వచ్చి చేరిరి. గ్రంథ కర్తృత్వము - వాగ్గేయకారత్వము - వీణావాద్య విషయముగా నారాయణాచార్య అనతికాలములోనే ఖ్యాతిబడిసిరి. శ్రీ అనంతాచార్య వీణ విద్యాపారంగతులు.
ఉత్తమ ఆచార్యులుగా పేరొందగా, శ్రీ సింగరాచార్య వైణికులుగా అట్లే వీణావాదన నిర్మాపకులుగా పేరొందిరి. నాటి గుంటూరు (గుర్తపురి) మహా మేరునగధీరులైన పర్వతనేని వీరయ్యచౌదరి, చదలవాడ సుబ్బయ్య, మారేమండ వరదాచారి, కొమాండూరి అనంతాచార్య, బలిజేపల్లి, మహావాది వేంకటప్పయ్యశాస్త్రి, రాజనాల వేంకట్రామయ్య, చెందుకూరి శివరామయ్య, వింజమూరి వరదరాజయ్యంగారు, కొమాండూరి తిరుమలాచార్య, శామంతవాడి రాఘవేంద్రాచారి, అంబటిపూడి శ్రీరామమూర్తి, ఇయ్యుణ్ణి జగదీశ్వరి మున్నగు ప్రముఖులతో విరాజిల్లినది. విజయవాడలో రేడియోకేంద్రం ప్రభుత్వ సంగీత కళాశాల ఆవిర్భావముతో గుంటూరు ప్రాముఖ్యత కొంత సన్నగిల్లిందనుట చారిత్య్రక సత్యము.
గ్రంథ రచనా ధౌరేయత
1) జాతిభేద సప్తతాళ సహిత శతరాగ రత్నమాలిక
2) పద్మావతి రాగ నక్షత్రమాలిక
3) తల్పగిరి రంగనాధ కీర్తనలు
4) అన్నమాచార్య స్వర కుసుమాంజలి
5) బంధ స్వరావళి
6) 'సరిగమాపాదస'ని పంచరత్నాలు.
ఇటుల గ్రంథ కర్త్వత్వముచే అద్భుతమైన రచనా పాటవ ప్రకర్షను వెలయించిరి. నాదోపాసనయే తన జీవిత ప్రధమ ప్రాణముగా అనుష్ఠించిన వాగ్గేయ ధీమంతులు. వీరు ఈ రచయితకు సమీప బంధువులు కావడంవల్ల వీరి రచనలు కీట్సంబికముగా నేర్పుట జరిగినది. రచయిత తండ్రి గానకళా భూషణ శ్రీ కొమాండూరి శేషాద్రి కడ పలు కీర్తనలు, వాటి సంగీత, సాహిత్య గత వైభవము తెలివిడియైనది. ఇంతియేగాక 'గాంధర్వ వేదామృతమ్' అను లక్షణ గ్రంథమునూ వెలయించి అందు ప్రధానముగా ఆంధ్ర వాగ్గేయకారులను క్లుప్తముగా పరిచయము చేసి, వీణ క్రమ పరిణామమును తాను పరిశోధించి విస్తృతపరచిన 'వీణ'లను సాలంకృతముగా చిత్రముల ద్వారా వెలుగుబరచిరి.