(గత సంచిక తరువాయి)
అమరేంద్రకు అదాటుగా గెష్టుహౌస్ కి వెళ్ళాలన్న తహతహ పుట్టింది, ఎందుకనో .... ! చందనం కట్టె కొనడం అయ్యింది. వేనులో పెట్టేందుకు వీలుగా ఇక దానిని కావలసిన కొలతలతో కోయించడం మాత్రం తరవాయి ఉంది. ఆ పనిని విమలాచార్యకు అప్పగించాడు అమరేంద్ర. రేంజర్ కి ఇవ్వాల్సిన డబ్బు చెల్లించి, రిసీట్ తీసుకుని, అతనికి "థాంక్సు" చెప్పి, ఈ రోజే హైదరాబాదు వెళ్ళిపోతున్నట్లు తెలియజేసి సెలవు తీసుకున్నాడు. ఆ తరవాత వేన్ ఎక్కి, గెష్టుహౌస్ కి పోనిమ్మన్నాడు. డ్రైవర్ అమరేంద్రను గెష్టుహౌస్ దగ్గర దిగవిడిచి, తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు.
రాజు ఆ సమయానికి గెష్టు హౌస్ కి దగ్గరలోనే ఉన్న సీమచింత చెట్టు ఎక్కి, కాయలు కోసుకుని తింటూ తన్మయత్వంలో మునిగిపోయి ఉండడంతో, వేన్ వచ్చినది కూడా పట్టించుకోలేదు వాడు. వాటిని తినడంలో వాడి ఏకాగ్రతకు, "పోనీలే పాపం, ఈ కాస్సేపేకదా ఈ భోగం" అనుకుని నవ్వుకున్నాడు అమర్ .
వల్లియమ్మ వంట చేస్తున్నదానికి గుర్తుగా తాలింపు ఘుమఘుమలు గుబాళిస్తున్నాయి. ఆ చుట్టుపక్కల ఎక్కడా అతనికి యామిని జాడ కనిపించలేదు. మరి యామిని ఎక్కడ ఉందిట?
అమర్ వళ్ళియమ్మను అడిగాడు అరవంలో, "పొన్ను ఎంగే" అని.
" ఉంగ పొండాట్టి (భార్య) కాడు పాక పోయిపోచ్చి" అంది, సాంబారులో పోపు వేసి, గరిటతో తిప్పుతూ జవాబు చెప్పింది వళ్ళియమ్మ.
అంతలో దూరంగా ఎక్కడో భీకరంగా ఉరిమిన చప్పుడు వినిపించింది. " వాన రాకపోతే బాగుండును. ఈ వేళే మన ప్రయాణమ్. మేము హైదరాబాదుకి, మీరు మీ పుట్టింటికి " అన్నాడు అమర్ ఆమెతో .
"నన్రి అప్పా! రొంబ నన్రి" అంటూ మురిసిపోయింది వల్లియమ్మ.
అమరేంద్ర ఇంక అక్కడ నిలబడ లేదు. వల్లియమ్మ చూపించిన వైపుగా యామినిని వెతుక్కుంటూ బయలుదేరాడు. అతనికి యామిని మీద చాలాకోపం వచ్చింది. ఇక ఎప్పుడూ స్వతంత్రంగా అడవిలోకి వెళ్ళనని ఆమె తనకు మాటిచ్చి సరిగా మూడురోజులయినా కాలేదు,అప్పుదే వాగ్దానభంగమా - అనుకున్నాడు కొంత దూరం వెళ్ళేసరికి అతనికి అర్థమయ్యింది, అది మొన్న తాము జామపళ్ళకోసం వెళ్ళిన దారేనని. యామిని జామపళ్ళు కోసి తేడానికి వెళ్ళివుంటుంది - అనుకుని అమర్ మనసుని సమాధానపరుచుకోడానికి ప్రయత్నించాడు. నేరుగా అక్కడికే వెళ్ళాడు. కాని ఆమె అక్కడ లేదు. అతనికి భయం మొదలయ్యింది.
ఏ క్షణంలోనైనా వాన మొత్తేసేలా బరువుగా ఉంది వాతావరణం. అప్పుడే దూరాన్నున్న కొండలమీద వాన కురుస్తున్నదానికి గుర్తుగా కొండ వాలులమీద మెరుపుల బీభత్సం కనిపిస్తోంది. నల్లని కొండలమీద మెరుస్తూన్న శంపాలతల హేల చూడ ముచ్చటగా ఉంది. ఉరుముల శబ్దం దూరంగా వినిపిస్తోంది. కాని వాటి అ అందాన్ని ఆస్వాదించే మనస్థిమితం అతనికి లేకపోయింది.
"ఈ తిక్కపిల్ల ఎక్కడుందో" అనుకున్నాడు అమర్. వెంటనే "యామినీ" అంటూ ఎలుగెత్తి పిలిచాడు. జవాబు లేదు. ఆ కేకకు బెదిరిన పిట్టలు అవికూడా అరుస్తూ చెట్టు కొమ్మల్ని విడిచి ఎగిరిపోయాయి.
తన పిలుపుకి జవాబు రాకపోడంతో అతనికి చిరాకు వచ్చింది. రకరకాల ప్రమాదాలు పొంచి ఉండే ఇలాంటి చోట్ల, ఇలా ఒంటరిగా వెళ్ళడం అన్నది దుస్సాహసమే ఔతుంది - అనుకున్నాడు. "అసలు ఈ పిల్లకి ఈ ప్రదేశాన్ని గురించి ఏమి తెలుసునని! జాగ్రత్త అన్నది అసలు తెలియదు, అతిశయం ఎక్కువ! అంతలో ఎంతో మెచ్యూరుగా కనిపిస్తుంది, మళ్ళీ అంతలోనే చిన్నపిల్లైపోతుంది! ఏం పిల్లో! ఈమె తత్త్వమేమిటో కనిపెట్టడం ఎవరివల్లా అయ్యేపనిలా లేదు" అనుకుని కోపం పట్టలేక పళ్ళు కొరుక్కున్నాడు అమరేంద్ర
కొంతదూరం ముందుకివెళ్ళి మళ్ళీ కేకపెట్టాడు అమర్. మళ్ళీ అదే పరిస్థితి. దాంతో అతనికి కంగారు పుట్టింది. అదిరే గుండెలు చిక్కబట్టుకుని మరింత ముందుకి వెళ్ళాడు. అక్కడనుండి నేల పల్లానికి దిగుతున్నట్లుగా తోచింది. మరి నాలుగు అడుగులు వేసీ సరికి తెలిసింది, అదొక నీరులేని
కొండకాలువ(nulla) అని. అక్కడున్న ఇసుకలో యామిని కాలి జోడు తాలూకు ముద్రలు కనిపించడంతో అతనికి గుండె దుడుకు తగ్గింది. అతడు ఆ కాలి జాడల్ని పట్టుకుని కొండకాలువలోని ఇసుకలో
నడవసాగాడు. ఒక మలుపుతిరిగి చూసేసరికి దూరంగా, కౌజు పిట్టల్ని తరుముతూ కనిపించింది యామిని. ప్రాణం కుదుటబడి అతడు "అమ్మయ్య" అనుకుని ప్రశాంతతను పొందాడు. తరవాత ఆమెను " యామినీ" అని పెద్దగా ఎలుగెత్తి పిలిచాడు గాని, గాలిహోరులో ఆ కేక ఆమెకు వినిపించ లేదు.
