శీర్షికలు
పద్యం - హృద్యం
- పుల్లెల శ్యామసుందర్

ఈ క్రింది "ప్రశ్న"కు పద్య రూపములో జవాబు పంపాలి. మీజవాబులు విద్యుల్లేఖద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖులోపలపంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేటతెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.

ఈ మాసంప్రశ్న:
(న్యస్తాక్షరి, వర్ణన) పద్యములోని ప్రతిపాదములోని మొదటి అక్షరములు కలిపిన 'దసరాలు' గా వచ్చేటటుల మీకు నచ్చిన ఛందస్సులో దసరా సంబరాలు వర్ణిస్తూ పద్యము వ్రాయాలి.


గతమాసం ప్రశ్న:
క్రుళ్ళిన వంకాయ మేలు కూరకు యెపుడున్!

ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.

రాజేశ్వరి నేదునూరి, న్యూజెర్సీ
త్రుళ్ళుచు దెచ్చితి వీవిటు
క్రుళ్ళిన వంకాయ - మేలు కూరకు యెపుడున్
కళ్ళకు గాంచిన నిగనిగ
వెళ్ళుము కూరలను దెచ్చి వేగమె బడికిన్


కృష్ణ అక్కులు
(1)
పెళ్ళి తొలినాళ్ళలో నొక
క్రుళ్ళిన వంకాయను సతి వేపుడు చేయన్
లొల్లిని చేయక వరుడనె
క్రుళ్ళిన వంకాయలు మేలు కూరకు యెపుడున్

(2)
ఉల్లి కొనలేని పెనిమిటి
చిల్లీ కూరనుతిని మనసుననె భరించెన్
ఇల్లాలి తోడ నుడివెను
క్రుళ్ళిన వంకాయలు మేలు కూరకు యెపుడున్


వారణాసి సూర్యకుమారి, రాంచి
కళ్ళకు నచ్చిన కూరలు
మళ్లీ కొని నిల్వ నుంచ మంచివె పాడై
మెల్లగ మిగిలిన వన్నీ
కుళ్ళిన, వంకాయ మేలు కూరకు నెపుడున్


ఇంద్రగంటి సతీష్ కుమార్, చెన్నై
(1)
ఒళ్ళును పాడుగ జేసెడి
చల్లని కూరలకు బయట జనుటెందులకున్!
ఇళ్ళన పెరటిన ఉండెడి
కుళ్ళిన వంకాయ మేలు కూరకు యెపుడున్!

(2)
కళ్ళకు ఇంపుగ కనబడు
మాల్లో శాకములు పనికి మాలినవన్నా!
ఇళ్ళన పెరటిన ఉండెడి
కుళ్ళిన వంకాయ మేలు కూరకు యెపుడున్!

(3)
నల్లని కాయలు చూపవు
కుళ్ళిన వంకాయ! మేలు కూరకు యెపుడున్
తెల్లని వంకాయ, రుచిన్
కల్లము లెరుగని పలుకుల కమ్మగ నుండున్!


గండికోట విశ్వనాధం, హైదరాబాద్‌
కల్లును త్రాగగ మిగిలిన
చిల్లరతో కూరలు కొని చేరగ కొంపన్‌
పెళ్ళాం తిట్లకు బదులిడె
క్రుళ్ళిన వంకాయ మేలు కూరకు యెపుడున్‌.


చావలి శివప్రసాద్, సిడ్నీ, ఆస్ట్రేలియా
(1)
అల్లము, పచ్చిమిరప, నీ
రుల్లి, కొతిమిరల జతగొని రుచుల వివిధమై
చెల్లు నొకపరి టొమాటో
క్రుళ్ళిన, వంకాయ మేలు కూరకు యెపుడున్‌

(2)
తళ్ళుకొను ప్రాయమున వే
పుళ్ళు తినమరగి ముదిమిన పొసగని నకిలీ
పళ్ళకు మనమున నెంచుచు
క్రుళ్ళిన, వంకాయ మేలు కూరకు యెపుడున్‌
(తళ్ళుకొను: ఉద్రేకించు; ముదిమిన: ముసలితనమున; క్రుళ్ళు: కుములు)


డా. రామినేని రంగారావు యం.బి.బి.యస్., పామూరు, ప్రకాశం జిల్లా
(1)
తల్లీ- బిడ్డకు- భార్యకు
చల్లంగా కడుపునింప జాలని కలిలో
కల్లోగంజో తోడుగ
క్రుళ్ళిన వంకాయ మేలు కూరకు యెపుడున్

(2)
మళ్ళిన వయసున పెళ్ళియు
క్రుళ్ళిన వంకాయ, మేలు కూరకు యెపుడున్
ఉల్లియె, గమనించంగా
తొల్లిటి రెండును విడచిన దుఃఖము తొలగున్


టేకుమళ్ళ వెంకటప్పయ్య, విజయవాడ
భళ్ళున దెరువగ దలుపులు
పెళ్ళికి పదిదినము లుండ పేర్మితొ జనులున్
తుళ్ళుచు జేరిరి యకటా!
క్రుళ్ళిన వంకాయ మేలు కూరకు యెపుడున్!


పుల్లెల శ్యామసుందర్, శేన్ హోసే, కాలిఫోర్నియా
పిల్లా, చౌకగ దొరికెడి
క్రుళ్ళిన వంకాయ గూడ కూరకుఁ దగునే!
క్రుళ్ళిన భాగముఁ గోయగ
క్రుళ్ళిన వంకాయ మేలు కూరకు యెపుడున్!

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)