(గత సంచిక తరువాయి)
తే.గీ. సేద్య జలమునకు వలయు చెఱువు పూడ
బాగుచేసెడి పనిమాని వంకలెన్ని,
’ఫైల్సు’ కదలకుండగ వింత ’రూల్సు’ చెప్పు
నట్టి అధికారులా దోషు లౌదు రిందు!
తే.గీ. తిండి లేకను, అప్పులు తీర్చలేక,
పేద రైతులు ప్రాణముల్ విడుచుచుండ,
నోరు మెదపక యున్న మీ యూరి నాయ
కులిట దోషులా కొంకక తెలుపు మయ్య!
తే.గీ. ఆస్తి తోడుత వారి భార్యా సుతులును
నాయకుల చేతకానితనమున నాశ
నంబయిన గూడ వారినే నమ్మి తిరిగి
ఎన్నుకొను వెఱ్ఱిప్రజలదా ఇచట తప్పు!
తే.గీ. ప్రత్న సంస్కృతి చిహ్నమౌ ప్రథిత దేవ
ళములు, తమ సంపద పరహస్తముల చిక్కి,
శిథిలమగుచున్నగూడ నిశ్చింతనున్న
ఆస్తిక శ్రేష్ఠులది యౌనె అసలు తప్పు!
తే.గీ. ప్రజల నిరత యోగక్షేమ రక్షణలకు,
వారి పెంపుకై సంకీర్ణ పథకములను
వీక నిర్వహించుట యందు విఫలమైన
మీ ప్రభుత్వ యంత్రాంగమా మేటి దోషి!
తే.గీ. కోర్టులో నున్న వ్యాజ్యంబు కొన్ని వత్స
రములు దాటిన ఇటునటు తెమల నీక
యాపనకు హేతువైన న్యాయవ్యవస్థ
చట్టముల లోపమౌనొ ఈ సటల కరయ!
తే.గీ. సంస్థలందున మీ న్యాయసంస్థ కొంత
మేలుగానుండు గ్రుడ్డిలో మెల్లవోలె;
కాని తీర్పు లాలస్యము లైనపట్ల
న్యాయదేవత కనుమూసినట్లు తోచు.
తే.గీ. ఎవరు కారణ మౌదురో ఇట్టి స్థితికి,
రాజకీయులొ, అధికార్లొ, ప్రజలొ, న్యాయ
సంస్థలో, పాలనావ్యవస్థ పతనంబొ -
తెలిసికొని వేగముగ సరిదిద్దుమయ్య!
తే.గీ. చూడ ఈ పృథ్వి పరమాత్మ సొత్తు సుమ్ము,
దాని యందున్న వనరుల తగిన విధిని
వాడు కొనుటకు మాత్రమే వసుధనున్న
జీవులకు హక్కు నిచ్చెను దేవుడరయ.
తే.గీ. వలయు వనరుల నేర్పుతో వాడ వలయు,
పరగ వనరుల నభివృద్ధి పరచ వలయు,
భావికైకొంత సంపద వదల వలయు,
ఇవియె మానవ విధులని ఎఱుగ వలయు.
తే.గీ. చేరి భూసంపదను వృథా చేయువారు,
వలయుకన్నను హెచ్చుగా వాడువారు,
దొంగతనము చేసినవారితోడ సములు,
చెలసి వారిని పట్టి శిక్షింపు డయ్య!
తే.గీ. అంటు, ఆచారముల నన్ని మంటగలిపి,
ఇంటిలోనను బైటను పెంట పెంచి,
పెలుచ జనులు త్రాగెడు నీరు, పీల్చు గాలి
కలుష మొనరించు ఖలుల నాకట్టవలయు!
కం. మస్తుగ పరసంస్కృతికిన్
మస్తరిలి సనాతనత తెమలి ఖిలమై, మీ
శస్త సమాజ పరిస్థితి
అస్తవ్యస్తముగ మాఱె వ్యసనాకులమై.
తే.గీ. అసలు దోషులను వదలి ఆలయమున
రామనామములో కొన్ని ఱాళ్ళు దొంగి
లించెనని ఈ బడుగువాని కొంచెమైన
మానవతలేక నిందింప బూనినావు.
శా. నీ కోపంబున కూరి నాయకుడొ, మన్నీడో, ప్రభుత్వంబునన్
’కాకారాయుడొ’, ’పైరవీ పరుడొ’, శాఖాధ్యక్షుడో, మంత్రియో
కాకీ పేదగు వానిపై నిటుల కిన్కన్ బూన న్యాయంబటే -
నీ కారుణ్యము చూపగా దగును కానీ! శోధకాగ్రేసరా!
తే.గీ. సాక్ష్యములు లేక గూడను సాకులెన్ని,
కెలసి యూహానుమాన వికృతిని నితని,
సాధువర్తను, సద్భక్తు, స్వార్థ్రహుతు,
తవిలి దుర్మార్గునిగ చూప దలచినావు.
ఉ. భక్త శిఖామణిన్ పరమ వైష్ణవమూర్తిని, సచ్చరిత్రునిన్
యుక్తమొ, కాదొ యన్ విషయ ముల్లము నందున నెంచి చూడ క
వ్యక్తపు నిందమోపి అపహాస్య మొనర్చి మహాపరాధ సం
పృక్తుడవైతి - నీ కనుల మీదుగ చూచితె వీని చౌర్యమున్.
చం. ఇరువది నాల్గు గంటలు నహీన విరాగ విభూతి లీనమై
పరిణతితోడ నా పతితపావననాముని రామనామమున్
సురుచిరలీల నోట పరిశుద్ధ మనస్కత నుచ్చరించు పూ
జరి నొక దొంగయంచు నభిశంసన సేయుట నీకు భావ్యమే!
శా. సేవాభావము భక్తిభావమును వాసింపంగ నుల్లంబునన్
సేవల్ జేసెను వైష్ణవుండు బహుధా శ్రీరామ, సీతామహా
దేవీ, లక్ష్మణ విగ్రహంబులకు - ఆ దేవుళ్ళె భక్తాళికై
గ్రావాకారములన్ ధరించిరని వీకన్ నమ్మి కొన్నేండ్లుగన్.
శా. సావాసంబున, పాదసేవను, విశిష్టాద్వైత యోగంబునన్,
భావంబందున రామనామజప సంపాద్యామృతస్వాంతుడై,
నీవే నాకిక సర్వమంచును మనో నిర్విష్టచింతారతిన్
భావాతీతమయ ప్రపంచమున నుద్భాసిల్లు వీడెప్పుడున్.
కం. ఇంతటి భక్తి పరాయణు
నింతటి భాగవత పురుషు నింతటి జ్ఞానిన్
వింతగ దొంగని పల్కితి
వెంతటి ఘోరంబొ దీని నెంచితె మదిలో!
సీ. రామనామము నంబి ప్రేమతో స్మరియింప,
శ్లేషతోడను నింద చేసె నంటి,
సేవకై రాముని చెంతచేరిన చూచి
రత్నములను దోచు యత్నమంటి,
భక్తతండములకు పరమాన్నములు బెట్ట
మెప్పుకోస మటంచు దెప్పినావు,
పొగచూరి తిలకంబు నిగనిగ తగ్గంగ,
పూని ఈతడె మసిపూసె నంటి,
తే.గీ. చిన్ననాటనుండియు వీని శీలమెఱిగి
గూడ కృపణుడంటివి నేడు కుత్సితముగ,
వెదకి నేరగాండ్రను పట్టు వృత్తి గాన,
సువ్రతుని గూడ మాయిగా చూచినావు.