గునగునా ముందుకి పరుగులు పెడుతూ, అందీ అందకుండా ఆమెను కవ్విస్తున్నాయి ఆ పిట్టలు. ఆమె కూడా ఎలాగైనా వాటిని పట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. అతనికి ఆ దృశ్యం చూడ ముచ్చటగా ఉంది. అతడు, "ఈ పిల్లకు ఇంకా పసితనం పోలేదు గావును, చిత్రంగా ఉందే! " అనుకున్నాడు. కెమేరా తీసుకురానందుకు మనసులో కించపడ్డాడు అమర్.
ఆ చుట్టుపక్కల మల్లెపొదల్లాంటివి దట్టంగా వ్యాపించి ఉన్నాయి. తెల్లనిపూలు విరబూసి, సువాసనలు వెదజల్లుతున్నాయి. ఝుంకారనాదంతో, తెల్లని పూలచుట్టూ ఎగురుతున్నాయి నల్లని తుమ్మెదలు. వేలాది తేనెటీగలు పూలపై వాలి మకరందాన్ని సేకరిస్తున్నాయి. ఇంకా అక్కడ ఇతరజాతి కీటకాలు లెక్కకు మిక్కిలి ఎగురుతూ కనిపిస్తూన్నాయి. పుడకలకే రెక్కలొచ్చినట్లున్న తూనీగలు, ఆకులమీదా, పూలమీదా వాలుతూ, పూసలాంటి తలను అటూ ఇటూ తిప్పి లోకాన్ని పరికించి చూసి
మళ్ళీ అంతలోనే అక్కడనుండి ఎగిరిపోతున్నాయి. .
యామిని కనిపించడంతో అమర్ కి ప్రశాంతత చిక్కింది. కొండవాగు మట్టులో ఉన్న బంగారురంగు ఇసుకలో, జేబుల్లో చేతులు ఉంచుకుని ఆమెనే చూస్తూ నిలబడి పోయాడు. యామిని మాత్రం తన ధోరణిలో తానుండి, ఇటు వైపైనా తిరిగి చూడలేదు.
కొండవాగులు చాలా విచిత్రమైనవి. వాటిలో నీరు అన్నప్పుడూ ఉండదు. కొండల్లో వానలు కురిసినప్పుడు, ఆ నీరంతా కొండవాగులలోకి చేరడంతో ఒక్కసారిగా అవి విఝృoభించి ప్రవహించి, తమ దారికి అడ్డునిలిచిన వాటి నన్నింటినీ కబళించివేస్తాయి. మళ్ళీ కొండమీద వాన కురవడం ఆగిపోయిన కొద్దిసేపట్లోనే అని వట్టిపోతాయి. వాననీటికి శుభ్రపడిన వాగులోని ఇసుక మాత్రం బంగారు రంగులో మిలమిలా మెరిసిపోతూ అక్కడే నిలిచి ఉంటుంది.
వాగు ఒడ్డున మొలిచి వున్న మొక్కలనిండా విరబూసివున్న పూలలో తొణికిసలాడుతున్న తేనెను తాగడానికి, తేనె పిట్టలు వచ్చాయి. పిట్టపొడవు ఎంతో ముక్కుపొడవూ అంతే ఉంది అనిపిస్తుంది వాటిని చూస్తే ! అవి ఆ ముక్కుని పూవులోకి గుచ్చి మకరందాన్ని పీల్చుకుని కడుపు నింపుకుని వెళ్ళిపోతున్నాయి. వినిపించే శబ్దాలను, కనిపించే దృశ్యాలను వింటూ, చూస్తూ నిలబడి ఉన్న అమరేంద్రకు అకస్మాత్తుగా, తుమ్మెదల "ఝుం"కారంలో ఏదో అపశృతి వినిపించింది. అది క్షణ క్షణానికీ పెరుగుతున్నట్లు అనిపించింది. వెంటనే స్ఫందించిన అతని మనసు కీడును శంకించి కంగారుపడింది. అతడు మరి ఆలోచించకుండా యామిని ఉన్న వైపుగా వేగంగా పరుగుపెట్టడం మొదలుపెట్టాడు.
యామినిని చేరుకోగానే అతడు, ఆమెను రెండుచేతులతోనూ పైకి ఎత్తి పట్టుకుని గట్టువైపుగా పరుగెట్టాడు. అకస్మాత్తుగా అలా జరిగే సరికి యామిని కంగారుపడింది. తననలా వెనకబాటుగా వచ్చి పట్టుకున్నది ఎవరో గుర్తించలేకపోయింది. చాలా భయపడింది. ఎలాగైనా ఆ పట్టు నుండి శీఘ్రం విడిపించుకోవాలని గట్టిగా పెనుగులాడింది. కాని అతడు, ఆమెను పట్టుకుని నడవడం తనకు ఎంత కష్టమైనా కూడా, పూర్తిగా గట్టు ఎక్కాకగాని ఆమెను క్రిందకు దింపలేదు. నేలమీద నిలబడగానే ఒళ్ళుతెలియని కోపంతో చేయి లేపి, తలెత్తి చూసిన యామిని ఎదురుగా అమరేంద్ర కనిపించేసరికి నిర్ఘాంతపోయింది.
తమాయించుకుని, ఎత్తినచెయ్యి కిందకు దించి, " మీరా! మీ రిలా చేశారు ఎందుకు? ఇదేం పని" అని అడిగింది కోపంగా. ఆమె కళ్ళవెంట కన్నీరు ధారలుకట్టింది.
"ఏడుపెందుకు? నేనొక రెండు నిముషాలు జాగు చేసినా ఏడవడానికి నువ్వూ ఉండే దానివికాదు, ఏడవ వద్దని చెప్పేందుకు నేనూ ఉండేవాణ్ణి కాను! నీ ఇష్టం వచ్చినట్లు ఆడుకోడానికి ఇదేమీ నీ పుట్టిల్లుకాదు " అన్నాడు కళ్ళెర్రజేసి అమరేంద్ర కోపంగా.
అదేం పట్టించుకోకుండా, "మీ రెందుకు.... ఎందుకు ఇలా చేశారు? ముందది చెప్పండి" అని అడిగింది కటువుగా.
" ఆ సంగటి నువ్వు నన్ను అడగనక్కరలేదు. అటుచూడు ఎందుకో తెలుస్తుంది నీకే" అన్నాడు, వేలితో దిశా నిర్దేశం చేసి చూపిస్తూ.
అతడు చూపించినవైపుగా తలతిప్పి చూసిన యామినికి, అంత చలిలోనూ ఉన్నబడంగా ముచ్చమట్లూ పోశాయి. ఆశ్చర్యంతో కళ్ళు మరింత విశాలమయ్యాయి.
వాళ్ళకు కొద్ది దూరంలో కొండకాలువలో, హోరుమనే శబ్దంతో, పరవళ్ళు తొక్కుతూ మహా వేగంతో దూసుకువస్తున్న పెను అల కనిపించింది యామినికి. ఉరుకులు పరుగులతో వచ్చిపడుతున్న నీటి వురవడితో ఆ కొండకాలువ మరుక్షణంలో నిండిపోయి, ఒడ్డులొరసుకుని ప్రవహించడం మొదలుపెట్టింది. అది చూసి యామిని నిలువునా, జంఝామారుతంలో చిక్కిన చిరు రెమ్మలా, గడగడా వణికిపోయింది. తనని అమరేంద్ర ఎంత పెద్ద గండం నుండి తప్పించాడో అర్థమయ్యింది ఆమెకు. అవాక్కై రెండు చేతులూ జోడించి అతనికి తన కృతజ్ఞత తెలియజేసింది.
" అమ్మలూ! నువ్వెక్కడున్నా నా ప్రాణాలన్నీ నీపైనే ఉంటాయన్నది మరిచిపోకు సుమీ.... !" తనను సాగనంపుతూ తండ్రి అన్న మాటలు పదేపదే ఆమెకు గుర్తురాసాగాయి. ఎగదన్నిన వెక్కిళ్ళతో ఆమెకు ఒకపట్టాన మాట రాలేదు. " మా నాన్న......, మా నాన్న....... ! నాకేమైనా అయ్యుంటే మా నాన్న ఏమైపోవాలి " అంటూ నిస్సహాయుడైన తండ్రిని తలుచుకుని హృదయవిదారకంగా ఏడవసాగింది యామిని.
ఆమె అలా తండ్రిని తలుచుకుని బాధపడడం చూడగానే అమరేంద్రకు మనసంతా జాలితో నిండిపోయింది. ఎప్పుడూ నిండైన ఆత్మవిశ్వాసంతో గంభీరంగా కనిపించే యామిని అలా బేలగా మారిపోవడం అతనికి విభ్రాంతిని కల్గించింది. అలా దు:ఖోల్భణతతో చలించిపోతున్న యామినిని వదిలి దూరంగా ఉండలేకపోయాడు అమర్. వెంటనే రెండడుగులు ముందుకు నడిచి, రెండుచేతులూ చాపి ఆమెను చేరదీసుకుని హృదయానికి హత్తుకున్నాడు. అతని మనసంతా ఆమె యెడల ఆర్ద్రతతో నిండిపోయింది.
"యామినీ! ఏడవకు. ప్రమాదమేం జరగలేదుగా ...... ! నీ కొచ్చిన భయమేమీ లేదు. చెప్పాకదా, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు - అని ! నీకు ఏ ఆపదా రానీను" అన్నాడు ఆత్మీయంగా. యామిని కూడా అతడే తనకు ఏడుగడ - అన్నట్లుగా అతనిని మరింతగా హత్తుకుపోయి ఊరటపొందింది.
అలా వాళ్ళ తనువులు రెండూ ఆపద్దర్మంగా పెనవేసుకున్నాయేగాని, మనసులమధ్యనున్న దూరం మాత్రం, ఏమాత్రం తగ్గలేదు. ఆమె మురళీని మర్చిపోలేకుండా ఉందన్న భావం అతనిని, అతడు వేరే అమ్మాయితో "ఆల్రడీ ఎంగేజ్డు" అన్న భావం ఆమెనూ పట్టి పీడిస్తూ, వారిమధ్యనున్న దూరాన్ని కాపాడుకుంటూ వస్తున్నాయి. అందుకే ఆ సాన్నిహిత్యం వాళ్ళ దృష్టిలో ఒక ఊరడింపు చర్య మాత్రమే అయ్యింది.
దూరం నుండి వినిపిస్తున్న ఉరుములు క్రమంగా దగ్గరౌతున్నాయి. కారుమేఘాలు సృష్టించిన చీకటిని చీల్చి చెండాడుతూ ఆకాశంలో ఉండుండీ మెరుస్తున్నాయి సంపా లతలు. నీటి బరువుతో వినువీధిలో మత్తగజాల్లా వీరవిహారం చేసిన కారు మేఘాలు, కొండ చరియలపై కురిసి కురిసి తమ ఒంటి బరువును దింపేసుకుని క్రమంగా పలచనయ్యాయి. ఇప్పుడక్కడ వాన, జల్లుగా మాత్రమే కురిస్తోంది. ఆకాశపు అంచులను కలుపుతూ వానవిల్లు అందంగా వెలిసింది. ప్రకృతి అంతా వింతకాంతితో మెరిసింది. ఆ కాంతిపూరంలో వాన చినుకులు పులుకడిగిన ముత్యాలలా థళథళా మెరుసిపోతున్నాయి. పరస్పర పరిష్వంగంలో మైమరచి ఉన్న ఆ యువజంట తలలపై ముత్యాలతలంబ్రాలై జలజలా కురిశాయి ఆ వాన చినుకులు. అంతలో "రివ్వు, రివ్వు" మంటూ బరువైన రెక్కల చప్పుడుతో ఒక నెమిళ్ళజంట ఎగిరివచ్చి, దగ్గరలోనే ఉన్న ఖాళీగా ఉన్న గడ్డి మైదానంలో వాలింది.
ఆ రెక్కల చప్పుడుకి ప్రజ్ఞలోకి వచ్చి కౌగిలి విడిచి ఎడంగా నిలబడ్డారు యామినీ అమరేంద్రలు. అంతలో మగనెమిలి క్రేంకరించి కేకపెట్టి, పురి విప్పి నృత్యం చెయ్యసాగింది. యామినీ, అమర్ అది చూసి నిశ్శబ్దంగా పొదల చాటుకి తప్పుకుని, వాటిని చూడసాగారు. ముత్యాలజల్లులా పడుతున్న ఆ చినుకుల మధ్య, తన్మయత్వంతో, లయబద్దంగా అడుగులువేస్తూ, పురిని విదిలిస్తూ నెమిలి పుంజు, తన ప్రియురాలిని మెప్పించడం కోసం మనోహరంగా నృత్యం చెయ్య సాగింది. పెంటి నెమిలి కూడా తన ప్రియుని తమకంతో ఓరకంట చూస్తూ, లయబద్ధంగా అడుగులో అడుగు కలిపి, దాని చుట్టు చుట్టూ తిరుగుతోంది. అంతకంతకీ అవి దగ్గరౌతున్నాయి. ఆ శృంగార హేల నెమ్మదిగా పరాకాష్ఠకు చేరుకుంటోంది. ఆ రాసలీలను చూస్తున్న ఆమర్, యామినిల మనసులు వాళ్ళ ప్రమేయం లేకుండానే నెమ్మదిగా ఉత్తేజిత మౌతున్నాయి.
క్రమంగా పరస్పరం దగ్గరౌతున్న ఆ పక్షుల జంటను చూస్తున్న యామినికి అప్రయత్నంగా గగుర్పాటు కలిగింది. సిగ్గుతో ఆమె మనసు మొగ్గలా ముడుచుకుంది. అమరేంద్ర నుద్దేసించి మనసులోనే అనుకుంది ఆమె, " నువ్వు "ఆల్రడీ ఎంగేజ్డు" అన్నది తెలుసుకనుక సరిపోయింది గాని, లేకపోతే నా కలల లోని రాజకుమారుడువి నువ్వేనని నేను ఈ క్షణంలోనే నీ ఎదుట బయటపడిన ఉండేదాన్ని కదా" అనుకుంది బాధగా.
అమర్ హృదయం కూడా వింతగా స్పందింస్లా చేసింది ఆ మయోరనృత్యం. తనలోనే అనుకున్నాడు, "యామినీ! మై డార్లింగ్! ఎన్నాళ్ళీ దాగుడుమూతలు? మురళీ మీద నీకున్న ఇష్టం ఇంకా తగ్గలేదేమో నన్న భయం నన్ను పట్టి నిలబెడుతోంది. మన మధ్యలో ఈ మురళీ నీడ కనక లేకపోతే, నేను ఏనాడో నీకు "ప్రపోజ్" చేసి ఉండేవాణ్ణి కదా! ఇలా ఎన్నాళ్ళు? ఏదో ఒక తెగింపుకి రావాలి. నేను నీకు ఇప్పుడే, ఇక్కడే ప్రపోజ్ చేస్తాను. ఇక ఏ ఆలోచనా పెట్టుకోకుండా నిన్ను నిన్నుగా, నా దానిగా ఒప్పేసుకుంటాను. నువ్వు "సరే" నంటే నేను అదృష్టవంతుణ్ణి! ఒకవేళ నువ్వు కాదంటే, కనీసం ఈ సందిగ్ధ మైనా తీరి, నిరాశతో నా మనసు తేలికపడుతుంది" అనుకున్నాడు.
అలా ఒక కఛ్ఛితమైన నిర్ణయానికివచ్చి యామిని కోసం పక్కకి తిరిగి చూసిన అమర్ కి ఆమె అక్కడ కనిపించ లేదు. తలెత్తి చూడగా గెష్టుహౌస్ వైపు విసురుగా వెళ్ళిపోతూ కనిపించింది ఆమె.
అమరేంద్రకు నిస్త్రాణగా అనిపించింది. ఇంక అప్పుడు చేసేదేమీ లేక నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ తనుకూడా గెష్టుష్టుహౌస్ వైపుగా నడక సాగించాడు. .
* * *
అమర్ గెష్టు హౌస్ కి ఇంకా ఫర్లాంగ్ దూరంలో ఉండగానే రాజు కంగారు పడుతూ పరుగెత్తుకుంటూ తనకు ఎదురుగా రావడం చూసి ఆశ్చర్యపోయాడు.
దగ్గరగా వచ్చి, రాజు ఆయాసపడుతూ చెప్పసాగాడు, "సార్! ఎవరో నలుగురు పెద్దపెద్ద మనుష్యులు గెస్టు హౌస్ కి వచ్చారు. వాళ్ళు మేడంగారి చుట్టూ చేరి ఏదో భాషలో గొడవగొడవగా మాట్లాడుతున్నారు. నాకేదో భయమౌతోంది, తొందరగా రండి సార్!" అంటూ గగ్గోలు పడ్డాడు. వెంటనే అమర్ నడక వేగం పెంచాడు.
ఉదయం రేంజర్ చెప్పాడు, గెష్టుహౌసుని ఎవరో విదేశీ షికారీలు పేరున బుక్కైపోయిందనీ, తరవాత వచ్చే వాళ్ళు ఈవేళ రేపట్లో వచ్చేస్తారనీను. వాళ్ళు అప్పుడే వచ్చేశారు కాబోలు! ఒక్కపూట ఆగితే తాము వెళ్ళిపోయి ఉండేవాళ్ళు, కాని అలా జరగలేదు. ఇప్పుడా షికారీల బారినుండి యామినిని తప్పించడం ఎలాగా - అని పరుగెడుతూనే ఆలోచిస్తున్నాడు అమర్. హఠాత్తుగా అతని మనసులోకి వచ్చింది వళ్ళియమ్మ అన్న " ఉంగ పొండాట్టి" అన్నమాట!
తనలోనే నవ్వుకుని, "ఇది బాగుంది. పెళ్ళికానిపిల్ల అంటే, ప్రతివాడూ, ప్రయిజ్ మనీ అన్నట్లు, దానిని తానే గెలుచుకోవాలనుకుని ఆశగా చూస్తాడు. అదే ఒకరి భార్య అంటే, ఎక్కడో రావణాసురుడు, కీచకుడు లాంటివాళ్ళు తప్ప, తక్కినవాళ్ళు ఎంతోకొంత గౌరవం ఇవ్వక మానరు. మరీ కొందరైతే " పరులసొమ్ము పామువంటిది" అని దూరదూరంగా తొలగిపోతారు కూడా." అనుకున్నాడు ఆశగా అమర్.
గెష్టుహౌస్ కి చేరుకున్నారు వాళ్ళు. మెట్లెక్కి వరండాలోకి వస్తూనే, జనం మధ్య బిక్కమొహం వేసుకుని నిలబదిఉన్న యామినిని చెయ్యిపట్టుకుని తనవైపుగా లాక్కుని, "ఐ యాం ఆమరేంద్ర, C.E.O. ఆఫ్ మైత్రీ ఫర్నిషింగ్సు, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్! మీట్ మై వైఫ్ మిసెస్ యామినీ ప్రియదర్శని." అంటూ తమ పరిచయాలు ముగించాడు. యామినితో తెలుగులో అన్యాపదేశంగా, " అందరికీ కలిపి ఒక్క నమస్కారం పడేసి, కాఫీలు తెస్తానని చెప్పి లోపలకు వెళ్లిపో, మళ్ళీ ఇటు రాకు" అని చెఫ్ఫాడు. యామిని బ్రతుకు జీవుడా - అని, అతడు చెప్పినట్లే చేసింది. ఆ తరవాత అమర్ వాళ్ళని కుర్చీల్లో కూర్చోమని చెప్పి మర్యాదగా ఆహ్వానించి కూచోపెట్టాడు. తను, వానకి తడిసిన బట్ట లైనా మార్చుకోకుండా అక్కడున్న కాళీ కుర్చీలో కూర్చుని వాళ్ళతో కబుర్లు మొదలుపెట్టాడు. వాళ్ళని ఒక్కొ క్కరి పరిచయమే అడిగి తెలుసుకుని, వారితో కరచాలనం చేసి, " మీరు గొప్ప "మార్క్సుమన్"లా ఉన్నారు. ఐ విష్ రియల్లీ ఎ బెష్టు స్పోర్టు ఫర్ యూ, డియర్ ఫ్రెండ్సు! చాలా ఏళ్ళనుండీ మీరు వేట కోసం అడవులకు వస్తున్నారు కదా, మీ ప్రత్యేకమైన అనుభవాలు ఏవైనా చెప్పండి, ప్లీజ్!" అన్నాడు.
వాళ్ళు చాలా ప్లీజ్ అయ్యారని వాళ్ళ ముఖాలు చూసి తెలుసుకోగలిగాడు అమర్. సాధారణంగా పేచీతో సాధించుకోలేని ఎన్నో విషయాలు ఫ్రెండ్షిప్ తో సాధించుకోవచ్చు - అన్న సూత్రాన్ని ఉపయోగించి క్షేమంగా యామినిని తీసుకుని ఇక్కడ నించి వెళ్ళిపోగలిగితే చాలు నన్నది అతని ఉద్దేశ్యం.
అమరేంద్ర వాళ్ళతో సరదాగా కబుర్లు చెపుతున్నట్లు కనిపిస్తున్నాడన్నమాటేగాని అతడు, ఎంత త్వరగా అక్కడనుండి వెళ్ళిపోవాలా - అన్న విషయాన్ని గురించే ఆలోచిస్తున్నాడు. అంతలో వేన్ లోడింగ్ పూర్తిచేసుకుని వచ్చింది.
"సారీ ఫ్రెండ్సు! మా ప్లాన్ ఫిక్సైపోయింది. బ్రేక్ఫాస్టు అవ్వగానే వెళ్ళిపోతాము. ఈ ప్రయాణం లేకపోతే నేను మీ షికారీ చూసి మరీ వెళ్ళీ వాడిని. కాలేజి రోజుల్లో NCCలో ఉండేవాడిని. అప్పుడు మాకు గురిచూసి తుపాకీ పేల్చడం ఎలాగో నేర్పారు. నేను కూడా గన్ హేండిల్ చెయ్యగలను. బై ది బై ..... మీకు అభ్యంతరం లేకపోతే మీరూ మాతో బ్రేక్ఫాస్టు చేద్దురుగాని" అన్నాడు ఇంగ్లీషులో. వాళ్ళు ఒప్పుకున్నారు. . వెంటనే లేచి, ఆ ఏర్పాట్లు చెయ్యడం కోసం అన్నట్లుగా లోపలకు నడిచాడు అమర్. .
అక్కడ యామిని కనిపించలేదు అతనికి. వల్లియమ్మను అడిగితే, గదిలోకి వెళ్ళి తలుపు గడియవేసుకుంది - అని చెప్పింది.
"నలుగురు కోసం కాఫీ, ఉప్మా, కారం తక్కువవేసి, చెయ్యాలి" అన్నాడు అమర్.
వల్లియమ్మ నొచ్చుకుంది. " చిటికలొ కాఫీ చేస్తాను. కాని తెచ్చిన సామానంతా ఐపోయింది సార్! ఉప్మారవ్వ కూడా లేదు. భోజనానికి సాంబారు, అన్నం మాత్రమే చేశాను" అంది వల్లియమ్మ.
అంతలో విమలాచార్య, సెల్వసామి దొడ్డిదారిని లోపలకు వచ్చారు. తుపాకులతో వచ్చి ఉన్న వాళ్ళని చూడ్డంతో, వాళ్ళ మొహాల్లో ఆందోళణ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అమరేంద్ర లోగొంతుతో వాళ్ళకి చెప్పాడు .......
"మనం ఇక్కడనుండి ఎంత శీఘ్రం వీలైతే అంత శీఘ్రంగా వెళ్ళిపోవాలి. మన తరవాత ఈ గెష్టుహౌస్ బుక్ చేసుకున్నవాళ్ళు వచ్చేశారు. ముఖ్యమైనవి మాత్రం వేన్లో ఉంచి, తక్కినవన్నీ దొడ్లో పడేసి, ఇల్లు ఖాళీచేసెయ్యండి. మనం ఇక్కడ అన్నాలు తినడంలేదు. వెళ్ళిపోతున్నాం" అని, రాజువైపుకితిరిగి, " వల్లియమ్మ ఇచ్చిన కాఫీ టిఫిన్లు తెచ్చి వాళ్ళకి ఇచ్చి, ఆ తరవాత నువ్వూ, మేడమ్ని, మీసామాన్ని తీసుకుని దొడ్డిడారిన వేళ్ళి వేను ఎక్కి కూర్చోంది. అర్థమయ్యిందా" అన్నాడు.
రాజు చేతులుకట్టుకుని "సరే సార్! అంతా అర్థమయ్యింది" అన్నాడు.
ఆ తరవాత వళ్లియమ్మతో అన్నాడు అమరేంద్ర, " మామీ! సాంబారు, సాదం , నెయ్యి మిక్సుపన్ని ప్లేటుత్తిల్ ఊతి, ఉప్మా మాదిరి స్పూన్ పోడు. అద్దిదా పోదుం నమ్మ టిఫినుక్కు ! " అనిచెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు .
* * *
షికారీ బాబులు అందరూ త్రిపుల్ ఫైవ్ సిగరెట్లు వెలిగించి అమర్ కి కూడా ఒకటి ఇచ్చారు. అందరూ పొగపీలుస్తూ హుషారుగా కబుర్లు చెప్పుకోడం మొదలుపెట్టారు. అంతలో కాఫీ టిఫిన్లు ట్రేలో ఉంచుకుని తీసుకువచ్చాడు రాజు.
అవి తీసుకుంటూ వాళ్ళలో ఒకడు అడిగాడు, " హల్లో! మీ వైఫ్ ని కూడా పిలవండి, బ్రేక్ ఫాస్టుకి మనకు కంపెనీ ఇవ్వమని!"
అమర్ చిరునవ్వుతో దానిని ఖండించాడు. "అదెలా కుదురుతుంది! మా సొసైటీలో కూడా కష్టమ్సు చాలా ష్ట్రిక్టు. సారీ! మా వాళ్ళు కూడా మీ ఆడవాళ్ళలాగే కొత్తవాళ్ళెవరితోనూ మాటాడరు. సోషల్ గా మగవాళ్ళెవరితోనైనా కలివిడిగా ఉండాలంటే కుటుంబాలమధ్య పరిచయం ఉండాలి. తప్పుగా అనుకోకండి, పరదా మినహా మన పద్ధతులన్నీ ఒకటే అన్నాడు, తలెత్తి వాళ్ళమొహాల్లోకి సూటిగా చూస్తూ స్థిరంగా.
మీరిక్కడకు ఏం పనిమీద వచ్చారు సార్!" మరొక షికారీ అదిగాదు.
"కొత్తగా పెళ్ళయ్యింది. వెరైటీగా ఉంటుందని ఇక్కడకు హనీమూన్ కి వచ్చాం సర్ " అన్నాడు అమర్, ఫింగర్సు క్రాస్ చేసుకుని తన మనోభావాలకు రూపకల్పన చేస్తూ.
"వెరీ గుడ్ ఐడియా! ప్రకృతిలో ప్రకృతి" అంటూ ఒకడు చప్పట్లు కొడితే తక్కినవాళ్ళుకూడా వాళ్ళని అనుసరించి కేరింతలుకొట్టారు.
"థాంక్సు" అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు అమర్.
మూడోవాడు అందుకుని, "మై హార్టీ కంగ్రాట్చులేషన్సు యంగ్ మాన్! యు ఆర్ ఏ లక్కీ గై! షి ఇస్ ఏ రియల్ బ్యూటీ" అంటూ అమర్ బుజం తట్టి ప్రశంసించాడు.
అందరూ ఒగరుస్తూ బ్రేక్ఫాస్టు ముగించి మరో సిగరెట్ ముట్టించారు. ఒకచేత్తో సిగరెట్ పట్టుకుని రెండవ చేత్తో కప్పు పట్టుకు కాఫీ తాగుతూ కొంతసేపు వాల్ళు కారంతో సతమతమయ్యారు. ఆ తరవాత మళ్ళీ కబుర్లు మొదలుపెట్టారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళమీద జోకులు చెప్పుకుని, "ఆహా", "ఓహో" అంటూ పగలబడి నవ్వసాగారు వాళ్ళు. అమరేంద్రకు అదంతా కంపరంగా ఉన్నా, పల్ల బిగువున సహించుకుని వాళ్ళ ఉల్లాసంలో పాలుపంచుకోక తప్పలేదు అతనికి.
యామిని గదిలోకివెళ్ళి తలుపు గదియవేసుకుండన్నమాటేగాని, తెరిచిఉన్న కిటికీలోంచి వాళ్ళుచేస్తున్న గందరగోళమంతా ఆమెకు వినిపిస్తూనే ఉంది. వాళ్ళ ముతక జోకులుగాని, వాళ్ళతోపాటుగా తనూ పడీపడీ నవ్వుతున్న అమరేంద్ర నవ్వుగాని ఆమెకు ఎంతమాత్రం నచ్చలేదు. కోపంతో ఆమెకు ఒళ్ళు రగిలిపోసాగింది. అంతవరకూ అమర్ పైన ఏర్పడిన సద్భావం, అతనిమీద "ప్రాణదాత" అన్న కృతజ్ఞత .... , అన్నీ ఆవిరైపోసాగాయి. ఎడా పెడా అమర్ చెపుతున్న అబద్ధాలు, ముఖ్యంగా తనను "మై వైఫ్, మై వైఫ్" అంటూ పదేపదే చెప్పడం ఆమెకు జుగుప్స కల్గించింది. అతని డూప్లిసిటీ ఆమెకు ఎంతమాత్రం నచ్చలేదు. ఆల్రడీ ఎంగేజ్డు పర్సన్ అలా మాట్లాడడం ఆమెకు చాలా తప్పనిపించింది. అతడు ఆడుతున్న ఈ గేంలో తను ఒక పావుగా మారడం ఆమెకు విపరీతమైన మనస్తాపాన్ని కలిగించింది.
"ఇతని మంచితనాన్ని నమ్మికదా నేను ఇంతదూరం ఇతనితో ఒంటరిగా వచ్చినది! కాని అంతా ఉట్టిది. ఎంత రుద్దినా చిరతపులి ఒంటిమీది మచ్చలు చెరగవు" అనుకుంది యామిని. ఉద్వేగంతో నిండిఉన్న ఆమె మనసు ఎక్కువ దూరం ఆలోచించలేకపోయింది.
క్షణంలో గెష్టు హౌస్ ఖాళీ ఐపోయింది. మరు క్షణంలో అన్నగారివెంట వెళ్ళడానికి సిద్ధమైపోయింది వళ్ళియమ్మ. వాళ్ళకు వీడ్కోలు చెప్పి కొంతదూరం సాగనంపివచ్చి, వేన్ ఎక్కాడు విమలాచార్య. అంతకంటె ముందుగానే వేన్ ఎక్కి కూర్చుని ఉన్నారు రాజు, యామిని. డ్రైవర్ వెళ్ళి "అంతా రెడీ" అని అమరేంద్రకు సైగచేసి చెప్పివచ్చి వేన్ ఎక్కి స్టీరింగ్ ముండు కూర్చున్నాడు . ఇక ఆలస్యమంతా అమరేంద్రదే !
అమర్ లేచి, కొత్త మిత్రులవద్ద శలవు తీసుకుని, వాచ్ మేన్ కి ఇల్లప్పగించి, టిప్ ఇచ్చివచ్చి, మరోసారి అందరికీ బై చెప్పి, ఏ హడావిడీ కనిపించనీకుండా నెమ్మదిగా నడిచివచ్చి వేన్ ఎక్కాదు. ఆ షికారీలు కూడా "బై, బై ఫ్రెండ్" అంటూ అనందంగా చేతులు ఊపుతూ వీడ్కోలు చెప్పరు. వేన్ స్టార్టు చేసి, ముందుకు సాగాడు డ్రైవర్.
తుఫాను వెలిసాక వచ్చే ప్రశాంతత లాంటి ఒకవిధమైన ప్రశాంతత ఏర్పడింది అప్పటికి అందరి మనసుల్లోనూ . వాళ్ళ మధ్య చాలా సేపటివరకూ మాటలు కరవయ్యాయి. మలుపులు తిరుగుతూ మలైక్కాడు కొండ దిగి, వేన్ ఘాట్ రోద్దుని చేరాక ముందుగా డ్రైవర్ నోరువిప్పి మాటాడాడు.
"మనం చాలా అదృష్టవంతులం సార్! ఏ గొడవా లేకుండా బయటపడగలిగాము. అడవి ప్రశాంతంగా ఉంది - అనుకుంటారుగాని, ఇక్కడ జరిగే ఘోరాలు ఇక్కడా జరుగుతూనేవుంటాయి. చేతిలో ఉన్న తుపాకులు చూపించి జనాన్ని భయపెట్టి ఈ షికారీబాబులు చేసీ ఘాతుకాలు ఇన్నీ అన్నీ కావు. వీళ్ళలో కొందరు మరీ దుర్మార్గులు ఉంటారు. మన పుణ్యం కొద్దీ వీళ్ళెవరో మంచివాళ్ళుగా ఉన్నారు. వీళ్ళు మీకు ఇదివరకే తెలుసాసార్?"
"అలాంటిదేం లేదు. ఇదే మొదటిసారి నేను వాళ్ళని కలుసుకోడం. మనం స్నేహంగా ఉంటే వాళ్ళూ స్నేహంగా ఉంటారు అని అనుకున్నా నంతే! ఆ సమయానికి అంతకన్న నాకు మరేం తోచలేదు. నువ్వు చెప్పినట్లు వీళ్ళెవరో మంచివాళ్ళు కాబోలు. ఏది ఏమైతేనేం, మనం క్షేమంగా తప్పించుకుని వచ్చేశాము, అది చాలు" అన్నాడు అమరేంద్ర.
వళ్ళియమ్మ చెంత లేదన్న దిగులో ఏమో గాని విమలాచార్య వెనకసీటులో ఒంటిగా కూచుని, కునికిపాట్లు పడుతూ, మరే విషయం కల్పించుకోకుండా స్తబ్ధంగా, కూర్చుని ఉండీపోయాడు.
అమరేంద్రకి అప్పటికే తలనొప్పి బాగా ఎక్కువగా ఉంది. అలవాటులేని సిగరెట్టుపొగ అతన్ని చాలా బాధ కల్గించింది. దానికి తోడు తడి బత్టలు! ఒకదానికి ఒకటి దోహదమై అతనికి చాలా అనారోగ్యంగా, జ్వరం వచ్చినట్లుగా ఒళ్ళంతా సలపరంగా ఉంది. కాని అతడు తన బాధను ఎవరికీ చెప్పాలనుకోలేదు.
కాసేపు ఆగి డ్రైవర్ మళ్ళీ , " మీరు చాలా అదృష్టవంతులు సార! క్షేమంగా మీరూ, అమ్మగారూ బయతికి వచ్చేశారు " అన్నాడు సంతృప్తితో. ఆ తరవాత మాటాడవలసింది ఇంక ఏమీ లేదన్నట్లు మాటలాపి, దృష్టిని రోడ్డుమీదకు కేంద్రీకరించి వేన్ స్పీడుపెంచాడు.
డ్రైవర్ అలా "అమ్మగారూ, మీరూ" అంటూ తననూ యామినినె కలిపి మాటాడడంతో, అమర్ తలతిప్పి యామిని వైపుకి చూశాడు. అంతవరకూ కోపంగా అతనివైపు చూస్తున్న యామిని చురుగ్గా తలపక్కకు తిప్పి, వేన్ కిటికీలోంచి బయటకు చూడడం మొదలు పెట్టింది. ఆ నిరసన అతనిని చాలా "హర్టు" చేసింది.
ఆమె దృష్టిలో తానొక పిరికివాడుగా, అనృతవాదిగా కనిపిస్తున్నాడు కాబోలు! కాని, శత్రువు తనకంటే బలశాలి ఐనప్పుడు ఎవరైనా ఏం చెయ్యగలరు? తను ఒక్కడే ఐతే పరిస్థితి వేరేగా ఉండేది. తను ఎలాగైనా యామినిని క్షేమంగా వాళ్ళ బారిన పడకుండా తప్పించడం కోసం, తనకు ఆ విధంగా ప్రవర్తించవలసివచ్చింది గాని స్వలాభంకోసం కాదు కదా! తను సరదాకోసం అలా ప్రవర్తించా డనుకుంటోంది కాబోలు - అనుకున్నాడు నిరీహతో. యామిని ప్రవర్తన అతనికి చాలా బాధకలిగిస్తోంది.
" థూ! ఈ ఆడవాళ్ళంతా ఇంతే, సుద్ధ అవకాశవాదులు! స్వార్ధపరులు! వాళ్ళు అనుకున్నది అనుకున్నట్లు జరిపించుకోవాలని చూస్తారు,. ఏపాటి తేడా వచ్చినా సహించలేరు. స్వార్ధం తప్ప, ఎదుటిమనిషి కష్టాల్నిఏమాత్రం పట్టించుకోరు" అనుకున్నాడు. చిరాకుగా, తల పక్కకు తిప్పుకుని కిటికీ లోంచి బయటికి చూస్తూ ఊర్చున్నాడు తనుకూడా బయటికి చూస్తూ కూర్చున్న యామిని తనలో అనుకుంది. "ఛీ! మొగాళ్ళు అంటేనే మోసగాళ్ళు. నన్నలా తన భార్య - అని చెప్పడం వల్ల తను ఇద్దరు అమ్మాయిలకు ద్రోహం చేస్తున్నాడన్న సంగతి అతనికి తెలియలేదనే అనుకోవాలా! ఆల్రడీ ఎంగేజ్డు అయ్యి ఉండి, అతడికి ఇదేం పాడుబుద్ధిట! అంతలో మంచి, అంతలోచెడు _ ఇదేం మనిషో" అని ఉక్రోషంతో ఉడికిపోతూ.
ఇద్దరిమధ్య కోల్డువార్ మొదలయ్యింది. వెళ్ళీటప్పుడు ప్రయాణం ఎంత సరదాగా సాగిందో ఇప్పుడంత స్తబ్ధంగా సాగుతోంది. టీ ఎస్టేట్ దగ్గర ఆగి టాంకు నిండా పెట్రోల్ పోయించుకుని, వెంటనే వాళ్ళు బెంగుళూరు ప్రయాణమైపోయారు. ఏవో అక్కడ దొరికిన చిరుతిళ్ళు తిన్నారేగాని ఎవరికీ భోజనం చెయ్యాలన్న ఆలోచనరాలేదు. యామినీ అమర్ అవికూడా తినలేదు. కాఫీ తాగి ఊరుకున్నారు. వాళ్ళు బెంగుళూరు చేరుకునేసరికి రాత్రి చీకటి పడింది.
ఆ రాత్రికి భోజనం చేసి, హోటల్ రూంలో పడుకుని, మళ్ళీ తెల్లారేసరికి లేచి హైదరాబాదుకి ప్రయాణమైపోయారు.
తిరుగుప్రయాణంలో బెంగుళూరులో ఆగి ఊరు చూడాలనుకున్న విషయం అమరేంద్ర మర్చిపోలేదు. కాని యామిని అడిగితే చూడొచ్చు లెమ్మని ఊరుకున్నాడు.
యామినికి కూడా ఆవిషయం గుర్తుంది, "ఏదైనా ప్లాన్ చేసేది అతడే కదా! కావాలంటే తనే ప్లాన్ చేస్తాడు, మధ్యలో నేనెందుకు కల్పించుకోవాలి" అనుకుని ఊరుకుంది ఆమె. తక్కినవాళ్ళకు ఆ విషయం అసలు గుర్తుందో లేదోగాని, పైకి చెప్పే సాహసం ఎవరూ చెయ్యలేదు. సారు, మేడం మధ్య ఏదో విభేదం వచ్చిందన్న సంగతి గుర్తించలేనంత వెర్రివాళ్ళు కారు వాళ్ళెవరూ. ప్రయాణం నిరాసక్తంగా, నిరాటంకంగా సాగిపోయింది. బెంగుళూర్ నుండి హైదరాబాదు వెళ్ళే దారి పట్టింది వేను.
లంచి టైంకి, దారిలో వచ్చిన ఒక బస్ స్టేషన్ లో కారు ఆపాడు డ్రైవరు. అక్కడకు దగ్గరలో ఉన్న హోటల్లో భోజనాలు చేశారు అందరూ. చెయ్యి కడుక్కోడానికి సింకు దగ్గరకి వచ్చిన యామినికి, అక్కడ ఒక తల్లి, ఆకలితో ఏడుస్తున్న పసిబిడ్డకు పాలుకలపడానికి కుదరక ఇబ్బందిపడుతూ కనిపించింది. వెంటనే ఆ పసిబిడ్డను అందుకుంది యామిని. ఆ తల్లి రెండు చేతులూ ఖాళీ అవ్వడంతో స్వేఛ్ఛగా పాలుకలప గలిగింది. ఇద్దరూ అక్కడున్న సిమ్మెంట్ బెంచీమీద కూర్చున్నారు. బిడ్డకు పాలు తాగిస్తూ అమె యామినితో మాట కలిపింది. కబుర్ల మధ్య తెలిసింది యామినికి ఆమె ఎక్కే బస్సు, తమ ఊరు మీదుగానే వెళుతుందన్న విషయం. వెంటనే ఇటునుండి ఇటే తమ ఊరికి వెళ్ళిపోవాలన్న ఆలోచన వచ్చింది యామినికి. ఆ పట్టితల్లిని తను వచ్చేవరకూ అక్కడే ఉండమని చెప్పి వేగంగా వేన్ దగ్గరకు నడిచింది.
అప్పటికే తక్కినవాళ్ళంతా వేన్ ఎక్కి కూచున్నారు. యామినిని చూడగానే డ్రైవర్ ఇంజన్ స్టార్టు చేశాడు. ఆమె వేన్ దగ్గరకు వచ్చింది.
" డ్రైవర్! ఇంజన్ ఆపు. నేను సామాను దింపుకోవాలి. ఇటునుండి ఇటే మా ఊరు వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను" అంది. డ్రైవర్ వెంటనే ఇంజన్ ఆపేశాడు యామిని అమరేంద్రవైపుకి చూసి, " సర్! ఇక్కడనుండి మా ఊరికి బస్సు ఉంది. మా ఊరు వెళ్ళి నాల్గు రోజులు ఉండి రావాలని ఉంది, విత్ యువర్ పర్మిషన్ సర్" అంది ముఖంలో ఏ భావమూ వ్యక్తం కానీయకుండా జాగ్రత్తపడుతూ ముక్తసరిగా.
అమర్ కూడా "ఫౌల్ మూడ్" లోనే ఉన్నాడేమో అతనికి కూడా "గుడ్ రిడెన్సు" అనిపించింది. అతని బెట్టు కూడా తగ్గలేదు. సంభాషణని పొడిగించకుండా, వెంటనే రాజును ఉద్దేసించి, "ఆమె సామానుట దింపి, ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టి, తొందరగా తిరిగి వచ్చేయ్యి" అన్నాడు రాజు దిగి యామినిసామాను బయటికి తీశాడు.
అమరేంద్ర యామిని వైపు చూసి, " ఎనీహౌ, థాంక్యు ఫర్ కీపింగ్ మి కంపెనీ! బై ది బై, నీకు సెలవిచ్చేది సరిగా నాల్గురోజులు మాత్రమే! ఐదో రోజు నువ్వు ఆఫీసులో కనిపించాలి. లేకపోతే ..... " అని అర్థకుసిగా వాక్యాన్ని ఆపేశాడు.
"లేకపోతే ఏం చేస్తావేమిటి" అని అడగలేదుగాని, ఆ అర్థం వచ్చేలా సూటిగా అతనివైపు ఒక్క చూపు చూసింది యామిని.
"నీ ఉద్యోగం ఉండదు" అంటూ వెంటనే పూర్తిచేశాడు అమరేంద్ర .
* * *
(సశేషం)